ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఢిల్లీ – తెలుగువారి చైతన్యదేహళి

Like-o-Meter
[Total: 9 Average: 4.8]

ఢిల్లీ అంటే ఎంతో ఇష్టం నాకు.

ఇక్కడి మనుషులు, మమతలు, ఋతువులు, నెమళ్ళు, ఉద్యానవనాలు, ఉద్యోగ భవనాలు, హరసింగార్ గుల్మొహార్ పూలచెట్లు, వింతవింత పక్షులు, విశాలమైన రహదారులు, విశ్వమానవ ప్రపంచం ఒక్కచోట కొలువుతీరిన కార్యాలయాలు, కళా నిలయాలు, విద్యాద్వారాలు, పఠన మందిరాలు, పురావస్తు కేంద్రాలు, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ, ఎర్ర కోట, ఇండియా గేటు, నేషనల్ మ్యూజియం, సాహిత్య అకాదెమీ, ఖుతుబ్ మీనార్, గాలిబ్ సమాధి, పురానా కిలా, కాశ్మీరీ గేట్, ఖైబర్ పాస్, లోధీ గార్డెన్, చాందినీ చౌక్, చావడీ బజార్, ఘంటే వాలా – ప్రాచీనాధునికతల సంగమ స్థలాలు, ఎక్కడ చూసినా కళ్ళల్లో కలలు నింపుకొని కనిపించే ప్రచుర జనసందోహాలను చూస్తుంటే పోయిన ప్రాణం లేచొస్తుంది నాకు.

“కళ్ళకద్దుకోనీ ఓ భూమీ, ఈ నీ పవిత్ర పద రాజీవాలను” అనాలనిపిస్తుంది.

ఆంధ్ర దేశానికి సుదూరమైన ఈ ఎడారిలో ఏ ఎండమావినో వెతుక్కొంటూ ఆశల సంచీని బుజాన వేసుకొని, పల్లెనుంచి ఢిల్లీకి వచ్చి చేరిన ఏ పురాణ పథికుడికి ఎంత ఋణపడి ఉన్నామో నాకు తెలియదు కాని, నలభైయేళ్ళ ఉనికి తర్వాత ఒకటి మాత్రం తెలిసింది: ఈ ఇంద్రప్రస్థ క్షేత్రమహిమ ఏమిటంటే – ఇక్కడికి చేరుకొన్నవారెవరూ ఆర్యులు కానివ్వండి, అయోనియన్లు కానివ్వండి, అల్లా ఉద్దీను, మొగలాయీలు, ఇంగిలీజుల లాగానే ఎప్పటికప్పుడు తల్లినేలకు వెళ్ళా లనుకొంటూనే ఒకసారి వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళరని!

ఏమిటి ఢిల్లీ జీవితంలో ఉన్న ఆకర్షణ? ఎందుకు ఈ అనుబంధం?

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

ఇక్కడి జీవితంలో ఒక రాజసం ఉన్నది.

వివేకానందస్వామి అమెరికా గురించి చెప్పినట్లు – ఈ నేలమీద కాలూనేసరికి ఎక్కడ లేని ఆత్మవిశ్వాసమూ వరిస్తుంది. దేశమంతటా రోజూ వర్తిల్లే వార్తలన్నీ మన కనుసన్నల్లో జరుగుతున్నట్లే ఉంటాయిక్కడ. ఇక్కడి నవాబు కట్టడాల రాయి రాయీ గతించిన కాలపు తెర మరుగున దాగిన చరిత్ర రహస్యాలను విప్పిచెబుతుంది.

