ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గజపతుల నాటి గాధలు – లక్క పందిరి

Like-o-Meter
[Total: 3 Average: 4.3]

రచన : బులుసు వేంకటరమణయ్య

ప్రచురణ: బుక్‍మన్స్

గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.

 

అదృష్టమంటే జగన్నాథ రాజు గారిదే అదృష్టం!

ఏమంటే – ఆయన మొదట ఒక చిన్న గుమాస్తాగా విజయనగర సంస్థానంలో అడుగుపెట్టేడు. చదువు చూస్తే నాలుగో క్లాసు కంటే ఎక్కువ లేదు. అయితేనేం? అద్భుతమైన తెలివితేటలు గలవాడు. పనిలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. ఎవరి దగ్గిర ఏ విధంగా ప్రవర్తించాలో అతనికి బాగా తెలుసును. ఆ కారణం చేత జగన్నాధరాజు గారు ప్రభువైన విజయరామరజపతి మహారాజులుంగారి మన్ననలకు పాత్రమై, అభివృద్ధికి వస్తూ అచిరకాలంలోనే జమీందారీకి అసిస్టెంటు దివానై, తర్వాత మహారాజులుంగారి బలవంతం మీద హెడ్డు దివానుగిరీ చెలాయించటానికి పూనుకున్నారు.

దివానుగారిది సుగ్రీవాజ్ఞ.

దాన్ని ఎవ్వరూ కూడా అతిక్రమించలేరు. ఎప్పుడూ, ఎవ్వరూ అతిక్రమించకపోవడం చేత అలాగు నిర్లక్ష్యం చేసినవారికి ఎలాంటి శిక్ష విధింపబడేదో తెలుసుకోవడం అసాధ్యమే!

మహారాజులుంగారు కూడా తమ కనిష్టమైన విషయాల్లో దివానుగారి ప్రవృత్తికి అడ్డు చెప్పలేక పోయేవారు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

దివానుగారంటే తాబేదార్లందరికీ గొప్ప గౌరవం. ఈయన బెదిరించేవాడే కని, ఒకరి పొట్ట మీద కొట్టడని అందరి ధైర్యమున్నూ. ప్రజలందరికీ దివానుగారంటే దేవుడిలాంటి వారన్నమాట.

అంతే కాదు, ప్రభుత్వం వారికీ జగన్నాథ రాజు చాలా నమ్మకస్థుడు. ఉత్తర సర్కారులలో వున్న జమీందారీ లన్నిట్లోకీ విజయనగరం జమీందారీయే చాలా పెద్దది; ధనవంతమయినది. అలాంటి జామీందారీ ఎటువంటి అల్లకల్లోలాలూ లేక సవ్యంగా జరుగుతున్నదంటే, దానికి దొరతనం కూడా గర్వించవలసినదే! దానికి కారణం దివాను జగన్నాథరాజు గారే అని పై దొరల కందరికీ బాగా తెలుసును.

మరో సంగతి ఏమిటమ్టే జగన్నాధరాజుగారికి బాగా మెప్పు కావాలి. తన నేర్పునీ, ప్రతిభనీ నలుగురూ మెచ్చుకోవాలి. తన మాటకి ఎదురు ఉండకూడదు. అదే ఆయనకి కావలసినది. దివాంజీగారు ఇలాంటి ఆశయాలు కలిగి వుండడం చేత కొత్తగా ఏ పెద్ద ఉద్యోగి వచ్చాడని తెలిసినా, అతదిని తమ సంస్థానానికి పిలిపించి గొప్పగా గౌరవించి పంపేవారు. ఇలాంటి సమ్మానాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం చేత మహారాజులుంగారూ అంగీకరించేవారు. ఈ విధంగా విజయనగరం దివానుగారికి గవర్నర్లతోటీ, కలెక్టర్ల తోటీ చాలా పరిచయం కలిగింది. వారందరికీ ఈయన మీద గొప్ప గౌరవం ఏర్పడింది. అందువల్ల కలక్టరు హోదాకి క్రింది వుద్యోగస్థులను దివానుగారు లక్ష్యం చేసేవారు కాదు. సబు కలక్టర్లు మొదలైన గవర్నమెంటు అధికార్ల కందరికీ జగన్నాథరాజు గారంటే చాలా భయంగా కూడా ఉండేది.

