ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!

Like-o-Meter
[Total: 0 Average: 0]

చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో

నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా

మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను.

జలపాతాల అవిరళ సంగీత సాధనలూ

నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ

కడలి తరంగాల కవ్వింపు బాణీలూ

ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.

 

అప్పుడెప్పుడో నగ్నంగా

అంతరంగాన్ని ప్రదర్శనలో పెట్టి

వెలుగంత స్వచ్చతకు చీకటి ఆపాదించినప్పుడే

నా స్వరం మూగవోయింది

పవిత్రంగా సమర్పించిన అభిమానానికి

అపనిందలు ప్రతిఫలమైనప్పుడే

మాటలు మర్చిపోయిన మనసు ముక్కలైపోయింది.

 

నిశ్శబ్దం నా చెలికత్తెగా మారాక

ఎక్కడ చూసినా సహృదయతే

ప్రశ్న ఏదైనా చిరునవ్వు నా సమాధానమయ్యాక

ఎక్కడ చూసినా ప్రశంసల జడివానలే

నిశ్శబ్దం నన్ను నేను లేకుండా చూసుకోవడమని

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణ అనీ

నిశ్శబ్దం ఎవరి జవాబు వారికిస్తుందనీ

ముఖ్యంగా అహాన్ని తృప్తి పరుస్తుందనీ

ఆలస్యంగా తెలుసుకున్నాను

 

అందుకే నేనిప్పుడు

దాహాన్ని తీర్చే ఓ గుక్కెడు మంచినీటి అమృతాన్ని

పరిపూర్ణత మధువు తాగిన సంతృప్తిని

నా నిశ్శబ్ద విశ్వ ప్రాంగణంలో నేనో సజీవ శిల్పాన్ని.