ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పరధ్యానం పరంధామయ్య

Like-o-Meter
[Total: 1 Average: 5]

 
 
ప్రచురణ: పాపాయి చిల్డ్రన్స్ బుక్స్ 
 
ప్రచురణ సంవత్సరం: 1982
 
సంపాదకులు: సింగంపల్లి అప్పారావు

పరంధామయ్యకి పరధ్యానం ఎక్కువ. ముందు పరధ్యానం పుట్టి తరువాతే పరంధామయ్య పుట్టాడంటారు చాలామంది. ఆయన భార్య మంగతాయారు. బజారు కాటమ్మ అనే పేరు సార్ధకం చేసుకుంది. ఇంటి పెత్తనం, వీధి పెత్తనం ఆమెదే.
 
ఈ ఇద్దరి దంపతులకు ఇద్దరు పిల్లలు. కృష్ణారావు, సుభద్రలు. వీరిద్దరికీ దాదాపు పెళ్ళీడు వచ్చింది. వారి పెళ్ళి గురించి మంగతాయారు పోరు పెడితే తప్ప పరంధామయ్య పై కండూవా వేసుకొని బయలుదేరడు. వీధి దాటి కొంతదూరం వెళ్ళాక, ఎందుకు బయలుదేరానో? అని తర్కించుకొని, ఓ వీశెడు వంకాయలు తెచ్చి, “నీవు చెప్పినట్లు చేసానే” అని మంగతాయారుతో అనటం, ఆమె నెత్తినోరూ బాదుకోడం. ఆపై రాజీపడిపోవడం షరా మామూలే.

ఇలా ఉండగా….

ఆ ఇంట్లో మరో సమస్య లేవనెత్తింది మంగతాయారు.

ఇంటిపని, వంటపని చేయలేక ఛస్తున్నాను ఎవరినైనా వంటమనిషిని ఏర్పాటుచేయమని వంటమనుషుల బ్రోకరు భద్రయ్యతో చెప్పమంది. అంతటితో వూరుకోకుండా చీటి రాసి జేబులోనే వేసింది. పరంధామయ్య భద్రయ్యకు విషయం వివరించాడు. భద్రయ్య ఒక ఆడమనిషిని పంపుతానని హామీ ఇచ్చాడు.
 
మరునాడు ఉదయం మల్లి అనే పడుచు ఇంటి ముందుకు రావటంతో పల్లుదోము పుల్లతో పళ్ళు తోముకొంటున్న పరంధామయ్య “ఎవరు కావాలమ్మా?” అడిగాడు.

“పనిమనిషి కావాలన్నారట” అందా మల్లి.

“ఎవరికి?” అడిగాడు పరంధామయ్య “పరంధామయ్య గారని ఇక్కడే అని చెప్పాడు భద్రయ్య”ఆ పేరుగలవాళ్ళు ఇక్కడెవరూ లేరమ్మా. పక్కవీధిలో అడగలేకపోవాయావ్ ?” అన్నాడు పరంధామయ్య.
 
ఇల్లు ఊడుస్తున్న మంగతాయారు వడివడిగా వచ్చి పరంధామయ్య పరధ్యానం మీద నాలుగు అక్షింతలు వేసి మల్లిని లోపలకు తీసుకుపోయింది.
SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
మల్లిని ఒక ముద్దాయిగా నిలబెట్టి ఆ ఇంటి షరతుల్ని చెప్పింది మంగతాయారు. “నెలకు ఒక చీపురు మాత్రమే ఇస్తాం. శనివారం విధిగా బూజు దులిపి ఇల్లు కడగాలి!” అంటూ చాంతాడులాంటి నిబంధనలు మల్లి ముందు పెట్టింది. మల్లి తలూపి పనిలో చేరిపోయింది.

పక్షం రోజులు గడిచాయ్. ఒక శుభోదయంలో పరంధామయ్య పాత పంచాంగం చదువుతూ ఉండగా మంగతాయారు కంగారుగా వచ్చి “ఏమండోయ్! కొంపలంటుకున్నాయ్ !” అంది.

