ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ప్రాణం నా క్లెయింట్

Like-o-Meter
[Total: 0 Average: 0]

వాగ్దత్త భూముల కోసం పోయిన ప్రాణాలు

ఏ వాగ్దానాలనూ శ్వాసించలేవు


ఇది ప్రాణం తరుఫు న్యాయవాదం

నీలోనూ ఉన్న ప్రాణం తరుఫున…


నుదుటి మీద, చెమటకు తడవకుండా, ఒక దీపం కట్టుకుని

రంగుల సొరంగాల లోపలి చీకటిని కెళ్లగిస్తున్నాను

అవసరం శాసిస్తే పేల్చేస్తున్నాను

ముద్రలు పడిపోయే ముద్దుల గురించి

మాట్లాడడమేల, ముద్దాడాలి నిజంగా

పెదిమలు చీరుకుపోయినా సరే …

వివశమై అవయవాలు బద్దలైనా సరే

… నేన్నిన్ను ప్రేమిస్తున్నాను …

ఏం చేసినా నీతో కలిసి చేయాలి, విడివడి కాదు


వాదం నీ కోసం, ఇష్టం నీ కోపం

పద్యంలోని కాఠిన్యం నీదే


ఖండిత వాక్కుల ఎడారిలో బొమ్మజెముడు మాట్లాడదు

పదును ముళ్ల కాండంలో ప్రియంగా దాచుకున్న నీటిని

కన్నీరుగా వృథా చేయదు, హింస ముందు అరవదు

మెత్తని గడ్డిపోచలా, పూల తీగెలా ప్రతి గాలికి తల ఊపదు

ఇసుక తుపానులలో జనించే దాహం నుంచి

ప్రాణాన్ని నిలబెట్టుకునే ఉపాయాలు చాల మొరటుగా ఉంటాయి

మోమాటాలుండవు


ఏదో ఒక రంగులో అక్కడ కూడా ఆకాశం ఉంటుంది

ఏదో ఒక స్వరంతో ఎప్పుడైనా ఒక పిట్ట కూస్తుంది,

రాత్రులను మోసుకుని మొయిళ్లు సైతం‍ వస్తాయి

స్నేహితుల్లా కాదు, పదఘట్టనల కింద మట్టగించే సైన్యంలా

ముట్టడి సేన వెళ్ళిపోయాక వెనుక ఉండిపోయే సైనికుల వలె

నీళ్లు ఏ రాళ్ల కింద దాక్కుంటాయో కోతికి తెలుసు

దానికి కొంచెం తీపి తేనియలు రుచి చూపించి

దాని వెంట వెళితే నీ దాహం కూడా తీరుతుంది

పేగును తడుపుకునే ఉపాయాలు బహు చిత్రంగా ఉంటాయి

అక్కడ జ్ఞానం, పండిత వినోదం కాదు – నిత్యావసరం


అక్కడ అంటే ఎక్కడ అనుకున్నావు?

ఇక్కడే, ప్రతి ఇక్కడి యొక్క పక్కనే!!


గట్టిగా నివసింపజూస్తే పడిపోయే ప్లాస్టిక్ గుడారాలలోనే

నాగరికత బొడ్డు మీద పుండుగానే, తేలాల్సిన వివాదం గానే


9-3-2012