ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శిద్దాని భావగీతాలు – 8

Like-o-Meter
[Total: 0 Average: 0]

పల్లవి:       ఓ తల్లి కన్నదేగా! నేటి నా ఈ దైన్యం
               ఆనాడే ఆ అమ్మకు తెలుసుంటే ఈ నిజం
               మారేది కాదా? ఈ సృష్టి నైజం


చరణం:     అడుగు బైట పెట్టేవేళ, అడవే ఎదురొస్తుంటే
              మాటేసి, మృగాలు మాటలకందని మారణహోమం చేస్తుంటే
              ఆరిపోయే జ్యోతులలో, మసకబారే దివ్వెలతో
              వన్నెలద్దుకుంటున్నది నవ్యభారతం
              అవమానపు దారులలో, ఆక్రోశపు లోతులలో ఆవిరైపోతుంటే     ఆడతనం
              నిట్టూర్పులు విడుస్తూ కొత్త చట్టాలు పుట్టిస్తూ
              భయమనే బంగారు పంజరాన
              భద్రంగా దాచుకోమంటున్నారా? మా భవితవ్యం

చరణం:    కడుపున కన్నైనా తెరవనినాడే ఆడపిల్లను కాటికంపే ఈ లోకానా
              అడుగుకొక్క యముడంటూ, రావణులు కీచకులు కొల్లలంటూ
              పుట్టిననాడే ఎందుకు అనలేదమ్మా
              దీర్ఘాయుష్మానంటూ నిండుగా నువ్ దీవించే ఆ దీవెన వద్దని
              దీర్ఘమానవతిగా మనమంటూ దీవించమనేదాన్ని కదమ్మా ఆనాడే

చరణం:   మానాలు మీకు చలిమంటలా?
             శీలాలు మీకు గడ్డిపోచలా?
             కన్నీరుగా మా ఎదలలో రగిలే విషాదాలు
             ఇంకెన్నాళ్ళు మోయాలి మీ మగతనపు ఆనవాళ్ళు
             ప్రాయపు ఊసెందుకంటూ, అభిప్రాయాలు అసలు వద్దంటూ
             కనుగానని కామాన సాగుతున్న మీ పయనాన
             అమ్మను అమ్మగా ఇంకెంత కాలం చూస్తారో


                       **********