ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పదండి వెనక్కు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

“పదయ్యింది లేవండీ..ఆఫిసు లేదా?” – సుప్రభాతం.

“లేదే సెలవు పెట్టా మిగిలిపోతున్నాయి సెలవులు”. 

“ఏమంత రాచకార్యముందనీ..?”. 

“ఉన్నవి వాడుకొటానికేగా..హాయిగా తిరిగొస్తా”. 

గబగబా లేచి టిఫిన్ తిని బయలుదేరా. సెలవెందుకు పెట్టానో తెలిస్తే..పగలబడి నవ్వుతుంది. ఎవ్వరికి చెప్పినా వెర్రోడికిందే జమకడతారు. అందుకు సంసిద్దమయ్యే బయలుదేరా.

కాళ్ళు తిన్నగా మునిసిపల్ స్కూల్ గేట్ దగ్గరాగాయి. అబ్బా! సరిగ్గా 50 ఏళ్ళు ఆస్కూల్ వదిలి.

జీళ్ళు ,తేగలు ,అమ్మే ముసలమ్మ స్థానం ఖాళీగాఉంది.

కొత్త భవనాలు లేచినా పాతభవనం చెక్కు చెదరలేదు. కోనేటి గట్టు..ఆడిన ఆటలు..ఒక్కొక్కటి మళ్ళీ పరకాయ ప్రవేశం చేసాయి. 

పరిసరాలు పలకరిస్తుంటే మెల్లగా నడిచాను ఆఫీస్ వైపు.

ప్రధానోపాధ్యాయుడు. గది దగ్గర ఆగాను.

“పోవటమా..మానటమా..” – తటపటాయింపు.

ఇంత దూరం వచ్చి ఆగితే…. అదో వెలితి..లోపలికెళ్ళాను..

“నమస్కారం..”

“రండి కూర్చోండి” అంటూ కుర్చీవేపు తలూపాడు.

కూర్చొన్నా.

“చెప్పండి” అంటూ సూటిగా చూసాడు.

మళ్ళీ “నమస్తే” అని., నా పేరు చెప్పా!

“నాకు కొన్ని పాత వివరాలు కావాలి ఇవ్వగలరా” అంటూ మొదలెట్టా..

“స్టడీ సర్టిఫికేటా..అబ్బాయిదా అమ్మాయిదా మనవడిదా ? పేరు, చేరిన సంవత్సరం , చెప్పండి” అంటూ పేపరందుకున్నాడు.

“అబ్బే అలాంటిది కాదు …వింతగా అనిపించొచ్చు” అని మెల్లగా నవ్వి చెప్పాను. “నేను ఇదే స్కూల్ లో చదివాను దాదాపు 50 సంవత్సరాల క్రితం అప్పటి తరువాత ఇప్పుడే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీదొచ్చాను. మీ రికార్డులు చూసి అప్పటి విద్యార్థుల వివరాలు చెప్పగలరేమో అనే ఆశతో వచ్చాను.”

నాకే నవ్వొస్తుంది కానీ ఉబలాటం ఉండనియ్యటం లేదు. అతను నిశ్చేష్టుడై నిలిచిపోయాడు.

“యు మీన్ మీ రు చదివినప్పటి వివరాలా!!!” అంటూ తెల్లబోయాడు.

ఓ నిమిషమాగాక ..మెల్లగా నవ్వాడు.

“మీ సీరియస్ చూసి ఎగతాళి చేయలేక పోతున్నాను మాష్టారూ. అయినా 10 ఏళ్ళ రికార్డులే ఉండవు. 50 సంవత్సరాలంటే మాటలా..ఒక్కటే సమాధానం..ఇంపాసిబుల్”. 

అనుకున్నదే సమాధానం నాకేమంత షాక్ గా లేదు.

“పోనీండి…థ్యాంక్స్” అంటూ లేచాను.

“కుర్చోండి కూర్చోండి” అంటూ కుర్రాణ్ణి పిలిచి టీ తెమ్మన్నాడు. “వెరీ ఇంటరెస్టింగ్ ….శ్రమ అనుకోకుంటే అసలు విషయమేమిటి ?ఎందుకా వివరాలు? చెప్పగలరా?” ఉత్కంఠ తో ముందుకు వొంగాడు.