విశాఖపట్నం జిల్లాలోని రెవిన్యూ డివిజన్లలో ఒక డివిజనుకి విజయనగరం కార్యస్థానం. అందుచేత ఎవరో ఒక విదేశీయుడు ఆ వూరికి సబు కలెక్టరుగా వస్తూ వుంటాడు. ఆ వచ్చినవారిని దివానుగారు ఎదుర్కొని చాలా గౌరవం చూపించడం పరిపాటి.

ఒకసారి ఒక విదేశీయుడు అక్కడికి అధికారరీత్యా రవలసి వచ్చింది. దివానుగారు కాస్త అనారోగ్యం వల్ల ఆయన్ని ఎదుర్కొనలేక తన తరఫున అసిస్టెంటు దివానును పంపి, ఆ అతిథికి తగిన ఏర్పాట్లు చేయించారు. ఆ ఉద్యోగస్థునికి లోకానుభవం తక్కువ. అప్పుడే స్టీమరు దిగి వచ్చాడు.

హిందూదేశంలోని వాళ్ళందరూ అనాగరికులనీ, మూర్ఖులనీ అతని మనసులో ఇదివరకే ఒక దురభిప్రాయం ఏర్పడి ఉండిపోయింది. తాను ఒక తెల్ల దేవతామూర్తిననీ, తనకు అక్కడివారు అడుగులకు మడుగు లొడ్డుతూ, ఎక్కువ వినయ విధేయతలు చూపించాలనీ అతని కోరిక. మొదట్లోనే తన్ను ఎదుర్కోడానికి పెద్ద దివాను రాకుండా చిన్న దివాను రావడం పెద్దగా అగౌరవపరచిన ట్లతనికి తోచింది.

నిజానికి ఆలోచిస్తే కలక్టరుకీ, సంస్థానానికీ ఎటువంటి సంబంధమూ లేదు. జమీందారీ వ్యవహారాల్లో అతను ఎలాటి జోక్యమూ తీసుకో నవసరం లేదు. అయినా తగు మనిషి తరహాగా దివానుగారు మర్యాద చేస్తే అది చాలదని ఆ పాశ్చాత్యమూర్తి అనుకోవడంలో అర్థం లేదు.

వాడుక ప్రకారం ఆ కలక్టరు గారికి, రాజ దర్శనమూ జరిగింది, మరి రెండు మూడు రోజుల్లో.

అతను దర్బారుకు వస్తున్నప్పుడు దివాను జగన్నాథరాజుగారు ఎదురుగా వచ్చి, సగౌరవంగా లోకలిపి తీసుకొని వెళ్ళి మహారాజులుంగారి పరిచయం కలిగించారు.

మహారాజులుంగారు స్వయంగా వచ్చి తన్ను దర్బారులోకి తీసుకువెళ్ళడం లేదేమిటా? అని దొరగారికి కష్టం అనిపించింది. ఇదివరలో గవర్నర్లూ, పెద్ద కలక్టరూ వచ్చేటప్పుడు మహారాజులుంగారు స్వయంగా ఆహ్వానించడం జరిగేదని ఆ సబుకలక్టరు దొరకు తెలుసును. వాళ్ళ కంటే తన తక్కువ యేమిటి? అని ఆనుకుని దీని కంతకీ కారణం దివానే అని మనస్సులో నిశ్చయించుకొన్నాడు.

తర్వాత ఒకటి, రెండు పర్యాయాలు కలుసుకున్నప్పుడు దివానును అలక్ష్యంగా చూసేడు. ఆ దొరగారి ప్రవర్తన జగన్నాధరాజు గారికి అసంతృప్తిని కలిగించింది. ఈ యిద్దరూ కూడా తగిన సమయానికి ఎదురుచూస్తూ ఉన్నారు.

*****

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
జగన్నాథ రాజు గారికి ఇంటిముందు పందిళ్ళు వేయించుకోవడమంటే సరదా. ఏ వీధి భాగవతం జరిగినా, బొమ్మలాట అరిగినా వాటికోసం ప్రత్యేకంగా పందిళ్ళు వేయించనక్కర లేదనీ, పందిరి ఇంటికి శోభను కలిగిస్తుందనీ, నిత్యకల్యాణం కళ్ళకి కడుతూ వుంటుందనీ ఆయన అభిప్రాయం. తాను హెడ్డు దివాను అయ్యాక కోటకి ప్రక్కగా సమీపంలోనే ఒక పెద్ద భవంతి ఆయన నివాసానికి ఈయబడింది. తర్వాత దివాంజీగారు తమ కోరిక ప్రకారం తమ భవనం ముందు శాశ్వతంగా వుండేటట్లు ఒక పందిరిని నిర్మించారు.

అదే లక్క పందిరి.

లక్కపందిరి అంటే లాక్షాగృహం వలె లక్కతో నిర్మించబడ్డది కాదు. అది చాలా విశాలమైన పెంకుటింటి ఆకారం గల పందిరి. ఆ పందిరికి బలమైన కర్ర స్తంభాలు. ఆ స్తంభాలకి పైభాగంలో వున్న బల్లల మీద లక్కరంగులతో రామాయణానికి సంబంధించిన బొమ్మలు మనోహరంగా శాశ్వతంగా వుండేటట్టు చిత్రించబడి వున్నాయి. ఆ వీధి రోడ్డు ఆ పందిరి మధ్యనుంచే పోతున్నాది. రెండు భారీ బళ్ళు నిరాఘాటంగా ఆ పందిరిలోంచి ప్రయాణం చెయ్యవచ్చును.

ఒకసారి సబుకలెక్టరు దొరగారు కోట సింహద్వారం వైపునుండి అయోధ్యా మైదానం వైపు కోట రోడ్డు మీద నుంచి పోతూ వుండగా ఆయన దృష్టి ఆ ప్రక్కనున్న దివాన్ జీ గారి ఇంటి ముందున్న లక్క పందిరి మీద పడింది. వెంటనే అతని మనస్సులో ఒక ఆలోచన తట్టింది. ఆ కలెక్టరు దొర తన వాహనాన్ని ఆ పక్కకి మరల్చి దివాన్జీ గారి యింటి వేపు వెళ్ళాడు.

దివాన్జీ అప్పుడే ప్రాతఃకాల విధులు తీర్చుకుని కచేరి సావిడిలో సుఖాసీనులయి, ఏవో కాగితాలు చూచుకుంటూ గుమాస్తాలతో ఏదో మాటలాడుతున్నారు. ఇంతలో కలెక్టరుగారు లోపలికి వచ్చారు. జగన్నాథరాజు గారు ఆయన్ని మార్యాదగా ఆహ్వానించి ఒక సోఫా మీద కూర్చోపెట్టాడు. కుశలప్రశ్నలు మామూలుగా జరిగిపోయాయి.

తర్వాత సబుకలెక్టరు అందుకున్నాడు – “నేను ఉదయం షికారుగా వస్తూ మీ ఇంటి ముందు పందిరి ఆకర్షింపగా ఇలా వచ్చాను. మీ పనికి ఆటంకం కలిగించినందుకు క్షమించండి.”

“………..”

“దీన్ని మీరే కట్టించారనుకుంటాను. ఇలా తయారవడానికి చాలా ఖర్చు అయి వుండాలి!”

“చిత్తమండి! నేనే కట్టించాను. చాలా సొమ్ము ఖర్చుపెట్టాను. ఇంతకీ మనస్సులోని కోరిక జరగాలంటే డబ్బుకి వెనక తీయగలమా?”

“సరే! బాగానే వుంది. ఈ వీధికి పోయే రోడ్డు ఈ పందిరి కిందనుంచే గదా వున్నాది? వచ్చే పోయే బళ్ళు, మనుష్యులూ మీ పందిరి క్రింద నుంచే గదా వెళ్ళాలి?”

“అవును. నిరాఘాటంగా వెళ్ళవచ్చు. దానికి మా అభ్యంతరం ఏమీ లేదు. బళ్ళు ఎదురెదురుగా వచ్చినా ఇందులో సునాయాసంగా తప్పుకోగలవు. వర్షం పడే సమయంలో దీని కింద చాలామంది జనం తలలు దాచుకుంటారు. ఇది జనానికి చాలా ఉపయోగంగా ఉంది.”

“ఉండవచ్చును గాక. పబ్లిక్ రోడ్డు మీద మీరిలా శాశ్వతంగా పందిరి కట్టించి వుంచడం పద్ధతికి విరుద్ధమేమో ఆలోచించారా?”

జగన్నాథరాజు గారికి కలక్టరు అభిప్రాయం ఇప్పుడు అవగతమైంది. కలక్టరుకి తమ సంస్థానం మీదా, తమ మీదా ఎలాటి అధికారమూ లేకపోయినా ప్రజా సంస్థ మీద అధికారం వుంది. నగర పరిపాలనాధికారం ప్రభుత్వముది కాని సంస్థానం వారిది కాదు. తన్ను సాధించడానికి కలక్టరు ఈ అధికారాన్ని ఉపయోగించదలచినాడని దివాను గారికి బాగా అర్థమయింది. అర నిమిషం ఆలోచించి ఆయన ఇలా అన్నాడు:

“ఇది చాలాకాలం క్రింద కట్టబడి వుంది. ఇదివరకు తమవంటి ప్రభువులూ, గవర్నరులూ దీన్ని చూచినారు; వారు ఎటువంటి ఆక్షేపణా చెయ్యలేదు.”

“ఆ సంగతి వేర్య్! ఎప్పుడో తప్పు జరిగిందని, తమవంటి వారు దాన్ని సరిదిద్దుకోకుండా అలాగే వుంచి వేయడం ధర్మమా?”

దివాన్జీ గారి మనస్సు ఉడికిపోతోంది. కోపం చేత ముఖం కందగడ్డ వలె ఎర్రబారిపోయింది. తనకు ఎదురు చెప్పేవా డొకడు ఇప్పుడు కనబడడమూ, తన్ను అవమానించడమూ దుస్సహం అనిపించింది ఆయనకి. అయినా ఆలోచించి శాంతం వహించవలసి వచ్చింది.

“అయితే ఏమి సెలవు?”

“మరేమీ లేదు; దీన్ని తీసివేయించాలి.”

జగన్నాథరాజు గారికి తల కొట్టినట్లనిపించింది. ఆయనకు ఏమి జవాబు చెపడనికీ పాలుపోలేదు.

కలక్టరు అధికార గర్వంతో తన విజయాన్ని సూచిస్తూ “తీసి వేయించక తప్పదు. సాయంకాలం లోగానే ఆ పని జరిగి తీరాలి” అన్నాడు.

జగన్నాధరాజు గారికి ఏదో మనస్సులో మెరుపు మెరిసినట్లయింది. ఆయన “సరే! తీయించివేస్తాను, సాయం కాలంలోగానే” అన్నారు.

“మీరు వెంటనే ఈ పనికి మనుషులను ఏర్పాటు చెయ్యాలి. నేను సాయంకాలం మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను.”

“ఓ! జగన్నాథరాజు ఇన్ని మాటలు ఆడేవాడు కాడు. సాయంకాలంలోగా తప్పకుండా తీయించివేస్తాను. నా మాట నమ్మండి.”

కలక్టరు వికసిత వదనంతో వెళ్ళిపోయాడు. దివాన్ జీ గారు తాను ఒంటరిగా కొన్ని కాగితాలు వ్రాసుకోవడానికి తన ప్రత్యేకపు గదిలోనికి వెళ్ళిపోయారు.

సాయంకాలం కావచ్చింది. లక్కపందిరి చెక్కుచెదరకుండా అలాగే వుంది. దాన్ని తీసివేయించడానికి ఎలాంటి ప్రయత్నమూ జరిగినట్టన్నా లేదు.

కలెక్టరుగారు తన ఆజ్ఞ ఎంతవరకు నెరవేర్పబడిందా అని చూడడానికి దివాన్జీగారి యింటి వేపు వచ్చాడు. లక్కపందిరిని చూసేసరికి అది తన్ను వెక్కిరిస్తున్నట్లు కనబడింది.

అతను మిక్కిలి కోపంతో దివానుగారి యింటి గున్నం దగ్గిరికి వచ్చాడు. జగన్నాథరాజు గారు చిరునవ్వుతో స్వాగతం యిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు.

“దివాంజీగారు, నాకు చాలా విచారంగా వుంది. నా ఆజ్ఞ నెరవేరలేనందుకు నేను తగిన చర్య తీసుకోవలసి వస్తున్నది” అన్నాడు కలెక్టర్.

దివాంజీగారు ఒక ఎర్ర కాగితం కలెక్టరు చేతికి అందిస్తూ నవ్వుతూ అన్నారు – “చిత్తం! తమ ఆజ్ఞ నెరవేర్చడ మనేది మాకూ చాలా ముఖ్యమే! కానైతే, తమ పైఅధికారుల మాట ప్రకారం జరిగించవలసి వచ్చినందుకు క్షమించాలని ప్రార్థన.” అని

ఆ ఎర్రకాగితం గవర్నరు గారి వద్దనుంచి వచ్చిన అర్జెంటు టెలిగ్రాము. అందులో “మీ ఇంటి లక్కపందిరిని ఎంతమాత్రమూ తీయించవలసిన అవసరం లేదు” అని వున్నది.
దాన్ని చూస్తూ కలెక్టరు నిర్ఘాంతపడిపోయాడు.

ఇంతలోనే కలెక్టరు ఇంటి ప్యూనొకడు ఆయన కోసం ఒక ఎక్స్ప్రెస్ టెలిగ్రాము పట్టుకొని అక్కడికి వచ్చి వినయపూర్వకంగా తన యజమానికి దాన్ని సమర్పించాడు.

కలెక్టరు దాన్ని ఆత్రుతతో విప్పి చదివుకున్నాడు. అది గవర్నరుగారి వద్దనుంచి వచ్చినదే.

“ఉత్తర క్షణంలో శిరస్తాదారుకి ఛార్జీ అప్పగించి, రసూల్ కొండకు పోయి ఛార్జీ తీసుకోవలసింది. అక్కడ ఛార్జీ తీసుకున్నట్లు రెండు రోజుల లోకా మాకు తెలియపరచాలి” అని ఆ టెలిగ్రాములో వుంది.

అది మనసులో చదువుకుంటూ సబుకలెక్టరు దొర వెలవెలపోయాడు.

అందులో విషయం ఆయన రహస్యంగా వుంచాడే కాని, అతని ముఖ వికాసం దాన్ని తెలియజేసింది. అందులో వుండే విషయమేమో దివానుగారికి ఇదివరకే తెలుసును. గవర్నరుగారు ఆయనకి ఈ సంగతి త్తెలియజేసారు.

జగన్నాథరాజు గారు కోరినదీ కలెక్టరుగారి బదిలీయే. అంతకంటే ఎక్కువ అపకారం చేయడం ఆయన స్వభావానికి విరుద్ధం.

దివాన్ గారు ఊరుకోలేదు.

“అయినా నా మాట నేను నెరవేర్చుకున్నట్లే జరిగింది.”

ఏమీ అర్థం కానట్లుగా కలెక్టరు చూసాడు.

“సాయంకాలం లోపుగా తీయించివేస్తానని అన్నాను గదా! అన్న మాట ప్రకారం తీయించివేశానా? లేదా?” అని జగన్నాథరాజు గారు చాలా ధీమాగా అన్నారు.

సబుకలెక్టరు దొర ముఖంలో గంటు పెట్టినా నెత్తురుచుక్క లేదు.

*****