ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి “ఉదయశ్రీ” [ఖండ కావ్యముల సంపుటి]

Like-o-Meter
[Total: 1 Average: 4]

అరుణరేఖలు

ఆనాడు నా శిథిల జీవితానికి ఒక మధురప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.

 

కన్నులు విప్పి చూచాను. శ్రీమతినీ చిరంజీవినీ విడిచి బరువు గుండెతో మేడమెట్లు దిగే గౌతమబుద్ధుని కారుణ్యమూర్తి కనిపించింది. ఆయన ఆర్దనేత్రాంచలాల్లో కరుణాకుమారి తొంగి చూచింది.

 

ఆమె వదనంలో అయోధ్యానగరం అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యం వెతుక్కుండే ఊర్మిళాకుమారి ఉత్కంఠ తొణుకు లాడుతూ వుంది.

 

ఆమె కంఠంలో పాషాణ హృదయుల ప్రక్కలక్రింద రెక్కలు వీడి నలిగి నశించిపోయే పూలబాల జాలిపాట మెల్లమెల్లగా మ్రోగుతూవుంది.

 

ఆమె నిట్టూర్పులో గంగానది గట్టుమీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో పడి ఎక్కడెక్కడికో కొట్టుకుపొయ్యే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెలచప్పుడు వినిపిస్తూవుంది.

 

ఆమె ఆర్ద్రనేత్రాల్లో మృత్యుదేవత వెంట ఒంటరిగా పతికోసం పరువెత్తే సతీమణి సావిత్రి ప్రణయస్వరూపం ప్రతిబింబిస్తూ వుంది.

ఆమె చల్లనిచేతుల్లో కరుణామయి రాధిక హృదయవిపంచి అమృతరాగాలు ఆలపిస్తూవుంది.

ఆమె కన్నీటి కెరటాలలో భారతమాత బాష్పధారలు ప్రవహిస్తూవున్నాయి. ఆమె నిట్టూర్పులు నన్ను మానవుణ్ణిచేశాయి. ఆమె కన్నీళ్ళే నాలోని కవిత్వం. ఆమె నా కరుణామయి. నా జీవిత సహచరి. నా కళ్యాణమూర్తి. నా ఆరాధ్యదేవి.

భగవంతుడు కరుణామయుడు – సృష్టి కరుణామయం. జీవితం కరుణామయం. ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలోకే విలీన మౌతుంది.

కరుణకూ కవికి అవినాభావ సంబంధం వుంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు.

ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.


అంజలి

పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమై

     పొదుగుగిన్నెకు పాలు పొసి పోసి

కలికి వెన్నెల లూరి చలువ దోసిళ్ళతో

     లతలకు మారాకు లతికి యతికి

పూల కంచాలలో రోలంబమునకు రే

     పటి భోజనము సిద్ధపరచి పరచి

తెలవారకుండ మొగ్గలలోన జొరబడి

     వింత వింతల రంగు వేసి వేసి

 

తీరికే లేని విశ్వ సంసారమందు

అలిసిపోయితివేమో దేవాదిదేవ!

ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!

 

కూర్చుండ మాయింట కురిచీలు లేవు! నా

     ప్రణయాంకమే సిద్ధపరచనుంటి

పాద్యమ్ము నిడ మాకు పన్నీరులేదు! నా

     కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి

పూజకై మావీట పుష్పాలు లేవు! నా

     ప్రేమాంజలులె సమర్పించనుంటి

నైవేద్యమిడ మాకు నారికేళము లేదు! నా

     హృదయమే చేతి కందీయనుంటి

 

లోటు రానీయ నున్నంతలోన నీకు

రమ్ము! దయసేయు మాత్మపీఠమ్ముపైకి

అమృతఝురి చిందు నీ పదాంకములయందు

కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

 

 

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర

     దీపాలు గగనాన త్రిప్పలేక

జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు

     మామూలు మేరకు మడవలేక

పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె

     గడియారముల కీలు కదపలేక

అందాలు చింద నీలాకాశ వేదిపై

     చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

 

ఎంత శ్రమనొందుచుంటివో ఏమో సామి!

అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన!

గుండె కుదిలించి నీముందు కుప్పవోతు

అందుకోవయ్య! హృదయపుష్పాంజలులను


ఉషస్సు

కర్కశ కరాళ కాలమేఘాల నీడ

లెగురుచున్నవి ప్రజల నెమ్మొగములందు!

క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి

క్రమ్ముకొన్నది దిగ్దిగంతమ్ము నెల్ల.

 

ఈ నిస్తబ్దత కంతరార్థ మెదియొ!! ఈ కారుమేఘాలలో

ఏ నిర్భాగ్య నిరర్థ నీరస గళం బెల్గెత్తి వాపోవునో!

