ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గజపతుల నాటి గాధలు – యుక్తి

Like-o-Meter
[Total: 2 Average: 3.5]

రచన: బులుసు వేంకటరమణయ్య

ప్రచురణ: బుక్‍మన్స్

గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.

 

 

ఇది రెండువందల ఏళ్ళ కిందటి మాట.

విజయనగరం సంస్థానం దివాను పూసపాటి సీతారామరాజుగారు కోటలోని మోతీమహల్లో కచేరి చేస్తూ వున్నారు.

దివానుగారంటే అందరికీ భయమే! ఎంతో పరిచయం వున్నవాళ్ళు తప్ప ఎవ్వరూ ఆయన యెదట పడలేరు. ఆయన ఆహ్వానించనిదీ ఎవ్వరూ ఎదటికి రాకూడదు. ఆయనది సుగ్రీవాజ్ఞ! మహరాజులుంగారు కూడా ఒక్కొక్కప్పుడు తనకు యిష్టంలేని పనులు జరిగినప్పటికీ వూరుకోవలసినదే!

దివానుగారికి అంత స్వాతంత్య్రం వుంది. ఆయన మహారాజులుంగారి సవతి అన్నగారు!

అప్పుడు ప్రభువుల ఆస్థానకవి – అడిదం సూరకవి – దివానుగారి దర్శనానికి వచ్చాడు. అతనిని లోపలికి రప్పించి, కూర్చున్నాక దివాను “కవిగారికి నమస్కారం! ఏం యిలా దయచేశారు? ప్రభువులు వూళ్ళో లేరని తెలియదేమో?” అన్నాడు.

“తెలిసిందండి. నిన్న మధ్యాహ్నం వేట నిమిత్తం మహారాజులుంగారు షికారుగంజికి వేంచేసినట్లు తెలిసింది. వారు లేకపోతే నేమీ? ప్రభువులంతవారు తమరు! తమ దర్శనానికే వచ్చాను నేను” అన్నాడు సూరకవి.

“అయితే సరే! చాలా సంతోషం! ఎప్పుడూ రాని వారు వచ్చారు, ఏమిటి సెలవు?”

“మరేమీ విశేషమైన పని కాదండి! ప్రభువులవారు మాకు యిదివరలో రెండు మాన్యాలు యిప్పించారు! మా కర్మం ఏమిటో గాని, అవి యెప్పుడూ యెండడమే కాని, పండడమనే మాట లేదు. పై పెచ్చు మేం గంటాల పన్ను చెల్లించుకోవలసి వస్తున్నాది. దయయించి వాటికి బదులుగా మరేమయినా కటాక్షిస్తే బ్రతికిపోతాము. ఏలినవారికి పుణ్యమూ వుంటుంది.”

“ఓహో! మీ కిచ్చిన కంచరాం, రేగా సరిగా లేవంటున్నారు కదూ! అవి దివ్యమైన మాన్యాలు గదండీ! తగిన రైతులను ఏర్పాటు చేసుకుంటే బంగారం పండవండీ అవి?”

“అవి యేం పండుతాయో భగవంతుడికే యెరుక. ఆ వూళ్ళలో మా మాన్యాలే కాదు; ఎవరి భూములున్నూ పండడం లేదు. ఒక ఏడన్నా మీకు బకాయిలు లేకుండ అక్కడ దస్తు వసూలైందేమో చెప్పండి చూదాం!”

“బకాయిలు వసూలు కాక ఏమవుతాయండీ! సంస్థానంవారు ముక్కు పిండి మరీ పుచ్చుకుంటారు. ప్రజలను తొందరపెట్టకూడదని ఉపేక్ష చేస్తున్నారు గానీ, నిజానికి చేతగాక కాదుగదూ! ఇంతకూ మీరు ముఖ్యమైన సంగతి గమనించారు కారు. మాన్యాలక్రింద యివ్వవలసిన భూములను ఎప్పుడో పంపకం చేశారు. మీ కివి అక్కర్లేదంటే మరెవరు మీకోసం తమ భూములను ఇస్తారు? ఏదో యిప్పటి క్కానీయండి; చూద్దాం తర్వాత సంగతి?”

