రెమ్మలకి టాటా చెప్పి మెల్లిగా కొమ్మల్ని విడిచి
దారెంట – నడిచే సరిగమలై, మెరిసే కిరణాలై
బడిముంగిట గీతమై అల్లుకొనే
ఒకే చెట్టు పూవుల్లాంటి బడిపిల్లల్ని చూసి
ఆ పిల్ల కళ్లు – చిన్ని చిన్ని మడుగులవుతాయి.
ఆమెక్కూడా –
తనో పూవయి ఆ వరసల్లో అమరాలని వుంది.
బడి గీతాన్ని గుండెల్లో దారంలా గుచ్చుకోవాలని వుంది.
కళ్ల ప్రతిబింబాల్ని పలకల్లో అక్షరాలుగా చూసుకోవాలనీ వుంది.
అయితే –
రోగిష్టి తల్లి చేతి సద్దిమూటను భుజాన వేలాడేసుకొని
సంజె చీకట్లదాకా ఆమె కూలిఎండను మోయాలి గదా !
కాళ్లు చేతుల్ని అరగదీసి విరదీసి
అడవంతా ఒక మోపుగా పొయ్యికిందకి తేవాలిగదా !
బర్రెమందకు తోకగా వేలాడి తూలాడి
తలను పచ్చి పేడగంప చేసుకురావాలిగదా !
కొమ్మ కొమ్మకు దోటి కొడవలిగా సాగి సాగి
ఒంటిని రెమ్మలుగా చీల్చుకొని మేకపిల్లల్ని ఆడించాలి గదా !
అందుకే –
ఆ పిల్ల చదువు నిరంతరం
తల్లి అడుగుల దారుల్లోనే వుంటుంది.
ఆచిన్నారి –
పెంకు బిళ్లతో కుండల్ని గీకి గీకి
అంట్లు తోమే వొడుపులో ‘అ’ ‘ఆ’ లు దిద్దుకోవాలి.
మొండి పొరకతో నేలంతా గీకి గీకి
దుమ్ముతెరల పలకలో చదువుకర్థం తెలిసికోవాలి.
చంకనెక్కిన తమ్ముళ్ల ఆకలిరాగాల ఏడుపుల్లో
బడి గీతాల్ని పదే పదే మననం చేసుకోవాలి.
ఆమెకిప్పుడు –
అక్షరాలు నేర్చుకోవటమే కాదు చదువంటే –
కడుపు నింపుకొనేందుకు అరపావు గింజల్ని సంపాదించడం.
పదాల్ని పలకటమే కాదు చదువంటే –
ఒంటిని కప్పేందుకు బెత్తెడు గుడ్డపేలిక సాధించటం.
పాఠాలు అప్పజెప్పటమే కాదు చదువంటే –
అమ్మదనాన్ని బతికించేందుకు పసితల్లిగా మారటం . . . . .