ఈ నీరంధ్ర నిశీధ గర్భకుహర, మ్మే భావ గంభీరతా

పౌనఃపున్యము దాచెనో! వెలయవో ప్రాభాత శోభావళుల్!

 

ఈ చీక ట్లిక తెల్లవారవటె! లేనేలేవటయ్యా స్మిత

శ్రీ చైతన్య నవప్రభాతములు నిర్జీవ ప్రపంచాన! మా

ప్రాచీబాల కపోల పాళికలపై ప్రత్యూష సౌవర్ణ రే

ఖా చిత్రమ్ములు గీతు రెవ్వ రనురాగస్విన్న హస్తాలతో!


 

ఉదయశ్రీ

సుప్రభాతము! రాగోజ్జ్వల ప్రబోధ

మంధలోకాని కిడు జగద్బాంధవుండు

ఉదయమగుచుండె నవయుగాభ్యుదయమునకు

అరుణ కిరణాలతో కరుణార్ద్రమూర్తి.

 

చీకటిలో లోక మ్మిది

చీకాకై పోయె; సంస్పృశింపగవలె నీ

శ్రీకరముల, కరుణా కమ

లాకర తరుణ ప్రభాకరా! రావోయీ!

 

శుద్ధోదన రాజేంద్రుని

శుద్ధాంతము చిందె శాంతసుధల, అహింసా

సిద్ధాంత మొలుకు గౌతమ

బుద్ధుని చిరునవ్వులోన పులకీకృతమై!

 

 

ఉత్తిష్ఠ

చిన్నికుమారు చిర్నగవు చెక్కిలిలో పులకించు రాణి క్రీ

గన్నుల నీడలన్ సుఖముగా సుమడోలల తన్మయుండవై

ఉన్నత భర్మసౌధముల నూగెడి రాజుల చిన్నవాడ! నీ

కన్నులు విప్పి నల్ దెసలు సన్గొనరా! యిక నిద్రచాలురా!

 

నిదురన్ భంగము చేసినా ననుచుగానీ; కూర్మిదేవేరి ప

య్యెద బాంధవ్యము బాపుచుంటి నని కానీ, కిన్కగైకోకు! నీ

హృదయమ్మున్ హృదయేశ్వరీ హృదయమందే కాదు..సుప్త ప్రజా

హృదయాబ్జమ్ముల మేలుకొల్పు ’ఉదయశ్రీ’లో ప్రపంచింపరా!

 

ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే

ధ్యేయము కాదు, హీను లతిదీనులు మ్లానతనుల్ దరిద్ర నా

రాయణు లేడ్చుచుండిరి, తదశ్రువులన్ దుడువంగపొమ్ము నీ

ప్రేయసితోడ, నీ కట లభించును కోట్లకొలంది స్వర్గముల్!

 

బుద్ధుడవై సుషుప్తుల ప్రబుద్ధుల జేయుము, శాంతి సత్య ధ

ర్మోద్ధరణార్థమై బ్రతుకు నొగ్గుము, మానవ సంఘసేవయే

సిద్ధికి త్రోవ, వత్సలర చిందెడి ప్రేమ సుధా స్రవంతులన్

శుద్ధ మొనర్చు ముజ్జ్వలయశోధర! జర్జరిత ప్రపంచమున్!!

లెమ్మిక మేలుకొమ్ము! కదలింపుము క్రాంతిరథమ్ము శాంతి మా

ర్గమ్మున; కాంతి పుంజము లఖండములై నవ జీవన ప్రభా

తమ్ములు నింప, సర్వసమతాసుమకోమల మానవాంతరం

గమ్ముల ప్రేమసూత్రమున గట్టుము మంగళ తోరణమ్ములన్!

 

గుటగుటలాడ ప్రాణములు గొంతుకలో వసి కన్ను గొల్కులన్

బొటబొట రాల బాష్పకణపుంజము, బోరున నేడ్చు నల్లదే

కటికి కసాయి కెంపు చురకత్తి గనుంగొని గొర్రెపిల్ల; సం

దిట గదియింపవే! దిగులు దీర్పవె! ముద్దుల బుజ్జగింపవే!!

 

ఈ మహి స్వర్గఖండ మొనరింపుము! ఘోర హలాహలమ్ము ది

వ్యామృత మాచరింపుము, “జయోస్తు” కుమార! శిరస్సుపై అహిం

సా మకుట ద్యుతుల్ దశదిశల్ వెలిగింప ప్రపంచ మెల్ల నీ

ప్రేమ రసైక వృష్టి గురిపింపుమురా! కరుణాకళాధరా!


కరుణమూర్తి

ఈ ప్రగాఢ నిగూఢ మధ్యే నిశీధి

గడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?

ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు

మూసియున్నట్టి తలుపులు దీసినార?

 

తెర తొలగ ద్రోసికొని చనుదెంచుచున్న

ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?

అందములు చిందు పున్నమచందమామ

కళ దరుగుటేమి కాలమేఘాలలోన?

