నేనూ, ప్రత్యూషా నడుస్తున్నాం ఇందిరా పార్కులో.
పరీక్షల సీజన్ కాబట్టి… ఇళ్ళలో చదివితే అర్థం కానట్టూ పార్కుల్లో చదివే పిల్లలూ, సాయంత్రపు విహారానికి వచ్చిన దంపతులూ, వాళ్ళను వాళ్ళ మానాన వదిలేసి ఆడుకునే పసివాళ్ళూ, ఆరోగ్యం కోసం వచ్చినట్టూ ఈవెనింగ్ వాక్ కి వచ్చి, అక్కడికి వచ్చిన లవర్స్ లోని అమ్మాయిల్ని మాత్రం దొంగచూపులు చూసే వృధ్ధులూ వగైరాలతో నిండి ఉంది పార్కు.
“వీళ్ళను చూస్తుంటే మీకేమనిపిస్తోంది” చదువుకుంటున్న పిల్లలను చూపిస్తూ అంది తను.
“మన తరం వెళ్ళిపోయిందని” నవ్వేను.
“మరి వీళ్ళను చూస్తే” పిల్లలు ఆడుకోవడాన్ని చూస్తూ మాట్లాడుకుంటున్న దంపతులను చూపిస్తూ అడిగింది.
“మన తరం ఇంకా రాలేదని” అన్నాను.
తను నవ్వి అంది – “కాదు మేష్టారూ! ఇంకా రావడం లేదే అనిపించాలి. కాబట్టి, మీకింకా చిన్న పిల్లాడి మనస్తత్వం పోలేదనుకుంటా”
ఇంత చనువుగా మాట్లాడుకున్నా, మేమిద్దరమూ స్నేహితులం మాత్రమే. ఇలా ఎందుకన్నానంటే, మేం ప్రేమికులం కాదు కాబట్టి. అంత మాత్రాన ‘సిస్టర్ ‘ అని ఆత్మవంచన చేసుకునే వాణ్ణి కాను. బహుశా, ఇలా ఆలోచించడం వల్లనేనేమో, చాలా మంది నన్ను ‘మొరటు మనిషి’ అంటారు. మరీ అతి తెలివిగా, తమ భాషను ఇతరులు గుర్తించాలన్న తపన ఉండే వాళ్ళు మాత్రం ‘మెటీరియలిస్టు’ అంటారు.
హై స్కూలు దాకా కలిసి చదువుకున్నాం ప్రత్యూషా, నేనూ. అక్కడ విడిపోయిన మేము తిరిగి కలుసుకున్నది ఆఫీసులోనే. నేను క్లర్కుగా, ఆమె టైపిస్టుగా. బాగా చదివినంత మాత్రాన మంచి ఉద్యోగాలు వస్తాయన్న అభిప్రాయం ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని చూసి పూర్తిగా పోయింది నాకు.
తను చాలా తెలివైన అమ్మాయి. ఏ టాపిక్ మీదైనా అథారిటీ తో మాట్లాడగలదు. జిడ్డు కౄష్ణమూర్తి ఫిలాసఫీ నుంచి కీట్స్ పొయెట్రీ దాకా. కేవలం తెలివీ, వ్యక్తిత్వమూ ఉన్న అమ్మాయి భార్యయితే బావుంటుందనుకునే యువకులుంటారని నేననుకోను.
ఆ అమ్మాయి కారు నలుపు. మొహం కూడా స్ఫోటకం మచ్చలతో కాస్త అందవిహీనంగానే ఉంటుంది. ఇంకాస్త అందగత్తే అయితే ప్రేమించి (?) ఉండే వాణ్ణేమో!
నా రూం దాకా నడిచే వెళ్ళాము. తను వెళ్ళొస్తానంటే, నా గది చూసి వెళ్ళమని ఆహ్వానించాను. చాలా కాలం తర్వాత కలిశాం కాబట్టి ఇంకాస్సేపు మాట్లాడాలన్న ఉత్సాహం కాబోలు.
“చాలా బావుందండీ మీ గది” హాలుని చూస్తూ మెచ్చుకోలుగా అంది. “కాఫీ పెట్టి తెస్తాను, కూర్చోండి” అన్నా వినకుండా కిచెన్ లోకి వచ్చింది.
కాఫీ తాగుతూ, “కాఫీ బాగా పెట్టారు. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయెవరో చాలా అదౄష్టవంతురాలు” అంది.
“ఉట్టి కాఫీ తాగి అలా అనేయకండి. నేను వంట చేస్తే నేను తప్ప మరెవరూ ముట్టుకోలేరు” నవ్వుతూ అన్నాను.
