ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

జోగినాధమ్ మాస్టారు

Like-o-Meter
[Total: 0 Average: 0]

జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్’ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. “ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా?” ఆయన నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్.

ఆ రోజులు సినీమా రీలులా మళ్ళీ నా కళ్ళ ముందు మెదిలాయి. వెంటనే అతని రూపం గుర్తుకొచ్చింది.

ముతక ఖద్దరు పంచ చొక్కా పై కండువా, కాస్త ఎత్తు పళ్ళు నూని రాసి నున్నగా దువ్విన క్రాఫు, కళ్ళజోడు సగం సమయం ముక్కు చివరదాకా జారిపోతూంటుంది. క్లాసులో ప్రవేశించగానే బొంగురు గొంతుతో “యిప్పుడు ఏ పీరియడ్?” అని ప్రశ్నించి, క్షణంలో అందరినీ పరికించి చూసేవారు. ఎవరు తడబడుతున్నారో కళ్ళజోడు లోంచి చూసేవారు. 

బోర్డు మీద రాస్తున్నప్పుడు కూడా వెనుకనుంచి మేము ఏం చేస్తున్నామో గమనించేవారు. శిక్షించేటప్పుడు పక్షపాతం లేకుండా అందరికీ ఒకేలా వేసేవారు. అది మాలో కొందరికి జీర్ణమయ్యేదికాదు. తెలివైన విద్యార్ధులను టీచర్లు కొంత అభిమానంగా చూస్తారని పక్షపాతం చూపిస్తారని విన్నాం గానీ మా జోగినాధం మాస్టారి వద్ద అవన్నీ అబధ్ధాలని ఋజువైపోయింది.

స్కూలు ఆవరణలో వున్నంతసేపూ ఏ క్లాసు కుర్రాడైనా కాగితం ముక్కగాని, చెత్త గాని కింద పడేయడం చూస్తే వెంటనే వాడి చెవి పట్టుకుని చెత్త ఏరించి, చెత్త కుండీలో వేయించేవారు. స్కూలు స్కూలమంతా “మాష్టారిదేల అలా ప్రవర్తిస్తారేమిటీ?” అనుకునేవాళ్ళం.

ఒకరోజు టీచర్స్ కామన్ రూము లోంచి గట్టిగా మాటలు వినిపిస్తూంటే, అదీ జోగినాధం మాష్టారి గొంతు వినిపించగానే “ఏమిటా?” అని తొంగి చూశాను.

 

 

చదివిన పేపరు చక్కగా మడిచి పెట్టలేదని మరో టీచర్ని మందలిస్తుంటే ఆశ్చర్యపోయాను. పిల్లలమే కాదు టీచర్లు కూడా అతని జులుంకి బలి అయిపోతారని అర్ధమయింది.

జోగినాధం మాస్టారు ఒంటరి మనిషి. మొదటి భార్య పోయిన రెండేళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుకున్నారుట. ఆమె ఆర్నెల్లు కూడా బ్రతకలేదుట. అప్పటి నుండి తమ్ముడి యింటి పక్కనే చిన్న యిల్లు అద్దెకి తీసుకుని, తమ్ముని యింటిలో భోజనం చేస్తూ ఒక్కరే వుండటం అలవాటు చేసుకున్నారు. యితని చండశాసనత్వమ్ పడలేక యిద్దరు భార్యలు యీ లోకం విడిచి పోయారేమోనంటూ పిల్లలం చాటుగా విమర్శ చేసుకునే వాళ్ళ .

వేసవి వచ్చిందంటే చాలు స్కూల్లో కొత్త కుండలు తెప్పించేవారు. వాటికోసం పిల్లల వద్దనుండే డబ్బులు వసూలు చేసేవారు. వాటిని దగ్గరుండి ప్యూను చేత నింపించి మూతలు పెట్టించేవారు. ఇంటర్వెల్ సమయంలో పిల్లలు నీటిని వృథా చేయకుండా కుండలు పగలకొట్టకుండా అందరూ నీళ్ళు తాగేలా చూసేవారు.

