ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సంక్రాంతి ఆ.శ. – పద్యాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]



అశ్వధాటీ వృత్తంలో సంక్రాంతి వర్ణన



సప్తాశ్వరూఢుడయి బాలార్కుడీ దినము తా జేరు రాశి మకరం
తృప్తాత్ములవ్వ ఘన కూష్మాండ దానములు విప్రాళి కందు సుదినం
ప్రాప్తించ పుణ్యగతి గాంగేయుడెంచినటి స్వచ్ఛంద మారణ దినం
తప్తాధికంబులకు మార్తాండుడున్ ధరయు సామీప్యమైన అయణం

లుప్తంబులై జనవె రోగాలు చేర హుతవాహుండు ప్రాణి జఠరం
దీప్తోద్ధతిన్ మెరయ పౌష్యంపు లక్ష్మి కళ ముంగిళ్ళ ముగ్గు రచనం
క్లుప్తంబులై నిశలు దీర్ఘంబులై పగలు పత్రాలు రాలు శిశిరం
గుప్తంబుగా మసలు పూర్వీకులన్ బిలచు పితౄణ తర్పణ దినం

వ్యాప్తించగా లచిమి ధాన్యంపు రాశులుగ పొంగళ్ళ తీపి పచనం
సుప్తస్థితిన్ పొదలు శీతర్తు బాధితుల మేల్కొల్పు భోగి దహనం
జ్ఞప్తిన్ తలంచుకొని గోజాతి సేవలను గోలక్ష్మి గొల్చు కనుమల్
ఆప్తాళి బంధుతతి సమ్మేళనంబులకు సంక్రాంతి గొప్ప తరుణం

* * * * *

బసవన్నయనుమాట పాపలెరుగకపోయె

హరిదాసునెల్లరున్ మరచిపోయె

నెలగంట ముగ్గన్న నేమొ తెలియకబోయె

గొబ్బిళ్ళవేమిటో కూడ మరచె

కోడి పందెమ్ములూ కోలాహమ్ములూ

పాత పొత్తమ్ములో వ్రాతలాయె

పెద్దలెల్లర మ్రొక్కి పెనుదక్షిణలుపొందు

దండాల పండగ దారితప్పె

 

సదరు టెలిఫోను ఈ మెయిల్ సాధనాల

అందరకు మేము గ్రీటింగులంపుకొనుచు

అనువు రవ్వంతయునులేని పనిదినాన

జరుపుకున్నారమా రాత్రి సంకురాత్రి

* * * * *