ఫక్కున నవ్వింది తను. ఇది కూడా మరో గొప్ప విషయం. సహజంగా నవ్వగలగడం.
ఇది నేను చాలా మందిలో చూడలేదు. సహజమైన నవ్వు మొహానికి దాన్నిస్తుందన్న విషయాన్ని చాలా మంది ఆడవాళ్ళు గమనించరెందుకో!
తనని బస్ స్టాప్ లో దిగబెట్టి, పదడుగులు వేశానో లేదో, ఎదురుగా స్కూటర్ ని రోడ్డు పక్కగా ఆపి, నన్నే చూస్తూ నిలబడ్డ సుబ్బారావు కనపడ్డాడు. అతను నా పక్క సెక్షన్లోనే యూడీసీ. అకారణంగానే ద్వేషం కల్గుతుంది అతన్ని చూస్తే నాకు. “నిజంగానే భలే వాడివి గురూ! గొప్ప దాన్ని కాకపోయినా ఏదో పిట్టనే పట్టేవు”, వెకిలిగా నవ్వేడు. వయసులో తనకన్నా కనీసం పదేళ్ళయినా చిన్నవాడినైన నన్ను కూడా ‘గురూ’ అంటాడు. నాకదీ నచ్చదు.
‘అదేం కాదండీ. నాతో పాటు హై స్కూల్ దాకా చదివింది తనూ అన్నాను.
‘అంటే ఈ పరిచయం అప్పటి నుంచే ఉందన్నమాట’ అన్నాడు ‘పరిచయం ‘ అన్న పదాన్ని వత్తి పలుకుతూ.
ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోను. సీరియస్ గానే ‘చూడండి. మీరేమనుకుంటున్నారో గాని, మా మధ్య అలాంటి పరిచయాలేమీ లేవు. నాకస్సలు నచ్చవు కూడా’ అన్నాను.
‘సర్లేవోయ్. ఏదో సరదాగా అన్నాను. అన్నీ సీరియస్ గానే తీస్కుంటావ్ నువ్వు;’ అన్నాడు.
నేనా విషయాన్ని అంతటితో మర్చిపోయాను. కానీ, అది అంత తొందరగా సమసిపోయే విషయం కాదని నాకు కొద్ది రోజుల్లోనే అర్థమయింది.
0 0 0
ఫైలు మూసేసి నాకిస్తూ అన్నాడు మా మేనేజరు నవ్వుతూ, ‘ఏమిటోయ్ ! ఈ మధ్య ప్రత్యూషతో ఎక్కువగా తిరుగుతున్నావుట.’ ప్రశ్నార్థకంగా చూశాన్నేను. ‘ఏమీ లేదు. అందరూ అనుకొంటుంటేనూ’ నసిగాడు. ఈ మధ్య మా ఆఫీసులో అందరూ మేము లోపలికి రాగానే గుసగుసలాడుకోవడమూ, ముసిముసి నవ్వులు నవ్వుకోవడమూ నేనూ గమనిస్తూనే ఉన్నాను. బహుశా, ఈ కారణంగానేమో, ప్రత్యూష ఆఫీసులో నాతో మాట్లాడ్డం లేదు. నేనూ పనిలో బిజీగా ఉండి పట్టించుకోలేదు.
కానీ, ఓ సంఘటనతో మా ఇద్దరి జీవితాలూ పెద్ద మలుపు తిరిగేయి.
0 0 0
ప్రత్యూష రెండ్రోజులు సెలవు పెట్టింది. ఎందుకో ఎవరికీ తెలీదు, నాకు తప్ప. వాళ్ళ కుటుంబం వాళ్ళంతా తన పెళ్ళి చూపుల కోసం వాళ్ళ ఊరు వెళ్ళారు. నిజంగా ఆమె పెళ్ళయితే సంతోషించే వాళ్ళలో నేను మొదటి వాణ్ణి. కాకపోతే, ఆమెకు మంచి భర్త లభించాలని నా ఆశ.
ఇంతలో, ఆమె సెలవు పెట్టిన మరునాడే అమ్మకు సీరియస్ గా ఉందని టెలిగ్రాం రావడంతో నేను మా ఊరెళ్ళాను. కానీ, పెళ్ళి చూపులనీ, నాక్కొన్ని సంబంధాలు చూశామనీ వ్రాస్తే నేను రానని – వాళ్ళిచ్చిన అబధ్ధపు టెలిగ్రాం అది. ఇంట్లో వాళ్ళతో చిన్న సైజు యుధ్ధం చేసి, నా పెళ్ళి ప్రయత్నాల్ని వాయిదా వేయించి, ఆరోజే తిరిగొచ్చేశాను నేను.
