ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

హైదరాబాదీ!

Like-o-Meter
[Total: 0 Average: 0]

”నువ్వు హైదారాబాదీవా!”అంటారు ఎవరో
మనసు పులకరిస్తుంది
హైదరాబాద్ బతుకు ఆల్బమ్ లో
ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో!
ఆల్బమ్ తెరిచినప్పుడల్లా
మంచు తెరలమధ్య నుంచి
నగరం చుట్టూతా పారుతున్న దిగులు.

రెండుగా చీలిపోతున్ననగరం-
ఎలా కలపాలి? కలిసేవుంటూ కలవని నీరెండ.
పచ్చని మొక్కలు నాటి ,నగరమంతా ఈ నీడలో
నిద్ర పోతుందని చెప్పాలని వుంటుంది

గుప్పెడు జాగా కొసం నెత్తురు చిమ్ముతోంది
పరుగులు తీస్తున్న నగరానికి ఒక
జ్ఞాపకంగా
మువ్వల రిక్షాలు కానుక ఇద్దామంటే,
మూసీనది మట్టిలో కూరుకుపోయి నిశ్శబ్ధంగా పలకరించాయి

వాటిమీద పుట్టుకొ్చ్చే మెట్రో ర్రైళ్ళు.
ఎదిగిపోయామని నవ్వుకోనేలోగా
చిక్కిపొయిన నది గర్భంలోంచి తొంగి చూస్తూ
గతం.
వర్తమానం.

2
కలలా జారిపోతున్న నగరంలో
కళ్ళల్లో ఎప్పటికీ మారని ఒక శాసనం
’మహబూ మన్షన్’ ఈ మార్కెట్ ని ఆనుకునే
పచ్చని అడవి,వాటీమీద వాలే తెల్లటి కోంగలు
అక్కడనుంచే గుడిగంటలతో లీనమై వినిపించే ”హనుమాన్ చాలిసా”.
నడివీధుల్లో ఊరేగే గజరాజు
ఒక కప్పు ఇరానీ టీ.
నాలుగు కబుర్లతో
హైదారాబాద్ బిర్యాని-

3
మనుషులు రంగుల్ని గుర్తుపడుతున్నారుట
వాటిని ముక్కలు చేయడానికి రంపాలు తెస్తున్నారు
రంగుల మధ్యలో మాట కూడా ముక్కలు కాక తప్పదుట
ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు.,
అప్పటిదాక నది ఒక్కటే -ఇప్పుడు
రెండు పాయలుగా విడిపోతుంది.

గతం- ఎక్కడో దోర రేగుపండులా
భవిష్యత్తులో సలుపుతోంది.

అమావాస్య తరువాత నెలవంక
ఆకాశంలో తేలుతోంది నావలా.
అందరం దగ్గరవుతాం
దూరంలో కూడా అనుబంధాలు పెరుగుతాయి
నిన్ను నన్ను కూడా ”హైదరాబాదీవా” అని అడుగుతారు….