 

నిండు గుండెలపై వ్రాలి నిదురవోవు

ఏ హృదయదేవి పావన స్నేహమునకు

ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి

వచ్చెనో కాక – వదన వైవర్ణ్య మేమి?

 

 నమ్మి జీవన సర్వస్వ మమ్ముకొన్న

ప్రణయమయి శాశ్వతప్రేమబంధనములు

త్రెంపుకొని బైటపడు ప్రయత్నింపులేమొ-

తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి!

 

ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత

మోహనస్వప్నలోకాలలో హసించు

ముద్దుపాపాయి చిరునవ్వు ముత్తియములు

దొరలుచున్నవి వాలు కందోయి తుదల!

 

గేహమే వీడలేకనో! గృహిణితోడ

స్నేహమే వీడలేకనో; శిశువుమీది

మోహమే వీడలేకనో; సాహసించి

దేహళిని దాట నింత సందేహపడును?

 

ప్రణయ భాగ్యేశ్వరీ బాహు పాశ మట్లు

జారిపొలేక ముందుకు సాగనీక

వెంట జీరాడుచు భుజమ్ము నంటి వచ్చు

నుత్తరీయాంచలము చక్కనొత్తడేమి?

 

కేలుగవ సాచి ఆర్ద్రనేత్రాల తోడ

మెట్టు మెట్టుకు పాదాల జుట్టుకొనెడి

ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స

హస్రముల గాంచి నిస్తబ్ధు డగుచు నిలుచు!

 

పడియు ముందుకు, వెనుకకే ప్రాకులాడు

ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి;

గాలి కెదురుగ సెలయేటి జాలులోన

పయనమగు రాజహంస దంపతుల భంగి.

 

ఆ మహోన్నత భర్మ హర్మ్యాలు దిగుట

ఏ మహోన్నత సౌధాల కెక్కజనుటొ?

ఈ వన విహారములు త్యజియించి చనుట

ఏ నవ విహారములు సృజియించుకొనుటో;

 

లలిత లజ్జావతీ లాస్య లాలనములు

కనెడి కన్నులు సత్య నర్తనము కనెనొ;

శ్రీ చరణ మంజు మంజీర శింజితములు

వినెడి వీను లంతర్వాణి పులుపు వినెనొ;

 

మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న

దీప మంపిన దీన సందేశ మేమొ;

స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ

పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు;

 

ఆపుకొలేని హృదయమ్ము నదిమిపట్టి

దూరమగుచుండె ప్రభువు సంసారమునకు’

శ్రీయు – శ్రీమతియును – చిరంజీవి లేని

ఈ “మహానిష్క్రమణ”కర్థ మేమికలదో?

 

కాంతిలోనుండి కటికి చీకటులలోన

కలిసిపోవుచునున్నాడు కరుణమూర్తి’

కటికి చీకట్లలోనుండి కాంతిలోన

పతితపావనుడై బయల్పడగనేమొ!!

కరుణామయి

నీ దరహాస చంద్రికలు నిండిన నా హృదయాంగణమ్ములో

లేదుగదా తమస్సు లవలేశము, ప్రేమసుధానిధాన! నే

డీ దయనీయదాసి భరియింపగలే దిక నీదు ప్రేమలో

పేదరికమ్ము – మేను మరపింపుము మోహన వేణుగీతికన్!

 

నీ యసితద్యుతుల్ కనుల నింపితి కాటుకచేసి – అల్లదే

తీయని పాటతో తలుపుదీసెను గుండెకు గున్నమావిపై

కొయిలకన్నె – నా వలపు కొండలపై కడకళ్లనుండి నే

రే యమునా స్రవంతి ప్రవహించెనురా; అనురాగవార్నిధీ!

 

“శ్రీయుతమూర్తియై కరుణచిందెడి చూపులతోడ స్వామి వేం

చేయును; పాదపూజ దయసేయును మా” కను సంబరాన, ఆ

ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు, పూచియుం

బూయని పచ్చపట్టు పరపుల్ గొని శ్యామల శాద్వలీ స్థలుల్.

 

నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీరవమ్ములో

నిద్దుర వోయినట్లు శయనించె సమస్తము; సద్దులేని ఈ

యద్దమరేయి ఒంటిగ – రహస్యముగా – తపియించు గుండెపై

నద్దుకొనంగ వచ్చితి దయామయ! నీ చరణారుణాబ్జముల్!!

ఏది మరొక్కమాటు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా

ఊదగదోయి! ఊదగదవోయి! సుధామయ యుష్మదీయ వే

ణూదయ రాగ డోలికల నూగుచు, విస్మృతిలో విలీనమై

పోదును నాదు క్రొవ్వలపు పువ్వుల ముగ్ధ పరీమళమ్ముతో!!

 

నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో

లేచెనురా! ప్రఫుల్ల మురళీరవళీ రమణీయ భావనా

వీచి – దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్

దాచుకొనంగలేని పసిదాననురా! విసిగింపబోకురా!