రాగానే తెలిసింది, ప్రత్యూష రిజైన్ చేసిందని. కారణం నాతో పరిచయమని చూచాయగా తెలిసింది. వెంటనే బయల్దేరాను ఆమెను చూడ్డానికి.
0 0 0
ఇంట్లో తనొక్కతే ఉంది. ‘ మళ్ళీ ఎందుకొచ్చారు?’ అనడిగింది.
‘ఇందులో మళ్ళీ రావడమేముంది? మీరు రిజైన్ చేశారని తెలిసి వచ్చాను’ అన్నాను.
‘అందరూ అన్ని రకాలుగా అనుకుంటూంటే ఎలా ఉండగలను?’ అడిగింది.
‘ఎవరో ఏదో అన్నారనీ, అనుకున్నారనీ ఉద్యోగాలు మానేస్తే మన జీవితాలు సాఫీగా సాగడానికి మనం ధనవంతులం కాదు ప్రత్యూషా’ అనునయంగా అన్నాను.
ఒక్క సారిగా బరస్ట్ అయ్యింది తను.
‘మీరు కూడా అర్థం చేసుకోరేం ? మీతో మాట్లాడ్డమే పెద్ద తప్పైనట్టూ అందరూ గుసగుసలాడుతుంటే సహించాను. అది నా చేతకానితనంగానో, పిరికితనంగానో భావించి, అంతా నాతో ద్వంద్వార్థాల మాటలు మాట్లాడ్డమూ, అసభ్యంగా ప్రవర్తించడమూ మొదలెట్టారు. కనుచూపుతోనో, సీరియస్ గా మాట్లాడ్డం ద్వారానో వాళ్ళను దూరంగా ఉంచుదామంటే, అన్నిటికీ తెగించిన వాళ్ళను ఎవరేం చేయగలరు? ఆఖరికి ఆఫీసులోని ఆడవాళ్ళు కూడా నాతో మాట్లాడ్డం మానేశారు. అయినా, ఈ ఉద్యోగమే జీవనాధారం కాబట్టి సహించక తప్పలేదు. ఇరవై నాలుగేళ్ళొచ్చిన నాకే పెళ్ళి చెయ్యకపోతే, మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళెలా చేస్తారని మా నాన్నని ప్రత్యక్షంగా అడిగేవాళ్ళూ, పరోక్షంగా ఎగతాళి చేసే వాళ్ళూ ఇప్పటికే లేకపోలేదు’
‘ఇన్ని బాధల్లో నేనుండి నిన్న ఉదయం జాయినవగానే, నా టేబుల్ మీద పెండింగ్ ఫైల్లో ఈ కాగితం ఉంచారు. చూడండీ అని నా చేతికందించింది. ‘ఉషా, ప్రత్యూషా!’ అని సంబోధించాడు. ‘దీన్ని కూడా కవిత్వమనుకుంటారు మూర్ఖులు’ అనుకున్నాను.
‘నిన్ను చూసినప్పటినుండీ నా మనసు మనసులో లేదు (మనసనేది ఉంటేగా అది అక్కడే ఉండడానికి). రోజూ నా కలల్లోకి వస్తున్నావు నువ్వు (ఆత్మ వంచనకిది పరాకాష్ట). నీ అందం నన్ను పిచ్చి వాణ్ణి చేస్తూంది (ఆమె అందం ఎంతో నాకు తెలుసు). ప్రకాశరావుని (అంటే నన్ను) కరుణించిన నువ్వు నన్నూ కరుణిస్తే సంతోషిస్తాను. మనిద్దరం కూడా సెలవు పెట్టి అలా తిరిగి వద్దాం. అన్నట్టూ, నేనెవరో నీకు తెలియాలంటే
సాయంత్రం తెల్లచీరలో ఇందిరా పార్కుకు రా. నీ కోసం ఆశగా ఎదురుచూస్తుంటాను. నీ-‘
క్రింద సంతకం లేదు.
నిజంగానే బాధేసింది నాకు. మనుషులింత అవకాశవాదులుగా ఎందుకు మారతారో? ఒంటరిగా ఉద్యోగం చేస్తూ, తన కుటుంబాన్ని పోషిస్తూన్న స్త్రీని గౌరవించడం మాని, పెళ్ళి కాని కారణంగా ఎద్దేవా చేయడం. వీలైతే రాయి విసిరి చూద్దామని ఎందుకు ప్రయత్నిస్తారో అర్థం కాదు.
‘అయాం సారీ’ అన్నాను. ‘అన్నట్టూ మీ పెళ్ళి విషయం ఏమైంది?’ టాపిక్ మారిస్తే కాస్తయినా కుదుటపడుతుందని అన్నాను.