అదిరిపడ్డ పరంధామయ్య చటక్కున రేకు పెట్టెతో బయటకు పరుగెత్తబోయాడు. “అబ్బా ఎక్కడికండీ?”

“కొంపలంటుకున్నాయని కొంపలో వుంటారటే?” అన్నాడు. “ఆ కొంపలు కాదండి ఇంకోరకమైన కొంపలు”

“ఇంకోరకమయిన కొంపలేమిటే?” అడిగాడు పరంధామయ్య.

మంగతాయారు కాస్తాగి “మన మల్లి లేదూ?”

“మల్లా అదెవతి?” ప్రశ్నించాడు పరంధామయ్య.

“బ్బా పనిమనిషండి..మరే నూతిపళ్ళెం దగ్గర అబ్బాయి స్నానం చేస్తోంటే ముసిముసిగా నవ్వుతూందండి”. పరంధామయ్యకు విషయం అర్థంగాక బుర్ర గోకేసుకుని “అవునూ ఇప్పుడు దానికి, కొంపలంటుకుపోటానికి సంబంధం ఏమిటి?”
 
“ఈ పిదపకాలం గురించి మీకు తెలీదు. అబ్బాయి దాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానన్నాడనుకోండి. మన పరువుప్రతిష్టలు చాపలో చుట్టి వీధిలోనికి గిర్వాటేసినట్లేగా”

“వాళ్ళిద్దరూ ప్రేమించుకొంటే మన పరువు ఎందుకు పోతుంది?” పరంధామయ్య అమాయకంగా ప్రశ్నించాడు.

“మీకు బొత్తిగా తెలివి లేదండి” – “ఈ విషయం నాకెవరూ చెప్పలేదే?”. “ఖర్మ..ఇప్పుడు కర్తవ్యం ఆలోచించండి.

“అబ్బాయి ప్రేమించకుండ వుండాలి. మన పరువుపోకుండా వుండాలి. అందుకని నన్ను ప్రేమించమంటావా?”

“దిక్కుమాలిన రాత. దాన్ని పనిలోనుండి మానిపించేయండి. అది మన ఇంట్లో పనిచేయటానికి వీల్లేదు?”

“విషయం అదన్న మాట, సరే!” అంటూ పరంధామయ్య నిట్టూర్చి “ఔను మనం పనిలోనుండి మాన్పిస్తే పాపం అదేం చేస్తుందంటావ్?”

“అఘోరిస్తుంది. మనకెందుకు?” అంది మంగతాయారు.

*****

కాళ్ళరిగేలా తిరిగి ఇల్లు చేరాడు పరంధామయ్య. “యిస్సురో” అంటూ కుర్చీలో కూలబడ్డాడు. “ఏమయిదండీ?” అడిగింది మంగతాయారు.

“ఏమయింది? పత్రికల్లో ప్రకటన వేయించేసరికి తలప్రాణం తోక్కొచ్చింది” అన్నాడు. “ఏమని వేయించారు?” అయోమయంగా ఉన్న పరంధామయ్యను అడిగింది తాయారు.

“చెప్పావుగా!” అన్నాడు విసుగ్గా. “అదే! కొత్త పనిమనిషి కావాలనేగా?” అనుమానంగా అడిగింది మంగతాయారు.

“మా ఇంట్లో పని చేసే మల్లి అనే పిల్ల తప్పిపోయింది తిరిగి అప్పగించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును అని వేయించా!” అన్నాడు తాపీగా పరంధామయ్య.

నెత్తి, నోరు కొట్టుకొంది మంగతాయారు. “అదేమిటండీ! మల్లిని మనమేగా పనిలోనుండి మాన్పించింది?” – “మానిపించామా! ఎందుకు?”

“మీకు చెప్పిందేమిటి? మీరు చేసిందేమిటి? నూతిపళ్ళెం దగ్గర అబ్బాయిని చూసి నవ్వుతుందని మానిపించామా! మరో పనిమనిషి కావలని చెప్పానా!” అంది తాయారు గంభీరంగా.

“అవునూ! అబ్బాయి నూతిపళ్ళెం దగ్గర ఎందుకున్నాడు?” – “నా ఖర్మ కొద్దీ నాకు భర్త అయ్యారు”. “ఎప్పుడే?”

