ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఎందుకిలా జరుగుతుంది?

Like-o-Meter
[Total: 1 Average: 4]

 

కొంత కాలం ఇలాగే మౌనంగా ..
అనుకోవడమేనా ఎప్పుడూ?

ఎందుకిలా జరుగుతుంది?
ఇలా కంట్లో నక్షత్ర ధూళి పడటం..
నువ్వు దగ్గరకొచ్చి ఉాదగానే…
ఇక్కడీ లోకంలో తుఫాను రేగడం…

చుట్టూ నే కట్టుకున్న
గోడలన్నీ కూలిపోవడం
ఉద్వేగ రహితంగా
నేను చూస్తూ నిలబడిపోవటం

మళ్ళీ ఎలాగో
నన్ను నేను సమాయుత్త పరుచుకుంటాను…
ఈసారి మౌనంతో కాదు …
అభావంతో నిన్ను ఎదుర్కోవాలని

సరిగ్గా అప్పుడే …
కుండపోత కురుస్తుంది
అనాచ్చాదిత హృదయం వణకడం చూసి
అచ్చం అడవిలాగే అల్లేసుకుంటావ్ …

శత్రు దుర్భేద్యమనుకున్న కోట ..
కొల్లగొట్టబడుతుంది.
నీ ఏలికలో నా రాజ్యం
తేనె తుట్టయిపోతుంది….