ఒకరోజు ఒక స్టూడెంట్ చేతిలోంచి గ్లాసు జారిపడి కుండ పగిలి పోయింది. వెంటనే ఆ కుర్రాడి పేరు, క్లాసును కనుక్కుని కుండ ఖరీదు చెల్లించమని ఆర్డరు జారీ చేశారు. ఆ పిల్లాడు ఏడుస్తూ తను పేద విద్యార్ధినని, డబ్బులు యిచ్చుకోలేనని గోల పెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి క్లాసుకి వెళ్ళి వున్న సంగతి పిల్లలందరికీ చెప్పి అందరూ తలో కాస్త వేసుకుని కుండ కొని యథాస్థానంలో పెట్టమని సలహా యిచ్చారు.

పిల్లలందరికీ కోపం వచ్చి,”మేమెందుకు చెల్లించాలి? ఎవరు పగలగొట్టారో వాళ్ళనే చెల్లించమనండి.”అంటూ వ్యతిరేకించారు.”సరే రేపటినుంచి డ్రమ్ములో నీళ్ళు తాగండి. ఈ మాత్రం సహకారం లేకుంటే జీవితంలో చాలా కష్ఠ పడవలసివస్తుంది…ఆలోచించుకోండి.”అని అన్నారు జోగినాథం మాష్టారు. అవి మాటలు కావు శిలా శాసనాలు!

యిలా క్లాసు టీచరుగా ఆ సంవత్సరంలో రోజూ తెలిసే విషయాలు యివన్నీ. అయితే స్కూలు చదువు పూర్తయేదాకా ఏదో ఒక సందర్భలో పిల్లలందరికీ అతనితో భేటీ అవుతూనే వుంటుంది. అన్ని సంవత్సరాలలో అనారోగ్యంతోగాని లేక వూరికి వెళ్ళో శలవు పెట్టడం చూడలేదు. అతన్ని ఎంత విమర్శించుకునీవాళ్ళమో కనిపించకుంటే అంత వెలితిగా భావించేవాళ్ళం.

సంవత్సరం పూర్తయి ఏన్యువల్ పరీక్షల ముందు చాలమంది టీచర్లు స్పెషల్ క్లాసులు పెట్టి కోర్సు పూర్తి చేసేవారు. కాని జోగినాధం మాస్టారు ఫిబ్రవరి మొదటి వారానికి కోర్సు పూరి చేసేసి రివిజన్ మొదలు పెట్టేవారు. మిగతా టీచర్లకి చాలా ఆశ్చర్యం – అతను కోర్సు అంత త్వరగా ఎలా పూర్తి చెయ్యగలరా అని. అతని క్లాసులో పిల్లలు కూడా మంచి పర్సెంటుతో పాసయ్యేవారు. ఒకరో యిద్దరో మాత్రమే పరీక్షల్లో తప్పేవారు. ఒక స్టూడెంటుగా అతనిని పైపైన చూసినప్పుడు కొంత శాతమే అర్ధమవుతారు.

అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో యింటికి వెళ్ళాను. ఒక్కసారి జోగినాధం మాస్టారిని కలవాలనిపించింది.

స్కూలుకి శలవలు ప్రారంభం కాలేదు. స్కూల్లోఅడుగు పెడుతూంటే ఒక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఇదే స్కూల్లో నా బాల్యం, పెద్ద చదువులకి పునాది ఏర్పడింది. దానికై దోహదం కల్పించిన మాస్టాలందరికీ జోహార్లర్పిస్తూ టీచర్స్ రూము ముందు నిలబడ్డాను అనుమతికోసం.

నీడకదలగానే,”ఎవర్రా?”గొంతు జోగినాధం మాస్టారిదే. “నేనే మాస్టారూ సతీష్ ని మీ స్టూడెంటుని.”

