ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కొత్త ప్రేమికులు

Like-o-Meter
[Total: 0 Average: 0]

“ఆ రోజులే వేరు” మరోసారి అనుకోకుండా ఉండలేకపోయాడు ఆంజనేయులు. తన డిగ్రీ చదువు అయ్యేదాకా ప్రతిరోజుని బద్ధకంగా ఆస్వాదిస్తూ అహ్లాదంగా గడిపాడు. ఒకటికి పదిసార్లైనా అమ్మ పిలవనిదే నిద్ర లేచేవాడు కాడు. ముసుగు తీయకుండానే, దుప్పటికున్న చిరుగులోంచి ఉదయించే సూర్యుడి తొలివెలుగులు కళ్లతోనే స్పృశించేవాడు. జామ చెట్టు మీద కూనిరాగాలు తీస్తున్న కోయిలను కవ్విస్తూ, రాలిపడిన నందివర్ధనం పూలు లెఖ్ఖపెట్టేవాడు. నిద్ర లేవమని అమ్మ ఎన్నిసార్లు కేకలు వేసినా, ఫైనల్ వార్నింగు ఎప్పుడు వస్తుందో తెలుసు. జస్ట్ అప్పుడే బద్ధకంగా వొళ్లు విరుచుకుంటూ లేచేవాడు. నిద్ర లేవటం వరకే బద్ధకం. ఆ తర్వాత తూనీగలా పనులన్నీ చకచకా చేసేవాడు.

లేవగానే మొదటగా చేసే పని పళ్లు తోముకొని పాలు, పేపరు తీసుకురావటానికి బయటకు వెళ్లటం. అదే సమయానికి వెంకట్, శేషు కూడా వచ్చేవారు. ముగ్గురూ కలిసి పాలు తీసుకొని సాంబయ్య షాపు దగ్గర న్యూస్ పేపర్లన్నీ తిరగేసి, కావల్సిన పేపరు మాత్రం కొనేవారు. ఇంటికి రాగానే, అమ్మ పాలు కలిపి ఇచ్చే సమయానికి కొన్న పేపరు కూడా చదవటం ఐపోయేది. నెమ్మదిగా కాలకృత్యాలు తీర్చుకొని, పుస్తకాలు సర్దుకునే సరికి ఎనిమిదిన్నర అయ్యేది. ఇక మిగిలింది టిఫిన్ తిని సైకిల్ తీసుకొని కాలేజీ కి బయలుదేరటమే. దోవలో శేషుని ఎక్కించుకొని కాలేజికి సరిగ్గా టైముకు చేరేవాడు. 

కాలేజీలో రోజు ఎలా గడిచిపోయేదో తెలిసేదే కాదు. క్లాసులు, క్యాంటీన్, లైబ్రరీ, బ్యాడ్మింటన్…. ఇంటికి చేరేప్పటికి ఏడయ్యేది. రేపటి కోసం బావిలో నీళ్లు తోడి, తొట్టి, బక్కెట్లు నింపి, స్నానం చేసి, అందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినేసరికి తొమ్మిదయ్యేది. పుస్తకాలు చదువుతుంటే టైము తెలిసేది కాదు. పడుకోమని పదిసార్లు నాన్న అరిచేదాకా చదువుతూనే ఉండేవాడు. దుప్పటి చిరుగులో నుంచి ఊగుతున్న చెట్లని, చెట్ల నీడలని చూస్తూ నక్షత్రాలు లెఖ్ఖవేస్తూ తెలీకుండానే నిద్రలోకి జారుకునేవాడు. 

అందమైన ఉదయాలు, అద్భుతమైన సాయంత్రాలు, ఎగిరే పక్షులు, ఊగే కొమ్మలు, నడిచే మేఘాలు, పిలిచే వాన… ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తను పుట్టి పెరిగింది ఓ ఇంట్లో కాదు ప్రకృతిలో అనిపించేట్లుగా డిగ్రీ అయ్యేదాకా రోజులు గడిచాయి. 