“అది గుర్తుంటే ఈ కాపురం ఇట్టా తగలడదు. ఇంకా నాలుగు రోజుల్లో మీ నాన్నగారి తద్దినం వస్తుంది. త్వరగా ఆ భద్రయ్యని కలుసుకుని పనిమనిషిని చూడమనండి

“ఎవరి తద్దినం?” – “మీ నాన్నగారిది!”

“మా…నాన్నాగారు….అవునేవ్ మర్చిపోయాను. మరి బ్రతికున్నదెవరు? ఓహో మీ నాన్నగారు కదూ! అవునూ బ్రతికివున్నవాళ్ళకి ఎందుకు పెట్టరు తద్దినం?”

“నాకు పెట్టండి సరిపోతుంది” అని విసవిసా వెళ్ళిపోయింది తాయారు.

*****

భద్రయ్య సాయంతో ఆ ఇంటిలో ఒక పనిమనిషి తయారయ్యాడు. పేరు గోపి. గాజు మీద పూసలా హుషారుగా ఉన్నాడు.

ఒకరోజు పరంధామయ్య ఇంట్లో అడుగు పెడుతూ వుండగా గోపీ ఎదురయ్యాడు. “ఎవడ్రా నువ్వు?” అన్నాడు పరంధామయ్య. “నేను గోపీనండీ!” అన్నాడు వాడు.

“గోపీవా? గోపికవా ? నా ఇంట్లో ఏమిట్రా నీకు పని ? ఎవరూ లేకుండా చూసి సామాను ఎత్తుకుపోవాలనుకున్నావా? వెధవా” అంటూ చొక్కా పట్టుకున్నాడు. గోపీ నిలువెల్లా వణికిపోతూ “మీ ఇంట్లో పనిమనిషిని సార్ ” అన్నాడు.

అదేదో పూర్వజన్మ స్మృతిలా గుర్తుకొచ్చి “సరే పో!” అంటూ లోపలికి నడుస్తూ “దిక్కుమాలిన ప్రపంచం. అందరూ మతిమరుపు వెధవలే” అని విసుక్కొన్నాడు పరంధామయ్య.

“ఏమైందండీ?” అంటూ వచ్చింది తాయారు. “ఏంలేదు! రామాలయానికి వెళ్ళానా….”

“శివాలయానికి వెళ్తున్నాని కదా మీరు చెప్పింది?” అందు తాయారు. “ఏదో ఒక గుడికెళ్ళానులేవే. తలుపు చెక్కలా నోరు నొక్కేసుకో! ఇంతకీ అక్కడెమైందో తెలుసా?”. “అబ్బే మీరు చెప్పారు కాదు”

“అక్కడో మతిమరుపు వెధవ గొడుగు మర్చి వెళ్ళిపోబోయాడు. నేను వాడికి ఇచ్చిపంపాను. “ఆహా! అలాగా! సంతోషం. మరి మీరు తీసుకెళ్ళిన గొడుగేది?’ తాపీగా అడిగింది మంగతాయారు. పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టు “నేను గొడుగు తీసుకెళ్ళానా?” అని బిక్కమొహంతో అడిగాడు పరంధామయ్య. మరేమీ రెట్టించకుండా మూతి మూడు వంకర్లు తిప్పి వెళ్ళింది తాయారు. చిరాకు పడుతూ కుర్చీలో కూర్చొన్నాడు పరంధామయ్య.

ఓ పది నిముషాలు గడిచిందో లేదో ఆదరాబాదరా వచ్చింది తాయారు. “ఏమండోయ్ కొంపలంటుకున్నాయ్ !” అని అరిచింది. కంగారుగా లేచాడు పరంధామయ్య. “అబ్బా ఏమిటా పరుగు. కాస్త వినండీ” అంది తాయారు. “కొంప కూలితే ఆగండీ అంటావేంటి” అన్నాడు పరంధామయ్య.

“ఖర్మ. వినండి. ఈరోజుల్లో ఆడపిల్లలు హైస్కూల్ దాటకుండానే ప్రేమించేస్తున్నారు.” – “దానికి నన్నేం చేయమంటావ్? మెళ్ళో బోర్డ్ కట్టుకొని ప్రేమించకండహో అని తిరగమంటావా?”

“అదికాదండీ గోపీలేడూ…మన పనిమనిషి”

“ఎవడు? నూతిపళ్ళెం దగ్గర మన అబ్బాయిని చూసి నవ్వాడు! వాడేగా” తనకూ జ్ఞాపకశక్తి ఉందని చూపించడానికి తాపత్రయపడ్డాడు పరంధామయ్య. ఐతే అదేమీ పట్టించుకోని తాయారు “వాడు బడిలో చదువుకున్నేప్పుడు క్లాసులో కునికిపాట్లు పడుతున్నాట్ట. మాస్టారు అరిచేసరికి ఉలిక్కిపడి లేచాట్ట. ఇది ఏ సంధి? అని అడిగితే మాది సంతమావులూరు సందు అని చెప్పాట్ట.”

“బావుంది. ఇంతకీ ఆ సందు ఎక్కడుందంటావ్?”

“ఎక్కడో తగలడిందిలేండి. అసలు విషయం అది కాదు” – “మరింకేంటి?” “ఆ గోపీగాడు మనమ్మాయితో ఈ హాసికం చెప్పడం. ఇద్దరూ పగలబడి నవ్వడం చేస్తున్నారండీ.” చివాలున లేచాడు పరంధామయ్య. “ఎక్కడికండీ?” అని అంది తాయారు. “నేనూ వెళ్ళి
నవ్వుకొస్తా” అన్నాడు సీరియస్ గా.

“మీతో వేగలేక ఛస్తున్నా. కాస్త వింటారా!” – “చెప్పు. అంతకంటే పనేముంది”

“మూగమనసులు సినిమాలో పడవవాడ్ని జమీందార్ల పిల్ల ప్రేమిస్తుంది.”

“ఇప్పుడా సినిమాని చూడాలంటావా?” అన్నాడు పరంధామయ్య. “కాదండీ మొగుడుగారు…” కసిగా అంది మంగతాయారు. “గారూ అంటే నేనేకదోయ్” అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. కోపంగా వెళ్ళబోతూ తమాయించుకొని “ఆ గోపీగాడు మనమ్మాయిని ప్రేమించవచ్చు. ప్రేమించాక పెళ్ళి చేసుకోనూవచ్చు.” అంది.

“అదేమిటి! ప్రేమించుకున్నోళ్ళు పెళ్ళెందుకు చేసుకొంటారు?” – “చేసుకుంటారండీ. కాలం అలావుంది.”

“కాలం అట్లావుంటే వాళ్ళ తప్పేముందే? ప్రేమించుకోనివ్వు” అని అక్కడితో ఆగకుండా “నీకంతా ఇదిగా వుంటే మనమ్మాయిని ప్రేమిస్తున్నట్టు గోపీగాడి చేత ఓ హామీ పత్రం రాయించుకో” అన్నాడు.

“ఎందుకు నాలుక గీసుకోటానికా? దిక్కుమాలిన సంసారానికి లంఖణాల మొగుడని తయారయ్యారు.” అంది రుసరుసలాడుతూ. – “చూడు! ఈ లోకం మిధ్య – అంతా మిథ్య. మిథ్యలో బ్రతుకుతున్నాం. జరిగిపోయేదేదో జరిగిపోతుంది. దానికి ఏ ఒక్కరి ప్రమేయం అక్కరలేదు.” అన్నాడు గుక్కతిప్పుకోకుండా.

“దేని గురించి మీరు చెప్పేది?” – “అదే అర్థం కాలేదు. అవును అదే ఆవకాయ పట్టాలన్నావు కదా! ఉప్పులో వూరేసేందుకు……”

“ఆవకాయ కాదండీ – ముందు తలకాయను వూరేయాలి. వసపిట్టలా వాగుతున్నా మీకు అంతుపట్టట్లేదు. అమ్మాయికేదైనా సంబంధం చూడరంటే వినరే!” అంది తాయారు.