 

“ఇది యది” యంచు తేల్చి వచియింపగరాని విషాద మేదియో

హృది గదలించుచున్నది; దహింపగసాగె నిరాశ శుష్కమౌ

బ్రదుకును; స్నిగ్ధ శీతల కృపారస ధారల, దుర్దినమ్మునే

సుదినము చేయరా! యదుకిశోర! కృశాంగి ననుగ్రహింపరా!

 

నీరసమైన నీ ప్రణయినీ హృదయ మ్మిది చల్లచల్లగా

నీ రసగీతిలో కరిగి నీరయిపోవుచునుండె, మోహనా

కార! రవంత వచ్చి కనికారము జూపవయేని, కాలువై

యేరయి పొంగి పొర్లి ప్రవహింపదొ గోకుల మాకులమ్ముగన్!

 

 

ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై

లోకము నిండెరా! కడుపులో బడబాగ్నిని దాచి; కాంక్ష మ

ర్రాకయి తేలె; చక్కనిదొరా! శయనింతువుగాని పొంగి వ

చ్చే కెరటాలమీద; దయసేయుము గోప కిశోర మూర్తియై.

 

రాధనురా ప్రభూ! నిరపరాధనురా! అనురాగ భావనా

రాధన మగ్నమానసనురా కనరా; కరుణింపరా; మనో

వీధి పదేపదే కలకవేయుచునున్నవిరా పురా రహో

గాథలు – ఈదలేనిక అగాధ తమోమయ కాలవాహినిన్!!

 

పారవశ్యము

అది శరద్రాత్రి, గగన సౌధాంగణమున

దేవతా స్త్రీలు దీపాలు తీర్చినారు;

సరస రాకాసుధాకర కరములందు

కలమటంచు నవ్వె శృంగారసరసి.

 

పూచె వనలక్ష్మి, పిండారబోసినట్లు

పండు వెన్నెల జగ మెల్ల నిండిపోయె;

యమున శీతల సురభి తోయమున దోగి

చల్లగా…మెల్లగా…వీచె పిల్లగాలి.

 

ఆ మహోజ్వల రజని, మోహన విహార

నవ నవానంద బృందావనమ్ము నందు,

అమల యమునానదీ శాద్వలముల మీద,

లలిత బాల రసాల పల్లవ పరీత

మధుర మంజుల మాలతీ మంటపమున-

పాల రా తిన్నెపయి కల్వపూలతోడ

మాల గట్టుచు కూర్చున్న బాల యెవరు?

ప్రణయ మకరంద మాధురీ భరిత ముగ్ధ

లోచనమ్ములలోని యాలోచనమ్ము

లేమో – ప్రేమ సుధారస శ్రీముఖ మగు

ఆ ముఖములోని యాకాంక్ష లేమొ – త్రిజగ

తీ సముజ్జ్వల సౌందర్యతిలక మామె

ముద్దు చేతులలో ప్రేమ పుష్పమాల

అంద మొగవోయి ఏ కళానందమూర్తి

కంఠము నలంకరించునో –

 

“చిచ్చువలె చందురుడు పైకి వచ్చినాడు!

పెచ్చరిలినాడు గాడుపు పిల్లగాడు!

రాడు మోహన మురళీస్వరాలవాడు!

తప్ప కేతెంతు నని మాట తప్పినాడు!”

 

అంత కంతకు నిట్టూర్పు లతిశయించె

కొమరు చెమటలు చిగురు చెక్కుల జనించె

వదన మరచేతిలో నట్టె వ్రాలిపోయె

పడె కపోలమ్ముపై నొక్క బాష్పకణము.

 

 

అంత లోపల సుశ్యామలాంగు డొకడు

అల్లనల్లన పుడమిపై నడుగు లిడుచు

వెనుకగా వచ్చి తన ముద్దు వ్రేళ్ళతోడ

గట్టిగా మూసె నామె వాల్గన్ను దోయి.

 

కమ్మ కస్తురి తావులు గమ్ముమనియె

లలిత తులసీ పరీమళమ్ములు చెలంగె

తరుణి తన్మృదులాంగుళుల్ తడవి చూచి

“కృష్ణుడో, కృష్ణుడో” యంచు కేకవేసె.

 

“సరస శారద చంద్రికా స్థగిత రజత

యామున తరంగ నౌకా విహారములకు

నన్ను రమ్మని చెప్పి బృందావనమున;

కింటిలో హాయిగా కూరుచుంటివేమి?

 

ఎంత తడవయ్యె నే వచ్చి – ఎంతనుండి

వేచియుంటిని – పొదరిండ్లు పూచి – వలపు

వీచికలు లేచి – హృదయాలు దోచికొనెడి

యీ శరజ్జోత్స్నలో – పుల్కరించి పొంగి

మ్రోతలెత్తెడి యమునానదీ తటాన!