నిద్ర లేచి దుప్పటి మడతలు పెడుతూ, బెడ్రూం నుంచి బాల్కనీలో ఉన్న పూల కుండీలు చూస్తూ, గతాన్ని నెమరు వేసుకున్నాడు ఆంజనేయులు. డిగ్రీ అవ్వగానే, అదృష్టం కలిసొచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగమే వచ్చింది. ఉద్యోగం చేస్తూనే, ఎం.బి.ఎ. కూడా చేసి మంచి పొజిషనుకు చేరి నెలరోజుల క్రితమే రిటైరయ్యాడు ఆంజనేయులు. ఉద్యోగంలో ఉన్నంత కాలం ఆఫీసు వెళ్లటానికి, తిరిగి రావటానికి ఒక టైమంటూ ఉండేది కాదు. రంజని భార్యగా రావటం మరో అదృష్టం. ఏనాడు, అది లేదు, ఇది లేదు అని సతాయించలేదు. అది కావాలి, ఇది కావాలని వేధించలేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోయేది. సమయానికి కావలసినవన్నీ సమకూర్చేది. ఇద్దరు పిల్లల్నీ బాధ్యతగా పెంచటమే కాకుండా పెళ్లిళ్లు కూడా అన్నీ తానై చేసింది. అలాంటి రంజని హఠాత్తుగా వదిలేసి ఎందుకు వెళ్లిందో అర్ధం కావట్లేదు. 

మూడు రోజుల క్రితం తమ మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.

 

 

“ఈ పనంతా చేసుకోలేకపోతున్నాను” అంది రంజని

“ఇప్పుడున్నది మనమిద్దరమేగా! ఏమంత పని ఉంది?” అడిగాడు ఆంజనేయులు.

“మీకేం! నిద్ర లేవటం, టీ తాగటం, మార్నింగ్ వాక్ వెళ్ళి రావటం, స్నానం చేసి అన్నం తినటం, పడుకోవటం, ఈవినింగ్ వాక్ చేసి రావటం, మళ్ళీ అన్నం తినటం, పడుకోవటమేగా? ఉన్నది ఇద్దరే అని పనిమనిషిని కూడా మానిపించారు. వంట వండాలి, గుడ్డలు ఉతకాలి, అంట్లు తోముకోవాలి, ఇల్లు చిమ్మి తుడుచుకోవాలి… ఇవన్నీ ఎక్కడ ఆగుతాయి?”

“అది కాదు రంజని, మొన్నటి దాకా ఆఫీసు పనుల హడావుడిలో జీవితంలో అలసిపోయా. అందుకే కొద్దిగా విశ్రాంతి అవసరం అనిపించింది”

“ఆ విశ్రాంతి నాకూ అవసరమే అని ఎందుకు అనిపించదు మీకు”

“ఇప్పుడు ఏమిటి నీ బాధ? పని మనిషి కావాలా! పెట్టుకో..”

“జీవితమంతా బాధ్యతలు, త్యాగాలతో గడిచిపోయింది, ఒక్క సరదా లేకుండా. రిటైరయ్యాక ఐనా, చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటే, మీరేమీ పట్టించుకోవట్లేదు…..”

“సరే, తలుపులేసుకో వాకింగ్ కి వెళ్లొస్తా”

ధడ్ అని మూసుకున్న తలుపుల వెనకాల, రంజనీ గుండె బ్రద్దలౌతున్నదని అప్పుడు గమనించలేదు తను. వాకింగ్ నుంచి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద తను కోమల్ వాళ్ల ఊరికి వెళుతున్నట్లు ఓ చీటి రాసి పెట్టింది. అవసరమైతే మొబైల్ మీద కాల్ చేయమని కూడా చెప్పింది. 

