నీకెప్పుడూ అనిపించలేదూ
బనీన్ని విప్పి సోఫా మీద విసిరేసినట్టు
దేహాన్ని కూడా విప్పి పారేసి
దిగంబరంగా ఆత్మని
అంబరాన్ని చేర్చాలని?
బహుశా అప్పుడు నువ్వు
ప్రపంచంతో విసిగిపోయి ఉంటావు
కానీ ఇప్పుడు నేను
ప్రవక్తలతో కూడా విసిగిపోయాను
తిరిగొచ్చిన క్రీస్తుని
నేనింకా చూడాల్సి ఉంది
ఎక్కడ చూడు
నకిలీ మనుషులు నకిలీ మనసులు
నేలలో ఏడుస్తున్న నకిలీ విత్తనాలు
బ్లాకులో కొనుక్కున్న నిన్నటి సినిమా టికెట్లు
నిఖార్సైన తూకం కింద నిన్నే చూస్తూ అయస్కాంతం
ఓరి మనిషి వెధవా బాగుపడరా అని
అనాదిగా బండబూతులు తిడుతూ సముద్రం
వీడింక బాగుపడడులే అని
ఆకుల గలగలల సామూహిక ఆత్మ శోకం
డొల్ల.. అంతా ఒక డొల్ల
చూడండి.. చూడండి
ఎక్కడనుంచో తెచ్చి
కాకి పెరట్లో పడేసిన
కోడిగుడ్డు డొల్లని
కళ్ళు పెట్టుకు చూడండి
అందులో..
నీ బ్రతుకూ.. నా బ్రతుకూ
కనిపించట్లేదూ?
అయినా నీ పిచ్చిగానీ
బ్రతుక్కి ఒక స్వచ్ఛతంటూ
ఎక్కడేడిసింది?
బ్రతుక్కి లేని స్వచ్ఛత
అక్షరానికి మాత్రమెందుకు?
రాసెయ్ రా కవీ.. రాసెయ్
మందు కొడుతూనో.. దమ్ము కొడుతూనో..
సన్నజాజి పందిరి కిందో..
సానిదాని కొంపలోనో..
కసితీరా రాసెయ్
చెప్పుకోలేని చోట
చెప్పుకాలితో తన్నిన
ఉంచుకున్నదాని తన్నుని కూడా…
నిస్సిగ్గుగా రాసెయ్..
నువ్వు బ్రతకలేకపోయినా
కనీసం నీ అక్షరాలైనా బ్రతుకుతాయి.