 

ప్రేయసి నుపేక్ష సేతువే ప్రియవయస్య!

ఇంత నిర్దయ పూనెదవే దయాళు!

ఇంతగా చిన్నబుచ్చెదనే మహాత్మ!

ఇట్లు గికురింతువే నన్ను హృదయనాథ!”

 

కలికి యిటు వచ్చిరాని పేరలుక తోడ

సజల నయనాల జీవితేశ్వరుని గాంచె.

 

సరస సంగీత శృంగార చక్రవర్తి

సకల భువనైక మోహన చారుమూర్తి

రాధికా మానస విహార రాజహంస

మందహాసమ్ము కెమ్మోవి చింద పలికె.

 

“ఆలసించుట! కాగ్రహ మందితేని

వెలది! విరిదండ సంకెలల్ వేయరాదొ!

ముగుద! పూబంతితో నన్ను మోదరాదొ!

కలికి! మొలనూలుతో నన్ను కట్టరాదొ!

 

రాధికా క్రోధ మధురాధర మ్మొకింత

నవ్వెనో లేదొ? పకపక నవ్వె ప్రకృతి;

నవ్వుకొన్నది బృందావనమ్ము; యమున

నవ్వుకొన్నది, చంద్రుడు నవ్వినాడు;

విరగబడి తమ పొట్టలు విచ్చిపోవ

నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల.

 

వాలుకన్నుల బాష్పాలు జాలువార

నంత రాధిక వివశయై అంఘ్రియుగళి

వ్రాలిపోయిన ప్రియుని కెంగేల నెత్తి

చిక్కుపడిన ముంగురులను చక్కనొత్తి

చెరిగిపోయిన తిలకమ్ము సరియొనర్చి –

“అవును లేవోయి! కపటమాయా ప్రవీణ!

ధీరుడవు మంచిశిక్షనే కోరినావు!

నిత్య సుకుమారమైన సున్నితపు మేను

నాదు చేబంతి తాకున నలిగిపోదె?

సొక్కి సొలిన నీ మోము చూడగలనె?

చేతు లెట్లాడు నిన్ను శిక్షింప నాథ!”

 

ఎంత నిర్దయురాలనో పంతగించి

కృష్ణ! నీచేత నిట్లు మ్రొక్కించుకొంటి –

నవ్య వనమాల కంఠాన నలిగిపొయె

చెక్కుటద్దాల తళుకొత్తె చిగురుచెమట

కొదుమ కస్తూరి నుదుటిపై చెదరిపోయె

బర్హిబర్హంబు చీకాకుపడియె మౌళి.

 

పొంద నేర్తునె నిన్ను నా పూర్వజన్మ

కృత సుకృత వైభవమున దక్కితివి నాకు;

విశ్వసుందర చరణారవింద యుగళి

ముద్దుగొని చెక్కుటద్దాల నద్దుకొను అ

దృష్ట మబ్బిన దొక్క రాధికకె నేడు,

తావకీన సౌందర్య సందర్శనాను

భూతిలో పొంగి ప్రవహించి పోదునోయి!

 

ఎంత కారుణ్య మున్నదో యెంచగలనె

కమలలోచన! నీ కటాక్షములలోన –

ఎంత లావణ్య మున్నదో యెంచగలనె!

ప్రేమమయమూర్తి! నీ ముద్దుమోములోన –

 

ఎంత మాధుర్య మున్నదో యెంచగలనె!

సులలితకపోల! నీ మృదు సూక్తిలోన –

ఎంత యమృతము గలదొ భావింపగలనె!

స్వామి! తావక మందహాసమ్ములోన –

 

ఎంత మైకము కలదొ యూహింప గలనె!

రాధికానాథ! నీ మధురాధరమున.”

 

అనుచు రాధిక పారవశ్యమున మునిగి

వ్రాలె మాధవు స్నేహార్ద్ర వక్షమునందు.

 

“రాధపై ప్రేమ యధికమో మాధవునకు

మాధవునిపైన రాధ ప్రేమయె ఘనమ్మొ”

ఈ రహస్యము నెరుగలే రెవరుగూడ

ప్రణయమయ నిత్యనూత్న దంపతులు వారు!

సాంధ్యశ్రీ

అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా

కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ

కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో

రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!

 

క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ

భ్యంజనమంగళాంగి! జడ యల్లుదునా – మకరంద మాధురీ

మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రఫుల్ల పు

ష్పాంజలి చేసి నీ యడుగులందు సమర్పణచేసికొందునా –

 

సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా

రింజకు నీళ్ళువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై

రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ

త్యుంజయమూర్తినై జమునితో తొడగొట్టి సవాలుచేతునా!


