ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సమ్మానం

Like-o-Meter
[Total: 3 Average: 4]

 

రచన: బులుసు వేంకటరమణయ్య

ప్రచురణ: బుక్‍మన్స్

గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.

 

బాలామణి దక్షిణదేశం అంతటా పేరుమోసిన నాట్యకత్తె.

అంత కొలది వయస్సులో అంత గొప్ప పేరు మోసిందంటే – ఆమెకు నాట్యంలో ఎంత పాండిత్యం వున్నదీ వ్యక్తి కాగలదు; ఆమె గొప్ప అందకత్తె కూడాను.

బాలామణి తండ్రి ప్రోత్సాహం మీద ధనసంపాదనార్థం ప్రసిద్ధ పట్టణాలకి వెళ్ళి, ప్రభువుల వద్ద తన శక్తిని చూపించి బహుమానాలు పొందటానికి దండయాత్రకి బయలుదేరింది. ముందుగా విజయనగరం వచ్చి, విద్యావ్యసనం గల విజయరామ ప్రభువు దర్శనం కోరింది. తాను నాట్యంలో అద్వితీయనంటూ తన శక్తి ప్రభువులకు తెలియజేయకోరింది.

ఎప్పుడూ పండితులతో చర్చలు సాగిస్తూవున్న విజయరామగజపతి ప్రభువుకు కవులంటేనే గౌరవం తక్కువ. సాధారణంగా కవులకి దర్శనం దొరికేది కాదు. నాట్యమంటే మరీ ఈసడింపు! అలాటి ప్రభువు ఆమె నాట్యం చూడ్డానికి అనుమతిస్తాడా?

తన నాట్యం చూడ్డానికి జనం తండోపతండాలుగా తహతహమంటూ వస్తారు. అట్టి తాను ఈ ప్రభువు దగ్గర చిల్లిగవ్వకు పనికిరాక పోయానని బాలామణికి కష్టం అనిపించింది. అయినా అధైర్యపడలేదు. ఆ ప్రభువు దర్శనం దొరికితే అతనిని అంగీకరింప చేయగలనని ఆమె విశ్వాసం.

చాలాదూరం నుంచి వచ్చాననీ, ప్రభువువారు దర్శనం యిప్పిస్తే చూచి, వెళ్ళిపోతాననీ, ఆమాత్రం అనుగ్రహించాలనీ వర్తమానం పంపింది. విధిలేక విజయరామ గజపతి ప్రభువు బాలామణికి దర్శనం యిచ్చాడు.

ప్రభువు బాలామణిని చూచీ చూడడంతోనే ముగ్ధుడయిపోయాడు. పిదప ప్రశ్నించి, సంగీత సాహిత్యాల్లోనూ, నాట్యశాస్త్రంలోనూ ఆమెకు గట్టి పాండిత్యం వున్నదనీ, నాట్యమంటే ఎక్కువ అభిమానమనీ తెలుసుకొన్నాడు.

ఆమె కోరికను కాదనలేక మరునాడు నాట్యప్రదర్శనానికి ఆయన అనుమతించాడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

*****

మహారాజులుంగారు తక్తు మీద అధిష్ఠించి ఉన్నారు. సభ్యులంతా వారివారికి తగిన స్థానాల్లో కూర్చుని ఉన్నారు. బాలామణి అత్యద్భుతంగా నాట్యం సాగిస్తున్నది. ఆమె సౌందర్యమూ, పోషక్కూ, నాట్యభంగిమలూ, కోకిల స్వరమూ అందరినీ ముగ్ధులను చేసివేస్తున్నాయి. ఆమె ప్రత్యేకంగా విజయరామ గజపతి మహారాజులుంగారి మీద రచించబడిన ఒక జావళీని అభినయిస్తూ వుంటే ఆయన పరవశులైపోయారు. నాట్యం అంటే చాలా చులకనగా చూసే ఆ ప్రభువుకి “నాట్యం ఇంత గొప్పదా?” అని అనిపించింది. ఆమెకు ఎంతన్నా బహుమానం ఇవ్వవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

నాట్యం ముగిసింది. బాలామణి తల వంచి, చేతులు ముకుళించి సవినయంగా మహారాజులుంగారికి నమస్కారం చేసింది.

“నేటి నీ ఈ అద్భుత నాట్యప్రదర్శనానికి చాలా ఆనందం కలిగింది మాకు. నిన్ను ఎలా సత్కరించాలో తెలియకుండా వుంది” అన్నారు మహారాజులుంగారు.

“అది ప్రభువుల దయాధీనం. వందలూ ఇచ్చినవారున్నారు, వేలూ ఇచ్చినవారున్నారు. లక్షలు ఇవ్వడానికి కూడా తమవంటి ప్రభువులు సమర్థులు! ఆ మీద మా అదృష్టం.” అన్నది బాలామణి మందహాసం చేస్తూ.

మహారాజులుంగారు దివాను జగన్నాథరాజు గారి వైపు సాభిప్రాయంగా చూపు ప్రసరించారు.

“ప్రభువులవారు నీ సామర్థ్యానికి చాలా మెచ్చుకున్నారు. సంతృప్తికరంగానే సమ్మానం జరుగుతుంది.” అన్నారు దివానుగారు బాలామణిని చూస్తూ.

*****

మహారాజులుంగారూ, దివానుగారూ ఆలోచనా మందిరంలో కూర్చుని, ఏవేవో వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు.

యాదాస్తు పుస్తకం తీయగా మొదట బాలామణి పేరూ, ఆమెకు ఇవ్వవలసిన బహుమానం వివరాలూ ఉన్నాయి.

దాన్ని చూచి దివాను ముక్కు మీద వేలు వేసుకున్నాడు.

