ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నిద్ర పట్టిన రాత్రి

Like-o-Meter
[Total: 1 Average: 3]

నిద్ర పట్టిన రాత్రి – తెలుగు కథ

రాత్రంతా అమ్మ దగ్గుతూనే ఉంది.

చాల రకాలుగా ప్రయత్నం చేసాం. కషాయం కాసి ఇచ్చింది నా భార్య.

సమయం 3.00 కావస్తుంది.

మా పెద్ద అమ్మాయికీ నిద్ర లేదు. నాన్నగారు కూడా నిద్ర లేచి హాల్లో సోఫాలో కూర్చొని ఎలా ఈ దగ్గు తగ్గుతుందా అని ఆలోచిస్తున్నారు.

ఏదో ఒక రీతిని అమ్మని నిద్రపుచ్చాలి అనే తపన.

నా భార్య అంది “రాత్రి ఇచ్చిన మందు తగ్గలేదని ఆ ప్రసూన డాక్టర్ గారిని అడగండి ఫరవాలేదు” అని సలహాను ఇచ్చింది.

వెంటనే ఆమెకు ఫోన్ చేస్తే కొద్దిసేపటికి ఆమె పలికారు. “సరే మీరు నే చెప్పే ఇంగ్లీషు కాఫ్ సిరప్ కొని పట్టించండి ఉదయాన్నే చూద్దాం” అని చెప్పింది.

వెంటనే ఇంటికి ఎదురుగా ఉండే అపోలో ఫార్మసీ వారి 24 గం.ల షాప్ గుర్తొచ్చింది. వెంటనే వెళ్లి మందు తీసుకొని వచ్చి అమ్మకు ఇచ్చాను ఇచ్చిన 10 ని.లలో అమ్మ గాఢ నిద్రలోకి జారుకొంది.

నాన్నగారి లో మళ్ళీ కలవరం.

తనలో తానే మాట్లాడుకొంటున్నట్టు బయటకు అంటున్నారు – “ఏమిటీ? ఇంత గాఢ నిద్ర పోతుంది?” అని.

నేను మంచినీళ్ళకని హాల్ లోకి వస్తే ఈ మాటలు వినిపించాయి. “ఏమీ కంగారు పడకండి చక్కగా పడుకోండి దగ్గి దగ్గి చాల అలసిపోయింది. ఈ మందులో కొంచం నిద్రపుచ్చే గుణం కూడా ఉంటుంది.” అని చెప్పి నేనూ నిద్రకు ఉపక్రమించాను.

మొత్తం మీద రాత్రంతా అందరం కలత నిద్రే పొందాము.

*****

పొద్దున్నే మా ఫేమిలీ డాక్టరు ఫోన్ చేసి వివరాలు అడిగారు.

కొంత ఊరట కలిగింది అమ్మకు.

****

ఉదయాన్నే మళ్ళీ షరా మామూలే అన్నట్లు జీవనయానం మొదలు.

మా కాలనీ దాటి మెయిన్ రోడ్ మీదకు నేను నా పెద్దమ్మాయి వచ్చామో లేదో భయంకరమైన రద్దీ ఆహ్వానం పలికింది. ఈసురోమంటూ ఉన్న పెట్రోలుని కాల్చుకొంటూ నత్త నడక లా సాగిపోతుంది మా కారు.

Y జంక్షను వద్ద సుమారుగా 20 ఏళ్ల  క్రితమే కట్టవలసిన ఫ్లై ఓవర్ ఇప్పుడు ఇక మెట్రో వస్తుంది కదా అని కనీసం మాటల్లో కూడా లేకుండా  పోయింది. మెట్రో పుణ్యమా అని నగర పాలక సంస్థ యొక్క అసమర్ధత చాల వరకు సమర్ధన చాటున దాక్కుంది కాని అది రోజూ ప్రయాణించే వారి శాపనార్ధాల కు గురిఔతోనె ఉంది. 

