Like-o-Meter
[Total: 1 Average: 4]
“అరుగులన్నిటి లోన ఏ అరుగు మేలు – పండితులు కూర్చోండు మా అరుగు మేలు.”
“అమ్మా అరుగులు అంటే ఏమిటే?” – ఒక్కగానొక్క కూతురు లక్ష్మి అడిగింది అపర్ణని.
అపర్ణ ఈ మధ్య నే గ్రీన్ కార్డ్ పొంది అమెరికా పౌరురాలుగా మారింది. ఆమె భర్త, అత్త మామలు చాల కాలంగా అక్కడే ఉంటున్నారు .
దురదృష్టవశాత్తు అపర్ణ అత్తగారికి అమలా పురం లో ఉన్న వారి బంధువులతో తెగతెంపులు అయిపోయాయి. అపర్ణ భర్త కామేశం. కామేశం ఒకే ఒక్క కొడుకు వాళ్ళ తల్లి తండ్రులకు. కామేశం నాన్నకూడా ఒకే ఒక్క కొడుకు. అపర్ణ చాల పెద్ద కుటుంబంలోంచి వచ్చింది. చిన్నాన్నలు, పెదనాన్న, అత్తయ్యలు ఉన్నారు.
అపర్ణది తణుకు దగ్గర ఒక అగ్రహారం. “ఎంతో మంచి ఊరు మాది” అనే అపర్ణ ఎప్పుడూ అనుకుంటుంది. కామేశం అమ్మ నాన్నలు చాల పట్టింపులు ఉన్న మనుషులు. అందువల్ల వాళ్ళు వారి వియ్యంకులతో కూడా అంతంత మాత్రంగానే ఉంటారు. అందువల్ల అపర్ణకు అమెరికాయే స్వదేశం. దానికి తోడు అపర్ణకు మరలా గర్భం రావడం కుదరదని చెప్పడం తో ఆమె తన అత్త మామల నుంచి తరచూ వంశం నిలపలేని కోడలుగా సూటి పోటీ మాటలు వింటూనే ఉంటుంది. ఈ సమస్యలన్నీ అపర్ణ తనకు పుట్టిన లక్ష్మి తో ఆడుకొంటూ తనకు చదువు చెబుతూ తెలుగు నేర్పుతూ మరచిపోతుంది. కామేశం మంచి వాడే కాని అమ్మ నాన్నలకు తెగ భయపడి పోతాడు.
లక్ష్మి వేసిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో ఆ పదేళ్ళ పాప అపర్ణ ఒక్క సారి భుజం పై చెయ్యి వేసి ఊపింది. ఆ కదలికకు అపర్ణ ఒక్కసారిగా తన చేతిలోని ఫోనుని పక్కన పెట్టి లక్ష్మి వైపు చూసింది. కామేశం ఫోన్ చేయడం తో అపర్ణ లక్ష్మి ప్రశ్నను వినీ సమాధానం చెప్పలేదు.
“ఓకే రా కన్నా! నువ్వు అడిగింది విన్నాను అరుగు అంటే ఏమిటి అని కదా సరే విను చెప్తాను.” అని సర్దుకొని కూర్చుంది.
“అరుగు అంటే మా ఊళ్ళో మా ఇంటికి ముందు అంటే లోనికి రావడానికి ముందు… ఊహూ నీకు గూగుల్ లో సెర్చ్ చేసి చూపుతా” అని సాంప్రదాయ ఆంధ్రా ఇళ్ళు అని వెతికితే చక్కని చిత్రాలు క్షణంలో తన ఐపాడ్ స్క్రీన్ పైకి వచ్చాయి. అందులో అరుగులు ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. వాటిని చూపింది లక్ష్మి కి. అంతలో ఏదో స్ఫురణకు వచ్చి, తన ఇంటి ఫోటోలు స్కాన్ చేసి ఉంచినవి తన ఐపాడ్ లో దాచుకున్నవి కూడా చూపింది.