“ఓరి! నువ్వా? రా! రా! ఎలా వున్నావ్? ఎక్కడ చదువుతున్నావ్?”యింత ఆప్యాయంగా మాట్లాడటం మాస్టారి స్వభావమే కాదు ఎంతో విచిత్రమనిపించింది.

“కంగ్రాట్యులేషన్స్ మాస్టారూ! మీకు బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందని నా స్నేహితుడు రాశాడు.అది తెలిసి మిమ్మల్ని కలవకుండా వుండలేకపోయాను,” అన్నాను వినయంగా.

“నాకు అవార్డ్ రాకపోతే నన్ను కలియవురా? పోనీలే అలాగైనా నన్ను చూడాలనుకునే వాడు ఒకడున్నాడన్న సంతోషంకలిగింది. అన్నట్లు హెడ్మాస్టర్ గారు నా కోసమని చిన్న సన్మానం లాంటిది చేద్దామని టీచర్లని, పిల్లలని కూడపెడుతున్నారు. స్కూల్లో ఏ ఫంక్షనయినా ఏర్పాట్లన్నీ నేనే చూసే వాడిని, కాని యిది నాకు సంబంధించినది కావటంతో నేను కాస్త ఎడంగా వుండాల్సి వస్తోంది. నువ్వు ఓల్డ్ స్టూడెంటువి. నీ సహాయం తీసుకుంటారేమో ఒక్కసారి హెడ్మాస్టర్ గారిని కలుసుకో.” అంటూ పురమాయించారు.

మంచి సమయంలోనే వచ్చాననిపించిది. “మే ఐ కమిన్ సార్!” హెడ్మాస్టర్ గారు తల తిప్పి చూసి ఎవర్న్నట్లు నొసలెగరేశారు.

“నా పేరు సతీష్ సార్! లాస్టియర్ బేచ్ స్టూడెంట్ ని. యిప్పుడు తెనాలిలో ఇంటరు చదువుతున్నాను. జోగినాధం మాస్టారికి అవార్డ్ వచ్చిందని తెలిసి ఆయన్ని అభినందించుదామని వచ్చాను. మిమ్మల్ని కలవమన్నారు. మీరు మాస్టారికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారని మీకు సహాయపడమని చెప్పారు.”

“ఓ! రా కూర్చో.”

“ఫరవాలేదు సార్! యీ ఫంక్షన్ పనుల్లో నేనూ సహాయం చేస్తాను, యీ విధంగా మాస్టారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.”

“మన గోపాలం మాస్టారి వద్ద వివరాలన్నీ వున్నాయి, తెలుసుకుని నీకు చేతనైన సహాయం చెయ్యి. అవసరమైన డబ్బు అతని వద్దే వుంది సంకోచించకుండా తీసుకో. ఈ సందర్భం మన స్కూలుకే గర్వ కారణం.”

“అవును సార్!మరి నేను వస్తాను.”

రెండు రోజుల తరువాత శనివారం సాయంత్రం ఆరు గంటలకి సన్మానం. సింపుల్ గా హాలునలంకరించాం. పుష్ప గుచ్ఛాలు, పూలమాల ,ఒక శాలువ తెచ్చాం. పిల్లలు కొంతమంది,టీచర్లు సమావేశమయ్యాం.

ఆ రోజు కూడా ముతక ఖద్దరు దుస్తులు ధరించే వచ్చారు జోగినాధం మాస్టారు. తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టారు హెడ్మాస్టరుగారు. జోగినాధం మాస్టారి మెడలో పూలదండ వేసి, శాలువ కప్పి, చేతికి పుష్ప గుచ్ఛ మిచ్చారు.