నవ్వి ..సిగ్గుపడుతూ చెప్పాను…

“నేనిక్కడ 4 ,5 తరగతులు చదువుకున్నాను. ఆ పాత భవనంలో నే మా క్లాసులుండేవి అప్పుడు చుట్టూ ఇన్నిభవనాలు లేవు అంతా మైదానం. బడి చుట్టు తిరుగుతూ ఆడుకునే వాళ్ళం. మీకు తెలియదనుకోండి శేషగిరి రావు గారు మా క్లాస్ టీచర్..చండ శాసనుడు..కమల గారు లెక్కలు చెప్పేవారు మంచివారు. మీకో విషయం చెప్పాలి నాతో ఒకటవ తరగతి చదువుకున్నవారు కూడా మా స్వస్థలం లో ఇప్పటికీ మిత్రులు గానే ఉన్నారు కలుస్తుంటాం. వాళ్ళు ఉన్నచోటే ఉంటున్నారు కాబట్టి కుదిరింది. అలాగే అక్కడక్కడ మిస్సయిన లింకులు కలపగలనేమో అని ఓ ఆశ. అందరూ కాకున్నా నాతో క్లోజ్ గా ఉన్నవారు ఒకరిద్దరుంటారుగా. ఎప్పటికైనా గుర్తుపడతారు..అలాంటి సంఘటనలున్నాయి అప్పట్లో..” కొద్దిగా గర్వంగా చెప్పాను.

“లక్ష్మి ,చిన్న తల్లి ,పెద్ద తల్లి , కృపాకర్ ,వాసు , నేను ఓ జట్టు. ఆ రోజుల్లో లక్ష్మి అంటే అంత క్లోజ్ ఒకరింట్లో ఒకరు తినే వాళ్ళం, హోం వర్క్ చేసేవాళ్ళం. ఆడటం పాడటం అన్నిట్లో మేమిద్దరమే జత. ఓ సారి నే నెపోలీయన్ వేషం వేస్తే మా అమ్మ నాన్నలతో బాటు తను కూడా ముద్దుపెట్టుకుంది. సెలవుల్లో కూడ కలిసె తిరిగాం. వేయి విషయాలు గుర్తున్నాయి. ఇప్పుడు చెప్పండి మరచిపోయుంటుందంటారా..????”.

“నో..నెవర్…” నేనే సమాధానమిచ్చుకున్నాను. టీ వచ్చింది.

అలాగే కృపాకర్ కూడా. అప్పటి మా ఇంటివెనకే వాళ్ల ఇల్లు. మొన్న అక్కడంతా తిరిగా అన్నీ కొత్త కొత్త ఇళ్ళు.అసలు పాతది కనుక్కోవటమే కష్టమైపోయింది. అయినా ఫలితం లేదు ఎవ్వరికీ తెలిదు. అక్కడ కొన్న వాళ్ళంతా ఓ పాతిక 20 సంవత్సరాల లోపే కొన్నారు. లక్ష్మి ఇంట్లో ఇప్పుడు ఓ పెద్ద లాడ్జ్ వెలసింది. అంతకు ముందు ఉన్న హోటల్ వాళ్ళు 30 సంవత్సరాల క్రితమే అమ్మేసి వెళ్ళి పోయారట. ఈ స్కూల్ భవనం ఆ కొలను ఇంకా చెక్కు చెదరక అలాగే ఉన్నాయి…గతానికి సాక్షిగా. ఆ గట్టు మీది ముసలవ్వ మాకు అప్పుకూడా పెట్టేది. పావలా ఉంటే ఓ నెల జీళ్ళు తినేవాళ్ళం.”

కాస్త ఉద్రేకపడ్డానేమో కంట్లో నీళ్ళూ….

“ఇలా ఇంతకుముందు ఎవరినైనా కలిసారా?” అడిగాడు.