ఆ ఫోటోలు చూపిస్తూ “ఇది మా అరుగు. ఈ అరుగు పై ఒక పెద్దాయన భాగవతం చెప్పేవారు. ప్రతి సాయంత్రం మా వీధిలో ఉన్న పెద్దలందరూ వచ్చి వినేవారు. ఆయన చాల బాగా చెబుతుంటే గోపాల స్వామి గుడి పూజారి గారు ప్రవచన మండపం లో మీరు ప్రవచనం చేయండి అని చెబితే ఆయన అక్కడికి వెళ్లి చెప్పేవారు ఎంత బాగా చెప్పే వారో!” అని ఒక్క సారిగా వాళ్ళ ఊరిలోకి వెళ్లి పోయాయి అపర్ణ ఆలోచనలు.
“ఒకసారి ఏమైనదో తెలుసా?”
అపర్ణ చిన్న పిల్లల మారిపోయింది ఈ సమయంలో. సర్దుకొని కూర్చొని నడుము నిటారుగా ఉంచి కళ్ళు పెద్దగా చేసి ఆనందం తన ముఖం లో పెల్లుబుకుతుంటే చెప్పుకుపోతోంది…“ఒకరోజు ఉదయాన్నే లేవగానే నేను మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అప్పటికి పళ్ళు కూడా తోముకోలేదు. ఎందుకంటే మా అక్క నన్ను పొద్దున్నే వస్తే తను కొబ్బరి ఆకుతో చేసిన చేసిన బూర బొమ్మ చూపిస్తాను అంది. నేను రాత్రి అదే విషయం గుర్తుపెట్టుకొని పడుకున్నాను. అందుకే లేవగానే మా అక్క ఇంటికి వెళ్లాను. అప్పటికి మా అక్క నిద్ర లేవలేదు! సరే అని వెనక్కి వస్తుంటే మా పెద్దమ్మ “కన్నాడు పొద్దున్నే వచ్చాదేంటీ అని నన్ను దగ్గరకు తీసుకొని ” ఏరా ఇంకా మొఖం కడుక్కోలేదా అని నన్ను పెరటి లోని నూతి దగ్గరకు ఎత్తుకొని తీసుకెళ్ళి, నీటిలో నీళ్ళు తోడి తను అక్కడే ఒక పక్కన ఉన్న పళ్ళ పొడి తీసుకొని నా పళ్ళు తనే తోమింది. అలా నా మొఖం కడిగి తన చెంగుతో తుడిచి లోనికి తీసుకెళ్ళి తిలకం బొట్టు పెట్టి నా తల దువ్వి మా అక్కదగ్గరకు తీసుకొని వెళ్ళింది. అప్పుడు అరుగు మీద మా పెదనాన్న మాటలు వినపడ్డాయి. ఆయన చాల మంచి మనిషి. ఊరిలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తీ. ఆయన ఒక అబ్బాయితో మాట్లాడుతున్నారు. ఆ మాటలు నాకు ఇప్పటికీ చాల గుర్తు అవి గుర్తు వచ్చినప్పుడు నేను ఏదో తెలియని అనుభూతిని పొందుతాను.”
“నీకు మా ఊర్లో రోజు ఎలా ప్రారంభం ఔతుందో ఎలా ముగుస్తుందో చెబితే నీకు అర్ధం ఔతుంది ఇక్కడ జీవన సౌందర్యం. మా ఊరికి నట్ట నడుమన ఉంది గోపాల స్వామి దేవాలయం. ఉదయం చక్కని కృష్ణ గీతాలతో లేదా ప్రవచనాలతో గుడి పైన ఉండే లౌడ్ స్పీకర్ మనసులు హత్తుకొనే లా పలుకుతుంటే అవి విని విని వాటితో పాటు గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు ఆఖరికి స్కూలు పిల్లలు సైతం పాడుతూ పనులు ప్రారంభిస్తారు.
మా గురువు గారు చెప్పినట్లు సంగీతమయం జగత్తు. అదే మమ్మల్ని నిద్ర లేపుతుంది.