“ఆశ్రితుల కష్టసుఖాలు ఆలోచించి తగిన యేర్పాట్లు చేయిస్తారనే గంపెడాశతో వచ్చాను – ప్రభువు లిలా అనడం ధర్మం కాదు. ఉపయోగం లేని భూములవల్ల కలిగే లాభం పన్నులు తప్ప మరేమీ లేదు. మా మాన్యాలు ప్రభువులు తీసుకుంటే ఆ పన్నుల భారమైనా తగ్గుతుంది.”

“కవిగారు తొందరపడుతున్నారు. మహారాజులుంగారు వచ్చేక, మనవి చేసుకోండి! వారు మాన్యాలు మారుస్తామంటే నాకేం పోయింది? వారు వచ్చేక మీ యిష్టం వచ్చినట్లు చేయించుకోవచ్చు.”

“ప్రభువు లనుగ్రహిస్తే మాత్రం ప్రయోజనం ఏం వుంటుందండి? దేవుడు వరమిస్తే మాత్రం పూజారి వరమియ్యొద్దా? మీకు యిష్టం కాని పని యీ సంస్థానంలో ఒక్క నలుసైనా జరగదు? ఇక యీ అజాగళస్తనాల్లాంటి భూములకి పన్నులు కూడా ఎందుకు కట్టుకోవాలీ! మీ యినాములు మీరే గ్రహించవచ్చును. పుట్టించినవాడే రక్షిస్తాడు. ఇంతకీ కవిసామ్రాట్టులకి కాలం గడవకపోదు. నేను వెళ్లివస్తాను. సెలవు!”

ఇలా అంటూ సూరకవి తన మాన్యాలకు సంస్థానం వారిచ్చిన పట్టాలు అక్కడే పడవేసి చివాలున లేచి వెళ్ళి పోయాడు. దివాను నిర్ఘాంతపోయి చూస్తూ వుండిపోయాడు.

సూరకవిని చూస్తే దివానుకు ఎప్పుడూ కిట్టదు; ప్రభువైన విజయరామగజపతి మహారాజులుంగారు దేవాలయాలకు, మసీదులకూ, కవిపండితులకూ, తదితరులకూ యిచ్చిన మాన్యాలు ఏదో విధంగా తీసుకోవడమే అతని సంకల్పం. సూరకవి కిది బాగా తెలుసు. అంచేతే నిర్మొగమాటంగా చెప్పి పట్టాలు అక్కడే పడవేసి వచ్చా డతను.

 

*****

ఇక ఆ వూళ్ళో వుండడం కూడా అతనికి ఇష్టం కాదు. దమ్మిడీ ప్రయోజనం లేనప్పుడు – పట్నం కాపురం వల్ల అప్పులు కావడమే కాని మరో లాభం లేదు. కాబట్టే కాపురం కూడా మార్చివేద్దా మనుకున్నాడు. ఊళ్ళో వుంటే ప్రయోజనం లేకపోయినా తరచు కోటలోంచి వర్తమానం వస్తూనే వుంటుంది; తాను వెళ్ళకనూ తప్పదు. ఆ విధంగానూ కాపురం మరో చోటికి ఎత్తివెయ్యడం అన్నివిధాలా మేలని అతనికి తోచింది.

సూరకవికి బుద్ధి పుట్టకనే పోవాలి; కాని పుడితే అది జరిగి తీరవలసినదే! వారం రోజుల్లోనే కాపురం చీపురుపల్లికి మార్చివేశాడు, కుటుంబం అంతా – తానూ, భార్య సీతమ్మా, కొడుకు బాచన్నా – అందువల్ల యెక్కువ బెడద లేకుండానే ఆ పని జరిగిపోయింది.

