ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నీ పాట …

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆగమన సంకేతాలకే
లయ తప్పిన గుండెలో
ఏ ఙ్ఞాపకాల గడపో తగిలి
బొక్క బోర్లా పడింది మనసు

దులుపుకోబోతే
ఒంటి నిండా
వదలని వెన్నెల రేణువులు

నిలువునా తడిపేస్తాయనుకుంటే
ఉవ్వెత్తున ఎగసిపడి
తిరిగి ఉద్వేగంలోకే ముడుచుకుపోతున్నాయి
పదాలు

ఇందరి మధ్యలో ఉన్నా
నీ అడుగుల సవ్వడికి
హఠాత్తుగా వరించే ఏకాంతంలోంచి   
పరిచయమైన సుగంధమొకటి
పలుకరించి పరుగెడుతుంది    

విరబూసిన పెదవుల మీదుగా
పయనించే ప్రతి శ్వాసా
కాశ్మీర రాగాన్ని
నరాలకి పరిచయం చేస్తుంది

అప్పుడే …
పదాల పూలచెండు
అరమోడ్పు రెప్పలపైన
సమ్మోహనంగా చుంబిస్తుంది