రంజని వెళ్లిన తర్వాత నుంచి కొత్త రొటీన్ కు అలవాటు పడుతున్నాడు ఆంజనేయులు. అలారం పెట్టుకొని నిద్ర లేవటం, టీ కెటిల్ ఆన్ చేసి, పళ్లు తోముకోవటం. ఈ లోపు తయారైన టీ కప్పులో పోసుకొని బాల్కనీలో పూలకుండీల పక్కనే కుర్చీలో కూర్చొని తాగటం. బాల్కనీలో పేపర్ వాడు వేసిన న్యూస్ పేపర్ చదువుకుంటూ, బోరు కొట్టేదాకా ఆలోచిస్తూ అక్కడే ఉండి, తర్వాత స్నానం చేసి, అన్నం వండుకోవటం, తిని కాసేపు పడుకొని మళ్లీ సాయంత్రం నిద్ర లేవటం, గుడ్డలు ఉతుక్కొని, కాసేపు ఈవినింగ్ వాక్ కు వెళ్లి రావటం, కాసేపు టీవీ చూసి, మిగిలిన అన్నం తిని పడుకోవటం. జీవితం ఎంత నిస్సారంగా ఉందో తెలిసొస్తున్నది. కాలేజీ చదువుల తర్వాత కోల్పోయిన జీవితాన్ని రిటైరయ్యాక వెదుక్కుందామంటే కుదరటంలేదు, రంజని లేకపోవటంతో!

కాల్ చేద్దామా వద్దా అని రెండు రోజుల్నుంచి ఆలోచిస్తున్నాడు. లేదంటే, కోమల్ వాళ్లింటికి చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే? రంజని అక్కడికే వెళ్లి ఉంటుందా?తనంతతాను ఏనాడు గడప దాటి ఎరగదే! తానొక్కటే అంత దూరం వెళ్లి ఉంటుందా? అబద్ధం చెప్పిందేమో? రంజని అబద్ధం చెప్పదే! లేక కోమల్ పేరు చెప్పి ఏమైనా అఘాయిత్యానికి…. ఇంకా ఆలోచించలేకపోయాడు. వెంటనే బట్టలు వేసుకొని బయలుదేరాడు. తలుపు తీస్తూనే, కాలింగ్ బెల్ కొట్టబోతు కనిపించింది కోమల్. ఆ పక్కనే రంజని. 

“బావగారు చాలా థాంక్స్…” అంటూ లోపలికి దూసుకొచ్చింది కోమల్. రంజనికి ఉన్న ఒక్కగానొక్క చెల్లెలు.

“థ్యాంక్స్ దేనికి? ఏంటి ఇంత హఠాత్తుగా…” అయోమయంగా అడుగుతున్నాడు ఆంజనేయులు.

“అక్కని పంపారుగా, అందుకనే థ్యాంక్స్” అంటూ చేతికి అరిసెలు అందించింది కోమల్, “అక్క చేసినవే” తినండి అంటూ..

తనని నేను పంపటం ఏమిటి, వాళ్లింట్లో తను అరిసెలు చేయటం ఏమిటి… అర్ధం కాక ఆశ్చర్యపోతున్నాడు ఆంజనేయులు.

“మా కొత్తకోడలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. నేను వ్రతం చేసుకున్నప్పుడేనాడు అక్క రాలేదు, మిమ్మల్ని ఒదిలిరాలేక” కన్ను గీటుతూ అంది కోమల్. “అందుకే, ఆరు నూరైనా సరే రావల్సిందే అని మొన్న వచ్చి పిలిచివెళ్లాం. మీరేమో ఈవినింగ్ వాక్ వెళ్లారట… గంట సేపు ఆగి ఇక మీరు రాకపోతే వెళ్లిపోయాం” తిరిగి వెళ్లిపోటానికి తయారౌతూ అంది కోమల్. 

* * * * * *

అమ్మ పిలుపులు, అలారం అరుపులు లేకుండా మొట్టమొదటిసారి పొద్దున్నే నిద్ర లేచాడు ఆంజనేయులు. చేతిలో టీ కప్పులు సైడ్ టేబుల్ మీద పెట్టి, రంజని మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకొని, తుమ్మెదలా గుసగుసలాడుతూ నిద్ర లేపుతున్నాడు. నిద్ర నటిస్తూ రంజని పక్కకి తిరిగి దుప్పటి లాక్కొంది మొహంపైకి. 

* * * * * *

కొత్తగా పరిచయమైన పాత ప్రేమికుల్లా, పార్కులో మార్నింగ్ వాక్ చేస్తూ ఆంజనేయులు, రంజని…