ఇక ’కుటుంబ భరణం ఎలాగ?’ అనే విచారమే లేదు సూరకవికి. అతనికి ధైర్యసాహసాలు ఎక్కువ. మొగమాటం అనేది లేదు. విజయనగరం సంస్థానానికి మిత్రులయిన వారి వద్దకూ, శత్రువులైనవారి వద్దకూ కూడా ఆయన వెళ్ళి బహుమానాలు, వార్షికాలు సంపాదించుకునేవాడు. అతనికి ఆ శత్రుత్వ, మిత్రత్వాలతో సంబంధమే లేదు. పర్లాకిమిడి నుంచి పెద్దాపురం దాకా వున్న సంస్థానాలన్నీ ఆయన్ని గౌరవించేవి. ప్రభువులే కాకుండా అక్కడి అధికారులు కూడా ఎక్కువ గౌరవమర్యాదలు చూపేవారు. అలాంటివారిలో విజయనగరం సమీపంలో వున్న శృంగవరపుకోట దివాను పొణుగుపాటి వేంకటమంత్రి ముఖ్యుడు.

శృంగవరపుకోట ప్రభువు శ్రీమఖి కాశీపతిరాజు మన్నెరాజులలో ప్రముఖుడు. విజయనగరానికి ప్రతిపక్షి కోటిలో చేరినవాడు. అతనికి సూరకవి అంటే గొప్ప గౌరవం; అతని కంటే అతని మంత్రి వెంకటమంత్రి మరీ ఎక్కువ గౌరవంతో చూశేవాడు. ఇద్దరూ ఒక కుటుంబం లోని వ్యక్తులవలెనే చాలా చనువుగా వుండేవారు. అంతే కాదు. ఇద్దరికీ బావమరుదుల వరస; ఆయన ఎప్పుడూ సూరకవిని ఏదో హాస్యం ఆడుతూనే వుంటాడు. సూరకవి తరచు శృంగవరపుకోటలో ఆ బావగారి యింట్లోనే వుండేవాడు.

చాయమ్మ వెంకటమంత్రి సోదరి. ఆమెకు పసితనంలోనే వైధవ్యం సంభవించింది. అందువల్ల ఆమె అన్నగారి వద్దనే వుండిపోయింది. సత్కాలక్షేపం కోసం ఆమె సంస్కృతాంధ్రాల్లో కొంత ప్రవేశం కగిలిగించుకుని రామాయణం, భగవద్గీతా మొదలైనవి పారాయణ చేస్తూ కాలం గడుపుతూ వుంటుంది. చమత్కారంగా మాటలాడడంలో, ఆమె చాలా గట్టిది. సూరకవిని ఏదో హాస్యం ఆడుతూ వుండడం అంటే ఆమెకు చాలా ఇష్టం.

సూరకవి నియ్యోగి అయినా ఆచార, వ్యవహారాల్లో పరమనైష్టికుల నందరినీ తలదన్నగలవాడు; ఎపుడూ ఆయన సంచారం చేస్తూ వుండినా, దగ్గర బంధువుల యిళ్ళల్లో తప్ప ఇతరత్రా విస్తరి వెయ్యడు. స్వయంగా వంట చేసుకుని కాలక్షేపం చేశేవాడు. సమారాధనలలో భోజనం చెయ్యడ మనేది ఎప్పుడూ లేదు.

వెంకటమంత్రి సంపన్నగృహస్థు. నిరతాన్న ప్రదాత. ఏదో వ్రతం పేరూ, నోముపేరూ చెప్పి బ్రాహ్మణ సమారాధన చెయ్యడం, తన ప్రభువు చేత అలాంటివి చేయించడం పరిపాటి. అలాగంటి సందర్భంలో వెంకటమంత్రి భార్య సూరకవికి మాత్రం ప్రత్యేకంగా వంట చెయ్యడం జరిగేది.

ఒకప్పుడు మామూలు మాదిరిగానే వెంకట మంత్రి గారి యింట్లో గొప్ప బ్రాహ్మణ సంతర్పణ జరిగింది. చుట్టుప్రక్కల వున్న వూళ్ళ నుంచి కూడా చాలామంది బ్రాహ్మణ్యం రావడం చేత వెయ్యిమందికి పైగా జనం పంక్తులు తీర్చి విందు ఆరగిస్తున్నారు. పాచకులతోనూ, తక్కిన తాబేదార్లతోనూ పాటు పట్టుతాపితాలు కట్టుకొని వెంకటమంత్రి వడ్డనలోనికి వచ్చాడు. ఆయనతోపాటు ఆయన సోదరి చాయమ్మ కూడా నేతిజారీ చేత్తో పుచ్చుకొని వడ్డించ సాగినది.

