ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఏం రాస్తాం?

Like-o-Meter
[Total: 0 Average: 0]

వలసపోయిన పిట్టలతో మూగబోయిన చెట్టు తొర్రలో
దేనికదే ఒంటరిగా ఉన్న రెండు ముసలి ఆత్మలనడిగా.
మునిమాపువేళ దాటినా దయగలమారాజు దొరకని
బిచ్చగాని ఖాళీ సత్తుబొచ్చె తడిమా.
ఎప్పుడో కోసిన వరిమడిలో ఇంకా పరిగేరుకుంటున్న

ఓ అవ్వ ఆరాటంలో వెదికా.

ఒక్కో మెట్టుకు పసుపు రాస్తూ ఏడు కొండలెక్కుతున్న

ఓ కళ్ళూ కాళ్ళు లేని కబోది లోలోనికి పరకాయప్రవేశమూ చేసి చూసా.
పదాల కోసం నిఘంటువులు వెదకక్కరలేదు
మన పల్లెను ఓసారి కలెదిరిగిపోతే చాలురా

అని ఆర్తిగా నాన్న చెప్పిందీ… చేశా.

ఊహూ… ఆకారం లేని పదాలు. పద్యానికి పనికిరావు.

చివరాఖరికి
సిగరెట్ పొగల అంచుల్లో
వో ఆలోచన అస్థిపంజరం
ఉత్తుత్తి చర్మాన్ని కప్పుకుని
రంగులద్దిన పదాలను రక్తనాళాల్లో నింపుకుని
ఖరీదైన వో కాయితం పై ఒలికింది.

ఏం రాస్తాం? 


అఫ్సర్ గారి “కొన్ని పంక్తులు ఇలా కూడా…” చదివిన స్పూర్తి తో. అఫ్సర్ గారి కవితలు చదివాక చాలా రోజుల వరకు అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి నాకు నచ్చిన కవితల్లో ఒకటి “కొన్ని పంక్తులు ఇలా కూడా…”. మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆర్ద్రంగా సాగిన ఆ కవిత చివరి పాదం చదివాక ఎవరైనా అలా కాసేపు ఓ అనిర్వచనీయమైన అనుభూతిలోకి వెళ్లి (ముసుగు తీసేసి) ఆలోచించాల్సిందే. అఫ్సర్ గారి కవితలు కొన్ని ఇక్కడ చదవచ్చు: