Like-o-Meter
[Total: 0 Average: 0]
బాల్యాన ముగ్గురు తాతలు చేయిపట్టి
సౌందర్య వనాంతరాల కుసుమరాగరంజిత పదాన
నన్ను నడిపించారోయ్!
ఆపై రూపరేఖా లావణ్యాలతో విచ్చుకున్న
నా యవ్వన సోయగాన్ని రసికదిగ్గజాలైన
ఆ ఎనమండుగురు ఎంతందంగా వర్ణించారోయ్!
భువనైకమోహన హాసవిలాసాన.
ఇక నా కౌమార కౌశలాన
రవి అస్తమయమే ఎరుగమన్న ఆ తలబిరుసు దొరలే
నింగికంటా ఎగసిన నా కీర్తి కేతనాల ముందు
అవనత మస్తకాలతో నిలిచి
సంతత మనోసీమల నుండి జారిన
ఆ మాధుర్య మోదామృత ధారలు త్రావి
చిరంజీవులన్న యశము బడలేదా?
ఇపుడా వైభోగమంతా యేమాయెనో గానీ నాకపుడే
వృద్ధాప్యమాపాదించి
ఆ మొనదేలిన ఇరువదియారు అమ్ముల అంపశయ్యపై
పరుండ బెట్టారు.
ఆ! ఇపుడు నా మరణ ముహూర్తం ఆసన్నమైనదనీ ,
సంస్కృతికి పాలు పట్టించిన
నా స్తనాలుకూడా వట్టిపోవునని
ఈ కాలానికిపుడు తెలిసొస్తుందిలే
నీ వల్లే కాదులే మీ అందరి వల్ల.
******