ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నౌకావలోకనమ్ – పుస్తక పరిచయం

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

ఆవకాయ సాహిత్యం – నౌకావలోకనమ్ – పుస్తకం పరిచయం

శ్రీమతి శరద్యుతి నాదయోగి త్యాగయ్య రచించిన నౌకాచరితం అనే నృత్యకావ్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసిన చక్కటి వచన రచన ఈ నౌకావలోకనమ్.

అవలోకనం అంటే చక్కగా చూడడం అని అర్థం. నౌక అంటే తోసుకొంటూ తీసుకుపోయేదని అర్థం. అయితే ఇవి నైఘంటుకార్థాలు. తీసుకుపోయేది చక్కగా చూడడం అంటే ఏమిటి? అన్న ప్రశ్న, సంశయం, సందేహం కలుగకుండా పోదు. కనుక ఇక్కడ ఈ రెండు పదాలకు విశేషార్థాలను వెదకాలి.

నౌకను ఓ ప్రాణమున్న మనిషిగా భావించండి. అంతే! అవలోకనం అనేది చక్కగా కుదురుకుంటుంది.

Buy Naukavalokanam on TeluguBooks.in 

Buy Naukavalokanam on AchchamgaTelugu.com

ఎవరీ నౌక?

శ్రీమతి శరద్యుతి వ్రాసిన నౌకావలోకనమ్ లోని నౌక ప్రాణమున్న నౌక. మాట్లాడే నౌక. మాయానౌక. ఆ మాయ దుష్టమాయ కాదు. లౌకిక మాయ అసలే కాదు. అది అప్రాకృతమైన, అతిమానుషమైన మాయ. శ్రీకృష్ణమాయ!

రచయిత్రి మాటల్లో చెప్పాలంటే – “శ్రీపతితో కలిసి పుట్టిన యోగమాయ ఇక్కడ నౌకగా మారి, శ్రీకృష్ణుని మాయాలీలకై స్వామి ఆజ్ఞను తలదాల్చి తానూ ఓ భాగమవుతుంది.”

ఈ నౌక ఆషామాషీ నౌక కాదు. ’అంగరంగవైభవంగా ముస్తాబయిన భూలోక పుష్పకవిమానం.’ ఇంద్రాది దేవతలకు దక్కని స్వామి పాదస్పర్శను స్వంతం చేసుకున్న నౌక.

ధ్వని పాడ్కాస్ట్ – వందలాది ఆడియోలను ఉచితంగా వినండి

అంతరార్థ శోధనం – నౌకావలోకనమ్:

రచయిత్రికి శ్రీత్యాగరాజ స్వామివారి నౌకాచరితమును చదువుతూ వుండగా ఎన్నో ఆలోచనలు, నవీన అంతరార్థాలు తోచాయి. త్యాగయ్యగారి దృష్టిలో భవసాగరమే యమునా నది. ఆ సాగరాన్ని దాటించే సాధనమే నావ అని రచయిత్రికి అర్థమయింది. ఆ అర్థంలోని పరమార్థాన్ని శోధించడానికి చేసిన ప్రయత్నమే నౌకావలోకనమ్.

మాన్యుడైన శ్రీత్యాగరాజస్వామి హృదయావిష్కరణ చేసి వ్యాఖ్యానించే అనుభవంగానీ, పాండితీ ప్రకర్షనగానీ అతి మాన్యురాలైన నాకు లేవ“ని చెప్పుకున్న వినయశీలి శ్రీమతి శరద్యుతి. అయితే, ఉడుత లాంటి అల్పప్రాణి నుండి సేవను స్వీకరించి అనుగ్రహించిన శ్రీరాముడు మానవుల సేవను స్వీకరించవుంటాడా? ఉండగలడా? ఉండలేడు. కనుకనే, శ్రీమతి శరద్యుతి మనసులో నిలబడి ’పలికించెడి వాడు రామభద్రుండట’ అన్న చందాన సాహిత్యసేవను స్వీకరించాడు. అయితే, ఆ సేవను రామార్పణంగా కాక కృష్ణార్పణంగా చేయమన్నాడు. ఇంతే వ్యత్యాసం.