పుణ్యధనుల కథాకథనాలు, ధర్మాధర్మ జయాపజయాలు, సార్వభౌముల కీర్తికాంక్ష, అలెగ్జాండరు ఆక్రమణశీలం, మొగలాయీల భోగలాలసత, ఆస్థానాలలో మనీషితల్లజుల భావశబలత, స్వాతంత్ర్యయోగుల త్యాగశీలం, సూఫీల ఆధ్యాత్మికత, మహమ్మదీయుల జంత్రగాత్రనైపుణ్యం, గాంధార శిల్పకళ, ఆంగ్లేయుల చాణక్యం, సంస్థాగతుల అవినీతి, సింధీ పంజాబీల కష్టించే తత్త్వం, నవ్యసంప్రదాయ నిర్లక్ష్యం, పెద్దలంటే భక్తి, మితిలేని స్వపక్షాభినివేశం, మతిలేని పరమతవిరోధం, పాశ్చాత్యుల క్రమశిక్షణ, రాజకీయుల వంశరక్షణ, ధనస్వాముల గర్వం, పేదరికపు నిస్సహాయత, బలహీనుల కంఠవిరావం, ఆసేతుశీతనగపర్యాప్తజనానీకం ఒక్క భారతీయ భావసముల్లాసంతో కలిసి ఉంటున్నప్పటి ఆత్మీయత, విదేశీయ పౌరానీకపు నిత్యనివాసం, విశ్వజనీనత నీడలోనే ప్రజాస్వామ్యంలో పల్లవించే నియంతృత్వ ధోరణులు, ఏదో తెలియరాని అహమహమిక, తహతహపాటు, అవకాశాలు, ఆరోగ్యం, అనురక్తి – అన్నీ ఒక్కచోటే పెనవేసుకొని ఉన్నాయిక్కడ.

తామరాకుపై నీటిబొట్టులా ఇక్కడున్నవాళ్ళకు ఈ ప్రాంతంతో ఒక అంటీఅంటనితనమూ ఉన్నది. ఈ నిమ్నోన్నతాల సంధియుగంలో మానవత్వపు విలువలు నశించి, సమాజం ఇంద్రియసుఖాలకోసం ఉవ్విళ్ళూరుతున్న దుఃస్థితిని గుర్తించిన మహాకవి అబ్బూరి రామకృష్ణారావు గారి లాగా –

“ఏనాడో రావలసిందీ వారణపురికి మనం
ఆ విశాలవటవృక్షం నిశ్చలనిభృతాగారం
ఇంకా నిలిచే ఉన్నది. నాడు మనకు చిన్నతనం
అల్లదుగో! స్వర్ణశిఖరదేవమందిరద్వారం
నిన్నూ నన్నూ ఎరుగరు నేటి కొత్తపూజారులు
పరిచితకంఠస్వరాలు చెవులకు పండుగచేయవు
అటూ ఇటూ నిర్మించిన కొత్త కొత్త రహదారులు
ఆ వెనకటి సుధాస్మృతులు వేరొక రుతి విననీయవు
అసంబద్ధయశోవాంఛ పరచింతాపరాఙ్ముఖత
ప్రబలే ఈ నగరంలో ఏమున్నది మనకు ఫలం?
అంతులేని ధనపిపాస అనాగరక నాగరకత
ఈ రొదలో ఎలా మనం మనుగడ సాగించగలం?
గతం గడిచిపోయిందని ఏలా ఈ అనుతాపం
కాలం నర్తకి బహుశా మారుస్తున్నది రూపం!
అని అప్పుడప్పుడు నిర్వేదమూ కలుగుతుంది.”

ఢిల్లీ అంటే ఒక సర్వవేణీసమాగమస్థలం. సర్వవాణీవిద్యాధ్యయనకేంద్రం.

ఈ రాజధానిలో తెలుగువారిదొక అపురూపమైన సజీవ సంజీవ స్థానం.

