బస్సులో సీటు దొరకని యీ నాలుగ్గంటల సాయంత్రం నిద్ర కళ్లతో తూగుతూ
నిల్చోలేక అవస్థపడే ఆ పిల్లాణ్ణి కాస్త దగ్గరదీయండి.
గొంగళి పురుగును మోస్తోన్న చివురుటాకులా
మూపున పుస్తకాల బస్తాతో చెమటలుకక్కే ఆ పసివాడికి
మీ మధ్య కొంత చోటివ్వండి.
పల్లెల్ని సుడిగాలిలా క్రమ్మిన
కాన్వెంటు చదువుల వ్యామోహం
ఫ్రీపాస్ ప్రయాణమై వాడి లేతబతుకును కాల్చేస్తోంది.
స్పూనెడు అక్షరాల కోసం
పిడికెడు మెతుకుల్తో పదిగంటల పగటిని యీదేందుకు
చిన్నప్పటి తల్లి స్తన్యం వాడి వొంట్లోంచి ఎప్పుడో ఆవిరైంది.
పగలంతా మాస్టార్లు
కుమ్మరి మట్టిలా తొక్కి వదలిన వాడి మెదడును
ఇక్కడే కాస్త కునుకుదీయనీండి.
తల్లి కోసం లేగదూడయి ఎదురెక్కాల్సిన వాడు
తల్లి గుండెల్ని – నిరీక్షణల గాయాల ఇంధనంతో సాగే
పల్లె బస్సుగా మలుస్తున్నాడు.
పల్లె ఒళ్లంతా తూనీగలా గిరికీలు కొట్టాల్సిన వాడు
పల్లె వూపిరుల్ని – వాడివాలే లేతవిరుల
సాయంకాలపు బస్టాండుగా మారుస్తున్నాడు.
అమ్మ తాయిలానికీ అయ్యవారి సుద్దముక్కకూ మధ్య చూపుడు వేలిని బలపంగా
మార్చే వూరిబడి కలల్ని ఇప్పుడన్నా కాస్త కాన్వెంటు గాయాలకు లేపనంగా
పూసికొనే అవకాశం ఆ కుర్రాడికివ్వండి.
భూమాత చేతుల్లోంచి పైకెగరేయబడి కిలకిల కేరింతలు కొట్టే చంద్రుడిలా
వుండాల్సిన వాడు భూగోళాల్ని సంచినిండా కూరి వీపుమీద మోయటం వల్ల
అంగవికలుడవుతున్నాడు – కాస్త సేదదీర్చి ఆదుకోండి.
బస్సుదిగి – ఒక్క అంగలో ఇంటికి చేరి వీపుమీది బరువుదించి వెనుదిరిగి
చూసికొనేసరికి అది హోంవర్కయి – పచ్చిపేడంత బరువుగా తలకెక్కి
సాయంత్రపు ప్రాణవాయువులన్నిట్నీ పీల్చేస్తోంటే అలసటగా నేలకు వాలబోయే
ఆ చిన్నారికి ఇక్కడే . . . ఇప్పుడే . . . . రవ్వంత విశ్రాంతినివ్వండి. మిమ్మల్ని
శత్రువులుగా గుర్తించకముందే వాణ్ని దగ్గరకు తీసికోండి