ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మరణ వాంజ్మూలం

Like-o-Meter
[Total: 0 Average: 0]

లెప్ట్ రైట్, లెప్ట్ రైట్
ఎవరి దారి వారిదే.
ఐతే ఒరే-
నాలుగు భుజాలా మోస్తున్న పాడెను
నడివీధిలో వదిలెయ్యకండి.

ఎవరి పూజలు వారివే
ఎవరి పూలూ వారివే
ఐనా సరే
ఒంటరిదైన తోట కోసం
కాసేపు ప్రార్ధించండి.

ఎదిగొచ్చిన ప్రతి గింజ మీదా
మీ మీ పేర్లు రాసుకోండి
కానీ
పొలాల మధ్య
ఇనుప కంచెల్ని పెరగనీకండి.

ఎవరి కన్ను వాళ్ళు
పెకలించుకోండి.
ఎవరి ఆయుధాలు వారివే.
గాయం మెలిపెట్టినపుడు
కన్నీళ్ళు కార్చడానికి,
రెండు కళ్ళూ ఓ చోట చేర్చండి

చెరో వైపు వంగిన కొమ్మల మీద
ఓ వైపు కాకులుంటాయి
ఓ వైపు కాయలుంటాయి
తొందరపడి
చెట్టు నరుక్కోకండి.

ఎవరి వాటాలు వారివే
పంచుకోడానికి
చెయ్యొకడికీ కాలొకడికీ
వచ్చినపుడు
ఎవడి పొట్టా కొట్టకండి.

ఎవరి భాష వారిదే.
ఎవరి భావం వారిదే.
మౌనంగా వున్నా, పర్వాలేదు
ఒకరి ముఖాలొకరు చూసుకోండి.
అద్దం అవసరం లేదన్న సత్యాన్ని
తెలుసుకోండి.

ఎవడి బిడ్డా వాడిదే
ఖచ్చితంగా ఎవడి పెళ్ళాం వాడిదే.
చెరో గదిలో వుంచడానికి-
కన్నవాళ్ళను మాత్రం నిలువునా
కొయ్యకండి.

రాత కోతల్లో
కాస్తంత జాగ్రత్త!

ఊర్లో పొలాన్ని
తలో ఎకరా పంచుకోండి.
అరె అయ్యలారా
ఊరవతల స్మశానాన్ని మాత్రం
ఉమ్మడి ఆస్తిగా వుంచుకోండి.