ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వాజపేయి కవితలు – 1

Like-o-Meter
[Total: 0 Average: 0]


మాజీ ప్రధాని, రాజకీయవేత్త, సుప్రసిద్ధ వక్త అయిన ’భారతరత్న’ అటల్ బిహారీ వాజపేయీ హిందీ కవితలకు ప్రముఖ తెలుగు కవి డా. ఇక్బాల్ చంద్ తెలుగు అనువాదం.

చదవండి – వాజపేయీ కవితలు మొదటి భాగం.

 


 

లోకంలో 

 

పొందినదేమిటి?

లోకంలో పోగొట్టుకున్నదేమిటి?

 

కలిసి విడిపోయే బాటలోన

నాకెవరి పైనా నెపం లేదు.

 

గతంపై ఒక చూపును విసురుతూ

జ్ఞాపకాల మూటను తడుముతూ

అడుగుల్లో అడుగులేస్తూనే గెంటుతున్నాను.

 

లక్షల సంవత్సరాల పురాతనమీ భువనం

జీవితం ఒక అనంత కథనం

 

ఇతర దేహాల సొంత సత్తుల

ఇంకా నూరు శరత్తుల గీతం.

 

గొళ్ళెం పై మీటిన చివరి పిలుపు విని

తలుపు తెరుచుకొంటే చాలు

 

జనన మరణాల అవిశ్రాంత భ్రమణం

ఎడారి సంచారంలో ఒక మజిలీ ఈ జీవితం.

 

ఈ పూటకు ఇక్కడ

రేపు ఎక్కడికో?

ఎవరికి తెలుసు

శుభోదయం కై ఎటువైపు

 

అంధకారపు అర్ధరాత్రి

ప్రాణుల రెక్కలపై లెక్కల సారాయము

ఏవో కొన్ని మాటలివి

మనసు పలికినవి.

 

 *****

 

యక్షప్రశ్న

నిన్నటి సజీవులు

నేటికి నిర్జీవులు.

 

ఈపూట కన్పిస్తున్నవారు

బహుశా రేపటికి వుండరు.

 

అస్తి నాస్తిల భ్రమణమిది

ఇలానే తిరుగుతుంటుంది

 

నేనువున్నాను, వుంటాను, అనుకునే భ్రమ కూడా

ఇలానే ఎదుగుతూ వుంటుంది.

 

ఏది సత్యం?

ఉండటమా? లేక లేకపోవడమా?

లేదా రెండూ సత్యమేనా?

 

ఎవరైతే సజీవులో

వారున్నారనడం సత్యం

ఎవరైతే నిర్జీవులో

వారు లేరనడం సత్యం

 

ఉండటం, లేకపోవటం రెండూ

నాణేనికి రెండు వైపులు.

మిగిలినదంతా ఆలోచనల భ్రమణం

బుద్ధికి వ్యాయామం.

 

కానీ, నిర్జీవత్వం తర్వాత ఏముంది?

ఇది జవాబు లేని ప్రశ్న

పనులన్నిటినీ పక్కనబెట్టి

అపర నచికేతుడు

ఈ ప్రశ్నకు జవాబును అన్వేషిస్తున్నాడు.

 

బహుశా ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోవచ్చు

ఒకవేళ కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే

మిగిలిపోతే మాత్రం తప్పేముంది?

అవును,

అన్వేషణల పరంపర ఆగరాదు.

 

ధర్మం యొక్క అనుభూతి

విజ్ఞానం యొక్క అనుసంధానం

ఏదో ఒకరోజు వెంటనే తలుపు తెరుస్తుంది.

 

అప్పుడు యక్షుడు

ప్రశ్న అడిగే బదులు జవాబు చెబుతాడు.

 

*****

 

నేను మౌనంగానూ లేను,

పాడుతూనూ లేను.

కాలం

మంచు శ్వాస

కలంకారీ వస్త్రాన్ని సగం మాడ్చింది.

