ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పల్లె ఒడి

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎన్నాళ్ళయింది 
నీ కాళ్ళకు చెవులు మొలిపించి
ఆ కాలి బాట సంగీతాన్ని విని
ఎన్నాళ్ళయింది 
తడిసిన మట్టికి
నీ ఒంటిని బహుమతిగా ఇచ్చి
పారే ఆ పిల్ల కాలువతో పోటీ పడి
విచ్చిన అందాలలో నీ కళ్ళను ముంచి
మనసు పై ఎన్నో అందమైన
చిత్రాలు గీసుకుని ఎన్నాళ్ళయింది
ఎన్నాళ్ళయింది
మోకాలి పైకెదిగిన పుడమి జడలపై
నీవు నవ్వుతూ పూసి
ఎన్నాళ్ళయింది
రెక్క విప్పని పక్షి పిల్లకి
నీ చేతులూపుతూ ఎగరటం నేర్పి
ఊసుల దారాలు కట్టి
ఆశల పతంగాలు ఎగురవేసి
ఎన్నాళ్ళయింది
దాక్కున్న వానపాముతో లాక్కున్న చేపను
హుందాగా నీ భుజం పై మోసుకెళ్ళి
నత్త గూళ్ళల్లో గానాన్ని నీ నేస్తాలకు వినిపించి
ఎన్నాళ్ళయింది
నీ పద ఘట్టనలతో ఆ తోటను దడదడలాడించి 
ఎన్నాళ్ళయింది
అసలెన్నాళ్ళయింది నేస్తం
పల్లె ఒడి నుంచి నీవు జారిపడి.

* * * * * * *

గడ్డి పువ్వు

విరులన్నిటికి రంగులిచ్చి
ఆ విలాసమేల తనకీయ లేదటంచు
వాపోయిన ఆ గడ్డి పువ్వుకు
ఘన వైభోగమే ఇచ్చిందా ప్రకృతి
తుషార బిందు స్నాన శ్రీమంతినిగా.

* * * * * * *
పరమార్ధం 

పోగు చేసి పోగు చేసి
చివరకు పరమార్ధం అర్ధమై
చినుకు చినుకు పంచుతూ
తాను కరిగిందా కారుమేఘం.

* * * * * *