ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మహర్షులు అందరి సొత్తు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

నీ జాతికి నువ్వు పితామహుడివి
కొన్నితరాల పాటు నీ దేశ ప్రజ
నిన్ను తల్చుకుని స్వాభిమానంతో
సంపాదించుకున్న అన్నం తింటారు.
అయితే ఈ కథ అంతటితో ఆగదు
ఈరోజు నీ పేరు వింటే పులకించిపోయే
ప్రజలు నీ దేశస్థులొక్కరే కాదు
కేవలం నీ జాతి వాళ్ళూ కాదు!

సమస్త ప్రపంచ ప్రజానికానికి నువ్వు ఒక ఆదర్శానివి
నిజానికి చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా వుండాలనుకుని
నువ్వు చేసిందేమీ లేదు!
నీ బ్రతుకు తీరు నిన్ను అజరామరుడ్ని చేసింది!
శాశ్వతమైన కీర్తిశిఖరాల అంచులని నువ్వు తాకినప్పుడు
స్వాతంత్రం సమభావం మానవజాతుల మద్య సయోధ్య
నీ నమ్మకాల పునాదురాళ్ళై నువ్వు
నీ వ్యక్తిత్వపు సౌధాన్ని పటిష్టంగా నిలబెట్టుకున్నావు
అయితే ఒక భవనం మహాసౌధం కడితే సరిపోదు.
వ్యక్తిగా ఎదగాలంటే ఏం చెయ్యాలనేదిముఖ్యం
అది చేసి చూపించావు!
నిన్ను జైలుపాలు చేసిన అరాచకశక్తుల్ని
నీ క్షమతో జయించావు!
మా గాంధిని మహాత్మునిగా తీర్చిదిద్దిన దేశంలో
ఉదయించిన నల్ల సూర్యుడివి!
మహాత్మగాంధీని మా దేశం మర్చిపోయినా
జన్మదినం నాడు తప్పితే మరెన్నడూ తలవకపోయినా
ఆయన కలలు కన్న భారతం
కళ్ళకి కట్టించిన విలువలు నేడు దేశంలో కరువైనా
నిన్ను చూసుకుని గర్వించాము.
ఆయనకివ్వలేని భారతరత్నాన్ని నీకిచ్చి
మా జాతి తన్నుతాను గౌరవించుకుంది!

మహాత్మగాంధీ అయినా మార్టిన్ లూథర్ అయినా
నెల్సన్ మండేలా అయినా ఒక దేశానికి ఒక జాతికీ చెందరు
చరిత్రని తిరగరాసే మహర్షులు అందరి సొత్తు!