 

కానీ,

హిమపాతాన్ని హెచ్చరిస్తూ ఒక వృక్షమాల.

చెదరిన పిట్టల గూడు

వొరిగిన జాజికాయ చెట్టు

చిర్నవ్వులు లేవు –

కన్నీళ్ళు వున్నాయి.

 

మంచు ప్రవాహం ఒడ్డున

ఒంటరిగా గొణుక్కుంటూ వున్నాను.

 

 *****

ఎవరు?

 

ఒక సూటి ప్రశ్న –

కౌరవులెవరు?

పాండవులెవరు?

 

ఇరువైపులా

శకుని పరిచిన

కుటిల వల –

జూద శాపాన్ని

ధర్మరాజూ వదల్లేదు

 

ప్రతి పంచాయితీలోనూ

పాంచాలికి అవమానం.

 

రాజు ఎవడైనా

సామాన్యుడు ఏడుస్తూనే వున్నాడు.

 

ఈనాడు

కృష్ణుడు లేని మహాభారతం కావాలి.

 

*****

 

ఎత్తు ఎదగడం

 

పొడుగు శిఖరాలపై

చెట్లు నాటుకోవు

మొక్కలు ఎదగవు

గడ్డి అల్లుకోదు.

 

శవ వస్త్రం లాంటి తెలుపుతో

మృత్యువు వంటి చల్లదనంతో

వొఠ్ఠి మంచు మాత్రమే పేరుకొంటుంది.

 

ఆడుతూ కేరింతలు కొట్టే నది

రూపధారణ చేసి

తన భాగ్యమ్మీద బిందువు బిందువై రోదిస్తుంది.

 

నీటిని శిలగా మార్చే

పరసువేది

వంటి ఎత్తు.

 

హీన భావాన్ని నింపే

రూపం –

వంటి ఎత్తు

అభినందించదగ్గ అధికారమయం,

అధిరోహించడానికి పిలుపునిస్తోంది.

అటువంటి దానిపై

జండాల్ని పాతగలం.

 

కాని,

ఏ పిచ్చుక కూడా

అక్కడ గూడు కట్టలేదు

ఏ అలసిన బాటసారీ

అక్కడ ఓ క్షణం విశ్రమించ వీలు లేదు.

సత్యంగా

రెప్పలు మాత్రం కొట్టుకొంటాయి.

 

కేవలం ఎత్తు మాత్రమే సరిపోదు

పరిసరాల్ని మరిచి

అయిన వాళ్ళ నీంచి విడిపోయి

శూన్యంలో ఒంటరిగా నిల్చోవడం

కొండకు వున్న ప్రత్యేకత కాదు

అది దాని నిరాసక్తత మాత్రమే!

 

ఎత్తు పల్లాలు నడుమన

భూమ్యాకాశాలంత దూరం వుంది.

 

ఎవడైనా సరే

ఎంత ఎత్తు ఎదుగుతారు

అంతే ఏకాకి అవుతాడు.

ప్రతీ భారాన్నీ స్వయంగా మోస్తుంటాడు.

 

మరొకరి వెంట నడుస్తూ

వేరొకరికి తోడుగా నిలుస్తూ

అందరితో కలిసి మెలిసి

వెతికినా కన్పించని వాడిలా కాకుండా

మనిషి

ఎదుగుదలతో పాటుగా

విస్తరించుకోవడం ఎంతో అవసరం.

 

సమూహంలో తప్పిపోవడం

స్మృతుల్లో మునిగిపోవడం

తనని తాను మర్చిపోవడం

అస్తిత్వానికి అర్థమూ

బతుకుకు సుగంధాన్నిస్తుంది.