“ఆ !! మా నాన్నగారి స్నేహితుల అబ్బాయి ని కలిసాను. వాడు మాస్కూల్ కాదు. అయినా వారం వారం కలిసేవాళ్ళం అప్పట్లో. వాళ్ళింటి పక్కననే ఓ పెళ్ళిసత్రం ఉండేది, పెళ్ళి జరిగితే అక్కడే రికార్డులకు డ్యాన్సులు వేసేవాళ్ళం. ఫలహారాలు మేసేవాళ్ళం. ఈ మధ్యే కలిసాం. కుటుంభ సభ్యులు కూడ వింతగా చూసారు. కొంతమంది చనిపోయారు..ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నారు” అంటూ ఆగాను అవన్నీ గుర్తుకురాగా…..

“కనుక్కొని ఏం చేస్తారు?” అడిగాదు ఇంకాస్త ముందుకు వంగి.

“ఏమో…కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు…మళ్ళీ ఆ కోనేటి గట్టుమీద కబుర్లు చెప్పుకో వచ్చు కరువు తీరా కబుర్లు కలబోసుకో వచ్చు నాకు గుర్తున్నవే కొన్ని..మరిచిపోయినవి ఎన్నో..తవ్వుకుంటే దొరుకుతాయేమో…మరిన్ని..మిమ్మల్నేమీ ఇబ్బంది పెట్టలే కదా.. నా సోది తో” అంటూ లేచాను.

“లేదు లేదు మాష్టారూ మీ కబుర్లు మా ఉరు తీసుకెళ్ళిపోయాయి” అంటూ వెనక్కి వాలిపోయాడు. ఎవరు గుర్తొచ్చారో!!

కథ అయిపోయిందా అంటే అయిపోయినట్టే. ఇప్పటికి ఇంక పరిశోధన పొడిగించలెను. ప్లాను అయితే ఉంది.బయటి ఊళ్ళలోకెళ్ళాలని చూద్దాం . శరీరం సహకరించాలి. సెలవులు దొరకాలి.

అద్దాలు సవరించుకుంటూ ముందుకు కదిలాను….విధి మళ్ళీ పదండి వెనక్కు అంటూంటె ఎం చేయను? బయలుదేరా.

హైదరాబాదు బస్సెక్కాను. రాత్రల్లా ప్రయాణం. ఈ వాల్వో బస్సులు, విశాలమైన

రహదార్లు, వచ్చాక ప్రయాణాలు కాస్త హాయిగ ఉంటున్నాయి బస్సు బయలుదేరింది.

మనస్సు బరువుగా ఉంది.సినిమా మీద మనసు లగ్నం కావటం లేదు.

నా క్లాస్ మేట్ ఇక్కడే సూళ్ళురుపేటలో నర్సింగ్ హోం పెట్టిందని తెలిసి మొన్నామధ్య బయలుదేరా. నర్సింగ్ హోం చేరాక తెలిసింది, ఆమె చనిపోయి 15 సంవత్సరాలయిందని. మంచి హస్తవాసి గల డాక్టరు మొగుడు సినిమాల్లో చేరాలని వెళ్ళిపోయాట్ట. పుట్టింటికి పోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఏమిటో ఈ జీవితం.

హైదరాబాదు లో ఓ ఏలూరు మిత్రుణ్ణి పట్టాను వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ లో బాగా

పేరున్న నాయకుడు కాబట్టి కనిపెట్ట కలిగాను. ఫోను చేస్తే బోలెడు సంతోషపడిపొయాడు. వాడికి ఇంకా ఇద్దరు టచ్ లో ఉన్నారని, అందరు కలుద్దామంటేనే బయలుదేరా.

దాదాపు 40 ఏళ్ళ తరువాత కలుస్తున్నాం. సాయిత్రం వాళ్ళింట్లోనే డిన్నర్. వాడి భార్య మా కన్నా ఎక్కువ సంతోషపడింది. ఒరే ఒరే అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళ అబ్బాయి పక్క నే జోకులు..ఏట్లో ఇసుక దిన్నెల మీద దమ్ము కొట్టడం. ప్రొహిబిష న్ టైమ్ లో మందు ఎలా సేకరించామో..అన్నీ చెప్పుకుంటూ చిన్న చిన్న పిల్లలయిపోయాం.

