ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శీతాకాలపు సాయంత్రం

Like-o-Meter
[Total: 0 Average: 0]

మా తాటాకు ఇల్లు చుట్టూ 

గుబురుగా ఎదిగిన చెట్లు 

పూపొదలు మా సరిహద్దు గోడలు 

శీతగాలి తిరిగి ఇంటికి పొమ్మని చెబితే 

ఆటపాటల బాల్యనికి ఆకలి తోడై 

పరుగు లంఘించి ఇంటి ముఖం పట్టాను 

 

ఇల్లు కనిపించగానే

పైకి లేస్తున్న పొగ పైబడింది చూపు

లోపలికి వెళితే 

మా నాయనమ్మ అన్నం వండుతోంది

ఆరుబయట పొయ్యి, ఊదు గొట్టం చేసే వింత చప్పుళ్ళు!

 

ఆ దృశ్యం…అలానే దాగిపోయింది మదిలో 

ఆ వాతావరణంను ఇప్పటికీ అనుభవించగలను.

కానీ

ఆ భద్రతా భావన ఇప్పుడు కొరవడిందనే ఎరుక 

ఆ ఆకలికున్న రుచి ఇప్పుడు లేదని కినుక 

 

పొగమంచు కమ్ముతుంటే 

పొగలోంచి మంట లేచి 

చలికాచుకోమని ఆహ్వానం 

కాదు వేన్నీళ్ళ స్నానం ముఖ్యమని 

శాసించే నానమ్మ స్వరం 

 

బండపచ్చడి చేయడానికి  సిద్ధమై  

నన్ను త్వరపరచే చిన్న నాయనమ్మ 

స్నానం ముగించగానే 

వాకలి లో పాన్పు సిద్ధం 

సేదతీరి భోజనానికి సమాయత్తం 

 

రాత్రిలో కలసిపోయిన సుఖం 

ఆత్రంగా దాచుకున్న గతం !!

*****