“శ్రీ జోగినాధం మాస్టారు అత్యుత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం అందుకోవడం మన స్కూలుకే గర్వకారణం. నిగర్వి, నిరాడంబరుడూ, నిజాయితీపరుడు – ఇన్ని ‘ని’ లని తన స్వంతం చేసుకున్నయితను నిస్వార్ధపరుడు కూడా. టీచరంటే యిలాగే వుండాలనిపించేలా అర్ధం చెప్పారు మనందరికీ. ఈ సందర్భంగా యితన్ని సన్మానించడం మనని మనం సన్మానించుకున్నట్లే. యితని ప్రవర్తన బాహ్యంగా కనిపించినదానిక్ పూర్తిగా భిన్నం. మాట వంత కరుకో మనసు అంత వెన్న.

స్కూలు కార్యక్రమాలన్నింటిలోను సహాయపడుతూ ఏవి కొనాలన్నా ఎవరికీ అవకాశం యివ్వకపోతే, మొదట్లో డబ్బులు మిగుల్చుకునేందుకా అని అపోహ చెందాను. కాని అది ఎంత తప్పో తరువాత తెలిసి వచ్చింది. కొనేటప్పుడు చౌకగా, అమ్మేటప్పుడు లాభసాటిగా చేసి ఎంతో కొంత మొత్తం మిగిల్చి పేద విద్యార్ధులకు ధన సహాయం చేసేవారు. పాత పుస్తకాలకు బైండు చేయించి మరుసటి సంవత్సరంలో కొనుక్కోలేని విద్యార్ధులకు యిచ్చేవారు. మన స్కూల్లో అందమైన పూలతోట మాస్టారి అభిరుచే. మనం వృధా చేసే నీటిని వుపయోగించి పూలు పూసేలా చేయించారు. ఈ స్కూల్లో జోగినాధం మాస్టారు చాలా సంవత్సరాలనుంచి పని చేస్తున్నారు. నేను వచ్చిన ఆరు సంవత్సరాలలో ఆరు నెలలు అతనిని అపార్ధం చేసుకున్నాను. నెమ్మదిగా అతని ఆశయాలు ఆలోచనలు గ్రహించాక అతనికి అండగా నిలిచాను.

ఎవరేమనుకుంటారోనన్న జంకు లేదు. ప్రతివారు తన వెనుక విమర్శలు చేస్తున్నారని తెలిసినా లెక్క చేయక అతని ఆశయ సిధ్ధికై ముందడుగు వేస్తున్నారు. తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ కూర్చోక తన జీతంలో కొంత భాగం ఆదా చేస్తూ వచ్చారు. పేద విద్యార్ధులకై వినియోగించాలని అతని ఆశ. ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఆదా చేయగల నేర్పు జోగినాధం మాస్టారికే వుంది.

పై విషయాలన్నీ తెలిశాక జోగినాధం మాస్టారంటే ఏమిటో అందరికీ తెలిసిందనుకుంటాను.ఎవరికీ తెలియని విషయం మరొకటుంది. ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళి తన మరణానంతరం తన అవయవాలు యితరులకు వుపయోగించమని దాన పత్రం రాసి వచ్చారు.(కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగింది) యీ పురస్కారం దొరకటం జోగినాధం మాస్టారికే కాదు మనందరికీ కూడా గర్వకారణం.” అంటూ తన ప్రసంగం ముగించారు.

జోగినాధం మాస్టారు యోగిలా అంతా విన్నా చివరలో కనులు చెమర్చి పై కండువాతో తుడుచుకున్నారు. మిగతా టీచర్లు కూడా అంతకు ముందున్నా అభిప్రాయం మార్చుకుని జోగినాధం మాస్టారి సుగుణాలే నాలుగేసి చెప్పారు.

పిల్లల తరఫున నేను మాస్టారిపై వ్రాసుకొచ్చిన కవిత చదివాను.

