ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ప్రకృతి

Like-o-Meter
[Total: 1 Average: 5]

నాలుగు పదాలో, నాలుగు వాక్యాలో
అవి నీనుండి అని తెలిసాక
కళ్ళు కొలవడం మానేస్తాయి
వసంతగాలికి వూగే
పూలతీగవుతుందీ గుండె

వేణువూదుతావో,
నీళ్ళు వదులుతావో,
తేల్చుకో త్వరగా!

******
 
అందరిలోనే వున్నావు
ఎన్నో సంభాషిస్తున్నావు
అయితేనేం….
తీరని నాతలపుల్లో
వాలిన నా కనురెప్పల్లో
దొరికిపోయావు  
  
******
తూర్పూ పడమరల్లో
రహస్యాన్ని ఛేదిద్దామనే ఎంతసేపూ!
తెలియనేలేదు తెరలు తెరలుగా
నువు దగ్గరవుతున్న సంగతి
విభజన రేఖ వచ్చేదాకా!

******
 
శిశిరానికీ, వసంతానికీ
మధ్య ఏం మాయ జరిగిందో
నువు లేని గ్రీష్మంలో  
కాసిన్ని నందివర్ధనాలను
కళ్ళ మీద కప్పుకుంటాను
కన్నీళ్ళని దాచుకునేందుకు!

******
   
చిన్న ఆకాశం ముక్క
ఓ పచ్చని పత్రం, ఒక పిట్ట
కాస్త మట్టి, ఓ వాన చినుకు
ఇదేగా ప్రకృతి అనుకున్నాను
నీనవ్వొచ్చి
నాకు నీరాజనం పట్టేవరకు!

******
ఏ క్షణం
ఎప్పుడు,ఎలా,ఎవరికి,
ఎందుకు నచ్చుతుందనేది
ఒక సంక్లిష్టమైన,సమాధానం లేని సందేహమే!
సనజాజులకే ఎందుకా పరిమళం
అని అడిగితే ఏమి చెప్పగలను!?
అదీ ప్రకృతే, నీ-నా ఇష్టం కూడా ప్రకృతే! 

******
తెల్లారేక సూరీడు పక్కన
నక్షత్రంలా వెలవెలబోతావు
రాతిరయ్యాకే దివిటీలా వెలుగుతూ
దహించివేస్తావు
ఈఉన్మాదం ఎన్నాళ్ళు!?
గుండె కవాటంలో ఇరుక్కున్న పదమేదో
వెలుగు చూసేవరకా!?