మా పూజారి గారు ఒక అద్బుతమైన వ్యక్తి. ఆ ప్రాతః కాలం లో రైతులు పాలు పితకడానికి వెళ్తారు, కొందరు పాలు తీసుకొని వస్తారు, వీధుల్లో అమ్మలక్కలు గుమ్మం ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఒక ఇంటిలోనుంచి ధూపం వాసన వస్తుంది మా బ్రాహ్మణ వీధిలో నుంచి సుగంధ వాసనలు వస్తాయి. కొందరు పువ్వులు కోసి మాల కట్టి గుడికి తీసుకొని వస్తారు. పెద్దలు వీధి అరుగులపై కి వచ్చి ప్రభాత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడే కూర్చుంటారు. కూరగాయలు, పళ్ళు అమ్ముకొనే వాళ్ళు వీధుల్లోకి అరుస్తూ వస్తుంటారు.
ఉదయాన్నే గుడికి తూర్పువైపున ఉన్న అనసూయమ్మ గారి హోటల్ నుంచి ఊకపొయ్య పొగ గొట్టం లోంచి పొగ బయటకు వస్తుంది. కోళ్ళు గూళ్ళ నుండి వెలువడి కొంత సేపు స్వేచ్చా విహారం చేస్తాయి. బాతులను పెంచుకొనే వాళ్ళు వాటిని తోలుకొంటూ పంట కాలువ వైపు వెళ్తుంటారు. పాల కేంద్రంలో పాలు సేకరించడం ఉదయం ఆరు నుంచి మొదలై ఏడున్నరకు ముగుస్తుంది. మేకలు గొర్రెలు మందలుగా మా ఊరికి ఆనుకొని ఉన్న గరువు ప్రాంతాలకు కాపరుల పర్యవేక్షణలో సాగిపోతాయి. ఎనిమిది గంటలకు సరిగ్గా మా ఊరి బడి గంట మోగుతుంది. ఎవరి పనులలో వారి అలా నిమగ్నమై ఉంటారు.
నాకు వ్యక్తిగతం గా బాగా నచ్చిన విషయం ఏమంటే ఇడ్లీల సుబ్బమ్మ పరిశుభ్రత, ఆహ్లాదం కలిగించె మాట తీరు. చక్కగా కడిగిన తామర ఆకుల లో వేడి వేడి ఇడ్లీ చక్కటి పచ్చడి మా ఊరిలో అందరికీ ఇష్టం ఆమె కేవలం ఒక 100 ఇడ్లీ లు మాత్రమే అమ్ముతాది రోజుకి తన జీవనోపాధి కోసం. చిన్న బండి పై తోసుకుంటూ వస్తాది ఉదయాన్నే. నేను నా కుటుంబ సభ్యలు ఆమెకు తరచుగా వినియోగదారులం. ఆమె చాల అభిమానస్తురాలు ఆమె ఒక్క గానొక్క కొడుకు పెళ్లి కాక మునుపే చనిపోయాడు ఆమె భర్త ఆ పై కాలం చేసాడు. ఒక చిన్న చక్కని ఇల్లు మా ఊరి మధ్యలో ఉంది ఆమెకు అదే ఆమెకున్న ఆస్తి. ప్రతి వారి మోములోనూ ఒక తపన తప్ప ఎలాంటి ఆందోళన ఉండదు.
