ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఫుట్ నోట్స్-1 ఇప్పటికిప్పుడు ఇదే..

Like-o-Meter
[Total: 0 Average: 0]

1

ఏమీ తెలియకపోవడం

గుర్తు పట్టకపోవడం

మరచిపోవడమూ

–      ఇవి కూడా బాగుంటాయి అప్పుడప్పుడూ.

 

2

పూల గురించి అంతా తెలుసు అనుకుంటాను

వాటి మెత్తని శరీరాన్ని  నిమురుతున్నప్పుడు

నా గరుకుతనం గుర్తొస్తుంది.

 

3

ముళ్ళ ని ఇట్టే గుర్తుపట్టేస్తాననీ అనుకుంటాను

తీరా అవి గుచ్చుకున్నప్పుడు

నా మెత్తనితనం తెలిసిపోతుంది

 

4

వొట్టి రాళ్లే కదా అని నడుస్తూ నడుస్తూ

వాటికేసి  చూపు వంచి చూడడం మరచిపోతాను.

మరచిపోవడం అనేది ఎంత గరుకుగా వుంటుందో

ఎంత కొచ్చెగా వుంటుందో తెలిసిపోతుంది కాళ్ళకి.  

 

5

ఏమీ తెలియకపోవడంలోనే  నేను తెలిసిపోతాను

గుర్తు పట్టకపోవడంలోనే

 నన్ను నేనూ నిన్ను నువ్వు గుర్తుపట్టేస్తాం

మరచిపోవడంలోనే

 అన్నీటినీ తలచుకుంటాం.

6

ఏ స్థితీ

శాశ్వతం కాదని చెప్పడమే ఇవాల్టి ఫుట్ నోట్!