రోడ్ల వెడల్పు పెరగలేదు కాని ట్రాఫిక్ పెరిగిపోయింది. నేతల మనసులు సంకుచితమైపోయాయి. ఎన్నో కీలక నాల్గు రోడ్ల కూడళ్ళ వద్ద ఎప్పుడో కట్టవలసిన ఫ్లైఓవర్ కట్టక పోవడం వల్ల ఇప్పటికీ కొన్ని లక్షల లీటర్ల ఇంధనం  వెలకట్టలేని కాలం వృధా అవుతూనే ఉంది. 

నాకనిపిస్తుంది రాజకీయ నాయకులకు మన ప్రభుత్వ అధికారులకు కేవలం వారి పదవీ కాలం తక్క ఇతర కాలం లెక్కలోకి రాదు అని.  అలాగే మెట్రో కట్టుబడి పేరిట నగర ప్రజలకు భూతల నరకం చూపిస్తున్నారు.

ఈ ఆలోచనలతో చాల జాగ్రత్తగా ఈ ట్రాఫ్ఫిక్ పద్మవ్యూహంలో వెళుతుంటే వెనుక నుంచి ఒక బైక్ తో ఒక మధ్య వయస్కుడు వచ్చి నా కారు టైల్ లాంప్ పగులకొట్టి బంపర్ కి చొట్ట పెట్టాడు. వెంటనే దిగి చూసే లోపు తుర్రుమని దూసుకొని వెళిపోయాడు.

వెనుక నుంచి హారన్ల మోత తొందరపెడుతుంటే మళ్ళీ  కొనసాగింది మా ప్రయాణం. రోజూ రాను పోను మొత్తం 40 కిలో మీటర్లు ప్రయాణం జీవితం పై విరక్తిని వైరాగ్యాన్ని కల్పించడానికి  మాత్రం ఎంతో చక్కగా దోహద పడుతుంది. 

చిత్రం ఏమంటే దూరం తక్కువే కాని మధ్యలో పద్మవ్యూహాలు కోకొల్లలు.

మొత్తం మీద మా పెద్దమ్మాయి ఆఫీసు చేరి తనను అక్కడ దింపి మరో 10 కి.మీ ప్రయాణానికి సిద్ధమయ్యాను. కొంచం ముందుకు పోగానే  ఒక పెద్ద గుంత కనిపించింది రాత్రి తవ్వినట్లు ఉన్నారు. అక్కడ ఏవిధమైన సూచన గాని  బారికెడు గాని లేదు. చూస్తుండగానే ఒక యువకుడు వేగంగా బైక్ లో వచ్చి  ఆ గుంతలో పడి పోయాడు. అతని బైక్ వేగానికి రోడ్ పైకే ఎక్కి మధ్యలో పడి ఆగిపోయింది.  

ఒక్క నిముషం లో ట్రాఫిక్ జామ్.

అక్కడ పోలీసు ఉండడు.కారు ఆపేసి చోద్యం చూడడమే నాపని.  కుర్రాడికి తలకు గాయమయ్యింది స్పృహ కోల్పోయాడని అని తెలిసింది. ఒక పది నిముషాలలో జామ్  క్లియర్ అయింది. నేను ఆఫీసు సరిగ్గా 10 గం.లకి చేరిపోయాను.

వెళ్ళిన దగ్గరి నుంచి పని మీద పని. మీటింగ్ తరువాత మీటింగ్.

లంచ్ టైం దాటి 3 గం. లకు ఖాళీ చిక్కింది.  

రాత్రి నిద్ర లేమితో ఉదయం కొద్దిగానే తిన్న పెరుగన్నం ఒంటి గంట కొట్టేసరికి పూర్తిగా అరిగిపోయి భయంకరమైన ఆకలి పుట్టింది కాని  3. గం.ల వరకూ  తినలేక మిగిలిపోయా.  బాక్స్ ఓపెన్ చేసి తినడం ఆరంభిస్తే రుచి సహించని కూర – పాపం ఎలాగో శక్తి కూడా గట్టుకొని నా భార్య వండితే తీసుకొచ్చా. కాని ఆకలి రుచి ఎరుగదు అని అనడానికి కూడా లేదు ఎందుకంటే ఆకలి  చచ్చిపోయింది.