త్యాగయ్య గారి రచనాశైలి ద్రాక్షాపాకం. అంటే సులభంగా అర్థమయ్యే భాష, భావంతో నిండివున్నదన్న మాట. సంగీతప్రపంచ ఆరాధ్యదైవమైన ఆ సద్గురు శైలినే అనుకరించారు రచయిత్రి. చిట్టి చిట్టి వాక్యాలు. అలతి అలతి పదాలు. చకచక్కని భావాలు – వెరసి “నౌకావలోకనమ్’ ఓ ఆహ్లాదకరమైన సుగంధబంధుర మధురవీచిక. హాయైన పిల్లతెమ్మెర. కమ్మని పాయసం. కృష్ణరసామృతభరితం.

నౌక పోషించే ఆరు పాత్రలు:

’నౌకావలోకనమ్’ లోని నౌక ఆరు రకాల పాత్రలను ధరిస్తుంది. ఆదిలో అది ఆనందనౌక. అనంతరం ప్రలోభనౌక. ఆపై ప్రణయ నౌక, తన్మయనౌక. అంతలోనే ప్రళయ నౌక. ఆఖరుకు శరణాగతి నౌక.

నిజానికి, కథారంభంలో మనకు నౌక కనిపించదు. యమునానది ఒడ్డున నిటారుగా నించున్న ఓ నిలువెత్తు దేవదారు వృక్షం కనిపిస్తుంది. అది ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఉంది. ఓ రోజున ఓ వ్యక్తి వచ్చాడు. ఆ చెట్టును కొట్టాడు. ముక్కలు చేసాడు. మేకులు దించాడు. బిరికీలను బిగించాడు. దాంతో చెట్టు కాస్త ఓడగా మారింది. రచయిత్రి మాటల్లో నౌకగా మారుతున్న చెట్టు భావాలు ఇలా ఉన్నాయి –

“కరుకైన రంపాలు కోస్తుంటే నన్ను
కష్టానికి కరుణ కలిగెనేమో
కమనీయరూపంతో ఓ నౌక నేను
తోచదే ఏమిటో దీని పరమార్థం!”

“ఆనంద ధారలను వర్షించెనదిగో
చాటుగా నా ఉనికి నదిపైన ఇదిగో
కాళింది మడుగులో జలజముల తోడ
కలకాలముంటాను యమునమ్మ నీడ”

ఇలా దేవదారు వృక్షం ఆనందనౌకగా మారింది. ఆకుంద, సేవంతికా, లోనిక, గిరికర్ణిక, యుతిక, అతిముక్త, మధుమాలతి అనే ఏడుగురు గోపికల యమునా విహారానికి ఆటపట్టయింది. ఈ ఏడుగురు గోపికలు చాలా విశేషమైనవారు. కృష్ణుడు సంగీతమయితే ఈ ఏడుగురు ఏడుస్వరాలు. కృష్ణుడు ఆకాశమయితే ఏడు వర్ణాలు. వీరు కృష్ణునితో కలిసి యమునా విహారం చేయాలనుకున్నారు. అదే సమయానికి కృష్ణమాయ నిండిన నౌక అక్కడకు వచ్చింది. ఆ నౌక ఎలా ఉందో రచయిత్రి మాటల్లో చూద్దాం –

పాలకడలిలో ఆదిశేషుడు. నల్లని యమునలో నేను. ఆకాశాన గరుత్మంతుడు. నీటిలో నేను ఒకే తీరుగా వెలుగుతున్నాం. పరమపురుషుని వాహనమైన వైనతేయుడు నిరంతరం తరిస్తాడు. కానీ ఈ వేళ కంజజుజనకుని మోసే భాగ్యం. నాది…నాది!

