ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నిన్నటి నాన్న-నేటి కొడుకు

Like-o-Meter
[Total: 0 Average: 0]

వలువలూడదీసిన
విలువల వ్యవస్థలో
నాకైతే ఏం కన్పడలేదు
వయసు వగరు తప్ప!

యాంటిక్స్‌ని భద్రపర్చుకున్న గదిలా ఉన్న
వృద్దాశ్రమానికెళ్ళి
నాన్నని కలిశా.
అదే చిర్నవ్వు, భావగర్భితంగా…
అదే ఆప్యాయత!

ఆయన బ్రతుకుబండి ముందు
నాకొత్త కారేపాటిది?

కారుని మార్చానేమోకానీ
ఆయన్ని ఏమార్చలేనుగా!!
నా తేరుని నిరాసక్తంగా చూసి
ఆనందాన్ని నిర్వచించుకోమన్నారు–

“తల్లీ, తండ్రీ, భార్యా, పిల్లలు
వీళ్ళందరి కంటే
జీవితమే నీకు తోడు
ఆ జీవితాన్ని “అర్ధం” చెయ్యి
జీవితంలో నిండిన
శూన్యానికి రంగులద్దకు”

నిన్న వాడిపారేసిన డోర్ మ్యాట్
దీనంగా నావైపు చూస్తూన్న చూపే…

జీవితం చిన్నదే
కానీ
జీవిత పరమార్ధం గొప్పది.

చలువ కళ్ళద్దాల వెనకచేరిన
వేడికి చలించి
ఆర్ద్రంగా
తన చేతిరుమాలిచ్చారు నాన్న.
వెధవది, కల్తీ కన్నీరు
ఉప్పగానైనా లేదు!