ఎనిమిది గంటలకు మా ఊరి పెద్దలందరూ కచేరీ చావడి దగ్గరకు వస్తారు అక్కడ ఆరోజు వచ్చిన వార్తా పత్రికలూ, ఒకరు చదువుతుంటే మిగిలిన వారు వింటారు. చదివిన వార్త పై చర్చ జరుగు తుంది. ఒక్కో సారి ఈ చర్చ చాల సుదీర్ఘం గా ఉంటుంది. అక్కడకు ఒక్కో సారి కుర్రాళ్ళు మధ్య వయస్కులు కూడా వస్తారు. సెలవు రోజుల్లో మా స్కూల్ మాస్టర్లు కూడా వస్తారు. భలే విజ్ఞానదాయకం గా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు చాల సంతోషం గా వంట వార్పూ కార్యక్రమం కొనసాగిస్తారు. చాల ప్రయోగాలు చేస్తారు కూరలు వండడంలో. ఒక్కో సారి సమిష్టి వంట కూడా జరుగుతుంది. సరిగ్గా ఎనిమిది గంటలు దాటిన తరువాత బిక్షువులు వస్తారు ఇంటిలోని ఆడ వాళ్ళు వాళ్లకు బియ్యమో, అన్నమో, మిగిలిన పదార్ధమో ఇస్తారు. ఇలా ఉదయం గడచి పోతుంది.
ఇహ మధ్యాహ్నానికి అందరూ ఇళ్ళకు చేరతారు. మంచి భోజనం ప్రతి ఇంటిలోనూ దొరుకుతుంది ఆ సమయంలో. సుమారుగా ఒంటి గంట లోపే భోజనాలు ముగిసి పోతాయి. ఒకరకమైన స్తబ్దత తో మా ఊరు ఉంటుంది. రైతులందరూ భోజనాలయ్యాక ఒక కునుకు తీస్తారు. మూడు గంటలు అవగానే
తేనీరో, మితంగా ఏదైనా పదార్ధమో తీపి కారం తిని మరల పొలాలకు బయలు దేరతారు.
సాయంత్రం నాలుగు నాలుగున్నరకే సాయత్రం పనులు మొదలౌతాయి. కల్లాపి చల్లడం ముగ్గులు వేయడం అంట్లు తోముకోవడం, ఒక పక్క జరుగు తుంటే, పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చి ఆదరాబాదరాగా అమ్మ పెట్టిన స్వీట్లు, కారపు పదార్ధాలు తిని కొన్ని జేబుల్లో నింపుకొని గుడి ముందు లేదా గుడి వెనుక ఉన్న స్థలానికి వెళ్లి రక రకాల ఆటలు అల్లర్లు చేస్తారు. పితికిన పాలను మరలా సహకార పాల కేంద్రానికి పోస్తారు పొలాల నుంచి కూరలు, పళ్ళు కూడా వచ్చేస్తాయి ఆ రాత్రి వంటకు లేదా తెల్లారి వంటకు. చీకటి ఇహ కమ్ముకొంటుంది అనే సమయానికి రైతులు అందరూ ఇళ్ళు చేరు కుంటారు. రాగానే స్నానాదులు ముగించుకొని బయట అరుగుల మీదకు వస్తారు. శీతాకాలం లో నైతే ఈ దృశ్యం చూడ దానికి చాల బాగుంటుంది. పొగ మంచు గ్రామం అంతా కప్పేస్తుంది. ఉదయం సూర్యుడు వచ్చే వరకూ ఇది వీడదు. సరే అలా అరుగులు చేరిన రైతులు పంటల గురించి పనుల గురించి చర్చిస్తారు. అలా కొంత సేపు సేద తీరి రాత్రి భోజనం ఏడు గంటలకే చేస్తాం మేము.
ప్రతి శీతాకాలం నుంచి మళ్ళీ వర్షాలు పడే వరకూ మా గుడి బయట ఉన్న ఖాళి స్థలం లో గొప్ప పండితులు భారత, భాగవత, రామాయణ ఇత్యాది పురాణ ఇతి హాసాలపై చక్కని ప్రవచనాలు చేస్తారు. ఆ ప్రవచనాలకు ఇళ్ళకు తాళాలు వేసి మరీ అందరూ వెళతారు అక్కడ జరిగే ప్రవచనం వింటూ మా గ్రామ ప్రజలు ఒక పులకిన్తకు గురిఔతారు. రాత్రి భోజనం అయ్యాక అందరూ ఈ ప్రవచనాలకు వస్తారు. ప్రవచనం అయ్యాక ప్రసాద వితరణ ఉంటుంది అది ఎనిమిది ఎనిమిదిన్నరకల్లా ముగుస్తుంది.