 

వైశాఖి

కుండలమీద పిచ్చికలు గుంపులుగూడె; నఖండ చండ మా

ర్తాండుడు చేటలన్ జెరిగె నగ్నికణమ్ములు; వెండినీ రదే

కొండలు నెత్తిపై పులుముకొన్నవి, రమ్ము శయింతు మీ లతా

మండపమందు, ప్రేమమయ మానసముల్ మధురించిపోవగన్

 

బుడుత డుయేలలో నిదురబోవుచునుండెను; పొట్లపాదుపై

ఉడుత పదేపదే అరచుచున్నది; పిట్టలు చెట్టుకొమ్మలన్

వడబడి కూరుచుండె; తలవంచెను చిట్టిగులాబి; గాడుపుల్

సుడిగొనుచుండె నో కుసుమసుందరి! మో మటు త్రిప్పబోకుమా

 

ఉండుము – లేవబోకుము కృశోదరి! నీ నుదుటన్ శ్రమాంబువుల్

నిండెను; పైపయిం దుడువనీ – సుషమా సుకుమారమైన నీ

గండయుగమ్ము వాడె వడగాలికి; ఊయలలోన వచ్చి కూ

ర్చుండుము – స్వేచ్ఛమై కలసి యూగుద మాశలు మిన్నుముట్టగన్.

 

 

 

ప్రాభాతి

రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్

ప్రోగులు వోయగా నిదురవోవు దయామయి! నా యెడందలో

ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెలో

దాగుడుమూతలాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!

 

ఈ గిజిగానిగూడు వలెనే మలయానిల రాగడోలలో

నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీభరమ్ములో

మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పైపయిన్

మూగి స్పృశించి నా హృదయమున్ కదలించుచునుండె ప్రేయసీ!

 

రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచిమాలికిన్

స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖమై మన దొడ్డిలోని పు

న్నాగము కుప్పవోసె సుమనస్సులు, కోవెలలో విపంచికల్

మ్రోగెను; లెమ్ము! పోదము! ప్రమోదముతో మనమాతృపూజకున్.

 

 

 

రాట్న సుందరి

రాటము మేళవించి, అనురాగము రాగము మాతృభూమిపై

పాటయి మ్రోగ, నూల్ వడకు పావన భారత భాగ్యలక్ష్మి! నీ

పాటల పాణిపద్మములు భవ్యము లయ్యెను – వేలులక్షలున్

కోటులు నూరుకోట్లు గయికొ మ్మివె ముద్దుల బావ దీవనల్.

 

పసుపుంబూతల లేత పాదములకున్ బారాణి గీలించి, నె

న్నొసటం గుంకుమ దిద్ది, కజ్జలము కన్నుందోయి గైసేసి, క్రొ

గుసుమంబుల్ తలదాల్చి, రాట్నముకడన్ గూర్చున్న నీమూర్తిలో

ప్రసరించెన్ జయభారతీ మధుర శోభా భాగ్య సౌభాగ్యముల్.

 

పండెను దేవి! నా వలపుపంటలు; పింజలు పింజలైన యీ

గుండెయె యేకుగా వడకుకొంటివి; నా బ్రతుకెల్ల దారమై

కండెలుగగట్టె నీదు చరఖాపయి; నేనిక చే రుమాలనై

యుండెద మెత్తగా పెదవు లొత్తుచు నీ వరహాల చేతిలో.

 

 

మధుర స్మృతి

ఆ మనోహర మధుర సాయంతనమున

ఉపవన నికుంజ వేదిపై నుంటి నేను;

చేత సుమరజ మూని వచ్చితిని నీవు

తిలకమును నా ముఖమ్ముపై దిద్ది తీర్ప.

 

ఒరిగి ఒయ్యరమొలుక కూర్చుండినావు

అందములరాణివై అస్మదభిముఖముగ;

చేరె మునుముందు నీ కుడిచేయి నాదు

ఆలిక ఫలకమ్ము తిలక విన్యాసమునకు.

 

పులక లెత్తించె తనువెల్ల చెలి! మదీయ

చిబుక మంటి పైకెత్తు నీ చేతివ్రేళ్ళు;

రాగరస రంజిత పరాగ రచ్యమాన

తిలక కళిక పరీమళమ్ములను చిందె.

 

“ఐనది సమర్చ, సొగ సింక అద్దమందు

చూచుకొను” డంటి వీవు నాజూకుగాను;

“అటులనా”యంచు నటునిటు సరసి, నీదు

చెక్కుటద్దమ్ము కడ మోము చేర్చినాను.

 

“ఎంత ముద్దుగ దిద్దితి వేది యేది”

యనుచు నొకరెండు ముద్దుల నునిచినాను;

పకపక మటంచు నవ్వి నీ పాణితలము

అడ్డమొనరించితివి తళ్కుటద్దమునకు.

 

నాటి ప్రేమార్ద్రతిలక మీ నాడు విజయ

దీక్ష నిప్పించు రక్తార్ద్ర తిలకమయ్యె;

ప్రియతమా! రమ్ము చేయెత్తి పులుచుచుండె

అమ్మ మనలను కరుణ కంఠమ్ము తోడ.