అవన్నీ చెప్పి విసిగించదలచ లేదు. మొత్తానికి చాలా సరదగా గడిచిపోయింది. సెలవు తీసుకుంటూ మీరు రండి అంటే మీరు రండి అని అనుకున్నాం మునుపు కూదా అలాగే అనుకున్నాం అయిపోయింది 40 ఏళ్ళు అదే చెప్పా ఇలా కలవాలి అన్న కుతూహలం ఎందరిలో ఉంటుంది ? ఏ రోజు దినచర్య ఆ రొజే వాయిదా పడే రొజుల్లో.. అని అందరి మనసుల్లో. 

రేపు విజయవాడ వెళ్ళాలి. అక్కడో ట్రైనింగుంది. బస్టాండులో డ్రాప్ చేసాడు కార్లో ఇంకో గంటుంది. మళ్ళీ కబుర్లు. ఏ సారి అక్కడ మాట్లాడలేని విషయాలు ఎన్నో చెప్పుకున్నాం బాధపడ్డాం ,నవ్వుకున్నాం ,జాలి పడ్డాం. ఇంతలో బస్సొచ్చింది. బస్సులోకూర్చొన్నా.

బస్సు ముందుకి మనసు వెనక్కి ప్రయాణం మొదలైంది .
 
కాలేజీ వదలగానే ఉద్యోగం లో చేరాను. అప్పట్లో గవర్నమెంటు ఉద్ద్యోగం అంటే గొప్ప. ఓరోజు మసాలా దోశెలు తెప్పించుకుంటే, అది కట్టిన పేపర్లో ఓ ప్రకటన చూసా కలం స్నేహం చేయండి అంటూ ఓ పాతిక రూపాయలు పంపితే చిట్టా ఇస్తానని. అలా ఏర్పడ్డాయి కొన్నిస్నేహాలు.
 
మేరీ ,సత్యా, మణి, రోహిణీ, ప్రభ లతో . ఒక్క రోహిణి తప్ప అందరిరిని కలిసాను ఆరోజుల్లోనే. రోహిణి ఉండేది విజయవాడ లోనే! ఉంటుందా ? పెళ్ళయి వెళ్ళిపోయిందా! విజయవాడ సంబంధాలే ఒప్పుకోవచ్చు.. అన్నదే చివరి ఉత్తరాల సారాశం. ఇదే పనిలోఉన్నాగా ..కుతూహలమే జయించింది. అడ్రసు బాగా గుర్తుంది. ఏన్ని ఉత్తరాలు రాసుకునే వాళ్లమో..నాకున్న కలం స్నేహం లో ఇద్దరే నన్ను కలవలేదు. వారి పరిస్థితుల దృష్ట్యా నేనూ బలవంతం చేయలేదు .తిన్నగా ఆ యింటి ముందు ఆగి కాలింగ్ బెల్ నొక్కాను. ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి తలుపుతీసింది.
 
“ఎవరు కావాలండీ?”
 
ఎలా చెప్పాలో తెలియక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాను.
 
“మీకెవరు కావాలి?” అంటూ ఎదురు ప్రశ్న.
 
“గోపాల రావు గారున్నారా?”

“గోపాల రావా ఇక్కడెవ్వరూ లేరే!”

“అడ్రస్సు ఇదేనా?”

“అవునండీ ఇదే అడ్రసు కాకుంటే పాతది.”

పెద్దవాళ్లెవరైన ఉంటే వాళ్ళకు తెలుసేమో వారి అమ్మాయి రోహిణి అని..చెప్తున్నా..మధ్యలోనే 

“అస్సలిక్కడెవరు అలాంటి వాళ్ళు లేరండి…నాకు బాగా తెల్సు ఇక్కడ మేమే

ఉంటున్నాం.” ఇక దయచెయ్ అన్నట్టు చెప్పింది.

ఇంతలో “ఎవరే?” అంటూ ఇంట్లోంచి కేక.

“ఎవరోనే గోపాల రావు కావాలంట!”

“ఏ గోపాల రావూ? ఇక్కడెవరున్నారూ ?” అంటూ ఆవిడే వచ్చింది.

“నమస్కారమండి.. నాకు తెల్సినవాళ్ళు గోపాల రావు గారని వాళ్ల అమ్మాయి రోహిణి ఇదే అడ్రస్సు లో ఉండేవారు” అంటుండగానే రోహిణీ నా అంటూ ఎగాదిగా చూస్తూ అడిగింది.