ఏదో తినేసి లంచ్ అయింది అనిపించి మళ్ళీ పనిలో దూకేసాను.

లేని వాటిని సృష్టించడం, అబద్దాలు అందంగా ఆడడం, విజ్ఞాపనలు సున్నితం గా తిరస్కరించడం ఒక పక్క చేస్తూ,  కొందరి తప్పులు కప్పి పుచ్చడం, కొందరి అహంకారాన్ని భరించడం,  కొన్ని అనవసరపు ఖర్చులను సమర్ధించడం, అసమర్ధులకు తాయిలాలు అందించడం ఇవ్వడం చూస్తూ పని మొదలైంది.

వీటన్నిటినీ చేస్తూ, చూస్తూ పని చేస్తుంటే అనిపిస్తుంది ఎంతటి అబద్ధపు ప్రపంచంలో జీవిస్తున్నానా అని. 

నిజం ఏటంటే నాకు ఈ అబద్దపు ప్రపంచానికి సేవ చేయడం వల్లే జీవన భృతి దక్కుతుంది. ఇది అబద్దపు ప్రపంచం అయినా నాకు దక్కే జీతం సత్యం. ఇది చాలదా రోజూ ఉద్యోగం చేయడానికి అని సమాధాన పడ్డాను.

అంతలోనే వచ్చింది ఫోన్ – ఎం. డీ. సాయంత్రం ఆరు గంటలకు ఆఫీసు చేరతారట (అది ఆఫీసు వదిలే టైం)  ఆయన సంతకం పెట్టవలసిన పేపర్ సిద్ధం చేసి ఉంచమని.

అంటే ఈరోజు సాయంత్రం కాదు రాత్రికే పని ముగిసి లేటుగా ఇంటికి వెళ్ళవలసి వస్తుందని చావు కబురు చల్లగా తెలిసినట్లు తెలిసింది.

సాయంత్రం మీటింగ్ లో  ఒక పెద్ద అధికారి తెలిసీ తెలియదని బొంకుతుంటే చూసి నవ్వు ఆపుకోలేక పోయాను. “ఆహా తండ్రీ! ఈ విధమైన వినోదాన్ని నాకు అందించి ఈ గందరగోళం లో నాకు చక్కని  ఉపశమనం కలిగిస్తున్నవా!” అని ఆ భగవంతునికి మానసికంగా కృతజ్ఞతలు, నమస్సులు తెలియచేసాను. 

ఎం.డీ ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే ఒక ఉద్యోగి ఏదో సినిమా తన లాప్టాప్ లో చూస్తూ కంటబడ్డాడు అతనికి ఈ ఆఫీసులో హార్డ్ వర్కర్ అని పేరు. ఉదయం అరగంట ముందుగా వస్తాడు సాయంత్రం లేటుగా వెళ్తాడు. పైగా ఈయన తరచూ పెద్ద వాళ్ళను కలసి మీరు ఇంద్రులు, చంద్రులు అని మంచి మాటలు చెప్పి వాళ్ళ కుటుంబ సభులతో కూడా పరిచయం పెంచుకొని వారికి మంచి సేవలందిస్తాడు.

అలా “పని” చేసే వాళ్ళంటే ఈ కంపనీలో పెద్దాయనకు భలే ఇష్టం. ఇంటివంటి వాళ్లకు చాల గొప్ప ఇంక్రిమెట్స్ వస్తాయి. మంచి పదవులు కూడా దక్కుతాయి. ఎప్పుడూ క్రమశిక్షణ, పని, డబ్బు సంపాదన గురించే ఆయన చెబుతాడు. పైగా సంస్థను ప్రొఫెషనల్ గా మలచాలంటాడు!

ఇది కొరుకుడుబడని ఒక సత్యం.