 

భూమికి కావాల్సింది వామనులు కాదు

పొడుగాటి వాళ్ళ అవసరం వుంది

ఎంతంటే –

ఆకాశాన్ని ముద్దాడగలిగినంత పొడుగు

నవ తారాల్లో ప్రతిభా బీజాలన్నట్లుగా

కాళ్ళు మెసలనంత గానూ

ఏ ముళ్ళూ గుచ్చుకోకుండా

ఏ మొగ్గా వికసించకుండానూ

మరీ ఇంత ఎత్తుగా కూడా కాదు.

 

వసంతం గానీ గ్రీష్మంగానీ గాదు

కేవలం ఎదుగుదల తుఫాను

ఒంటరితనపు స్థబ్దత –

ఓ! నా ప్రభూ!

 

ఎదుటి వారిని కౌగిలించుకోలేనంతగా

ఎదుగుదలని ఎప్పటికీ ప్రసాదించకు

అంత కాఠిన్యాన్ని నాకెప్పటికీ ఇవ్వకు.

 

*****

పచ్చిక పై

 

ఇంతకు క్రితమే

ఈ పచ్చికపై

మంచు బిందువులు వుండేవి

ఇప్పుడు లెవ్వు.

 

ఆనందాన్ని పంచుతూ

శాశ్వతంగా వెంటవుండేవి

ఎప్పుడూ లేదు

ఎక్కడా లేదు.

 

నియమాన్ని వెతుకుతూ

బాలసూర్యుడు

ఎప్పుడైతే తూర్పు ఒడిలో

కాళ్ళను కదిలించడం మొదలు పెట్టాడు

అప్పుడు నా తోటలోనికి

ప్రతీ ఆకు ప్రకాశించడం మొదలయింది.

 

నేను ఉదయిస్తున్న సూర్యుణ్ణి నమస్కరించనా

లేదా

దాని తాపానికి తెగిపోయిన

బిందువుల్ని వెతకనా?

 

సూర్యుడు ఒక సత్యం

కాదనలేం.

కాని, మంచు కూడా ఒక సత్యమే

మంచు క్షణికం అది వేరే సంగతి.

 

అణువణువూ

చెదురుతున్న సౌందర్యాన్ని తాగుతూ

నేనెందుకు

క్షణక్షణంలో జీవించకూడదు.

 

మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు

ఎండ మళ్ళీ వికసిస్తోంది.

 

కాని, నా తోటలోని

పచ్చికపై

మంచు బిందువులు

ప్రతి ఋతువులోనూ దొరకవు.

 

*****

గుర్తింపు

 

చెట్టు చిటారున పాకిన మనిషి

ఎత్తుగా కన్పిస్తాడు

వేళ్ళల్లో నిల్చున్న మనిషి

పొట్టిగా కన్పిస్తాడు.

 

మనిషంటే ఎత్తూ గాదు పొట్టిగానూ గాదు,

పెద్దవాడూ గాదు చిన్నవాడూ గాదు

మనిషంటే, కేవలం మనిషి మాత్రమే అవుతాడు.

 

లోకం

ఎందుకు గ్రహించదు

ఈ లోకంలో –

ఒక వేళ ఎరిగినా

మనస్సుతో ఎందుకు ఒప్పుకోదు?

 

మనిషి ఎక్కడ నిల్చున్నాడన్న దానితో

తేడా ఏమీ వుండదు

బాట పైనా లేదా రథము పైనా?

ఒడ్డు పైనా ఊబిలోనా?

 

తేడా ఎక్కడ వుంటుందంటే

ఎక్కడ వుండాల్సింది

ఎక్కడ వున్నాడు

అతని పృథ్వీతలం ఏమిటి?

 

హిమాలయ శిఖరం చేరినప్పుడు

ఎవరెస్ట్ విజయ పతాకం ఎగురుతూ వుండగానూ

మరో విజేత అసూయతో దగ్ధమవుతూ

తన సహచరుణ్ణి నమ్మకద్రోహం చేస్తే

అతను ఎవరెస్ట్ ఎత్తులో వున్నాడు కాబట్టి

క్షంతవ్యుడవుతాడా?