ఇక శ్రీరామ నవమికి సీతారాముల కల్యాణం, అట్ల తద్దె కు ప్రతి ఇంతో వేసే అట్లు, చెరుకు పానకం రుచులు, కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం, గణపతి, దేవి నవరాత్రులు అప్పుడు జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హరి కథలు, పౌరాణిక నాటకాలు, సంగీత విభావరులు, పోటీలు, భక్తి సినిమాలు, దసరా సెలవుల్లో పిల్లల ఆటలు, కార్తీక మాసం లో రోజూ జరిగే పూజలు, జ్వాల తోరణం, దీపావళి సంబరాలు ఆ పై సుబ్రహ్మణ్య షష్టి కి జరిగే సంత సందడి, రంగుల రాట్నాలు, అబ్బో ఒకో సందర్భాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు అలా ఉంటాయి. మనం కూర్చున్న ఈ అరుగు ఉందే ఇది ఒక గొప్ప అదృష్ట శాలి ఇక్కడ జరిగిన చర్చల వల్ల ఎన్నో జీవితాలు ఉద్ధరింప బడ్డాయి” అని మా పెదనాన్న చెబుతుంటే నాకు నిజమే అనిపించింది.
“అంటే మీ అరుగు అందరి అరుగుల కంటే గొప్ప అన్న మాట!” అని లక్ష్మి ఒక్క సారిగే అనే సరికి అపర్ణ మరలా వర్తమానం లోకి వచ్చింది.
“నిజమే రా! మా పెదనాన్న గారి అరుగే గొప్పది. ఆయన ఎన్నోశుభకార్యాలు దగ్గరుండి జరిపించారు. అలాగే ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఆయన మా ఊరికి మర్యాద రామన్న.”
“మరి అంత మంచి ఊరిని వదలి ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని ఆ లేత హృదయం తో లక్ష్మి అడగిన ఆ పెద్ద ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.
లక్ష్మి కి బువ్వ పెట్టేసి నేను కొంచం తిని పక్క చేరే సరికి కామేశం వచ్చాడు రాగానే “అపర్ణా నాకు కొంచం బడలికగా ఉంది మధ్యాహ్నం భోజనం కూడా ఎక్కువైంది. నాకేమి వద్దు స్నానం చేసి పడుకుంటాను అని చెప్పి బాత్ రూం వైపుకు వెళ్తూ “హాయ్ కన్నలూ” అని లక్ష్మిని పలుకరించాడు.
కొంత సేపటికి లక్ష్మి పడుకుంది. కామేశం కూడా గాఢ నిద్ర లోకి జారుకున్నాడు తను మాత్రం తన గ్రామాన్నే తలచుకొంటూ నిద్రకు వెలియై తానోంటరియై అల్లానే సోఫా లో కూర్చోండి పోయింది.
అంతలో ఫోన్ మ్రోగింది. అపర్ణ ఎత్తగానే కంగారు గా ఒక కంఠం: అమ్మ మీ అత్త మామలు రోడ్ ఆక్సిడెంట్ లో మరణించారు మీరు వెంటనే బయలు దేరి రావాలి అని పలికింది. ఇతర వివరాలన్నీ హాలు లోకి వెళ్లి అడిగింది. ఆదమరచి నిద్ర పోతున్న తన భర్తని తన గారాల పట్టి యైన తన కూతుర్ని చూసి ఈ విషయం ఎలా చెప్పాలా అని సందిగ్ధంలో పడింది.