సరే, అలా ఆనందనౌక వద్దకు కృష్ణ సమేతులై వచ్చారు ఏడుగురు గోపికలు. వారు యవ్వన గర్వంతో నిండివున్నారు. సౌందర్యసంపదతో అతిశయించివున్నారు. ఒకవైపు కృష్ణుని పట్ల ప్రేమను కలిగివున్నారు. వీడు మామూలు పిల్లవాడే అన్న చులకనను కలిగివున్నారు. అందుకే వీరిని రచయిత్రి ఇలా వర్ణించడం జరుగుతుంది – “సగం పచ్చిగా, మిగతా సగం పండుగా వుండి దోరజామకాయలాగా ఉంది ఆ గోపికల అంతరంగం.” వారి గర్వం కృష్ణుడుకి కోపం తెప్పించింది. ఓడను ఎక్కనన్నాడు. అప్పుడు ఆ ఏడుగురు గోపికలు ఏడువిధాలుగా బ్రతిమలాడారు. ఏడు విధాలుగా ప్రలోభ పెట్టారు. ఇలా ఆనందనౌక కాస్త ప్రలోభనౌక అయింది. చివరకు నౌకను ఎక్కడానికి ఒప్పుకున్నాడు కృష్ణుడు.

ప్రణయ నౌక:

కృష్ణుని ఆగమనంతో నౌక ప్రణయనౌకగా మారింది. ఓడలో, గోపికల మధ్య వెలుగుతున్న కృష్ణుణ్ణి చూడడానికి సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ ఒకేసారి వచ్చారు. “ఇది సాయంసంధ్యా సమయం. నా సమయం. వెళ్ళమన్నా“డు చంద్రుడు సూర్యుణ్ణి. ఇద్దరి మధ్య సంవాదం జరిగింది. ఎంతో గమ్మత్తైన ఈ సంవాదాన్ని నేను చెప్పడం కంటే మీరు చదవడంలోనే రక్తి కడుతుంది.

ఆ ప్రణయనౌకలో మెరుపు తీగెలతో అల్లిన ముత్యాలదండకి నీలమణిని అమర్చినట్టుగా రచయిత్రికి కృష్ణా సమేత గోపికల బృందం కనబడింది. యమునలో నౌక సాగుతుంటే ఒక్కొక్క గోపికతో ఒక్కోవిధమైన ప్రణయకేళిని ప్రదర్శించసాగాడు కృష్ణుడు. ఆ ప్రణయక్రీడను చూస్తున్న నౌక తన్మయ నౌక అయింది. ఆ గోపికతో కృష్ణుడు కూడినప్పుడు మరొక గోపిక విరహాగ్నిదగ్ధ మానస అవుతోంది. మరో గోపిక తన సఖి చేసుకున్న అదృష్టానికి ఆనందిస్తోంది. ఇవన్నీ చూస్తున్న నౌక తనతో తాను ఏమనుకుందో ఊహిస్తూ రచయిత్రి ఇలా చెబుతుంది – “నిర్జీవమైన చెట్టు తునకలతో తయారైన నాకు సజ్జనామోదమైన నీ అద్భుతలీలా విశేషాలను గోచరింపజేసావు.”

రేగుపళ్ళు – వేదాంత బోధ:

అంతలో గిరికర్ణిక అనే గోపిక కృష్ణుని కోసం రేగుపళ్ళని తీసుకొచ్చింది. తీసుకురావడమే కాదు ఆ పండులోని వేదాంత రహస్యాన్ని వివరిస్తుంది. “కృష్ణ! రేగిపండు ప్రత్యేకతను చెబుతాను విను. యుక్తవయస్సులో తేనెలూరినట్టు అత్యంత మధురంగా అమృతపు జల్లు కురిపిస్తుంది. బాగా పండిపోయాక పటుత్వం పోయి పుల్లటి రుచిని కలిగివుంటుంది.”

గిరికర్ణిక చేత ఈ మాటలని పలికించిన రచయిత్రి శ్రీమతి శరద్యుతి సునిశిత దృష్టితో చూసినప్పుడు “బాదరాయణ సంబంధం” అర్థం కాని వ్యర్థసంబంధంగా కాక వేదార్థబోధకమైన ఆధ్యాత్మిక సంబంధం అని అనిపించక మానదు.

ప్రళయ నౌక శరణాగతి:

మళ్ళీ నౌకలోకి వస్తే ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గోపికలు కృష్ణుణ్ణి నిర్లక్ష్యం చేసి తమలో తాము ఆడుకుంటున్నారు. ఇలా ఎందుకయిందో తెలియాలంటే పుస్తకాన్ని చదవాల్సిందే.