 

లేదు –

అపరాధం అపరాధమే అవుతుంది,

హిమాలయాల సర్వ శ్వేతమూ

ఆ కళంకాన్ని చెరిపివేయలేదు

వస్త్రాలు పాల తెలుపులా

మనస్సు మాలిన్యాన్ని దాచలేదు.

 

ఎవరో సాధువు చెప్పాడు

మనిషి కన్నా ఉన్నతమైనది ఏదీ లేదని,

కానీ,

మనిషి కన్నా ఉన్నతమైనది

అతని మనస్సు అన్పిస్తుంది.

 

సంకుచిత మనస్సుతో ఎవరూ ఉన్నతలు కాలేరు

అవిటి మనస్సుతో ఎవరూ నిల్చోలేరు.

 

అందుకే కదా!

అస్త్రాల్ని విడిచి

రథంపై నిల్చున్న అర్జునుణ్ణి

కృష్ణభగవానుడు

గీతను బోధించాల్సి వచ్చింది.

 

ఓటమి మనస్సుతో

యుద్ధరంగంలో గెలవలేము.

రణరంగంలో గెలిచినంత మాత్రాన

మనస్సుల్ని గెలవలేము.

 

శిఖరం మీంచి పడితే

తీవ్ర గాయం అవుతుంది

అస్థిత్వం చెదురుతుంది

బాధ మనస్సు నీంచి పుడుతుంది –

అంటే దీని అర్థం

శిఖరం ఎక్కవద్దని హెచ్చరిక కాదు,

పరిస్థితులపై విజయం

సాధించకూడదనే

ధృఢ సంకల్పమూ కాదు

 

మనిషి ఎక్కడ నిల్చున్నాడో

అక్కడే వుండాలా?

 

ఇతరుల దయాదాక్షిణ్యాల

విశ్వాసం పై పడివుండాలా?

 

జీవితం పేరు జడత్వం కాదు,

పలాయనం పురోగమనమూ కాదు,

మనిషి పోరాడాలి

పరిస్థితుల్ని ఎదుర్కోవాలి

 

ఒక స్వప్నం పగిలిగే

మరొకదాన్ని మొలకెత్తించాలి.

 

ఎంత ఎత్తుగా ఎదిగినా

మానవతా శయ్య మీంచి పడరాదు

తన ధరాతలాన్ని వీడొద్దు

అంతర్యామి నీంచి ముఖాన్ని మరల్చరాదు.

 

వామనుడు

ఒక కాలును భూమిపై వుంచే

ఆకాశ, పాతాళాలను గెలిచాడు.

మధ్య అభిమానం

రూపం మారక

ఎవరూ తనను భారం కాకుండా

ధరిత్రియే ధరిస్తోంది.

 

మనిషి గుర్తింపు

అతని ధనంతో గానీ స్థానంతో గానీ రాదు,

అతని మనస్సును బట్టే అతని గుర్తింపు –

మనస్సు ఫకీరుతనం ముందు

కుబేరుని సంపద కూడా ఏడుస్తుంది.

 

*****

మనో సంతోషం

 

ఈ భూమ్మీద

మానవప్రాణి ఒక్కడే

గుంపులో వుంటూ ఏకాకి గానూ

ఏకాంతంలో వుంటూ సమూహంగానూ

అనుభవించగలుగుతుంది.

 

మానవుడు సహజీవనం కోరుకుంటాడు

ఇల్లూ వాకిలి నీంచి మొదలయి

నగరాల్ని నిర్మిస్తాడు

వీధి, ఊరు – పట్టణం, నగరం

ఇలా అలంకరిస్తాడు

 

సభ్యత యొక్క కఠిన పరుగులో

సంస్కృతిని వెనకే వదిలేసి

ప్రకృతిని జయించి

మృత్యువుని పిడికిలిలో బంధించాలనుకొంటాడు

 

తన రక్షణ కోసం

ఇతరుల వినాశనానికి ఆజ్యం పోస్తాడు

ఆకాశాన్ని శపించి

ధరిత్రిని బహిష్కరించి

గాలిని విషవాయువుగా మార్చుతూ

నీటిని కలుషితం చేయడానికీ వెనుకాడడు.

