ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కొన్ని కలలు అంతే

Like-o-Meter
[Total: 0 Average: 0]

మొదటి వాక్యానికి ముందే

మరో కల వ్రాసిన

ముగింపులా-

నదికి ఆవల

నిద్రిస్తున్న నక్షత్రం

చీకటి స్వరాలతో

శ్వాసిస్తూ

పాత కొమ్మలకు

కొత్త రెమ్మలు తొడుగుతుంది.

 

ముగింపుకు ముందుమాటలా

మబ్బుపూల మధ్య

పూసిన ఓ గాలిపాట

ఆకుల రెప్పల మధ్య

తడి అనువాదమై

వెలుగు రెక్కలు పరుచుకుంటూ

నక్షత్రాన్ని ముక్కున కరచుకొని

వెలుగులోకి పారేస్తుంది.

 

కొన్ని కలలు అంతే!

కెరటాల్లా కొట్టుకుపోయిన

కొన్ని వాక్యాలు

రహస్యపు ముడులేసిన

అక్షరాలై

రాత్రి రెప్పలకు

రంగులద్దుతూ

కళ్ళలోకి ప్రవహిస్తాయి.