తలవంచుకుని అంది. ‘పంథొమ్మిది పెళ్ళి చూపుల అనుభవంతో చాలా తెలుసుకున్నానండీ. వచ్చే ప్రతి మగాడికీ నా ఉద్యోగం , జీతమూ, ప్రమోషన్ లూ, ఇవి గాక మేమివ్వగలిగే కట్న కానుకలూ, లాంఛనాలూ, ఆడపడుచు కట్నాలూ, స్కూటర్లూ,టీవీలూ – అసలీ పెళ్ళీడుకొచ్చిన యువకులు టీవీలూ వగైరా కొనరేమో! అందరూ కట్నం కింద వచ్చే డబ్బుతో కొనడమో, లాంఛనాల్లో తీసుకోవడమో చేస్తారేమో అనిపిస్తుంది.’
నవ్వేను నేను. మళ్ళీ తనే అంది – ‘ నాకూ చెల్లెళ్ళకీ పెళ్ళి చేయడం మానాన్నకొచ్చే పెన్షన్ డబ్బులతో అయ్యే పని కాదు. మా జీవితాలే సరిగ్గా జరగవు ఆ డబ్బుతో. పోనీ నా జీతంతో చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేద్దామా అనుకుంటే, పెద్దదాన్ని, నాకు పెళ్ళి కాలేదని వాళ్ళకూ కావడం లేదు. ఇలాగే ఉండి పోదామా అంటే, సంఘానికి భయపడాల్సి వస్తోంది.’
‘కష్టాల్లో ఉండేటప్పుడు సలహాలు గానీ, సహాయం గానీ అందివ్వని సమాజం అవసరం లేని పెళ్ళిని వదులుకుందామంటే హర్షించదు. అయినా సంఘం కోసం మనిషి తన జీవితంలో యాభై శాతమైనా జీవించాలి కాబట్టి, భయపడాల్సి వస్తోంది.’
‘ఇన్ని పెళ్ళి చూపులు చూశాక నాకనిపిస్తోంది – మళ్ళీ కన్యాశుల్కం వచ్చే దాకా పెళ్ళి చేసుకోకూడదని.’ – ఆమె కంఠం రుధ్ధమయింది. ‘అప్పుడు మళ్ళీ నా కన్యాశుల్కం పెంచేసి అందర్నీ బాధపెట్టాలనుంది. చిత్రంగా నన్నింతదాకా చూసిన ఏ ఒక్కరూ నేనందంగా లేనని తిరస్కరించలేదు. చూశారా యువకుల్లో దురచారాలూ, నడివయస్కుల్లో కుత్సితమూ ఎలా పెరిగిపోయాయో!’ తన చేతుల్లో మొహం దాచుకొని రోదించసాగింది.
నాకు తెలిసినంతలో ప్రత్యూష చాలా గొప్ప వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమె స్నేహం ఒక అదృష్టంగా భావిస్తూంటాను నేను. ఎప్పుడూ గంభీరంగా, ఓ రకమైన పెద్దరికంతో కనిపించే ఆమె ఇంతగా బ్రేక్ అయిందంటే, మెంటల్ గా ఏ స్థితిలో ఉందో ఊహించగలను.
దగ్గరగా వెళ్ళి, తన చేతిని నాచేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. అంతకంటే భాష తెలీలేదు నాకు.
చప్పున భీతహరిణేక్షణలా తలెత్తింది తను. ‘నువ్వూ ఇంతేనా?’ అన్న భావం కన్నా నాకు భయమే ఎక్కువ కనిపించింది.
స్నేహపురస్సరంగా నవ్వేను. అర్థమయిందో ఏమో నా గుండెలపై తలపెట్టుకుని సంతోషం పట్టలేకనేమో ఏడ్వసాగింది. బిలాంగింగ్ నెస్ లో ఉండే ఆనందం అర్థమై, లోకులంతా దీన్నే ప్రేమంటారేమో అనుకున్నాను. (మెటీరియలిస్టులు అకస్మాత్తుగా ప్రేమించడం ప్రారంభిస్తే, నిజాయితీగా ప్రేమిస్తారని, ‘ప్రేమ ‘ అన్న పదాన్ని చాలా మంది చీప్ గా వాడుతుంటారని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది నాకు).
తన భుజాల చుట్టూ నా చేతులు వేశాను. నా నిర్ణయం మా భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలీదు. కానీ, నా నిర్ణయం కేవలం ఆమె మీద సానుభూతితో మాత్రం కాదని నాకు తెలుసు.
(రచన మాస పత్రిక – మార్చి 94 లో ప్రచురితం )