ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సాయం నీడలు…

Like-o-Meter
[Total: 0 Average: 0]

మొన్నటి వాన సాయంకాలపు
ఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..
రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి!

అనుభవాల అల్మరా
అప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లా
ఎండిన మొగలిరేకులు
గరుకుగా తగుల్తూనే గుబాళిస్తాయి..

కాలం క్రమబద్దంగా ఎండగట్టిన
గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండో
ఆత్మీయపు వేసవివాన
ఆసాంతం  కురిసి పోతుంది..

ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..
గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే అరచేతిగీతలూ..
నిశ్శబ్దానికి రాగాలు నేర్పే చల్లని గాలీ..
స్నేహాలేవైనా సరే
అదృశ్యంగానో.. అంతర్లీనమయ్యో

జీవితపు రహదారిలో
పరిహాసంగా  పలకరించే
ముళ్ళూ రాళ్ళ మీద
మెత్తటి ముఖమల్ దుప్పటి కప్పుతూనే ఉంటాయి!