Like-o-Meter
[Total: 0 Average: 0]
నేనో మైదానాన్ని!
తడిసిపోయిన నోట్లకట్టల్ని ఆరబెట్టుకొన్నట్టు
ఎండుటాకుల్ని పేర్చుకొంటా
చివరల కంటుకొన్న మంచుబొట్లని
పీల్చేసి వాటి బాధ తీరుస్తా
రాత్రి వక అమ్మాయి లేత దేహాన్ని
గుండెలోకి దించుకొన్నా
వంటరి తాత “తీసకపోరా! రామా!” అనగానే
పరదేశీ మనవడికి తెలీకండా
గబీమని లాగేసుకొన్నా
జెండాల కోసం
గూటింబిళ్ళాట కోసం
వళ్ళంతా గోతుల్ని దిగేసుకొన్నా
ఎప్పుడైనా! ఆహా( ఎప్పుడైనా వకసారి
చెవిని ఆనించు నాపై
నీ తరతరాల తలరాతల రహస్యాల్ని
నీకు మాత్రమే చెప్తాను!