“సంబంధమా? ఇరవైయేళ్ళ వాణ్ణి చూడమన్నావని ఒకడ్ని తీసుకొచ్చాను. వద్దన్నావ్” అన్నాడు.

“బ్బో…గొప్పసంబంధం తెచ్చారులే. శఠగోపంలా ముఖం, గోష్పాదమంత పిలక” అంటూ విసుక్కుంది తాయారు.

“పోనీ ఓ పని చేద్దామా?” – “ఏమిటి?”

“ఇరవై ఏళ్ళవాడెవడూ దొరకడం లేదుకదా అందుకని పదేళ్ళవాళ్ళని ఇద్దర్ని తెస్తే…”

“క్రితం జన్మలో నేనేదో పాపమ్ చేసుకొన్నానండీ” బాధగా అంది తాయారు. ఇక మాట్లాడకుండా మౌనం వహించాడు పరంధామయ్య.

“మీ తెలివికో దండం. ముందు ఆ గోపీగాణ్ణి పనిలోంచి తీసేయండి” అని చెప్పింది తాయారు. బుద్ధిగా తలాడించాడు పరంధామయ్య.

*****

“ఔనుగానీ ఈ యాభైయేళ్ళ మొగమనిషిని తెచ్చారేమిటీ?” అంది తాయారు. “ఇదిగో తాయారూ! మల్లి వచ్చింది – అబ్బాయిని అనుమానించావ్. గోపీ వచ్చాడు – అమ్మాయిననుమానించావ్. ఏ నడివయసుదాన్నో తెస్తే నన్ను…ఏది…నన్ను అనుమానిస్తావనే ఈ
ఏర్పాటు” అన్నాడు పరంధామయ్య.

“మీకూ తెలివుందండోయ్” అంది మెచ్చుకోలుగా. “తెలివా? అదేమిటి?…ఓహో అదా…హ్హాహ్హాహ్హా” అని పగలబడి నవ్వాడు పరంధామయ్య.

ఓ ఇరవైరోజులు గడిచాయి.

పేరంటంనుండి తిరిగివచ్చిన మంగతాయారు లోనికి ఘొల్లున అరుస్తూ “ఏమండోయ్ కొంప కూలింది…దేవుడో…” అంది. వరండాలో ఉన్న పరంధామయ్య దూకుడుగా ఇంట్లోకి పరుగుతీసి కంగారుగా గదులన్నీ తిరగసాగాడు. “ఏమిటండీ అలా తిరుగుతున్నారు?” మంగతాయారు ఏడుస్తూ అడిగింది.

“కొంప….కూలిందన్నావ్? ఎక్కడ ? ఏ గది ?” అన్నాడు ఆతృతుగా. “గది కాదండి. అవతారం వంటిల్లు మొత్తం ఊడ్చేసాడు” అంది ముక్కు చీదుతూ.

“బావుంది. పనిమనిషి ఊడ్చేయక ఇంకేం చేస్తాడు?”

“అదికాదండీ. ఇంట్లో ఎవరూ లెకుండ చూసి మొత్తం సామాన్లు ఎత్తుకెళ్ళిపోయాడు” అంది ముక్కుని ఎగబీలుస్తూ. “అరెరె. అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. నాకు తెలిస్తే ఏవో అవసరమైనవి మాత్రమే ఎత్తుకెళ్ళమనేవాణ్ణే” అంటూ బుర్రగోక్కోసాగాడు పరంధామయ్య.

భర్త వంక జాలిగా చూసింది మంగతాయారు. ఆ భావాన్ని మరోరకంగా అర్థమ్ చేసుకున్న పరంధామయ్య “బాధపడకే. కొత్త పనిమనిషిని కుదురుస్తాగా” అన్నాడు.

“వద్దులేండి ఎందుకొచ్చిన పీడ. నేను అమ్మాయి ఎలాగోలా అవస్థపడతాం. చేసిన నిర్వాకం చాలు” అంది. కాసేపాగి మెల్లిగా అడిగాడు పరంధామయ్య –

“అవును ఇంతకీ ఏమిటి కూలిందని అన్నావ్?”

“నా బ్రతుకు” అని గొణుక్కుంది తాయారు.

******