అదే ప్రాంతంలో ఉన్న తన స్నేహితురాలు భావన వాళ్ళ నాన్న గారితో ఉన్న పరిచయం తో ఆయనకు ఫోను చేసి విషయం చెప్పింది ఆయన వెంటనే ఇంటికి వచ్చి బెల్ కొట్టగానే కామేశానికి మెలకువ వచ్చింది . తనే వెళ్లి తలుపు తీసి ఆయనను లోనికి రమ్మని చెప్పాడు. ఆయన చాల శాంత వదనం తో జరిగిన విషయాన్ని కామేశానికి చెప్పాడు. కామేశం తన భార్య అపర్ణ తెలివికి మెచ్చుకోలుగా ఆమె చేతిని తాకి. చేయవలసిన పనిలో మునిగి పోయాడు.
అంతా ముగించుకొని అమెరికాకు ప్రయాణం అవుదామనుకున్న సందర్భంలో కామేశం అపర్ణను పిలిచి “అపర్ణా! మనం ఇక ఇండియాకు వచ్చేద్దాం. నేను సంపాదించినది మన కుటుంబానికి మన పిల్లకు ఏ బాదర బందీ లేకుండా చేయగలదు. నేను ఇక్కడ ఏ చిన్న ఉద్యోగమైన నాకు నచ్చితే చేయవచ్చు లేదు నాకు తోచిన పని చేసుకోవచ్చు. మనం మీ ఊరికి వెళ్లి అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉందాం ఏమంటావ్?” అని అడిగేసరికి అపర్ణ నిశ్చేష్టురాలయింది.
ఆమె స్థితి గమనించి కామేశం “అపర్ణా, నాకు తెలుసు నేను నీకు ఎంత బాధను కలిగించానో. కేవలం మా తల్లి తండ్రుల కు ఏమాత్రమూ వ్యతిరేకంగా ఉండకూడదనే ఒక నియమానికి కట్టు బడి అలా ప్రవర్తించాను కాని నీ పై ప్రేమ లేక కాదు. నువ్వు ఆ రోజు రాత్రి లక్ష్మి కి చెప్పిన మాటలన్నీ నేను ఆన్ లో ఉన్న నీ సెల్ ఫోన్ ద్వారా విన్నాను. అంత చక్కగా ముద్దుగా నువ్వు చెబుతుంటే నాకు చాల దిగులు కలిగింది నిన్ను ఎంత బాధ పెడుతోన్ననో అని. కాలం లో వచ్చిన ప్రతీదీ పోవలసిందే నా తల్లి తండ్రులు కూడా. అందుకే వారితో పాటు మన గత అనుభవాలు వెళ్లి పోయాయి అని అనుకో. వాళ్ళతో ఉన్న ప్రతి మంచి అనుభూతిని మాత్రమే తీసుకో. నాకు తెలుసు నిన్ను ఒక దాసీ గా చూసారు తప్ప ఎప్పుడూ ప్రేమగా నిన్ను చూడలేదు పైగా నీకు ఇక పిల్లలు పుట్టారు అని ఇక మా నాన్న వంశం పెరగ దాని తెలిసీ నిన్ను ఇంకా సూటి మాటలతో బాధించారు. వాళ్ళు నన్ను ఇంకో వివాహం చేసుకో మని ఎంతగా ఒప్పించారో నీకు తెలియదు . అప్పుడు నేను ఒక పెద్ద అబద్ధమాడి అసలు నాకే పిల్లలు పుట్టారు అనే విషయాన్ని వాళ్లకు చెప్పను. నేను గతంలో పనిచేసిన అణు కేద్రం యొక్క కారణంగా నాకు ఇక పిల్లలు కలగారు అని కొన్ని దొంగ పత్రాలు కూడా చూపి సర్ది చెప్పి పైగా ఈ విషయం గోప్యం గా ఉంచాలి లేదంటే నువ్వు నన్ను చులకన చేస్తావని కూడా చెప్పాను. అది అసలు విషయం.ఇవిగో నా లాప్ టాప్ లో చూడు” ఈ దొంగ సర్టిఫికట్లును చూపాడు.
అపర్ణ అచేతనం గా ఉండిపోయింది కామేశం వైపు తదేకంగా చూస్తూ. ఒక్క సారిగా తేరుకొని ఆతని గుండెలపై వాలిపోయింది.
——-