చాలామందికి.ఇన్ని విషయాలతో మనసు నిండిపోయి నా కేబిన్ చేరి యాంత్రికం గా నా బాగ్ సర్ది, పంపవలసిన అర్జెంటు మైల్స్ ఒకటికి రెండుసార్లు చదివి పంపి పార్కింగ్ ప్లేస్ కి వచ్చి  జేబు తడుముకొంటె తెలిసింది కారు తాళాలు కేబిన్ లో ఉన్నాయని.

దేవుడు పంపిన దూతగా సెక్యూరిటీ గార్డు కనిపిస్తే అతని సహాయంతో ప్రయాణం మొదలు పెట్టాను.

రోజూ ఉండే ట్రాఫిక్ కంటే  ఈరోజు రద్దీ ఎక్కువ గా ఉంది. నిజంగానే నత్త నడకతో ప్రారంభమైంది ఇంటికి తిరుగు ప్రయాణం. దూరంగా బాగా జామ్  అయినట్లు తెలిసి పక్కనే ఉన్న కార్ డెకార్  షాప్ వైపు కార్ తిప్పి అక్కడ టైల్ లాంప్ వేయించుకొని అక్కడే ఉన్న మెకానిక్ తో ఆ సొట్ట కూడా తీయించుకొనేసరికి రద్దీ తగ్గి సాఫీగా ట్రాఫిక్ సాగడం మొదలైంది.

ఇంటికి చేరే సరికి 9.30  భోజనం ముగించి నడుం వాల్చానో లేదు అమ్మ మళ్ళీ దగ్గడం మొదలైంది.

పొద్దున్న డాక్టరు గారు మందులు ఇచ్చినా మళ్ళీ వస్తుందేంటి అని నా భార్యను అడిగితే తనూ నిరాశగా నా వంక చూసి వెంటనే లేచి అమ్మ దగ్గరకు వెళ్ళింది.

నేను ఆమెను అనుసరించాను.

అప్పటికే అమ్మ నాన్నగారి నిద్రకు భంగం అని హాల్ లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేసి మరొక మందు కోసం బయటకు వచ్చాను. 

బయట పున్నమి వెన్నల.  

ఒక్కసారిగా చల్లగాలి నా మేను తాకింది. 

వేపచెట్టు వెన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది.

ఎంత అదృష్టం ఈ చెట్టుది అని అనిపించింది.

కర్తవ్యం తట్టిలేపినట్లు నా అడుగులు మందుల షాప్ ముందు ఆగిపోయాయి కాని చూపులు ప్రకృతి అందాలపైన ఉండిపోయాయి. బలవంతంగా వాటిని మరల్చి మందు తీసుకొని ఇల్లు చేరాను.

అరగంటలో అమ్మ ప్రశాంతం గా నిద్రపోయిందని తెల్లారి లేచాక తెలిసింది. ఎందుకంటే నేను అమ్మకు మందు ఇచ్చి నడుం వాల్చానో లేదు నిద్ర రూపంలో ఆ పరమాత్మ నన్ను ఆ రాత్రి తనలో మమైకం చేసుకొని స్వప్నంలో నన్ను నా భార్యను వెన్నెల్లో గోదావరి ఒడ్డున సైకతంలో విహరిస్తున్నట్లు చేసాడు.  

ఉదయం నా భార్య అల్పాహారం పెడుతుంటే అన్నాను – “నిద్ర వల్ల తెల్లారి వచ్చే శక్తి ఎంత సత్యమో నిద్రలో వచ్చే స్వప్నం కూడా అంతే సత్యం” అని. 

“ఏ  స్వప్నం?” అని తను అడిగితే – “ఇప్పుడు చెప్పను. రాత్రికి చెబుతాను” అని అన్నాను.

మరి ఈ రాత్రి ఎలా గడుస్తుందో తెలియదు. కాని ఒకటి మాత్రం తెలిసింది.

“నాహం కర్తా హరిః కర్తా” అని కర్తవ్యం ఏదో చేసుకు పోవడం.

అంతే! అప్పుడు ప్రతి రోజూ భారం కాదు ఒక బహుమానం ఔతుంది.

*****