దాంతో, కృష్ణుడు గోపికలకు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదు. జగన్నాథుడు తలచుకుంటే జగన్నాటకాలకు కొదవ లేదు. అంతే! తలంపు మాత్రంగానే ప్రళయాన్ని సృష్టించాడు. అంతటితో ప్రణయ నౌక కాస్త ప్రళయ నౌకగా మారింది. ’తిమిరాగ్ర మేఘాలు’ ఆవరించాయి. ’ప్రళయ మారుతాలు’ చెలరేగిపోయాయి. ఆనందాల ముంగిళ్ళలో మహా అలజడి. నౌక భయపడింది. బెంబేలెత్తింది. మొదట యమునాదేవిని తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థించింది. గోపికలను కాపాడమని వేడింది.

నా పుట్టుకే కొన్ని వందల దెబ్బలతో, సీలలు గుచ్చిన పోట్లతో మొదలయింది. అప్పుడు కలిగిన బాధ నాకో అందమైన రూపాన్నిచ్చింది. కానీ ఇప్పుడున్న నా మనఃస్థితి నా రూపాన్నే కాదు నా ఆత్మస్థైర్యాన్ని కూడా చిద్రం చేస్తోంది. నాతో పాటు నేను మోస్తున్న ఈ నారీమణులందరూ ప్రమాదం నోట చిక్కుకుని అల్లాడిపోతున్నారు. జగద్రక్షకా పాహి మాం!” అంటూ నౌక ఎలుగెత్తి ప్రార్థించింది.

’సౌందర్య తమస్సు’తో నిండిన బుద్ధి గల్గిన గోపికలు కూడా ప్రార్థించారు. కావమని అర్థించారు.

ఇంతటితో ప్రళయనౌక ’శరణాగతి నౌక’గా రూపాంతరం చెందింది. కృష్ణుడు గోపికలకు విచిత్రమైన, వింతైన సలహాలను ఇచ్చాడు. వారిని వివస్త్రలుగా మారమన్నాడు. అరకొర శరణాగతితో ప్రమాదం ఆగదని, సంపూర్ణ శరణాగతి లోనే ప్రమోదం ఉందన్నాడు.

మొదట కాదన్న గోపికలు గతి లేక కృష్ణుని సలహాను పాటించారు. నిర్లజ్జలై నిలిచారు. అప్పుడు రచయిత్రి “గోపికల మదము కాటుకలా కరిగి, చెక్కిలి వెంట కారి, ప్రళయంలో కొట్టుకుపోవ’డాన్ని చూడడం జరిగింది.

అహంకారం అంతరించిన ఏడుగురు గోపికలకు శ్రీకృష్ణుని ఏడు అపూర్వ అవతారాల దర్శనమయింది. ఆ తర్వాత ఓ అలౌకికమైన సంఘటన జరిగింది. అదేమిటో పుస్తకంలో చదివి తెలుసుకోండి.

ఆపై గట్టు చేరిన గోపికలు “గంధము పూయరుగా” అంటూ పన్నీటి గంధాన్ని కృష్ణునికి పూసి పూతాత్మలై తరించారు.

ముగింపు మాటలు:

యువ రచయిత్రి శ్రీమతి శరద్యుతికి ఇది తొలి రచన.

కానీ పుస్తకం ఆమూలాగ్రం ఇది ఓ ఔత్సాహిక రచన అని అనిపించదు. పరిణితి చెందిన అనుభవజ్ఞులెవరో వ్రాసినట్టే అనిపిస్తుంది. ఇది నా మాట కాదు ’అవధాన సరస్వతి’ డా. మేడసాని మోహన్ గారి మాట. ’అన్నమయ్య వరప్రసాది’ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి మనసులోని మాట.

ఆధ్యాత్మిక రచనలు అరుదవుతున్న ఈ కాలంలో, శరద్యుతి లాంటి ఓ యువతి వ్రాసిన నౌకావలోకనమ్ వంటి సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

మరెందు కాలస్యం? ’నౌకావలోకనమ్’ పుస్తకాన్ని ఈ క్రింది లంకెను ఉపయోగించి పొందండి.

Buy Naukavalokanam on TeluguBooks.in 

Buy Naukavalokanam on AchchamgaTelugu.com