తెలుగు భాషాకుటుంబానికి చెందిన బ్రాహుయీ మాట్లాడుతూ బెలూచిస్థాన్‌కు తరతరాల క్రితం తరలివెళ్ళి, క్వెట్టాలో ఉద్యోగాలు చేసి ఇక్కడికి మరలివచ్చినవారి సంతతి సనాతన పదసంపదను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందిక్కడ. ఉడిషా నుంచి ఇక్కడికి వచ్చిన రెల్లి కుటుంబాల వారి ప్రసంగాలలో ఒక సరికొత్త తెలుగు పలుకుబడి వినిపిస్తుంది. అలహాబాదీయుల భోజపురీ వింత తెలుగు మాట్లాడే ఉపాధ్యాయ కుటుంబా లున్నాయిక్కడ. ఇక్కడి పిల్లలు మాట్లాడుకునే తెలుగు విరజాజులూ, హిందీ ఇందీవరాల విచిత్ర మణిప్రవాళం ఉండనే ఉన్నది. తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన సంస్కృత ప్రాకృత గ్రంథసంచయం ఇక్కడున్నట్లు మరెక్కడా లేదు. ప్రాచ్య పాశ్చాత్య సంగీత నృత్యాలకు, సాహిత్య చిత్ర శిల్పకళాకిర్మీరాలకు తుంగశృంగాటకం ఇదే. ఆధునిక నాటకం ఇక్కడే రూపాన్ని చక్కదిద్దుకొన్నది. కన్యాశుల్కంలో కొత్త కోణాలు ఆవిష్కరింపబడి మన ఆబోరు దక్కిందిక్కడే కదూ.

ఇటీవల ఇక్కడి రాజకీయాల నివురు నిప్పై మరెక్కడో పొగ రాజుకోవటమూ చూస్తున్నాము.ఆ విశేషాలెన్నో.

ఇక్కడి తెలుగు భాష చారిత్రికవిలాసం, కవులూ రచయితలూ, పత్రికలూ, పాత్రికేయులూ, కళాకోవిదులూ క్రీడాకారులూ, మనస్వులూ, మహిళామణులూ, సంస్కార పరిమాణాలూ, మరెన్నో పరిణామాలూ …

ఢిల్లీలో తెలుగువారి స్థానం ఒకప్పుడెలా ఉండేది? ఇప్పటి స్థితిగతులేమిటి? అని – స్మృతిరంగస్థలిపైని అతీత కాలయవనికను ఒక్కింత తొలగించి, దృశ్యాదృశ్యగతంలోకి తొంగిచూసినప్పుడు పరంపరీణన్యాయంగా స్ఫురించే దృశ్యచిత్రాలలో

“ఇది నా దేహళి,
నా భవం బిచట,
నిందే సృష్టిమర్మస్థితుల్ పదనై,
పూజ్య ఋషిప్రచోదితములై
ప్రాక్పశ్చిమాశాంతముల్ గదిసెన్ …”

అని ఈ యమునాతీరంలో వీచిన సుకవితా సంగీత నాట్య కళాసమీరాలను, ఇక్కడి చరిత్ర విధాతలైన మహనీయ వ్యక్తులను, అసామాన్య సామాన్యులను, స్మరణీయ సంఘటనలను, తెలుగువారు ఉనికికోసం, మనికికోసం ముచ్చటపడి నిర్మించుకొన్న సంస్థలూ సమాఖ్యల చరిత్రలను, ఆ ఆత్మీయతలను, ఆ జ్ఞాపకాల ఛాయాచిత్రాలను, ఉక్తిప్రత్యుక్తులను, సూక్తిరత్నాలను, చిత్రోక్తులను, ఛలోక్తులను, ఆశలను, ఆశయాలను, ఆదర్శాలను మరీ మరీ నెమరువేసుకోవా లనిపించి, స్మృతిసరస్సులో వికసించిన అనుభవ లీలాకమలాల సుగంధాన్ని నాకు పరిచితమైనంతలో శ్రుతపాండిత్య వాక్స్రవంతిగా మిత్రులందరికీ ఒక్కొక్కటిగా పంచిపెట్టా లనిపించి మనస్సంతా మాధుర్యభావంతో నిండిపోతుంది నాకు.

అన్నట్లు శ్రీ శ్రీ అన్నట్లు – ఇది నా గళగళన్మంగళకళాకాహళి! ఆత్మీయ భావగేహళి !! నిస్సీమ చైతన్యదేహళి !!!

@@@@@

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY