గోకులంలో ఆనందం అల్లరిచేస్తున్నది.ఉత్సాహం పూల సువాసనలాగా, లేగదూడల చెంగణాలలాగ అటు ఇటూ పరుగుపెడుతోంది.
గోపికలు ముసిముసిగా నవ్వుతూనే నొసలు విరుస్తూ యశోద వద్దకు వస్తున్నారు. వాళ్ళ నోళ్ళ నిండుగా ఫిర్యాదులు. చేతుల్ని ఊపుతూ, తలల్ని ఆడిస్తూ, గబగబా అరుస్తున్నారు.
పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ ఫిర్యాదులనే కవ్వంతో, ఆకతాయి పనులనే తాడుతో యశోద హృదయభాండాన్ని మధించారు. ఫలితంగా కోపమనే నురగ తేలింది. కృష్ణలీల అనే వెన్న వెలువడడానికి ఇంకా కొంత సమయము మిగిలి ఉంది.
లేగదూడల్ని వాళ్ళ వాళ్ళ అమ్మలవద్ద భద్రంగా వదిలి, యమునా తీరం బురద అక్కడక్కడా అంటుకొనగా, వాలిపోయిన పింఛాన్ని సరిచేసుకొని, గోధూళితో ఎర్రబడ్డ కళ్లతో, పిల్లనగ్రోవిని ఊదుకొంటూ ఇంటికి చేరాడు కన్నయ్య.
వాకిట్లోనే నిలబడివున్న అమ్మని చూసాడు. అమ్మ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. “అయ్యోపాపం! అమ్మ మధ్యాహ్నం నిద్రపోలేదేమో!” అని అనుకొన్నాడు కన్నయ్య. “వీడి అవతారం చూసి చూసి ఎందరు కళ్లల్లో నిప్పులు పోసుకొన్నారో?” అని అనుకొంది యశోద. వెంటనే కోపం నురగని అసహనం కలయబెట్టింది.
“కన్నయ్యా! ప్రభావతి ఇంట్లో వెన్న కుండల్ని పగలగొట్టావంట?”
“అవునమ్మా! ఆ వెన్న పదిరోజుల పాతదని….”
“మణిమేఖల ఇంట్లో దూడల్ని తరిమేసి ఆవుపాలు నువ్వే తాగేసావంట?”
“అవునమ్మా! దూడ పాలు తాగనంది….”
“నాకు ఓపిక చచ్చిపోతోంది కన్నయ్యా!”
“అయ్యో! ఇంక నాకు జోలపాట ఎవరు పాడతారమ్మా?”
“ఈరోజునుంచీ నువ్వు పశువుల కొట్టంలోనే పడుకోవాలి. గోమాత పాడుతుంది జోలపాట”
“వద్దమ్మా! నాకు నీ పాటే కావలి”
“నా మాట విననివాడికి పాట కావాలా?”
“నీ మాట వింటానమ్మా!”
“నువ్వు ఎప్పటికీ వినవు. పద పశువుల పాకలోకి….”
చీకటి వేళకే మెలకువైంది యశోదకు. కోడి కూయనే లేదు కానీ ఎందుకు మెలకువైంది? అయ్యో! నా కంటి సూర్యుడు, కన్నయ్య, పశువుల కొట్టంలోనే పడుకొన్నాడు కదూ!
గబగబా పశువుల పాకలోకి వెళ్ళింది యశోద. చేతిలోని దీపం వెలుగులో…ఆ పాకలో…అక్కడో మహాశ్చర్యం.
అక్కడ ఒక్కో ఆవు పక్కనే ఒక్కో కృష్ణుడు. గోమాత ఒకవైపు, లేగదూడ మరోవైపు, వెచ్చదనం ఇస్తూ ఉంటే, బుంగమూతితో నిద్రపోతున్న కృష్ణుడు. కాదు..కాదు…అనేకమంది కృష్ణులు.
కళ్ళల్లో కలకలం చెలరేగుతూ ఉండగా, వణుకుతున్న గొంతుతో “కన్నయ్యా!” అంది యశోద. టక్కుమని అనేక కన్నయ్యలూ లేచి “అమ్మా!” అన్నారు ఒక్కసారిగా. కన్నతీపి గుండెల్లో సుడులు రేపుతుండగా, కళ్ళముందు మాయ అనేక రూపాలలో తేడాలు తెలియడంలేదు. అనేకత్వంలో ఏకత్వం ఉంది. కానీ ఈ అనేకాలలో ఒక్కటే నిజం. ఒక్కడే కన్నయ్య. ఎక్కడ? ఎక్కడ? ఆ నిజం కన్నయ్య ఎక్కడ?
యశోద కళ్ళు లేగదూడ తప్పిపోయిన గోమాత కళ్ళను పోలి ఉన్నాయి. ఒక నిముషం గడిచింది. నిజం కన్నయ్య గుర్తు చిక్కడం లేదే! ఆవు పొదుగులో క్షీర ధారల్లా యశోద కళ్ళల్లో కన్నీటి ధారలు.
“మీ అమ్మ ఏడుస్తోందిరా కన్నయ్యా! ఇంకా ఏడిపిస్తావా?” అని అడుగుతున్నట్టుగా మారుమూలలో ఒక గోమాత “అంబా” అంది.
యశోదకు మైకం వీడినట్టైంది. అవునూ! ఈ అనేక కన్నయ్యల సిగముడిపై పింఛమేదీ? అవును. లేదు. తీగ దొరికింది. అల్లుకువెళితే అసలు కన్నయ్య దొరికాడు. ఆ మారుమూలనే గోమాత ఒడిలో….కళ్ళు తెరుచుకొనే ఉన్నాడు.
అమ్మని చూడగానే చేతులు చాచాడు. అమ్మ మాత్రం ఆగుతుందా. అనేక కన్నయ్యలు నవ్వుతుండగా అమ్మ అసలు కన్నయ్యను పట్టేసుకొంది.
మరింకెప్పుడూ కన్నయ్య పశువులపాకలో పడుకోలేదు!
@@@@@