ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

“ఇలా అనిపించిందా”

Like-o-Meter
[Total: 0 Average: 0]

రోడ్లపై రకరకాల మనుషులు
నవరసాలు ఒలికించే మోములూ..చేష్టలూ
ఆత్మలు బట్టలేసుకున్నట్టుగా కనిపించాయా?
 
ఒకరు స్వార్థంతో ప్రవర్తిస్తుంటే
ఆపుకోలేని నవ్వు వచ్చిందా!
అబద్ధాలు అందంగా అమాయకంగా
చెబుతున్నట్లు తోచిందా?
 
కోపంతో కంపిస్తూ ఒకరు
నానా దుర్భాషలాడుతూ
తనను తాను హింసించుకోవడాన్ని
శాంతంగా చూసే అంతరాత్మ గోచరమయిందా?
 
ఎదురుగా బోసినోటితో పాపాయి
అమ్మ భుజంపైనుంచి చూస్తుంటే,
ఒక ఎదిగిన వ్యక్తిగా మారి
మరొక పాపకు జన్మనిచ్చే తల్లిగా
అంతలోనే వృద్దురాలిగా
చివరకు ఒక ముత్తైదువ శవంగా అగుపించిందా?
 
ఆగిన ట్రాఫిక్ పక్కనుంచి
ఒక అంబులెన్సు
అరుస్తూ పోతుంటే
అద్దాల్లోంచి ఒక దేహం
అవస్థపడుతూ ఉంటె
చుట్టూ విషణ్ణ వదనాలు
మృత్యువుని దేవత అని
మనమెందుకు అంటామో తెలిసిందా?
 
రోడ్ల కూడళ్ళలో బిచ్చమెత్తుకుంటూ
తమను తాము మోసంచేసుకొంటుంటే
చింకి బట్టలలో ఆరోగ్యకరమైన దేహం
దాచుకుంటూ పడుతున్న యాతన
చిన్న ఉద్యోగులకు అప్పులిచ్చి
వడ్డీలు వసూలు చేస్తూ
పొందుతున్న భరోసా బయటపడింద?
 
కనిపించేదంతా అబద్ధంగా
నిజం చాల ప్రశాంతంగా
జగత్తంతా ఒక ప్రయాణంగా అనిపించిదా ?