“అసలు మీరెవరు ? ఈ అడ్రస్ ఎవరిచ్చారు?” అంటూ ప్రశ్నించారు.

“వాళ్ళే ఇచ్చారు..నేను తిరుపతి నుంచి వచ్చాను వీలయితే కలిసి పొదామని” అని నసిగాను.

“ఏమొనండి మాకెవరు తెలియదు”

వెనక్కి తిరిగాను..నిరాశాతో. అటు ఇటూ అడుగుదామన్న ఆలోచన చంపుకొని బస్సెక్కాను.

ప్రయాణ బడలిక వల్ల సోమవారం కాస్త ఆలస్యంగా ఆఫీసు బయలుదేరాను.
 
సీట్లో కూచోగానే కనపడిందొక బ్లూ కవరు. ఆ కవరు నాకు బాగా గుర్తు అది రోహిణి రాసిన ఉత్తరమే .అదే దస్తూరి. ఆశ్చర్యపోతూ కవరు తెరిచా. నిజమే రోహిణి రాసిన ఉత్తరమే.
 
“ఓయ్ బొజ్జ గణపయ్యా ,
 
ఏంటీ ఇన్నేళ్ళయ్యాక ఆరాలు మొదలెట్టావు? అయినా అలా చెప్పా పెట్టకుండా వచ్చేయటమే? కావులించుకుని కబుర్లు చెబుతాననుకున్నావా. ట్యూబులైటూ వెలగలేదా? బుర్ర గోకకు. నీవొచ్చింది కరెక్టు అడ్రస్సుకే. అయినా రావొద్దని చెప్పాగా. సర్లె అక్షింతలు మళ్ళీ వేసుకుందువు గాని. ఎలాఉన్నావు ? అబ్బ ఎణ్ణాళ్ళయ్యింది..??అంటే గుర్తున్నానన్నమాట..మరిచిందెప్పుడు అన్న డైలాగ్ కొడతావని తెలుసు..స్టన్ అయిపోయా నిన్ను చూసి. అప్పుడెప్పుడో నిన్ను సికిందరాబాదు స్టేషన్ కి రమ్మని కనపడకుండా చూసి పోయా గుర్తుందా!! అది గుర్తొచ్చి ఇంకా ఏడుస్తున్నావా? నీ పెళ్ళి కార్డు చేరింది. అప్పుడు డెలివరీ టైం. లేకున్నావచ్చేదాన్ని కానేమో…ప్చ్ ! అస్సలు నాకేం తోచటం లేదు నువ్వొచ్చినప్పటినుంచి. నా ఉత్తరాలున్నాయన్నావుగా, ఓసారి చదవాలనిపిస్తుంది. మా మూడో ఇంట్లో మీ డిపార్ట్ మెంట్ వాళ్ళే ఉన్నారు. నువ్విప్పటికీ యూనియన్ లీడర్ వేనటగా! చూసావా!కనుక్కుంటూఉన్నా. ఎలాగో పర్మిషన్ సంపాదించా. శుక్రవారం ప్రయాణం కేశినేని లో. శనివారం పొద్దున్నే 6 గం.కల్లా అక్కడుంటాను. వెంకన్న దర్శనం ఇప్పించకలిగితే చూడు. లేకున్నా నో ప్రాబ్లంస్ కబుర్లు చెప్పుకోవచ్చు.

ఉంటా…మరి..

మంచి కంచి పట్టుచీర తీసిపెట్టు. ఘరానా గా చెప్పుకుంటా. ఉంటాను.. రోహిణి (ఇది నా కలం పేరు అని వేరే్ చెప్పక్కర్లేదనుకుంటా ..ట్యూబూ)”

ఉత్తరం చదివాక మనసంతా ఎంతో సంతోషం. నాప్రయత్నాలకి ఫస్ట్ మార్క్ కాకున్నా పాస్ మార్కొలొచ్చాయి. అప్పటిలాగే ఉంది..ఏ మార్పూ లేదు.. పిచ్చిపిల్ల..రొయ్యలంటే ప్రాణం..పట్టుచీర కొనాలి…. ఫోనందుకున్నా……