 

అయినా, ఇదంతా చేసిన తర్వాత కూడా

ఎప్పుడన్నా అతడు ఒంటరిగా కూర్చున్నప్పుడు

ఆలోచిస్తూవుంటాడు.

 

ఇంట్లోని మూల కూర్చొనివున్నా

లేదా కాంతివేగ గతితో

ప్రయాణిస్తున్న విమానంలో వున్నా

లేదా ఏదో వైజ్ఞానిక ప్రయోగశాలలో వున్నా

లేదా గుళ్ళోవున్నా

లేదా స్మశానంలో వున్నా

అతడు ఒంటరే.

 

ఎప్పుడన్నా అంతర్ముఖంలో చూసుకొన్నప్పుడు

మనస్సు ముడుతల్ని తెరుచుకుంటూ

స్వగతంతో ఇలా పలుకుతాడు –

 

లాభ నష్టాల బేరీజు లేదు

దేనిని పొందాను, దేనిని పోగొట్టుకున్నాను

లెక్కా పత్రమూ లేదు.

 

తన జీవిత ఆద్యంతాల్ని తూచినప్పుడు

తన గీటురాయిపై తననే పరీక్షించుకొంటాడు

నిర్దయగా చూసుకొని పరీక్షించుకొంటాడు

ఇదే గొప్పదనం

ఇదే సత్యం అని స్వగతంగా పలుక్కుంటాడు

 

అంతిమయాత్ర వేళ

శెలవ్ తీసుకునే సమయాన

అందం తోడూ విడిపోతుంది

శరీరం కూడా సహకరించదు

 

ఆత్మగ్లాని నుంచి ముక్తి అయ్యేటప్పుడు

జీవితంలో చేసినవన్నీ

నిజంగా ఆలోచించే చేసాను

తెలిసి తెలిసీ ఎవర్నీ మెప్పించడానికి కాదు

సహజ కర్మ అనుకొని చేసాను

అని ఎవరైనా చెయ్యెత్తి పలుకగలరా?

 

అలా అయితే అతని అస్థిత్వం సార్థకమైనట్టే

అతని జీవితం సఫలం అయినట్టే

అట్లాంటి వాడి కోసమే ఈ సామెత పుట్టింది

మనస్సు సుందరమైతే భాగ్యంలో గంగాజలం

 

(న్యూయార్క్, 1994)

 

*****

 

నేను ఆలోచిస్తున్నాను

 

వేగంగా పరుగులు దీసే బస్సులు

బస్సుల వెనుక జనం పరుగులు

పిల్లల్ని కనిపెట్టుకొంటూ స్త్రీలు

 

దుమ్ము రేపుతూ బజార్లు

కంటికేమీ కన్పించడం లేదు

నేను ఆలోచిస్తూ వుంటాను

కనులెందుకు మూతబడతాయో ఆలోచిస్తున్నాను

 

ఆగాల్సిన చోట ఎందుకు ఆగవీ బస్సులు

క్యూలో ఎందుకు నిల్చోరీ మనుషులు

ఆఖరికి ఈ పరుగు పందెం ఎప్పటి వరకు?

 

దేశ రాజధానిలో

పార్లమెంట్ ముందు

దుమ్ము ఎప్పటి వరకు రేగుతూవుంటుంది?

 

నా కళ్ళు మూసి వున్నాను

నాకేమీ కన్పించదు

నేను ఆలోచిస్తూనే వుంటాను.