 

 

ఒకమాటు కనుమోడ్చుచుందు బమ్మెరవారి

మందార మకరంద మధుర వృష్టి

ఒకమాటు మూర్కొనుచుందు తిమ్మనగారి

పారిజాత వినూత్న పరిమళమ్ము

ఒకమాటు చవిచూచుచుందు పెద్దనగారి

ద్రాక్షాగుళుచ్ఛ సుధా సుధార

ఒకమాటు విహరించుచుందు పింగళివారి

వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి

 

ఒకట కవితా కుమారితో నూగుచుందు

గగన గంగా తరంగ శృంగారడోల

ఆంధ్ర సాహిత్య నందనోద్యాన సీమ

నర్థి విహరించు “ఆంధ్ర విద్యార్థి” నేను.

 

కాళిదాస కవీంద్ర కావ్యకళావీధి

పరుగులెత్తెడి రాచబాట నాకు

భట్టబాణుని ముద్దుపట్టి కాదంబరి

కథలు చెప్పెడి చెల్మికత్తె నాకు

భవభూతి స్నేహార్ద్ర భావవైభవగీతి

కరుణా రసాభిషేకమ్ము నాకు

వాల్మీకి కవిచక్రవర్తి భావస్ఫూర్తి

ఆటలాడెడి పూలతోట నాకు

 

భారతీదేవి మృదులాంక భద్రపీఠి

ముద్దులొలికెడి కతనాల గద్దె నాకు

తెలుగుతోటల సంస్కృత వనలతాళి

నంటుత్రొక్కెడి “ఆంధ్రవిద్యార్థి” నేను.

 

అస్వతంత్రుడు

నేనొక దగ్ధజీవనుడనే అయినాను – మదీయ మానసో

ద్యానమునిండ రక్కసిపొదల్ చిగిరింతలు గారకంపలే

గాని, పదేపదే పయిరుగాలికి నూగు గులాబి గుత్తులే

కానగరావు – స్వేచ్ఛయును గల్గునే యీ కరుణావిహారికిన్!

 

నేనొక వెర్రిమొర్రికవినే అయినాను – మదీయ జీవితా

ఖ్యానమునందు క్లిష్టగతి కష్టసమన్వయ దుష్టసంధులే

కాని సుగమ్య సుందర సుఖంకర సూక్తి సువర్ణ పంక్తియే

కానగరాదు – బోధమును గల్గునే యీ కవితావిలాసికిన్!

 

నేనొక జీర్ణశిల్పకుడనే అయిపోయితి – నా యులిన్ సదా

పీనుగ మొండెముల్ – పునుకపేరులు – కుంటిరూపి బొమ్మలే

కాని, వినూత్న యౌవన వికాస మనోహర రూపరేఖయే

కానగరాదు – తృప్తియును గల్గునె యీ తృషితాంతరాత్మకున్!

 

నేనొక క్లిష్టగాయకుడనే అయిపోయితి – నా విపంచి పై

దీన గళమ్ముతో తెగిన తీగలమీద విషాదగీతులే

కాని, రసంబు పొంగి పులకల్ మొలపించు ప్రమోదగీతయే

కానుగరాదు – స్థాయియును గల్గునె యీ రసలుబ్ధజీవికిన్!

 

నేనొక రంగలంపటుడనే అయినాను – మదీయ నాటకా

స్థానములో బుసల్ గుసగుసల్ సకలింతలు చప్పరింతలే

కాని, సెబాసటంచు రసికప్రవరుల్ తలలూపి మెచ్చుటే

కానగరాదు – సిద్ధియును గల్గునె యీ నటనావిలాసికిన్!

 

నేనొక కష్టకర్షకుదనే అయినాను – మదీయ బుద్ధి మా

గాణము నిండ ఒడ్డు మెరకల్ రవపెంకులు రాలురప్పలే

కాని, పసందుగా పసిడి కంకులువంగిన పంటపైరులే

కానగరావు – పుష్టియును గల్గునె నిష్ఠదరిద్రమూర్తికిన్!

 

నేనొక నష్టజాతకుడనే అయినాను – మదీయ జన్మ చ

క్రాన కుజాష్టమాది కుటిలగ్రహ కుండలి క్రూర దృష్టులే

కాని, త్రికోణ కేంద్ర శుభగ గ్రహ వీక్షణ సామరస్యమే

కానగరా – దదృష్టమును గల్గునె? యీ దురదృష్టమూర్తికిన్?

నేనొక భగ్ననావికుడనే అయినాను – మదీయ భవనాం

భోనిధిలో మహామకరముల్ సుడిగుండములున్ తుపానులే

కాని, సుధా సుధాకిరణ కల్పక దివ్యమణీ వితానమే

కానగరాదు – అద్దరియు గల్గునె యీ యెదురీతగానికిన్?