సూరకవి కూడా అక్కడికి వచ్చేడు. భోజనం చెయ్యడానికి కాదుగాని, అంతమంది బ్రాహ్మణ్యం భోజనం చేస్తూ వుండగా చూచి ఆనందించాలని అతని కోరిక. అతడు సమారాధన జరుగుతూ వున్నచోట ఒక తిన్నెమీద కూర్చుని పదార్థాలు ఎలా చురుకుగా సరఫరా అగుచున్నదీ, అతిథులు ఎలా భుజిస్తున్నదీ గమనిస్తూ వున్నాడు. వండిన పదార్థాలకీ, అవి వెంటనే ఖర్చవుతూ వుండడానికీ అంతం కనబడ్డం లేదు. వెంకటమంత్రిగారి యీ గొప్ప యత్నానికి సూరకవి మిక్కిలి ఆశ్చర్యపడి ఆశువుగా ఇలా పద్యం చెప్పాడు –

ఒక్క సముద్రము దక్కగ
తక్కిన సంద్రములు నీ యుదారమహిమచే
జిక్కెగద విప్రభుక్తికి
వెక్కసముగ పొణుగుపాటి వేంకట మంత్రీ!

“సప్తసముద్రాల్లోనూ ఒక్క సముద్రం తప్ప తతిమ్మా అన్నీ యిప్పుడు బ్రాహ్మణ సమారాధనకి యిక్కడికి వచ్చాయి; అంటే ఇక్కడి పదార్థాలు సముద్రాల వలె అంతం లేకుండా వున్నాయి” అని దీని అభిప్రాయం. దీన్ని విని అక్కడి వారంతా “చాలా అద్భుతంగా చెప్పారండీ సూరకవిగారు!” అని మెచ్చుకున్నారు.

అప్పుడు ఒక మూల నేతివడ్డనలో మునిగి వున్న చాయమ్మ సహజ హాస్యధోరణిలో సూరకవివైపు వున్న పంక్తిలో వడ్డిస్తూ సూరకవితో –

“బావగారు, ఆ సముద్రం ఏమిటంటారు?” అని చిరునవ్వుతో ప్రశ్నించింది.

“మరేం వుంటుందమ్మా! సేవించినవాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని శుక్రాచార్లువారు శపించిన సురా సముద్రం!” అన్నాడు.

ఆమె నవ్వుతూ “అలాగా? అది స్వయంపాక నియమం గల బావగారి కంటూ మా అన్నగారు మీకోసం ప్రత్యేకించి వుంచివేశారండీ!” అన్నది. అందరూ గొల్లుమని నవ్వారు, సూరకవి వైపే చూస్తూ.

సూరకవి ఆ సమాధానినికి నిర్ఘాంతపోయాడు. ఆమె యుక్తికి ఆశ్చర్యపడి తిరిగి సమాధానం చెప్పడానికి కొంచెం ఆలోచించాడు.

బ్రాహ్మణ్యం అంతా నవ్వు ఆపేసరికే సూరకవి అందుకున్నాడు –

“నిజమే! బావగారు నాకోసం ప్రత్యేకంగా ఆ సముద్రాన్ని వుంచితే వుంచి వుండవచ్చు; కాని యిల్లుపట్టిన ఆడపడుచు దాన్ని తానే వుంచుకుంటుంది; కాని ఎవరికైనా ఇయ్యనిస్తుందా?”

సూరకవి యిలా అనేసరికి అందరూ ఇదివరకు కన్నా ఎక్కువగా నవ్వసాగారు. సూరకవిగారు తగిన సమాధానం యిచ్చారని మెచ్చుకున్నారు.

ఇదివరకు విజయగర్వంతో నలుగురివైపూ చూస్తున్న చాయమ్మ ముఖం దమ్మిడీ అంత అయిపోయింది.

॒॒॒॒॒@@@@@_