“జోగినాధం మాస్టారంటే పిల్లలకి హడల్
ముతక ఖద్దరు దుస్తులు
ముక్కు మీదకు జారే కళ్ళజోడులోంచి నిశిత దృక్కులు
మాటేమో కరకు – పిల్లలకు అది వింటే వొణుకు
తప్పు చేసినందుకు లేదు బాధ
మాస్టారు చూసి కేకలేస్తారేమోనన్న వ్యధ
యివన్నీ మాస్టారి బాహ్య రూపం
తన మంచితనం కనిపించనీయక గోప్యం
మంచి గంధపు సువాసనని అరికట్టలేనట్లు
మాస్టారి ఆశయాలకు లేవు ఆనకట్టలు
పిల్లలు, వారి విద్యాభ్యాసమే వారి లోకం
స్కూలు పరిశుభ్రత వారి ప్రపంచం
మీ వద్ద నుండి దూరమైన తరువాతనే గ్రహించాం
మీ మాటల విలువ ప్రతి క్షణం
మీ వృత్తిలో వున్న అంకిత భావం
పొందింది అత్త్యుత్తమ వుపాధ్యాయ పురస్కారం
విన్న మేమంతా ధన్యులం
జోహారు జోగినాధం మాస్టారూ జోహారు”

ఓపికగా విని అంతా అభినందించారు. హెడ్మాస్టరుగారు లేచి యిప్పుడు జోగినాధం మాస్టారు మాట్లాడతారు. జోగినాధం మాస్టారు లేచి అందరికీ నమస్కరించారు.

“నేను చేతలవాడినే గాని మాటలవాడినికాను. నేను ఏదో చేశానని భావించటం లేదు. యింకా ఏమేం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. నా ప్రియ శిష్యుడు సతీష్ నాపై తమకున్న అభిప్రాయం, అభిమానం కవిత రూపంలో తెలియజేశాడు. చాలా బాగుంది. హెడ్మాస్టరుగారు, నా సహోద్యోగులు నాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. నా దగ్గర వున్నంత వరకు నాశిష్యులు నాపై ఏ అభిప్రాయంతో వున్నా, నాకు తెలుసు యీ స్కూలు వదిలి బయట ప్రపంచంలో అడుగిడితే నా మాటల ప్రభావం పరోక్షంగా పని చేస్తుంది. నాకు కావలసినది అదే! నా ముందు ముఖస్తుతి నాకొద్దు. యిక హెడ్మాస్టరుగారు చెప్పినట్లు నన్ను అపార్ధం చేసుకుందికే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు. ‘నీటిని తేరిస్తే గాని పరిశుభ్రత తెలియదు,అలాగే నా ఆలోచల్ని ఆశయాలని తేర్చిచూస్తే గాని అందులో విలువ తెలియదు ‘.

నేనూ పేద విద్యార్ధినే. నా విద్యాభ్యాసానికి ఒక దాత అజ్ఞాతంగా ధనసహాయం చేశారు. అందుకనే పేద విద్యార్ధులు ధనసహాయం లేక వంచింపబడకూదదు. అది నా ధృఢ సంకల్పం. నా సహోద్యోగులకు నా విన్నపం. నెలలో ఒక రూపాయి అయినా దాచండి. ఆ పొదుపు ఎవరికి మంచి జీవితాన్ని ప్రసాదించడానికి వుపయోగపడుతుందో. యికపోతే, పారితోషికలూ పొగడ్తలూ తాత్కాలికం మన ఆదర్శమే మనకి శాశ్వతం కావాలి! యింతకన్నా చెప్పడానికేమీ లేదు. యింత అభిమానంతో నాకు చేసిన యీ సన్మానానికి కృతజ్ఞుడిని.

యిన్ని సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికవటం మాటలు కాదు. జోగినాధం మాస్టారు చండశాసనుడే కాదు ఆల్ రౌండర్ కూడా. “హేట్సాఫ్ మాస్టారూ” అని మనసులోనే నివాళులర్పించాను. జీవితంలో కొంత భాగం వృత్తికై వినియోగించే వాళ్ళుంటే జీవితమే వృత్తిగా భావించేవాళ్ళు జోగినాధం మాస్టారిలాంటి వాళ్ళు.

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>