 

నేనొక దీనభిక్షుడనే అయినాను – మదీయ జీర్ణగే

హాన దరిద్రదేవత మహా వికట ప్రళయాట్టహాసమే

కాని, యదృష్టలక్ష్మి కడకంటి సుధా మధురార్ద్రదృష్టియే

కానగరాదు – భాగ్యమును గల్గునె ఇట్టి యభాగ్యమూర్తికిన్?

 

నేనొక వ్యర్థతాపసుడనే అయినాను – మదీయ సంతత

ధ్యాన సమాధిలో వెకిలిదయ్యపు మూకల వెక్కిరింతలే

గాని, ప్రసన్నభావ కళికా లవలేశ విలాసమేనియున్

గానగరాదు – ముక్తియును గల్గునె యీ పరితప్తమౌనికిన్?

 

 

తెనుగుతల్లి

కనిపింపదే నేడు! కాకతీయ ప్రాజ్య

సామ్రాజ్య జాతీయ జయపతాక –

వినిపింపదే నేడు! విద్యానగర రాజ

సభలోని విజయ దుందుభుల మ్రోత –

చెలగదే నేడు! బొబ్బిలికోట బురుజుపై

తాండ్ర పాపయ తళత్తళల బాకు –

నిప్పచ్చరంబయ్యెనే నేడు! వీర ప

ల్నాటి యోధుల సింహనాదలక్ష్మి –

 

చెక్కు చెదరని – యేనాడు మొక్కవోని –

ఆంధ్ర పౌరుష మిప్పు డధ్వాన్న మయ్యె;

మరల నొకమాటు వెనుకకు మరలి చూచి

దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!

రాజరాజుల చరిత్రల నాలపించెడి

గౌతమీ గద్గద కంఠరవము

కృష్ణరాయల కీర్తిగీతాలు కడుపులో

జీర్ణించుకొను హంపి శిథిలశిలలు

అలనాటి కాకతీయుల పౌరుషము త్రవ్వి

గంపకెత్తెడి ఓరుగంటి బయలు

బలితంపు రెడ్డి బిడ్డల సాము గరడీల

రాటుతేలిన కొండవీటి తటులు

 

విని – కని – తలంచుకొని గుండె వ్రీలిపోయి

వేడి వేడి నిట్టూర్పులే విడిచినాము!

గుడ్డ గట్టిన కడివెడు కొడుకులుండి

యిల్లు వాకిలి కరువైన తల్లివీవు!!

 

“రాయి గ్రుద్దును” నీ పురా శిల్పసంపత్తి

అమరావతీ స్తూప సముదయంబు;

“చదవించు” నీ మహాసామ్రాజ్య కథల నాం

ధ్ర క్ష్మాపతుల జయస్తంభ లిపులు;

“గళమెత్తిపాడు” నీ గాన సౌభాగ్యమ్ము

రమణీయముగ త్యాగరాయ కృతులు;

“వేనోళ్ళచాటు” నీ వీరమాతృత్వమ్ము

పలనాటివీరుల పంట కథలు;

 

“వల్లె వేయును” నీ వైభవ ప్రశస్తి

హోరుమంచును నేడు మా ఓడరేవు;

బ్రతికిచెడియున్న నీపూర్వ భాగ్యరేఖ

చెరగిపోలేదు తల్లి! మా స్మృతిపథాల!!

 

గంటాన కవితను కదనుత్రొక్కించిన

“నన్నయభట్టు” లీనాడు లేరు

కలహాన కంచుఢక్కల నుగ్గునుగ్గు గా

వించు “శ్రీనాథు” లీవేళ లేరు

అంకాన వాణి నోదార్చి జోలలు వాడు

“పోతనామాత్యు”లీ ప్రొద్దు లేరు

పంతాన ప్రభువుచే పల్లకీ నెత్తించు

కొను “పెద్దనార్యు” లీ దినము లేరు

 

“వాణి నా రాణి” యంచు సవాలు కొట్టి

మాట నెగ్గించు వీరు లీ పూట లేరు

తిరిగి యొకమాటు వెనుకకు తిరిగి చూచి

దిద్దికోవమ్మ! బిడ్డల తెనుగు తల్లి!!

 

కవులకు బంగారు కడియాలు తొడిగిన

రాయలు గన్న వరాల కడుపు

సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ

నాథుని గన్న రత్నాల కడుపు

భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో

పన్నను గన్న పుణ్యంపు కడుపు

జగ మగంటిమి నల్దెసల్ వెలార్చిన పాప

రాయని గన్న వజ్రాల కడుపు

 

పిసినిగొట్టు రాజులకును – పిలకబట్టు

కుకవులకు – పిచ్చిపిచ్చి భక్తులకు – పిరికి

పందలకు – తావు గాకుండ ముందు ముందు

దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!