 

*****

 హిరోషిమా

 

ఒక్కొక్క రాత్రి

ఆకస్మికంగా నా నిద్ర ఎగిరి పోతుంది

కళ్ళు తెరుచుకొంటాయి.

 

ఏ శాస్త్రజ్ఞులైతే

అణు అస్త్రాల్ని ఆవిష్కరించారో

వాళ్ళు

హిరోషిమా, నాగసాకి నరసంహార వార్త విని

రాత్రంతా ఎలా నిద్రపోగలరని

ఆలోచిస్తూవుంటాను.

 

దంతాల మధ్య ఇరికిన గడ్డిపోచలు

కంటిలో ఇసుక

పాదాల్లో గుచ్చుకొన్న ముళ్ళు

కన్నుల నిద్ర

మనశ్శాంతిని ఎగరగొడుతుంది.

 

సమీప బంధువు మృత్యువు

ఒకానొక ప్రియమైనవారు లేకపోవడం

పరిచయస్థులు ఎగిరిపోవడం

చివరాఖరికి పెంపుడు జంతువుల్నీ

పోగొట్టుకోవడం

 

గుండెలో ఎంత బాధ, విషాదం నిడుతుందంట

ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు

పక్కపై అటు ఇటూ పొర్లుతుండటంలోనే

రాత్రంతా గడిచిపోతుంది.

 

ఎవరి ఆవిష్కారంతో అది చివరి అస్త్రంగా మారిందో

ఎవరైతే 6 ఆగస్ట్ 1945 కాళరాత్రి

హీరోషిమా, నాగసాకిలో మృత్యు తాండవంతో

రెండు లక్షల పైచిలుకు మందిని బలిగొన్నారో

సహస్రాధికుల జీవితాల్ని అవిటి చేసారో

వారు కనీసం ఒక్క క్షణమైనా

తాను చేసిన పని తప్పని అనిపించదా?

 

ఒకవేళ అన్పిస్తే

కాలం వారిని బోనులో నిలబెట్టదా!

అలా అన్పించకపోతే

చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదు.

 

*****

మూల మలుపులో

 

నాకు దూరంగా వున్నదీ కన్పిస్తుంది.

గోడలపై రాతల్నీ చదవగలుగుతున్నాను

కాని, హస్తరేఖల్ని చదవలేను.

 

సీమాంతరాన మండుతున్న

అగ్ని గోళాలు కన్పిస్తున్నాయి

కాని, కాలి కింద పరుచుకున్న

కాలుతున్న బూడిద కన్పించడం లేదు

నిజంగానే నేను వృద్ధుణ్ణి అయినానా?

 

ప్రతీ డిసెంబర్ ఇరవై ఏడున

జీవితం మరో కొత్త మెట్టు ఎక్కుతాను

కొత్త మలుపు దగ్గర

ఇతరులతో తక్కువగానూ

నాలో నేనే ఎక్కువగానూ పోరాడుతాను.

 

నేను సమూహాన్ని నిశ్శబ్ద పరచలగను

కానీ సొంతానికి సమాధాన పరచుకోలేను

నా మనస్సు నా అంతరంగ న్యాయస్థానంలో నిల్చోబెట్టి

కిందికి పడదోసినప్పుడు

నా వాజ్ఞ్మూలమే నాకు వ్యతిరేకంగా సమర్పించుకొంటుంది

 

నేను ఓడిపోతాను

సొంత దృష్టిలోనే నేరస్థుడిగా మారుతాను.

 

సమీపం నీంచి గానీ సుదూరం నీంచి గానీ

అప్పుడు నాకేమీ కన్పించదు.

ఆకస్మికంగా నా ఆయువు దశాబ్దం పెరిగిపోతుంది.

 

నిజంగానే నేను

ముసలివాణ్ణి అవుతున్నాను.

 

(23-12-1993, పుట్టినరోజు సందర్భంగా)

 *****

(సశేషం)