మహారాజులుంగారు “ఏమి”టన్నట్టు అతని వైపు చూచారు.

“మరేమీ లేదండి! ఇలాంటి త్యాగాలు చేస్తే జమీందారీ మూడు రోజుల్లో ఎగిరిపోతుందని భయంగా వుందండి” అన్నాడు దివాను ధైర్యంతో.

బాలామణికి లక్షరూపాయలు ఇవ్వవలసినట్లుగా ఆ లెక్కలో వెయ్యబడివుంది.

“మాకు ఆనందం కలిగింది. లక్షా ఇవ్వాలని సంకల్పించుకున్నాం! ఇయ్యవలసిందే!”

దివాను మరి ఎదురు జబాబు చెప్పలేదు. “చిత్తం, చిత్తం, మహాప్రభూ! ఏలినవారి యిష్టప్రకారమే జరిగించవచ్చు. కాని నా మనవి యేమిటంటే – కొంచెం వ్యవధి కావాలని ప్రార్థన” అన్నాడు.

“వ్యవధి కావాలా? ఎందుకూ?”

“ప్రభువుల వారు చిత్తగించాలి! లక్ష రూపాలయంటే సామాన్యం కాదు. ఇప్పుడు ధనాగారంలో నాలుగు వేల కంటే ఎక్కువ మొత్తం లేదు. మూడు రోజులు గడువిస్తే ఠాణాలకి తాఖీదులు పంపి, సొమ్ము వసూలు చేయించి తెప్పిస్తాను. తమరు ఖుద్దున ఆ నాట్యకత్తెకు బహుమానం ఇయ్యవచ్చు.”

మహారాజులుంగారు సమ్మతించక తప్పినది కాదు.

మూడు రోజులూ గడిచినాయి.

తన సమ్మానం సంగతి యింకా యేమీ, ఎందుకు తేలలేదో తెలియక బాలామణీ తహతహపడుతూ వుండగా, మర్నాడు దర్బారులో సమ్మానం జరపబడుతుందంటూ ఆమెకి వర్తమానం వచ్చింది.

మహాఘనంగా సమ్మానం జరుగుతుందని ఆమె ఆనందంతో ఆకాశం అందుకుంటూ ఉంది.

*****

శ్రీ విజయరామ గజపతి మహారాజులుంగారు కొలువు తీర్చి ఉన్నారు.

సభా భవనం సాంతులతోటీ, ఉద్యోగులతోటీ, ప్రేక్షకులతోటీ కిటకిటలాడుతూ వున్నది.

బాలామణి ఒకప్రక్క తన బలగంతో వచ్చి కూర్చున్నది.

దివాను జగన్నాథరాజు నిలిచి, సభ్యులను సంబోధిస్తూ – “నేడు చాలా సుదినం. ప్రభువువారికి ఠాణాల నుండి దస్తు ఖుద్దున సమర్పించబడే దినం. ఈ దినమే నట్టువకత్తెల్లో ఆరితేరి, సభ్యులందరినీ – ఎక్కువగా ప్రభువువారిని రంజింపజేసిన బాలామణికి సమ్మానం జరిగేరోజు. మొదట ఆయా ఠాణేదారులు దస్తు సమర్పిస్తారు.” అని చెప్పి తన స్థానంలో కూర్చున్నాడు.

ఒక్కొక్క ఠాణేదారూ వచ్చి ప్రభువులకి వంగి, వంగి నమస్కారం చేసి, తాము తెచ్చిన దస్తు రూపాయిల సంచులు లెక్కపెట్టి పడవేసి, దివానుగారివల్ల రశీదు తీసికొని వెనక్కి వెళ్ళసాగినారు.

ఇలా పది ఠాణాల నుంచి వచ్చిన దస్తు లక్ష రూపాయిలూ చేరింది. సీళ్ళు వేసిన నూరు సంచులు కుప్పలా పడ్డాయి; ఒక్కొక్క సంచీలో వెయ్యేసి వెండి రూపాయలు ఉంటాయి. అసలు “సంచీ” అంటేనే వెయ్యి రూపాయలంటూ తెలుగుదేశంలోని పరిభాష కదూ!

తర్వాత దివానుగారు లేచి “ఇకమీద బాలామణికి సమ్మానం జరుపబడుతుంది” అని చెప్తూ ప్రభువుల వైపు తిరిగి “ప్రభువులు అనుగ్రహించి బాలామణిని సమ్మానించవలెనని ప్రార్థన!” అని మనవి చేసాడు.

మహారాజులుంగారికి ఆలోచన పోయింది; మనస్సు సందిగ్ధంలో పడింది. బాలామణికి లక్ష రూపాయలు ఇవ్వాలని మొదట అనుకున్నా, అలా చేయడం అనుచితం అని ఆయనకు తోచింది. రూపాయిలన్నీ కైలాస పర్వతం వలె గుట్టగా పడివున్నాయి.

“ఎన్ని నెలలో, ఎందరు ఉద్యోగులో, ఎన్ని విధాలనో తంటాలు పడితేనే గాని యింత సొమ్ము తేలదు. రైతులందరూ చెమట ఊడ్చి, శ్రమించి పండించిన పంట వల్ల లభించిన సంపద! దీన్ని అనాలోచితంగా ఒక నాట్యగత్తెకు – ఒక గంటసేపటి నాట్యానికి సమర్పించడమా? ఇలా ఎంత మాత్రమూ జరగకూడదు.” అని ఆయన మనస్సుకు తట్టింది.

తాను అనాలోచితంగా లక్ష రూపాయిలు ఇవ్వమంటే – దానికి ఇష్టపడక తన శ్రేయోభిలాషి అయిన దివాను జగన్నాథరాజు పన్నిన పన్నాగమే యిదంతా అని ఆయనకు బోధపడింది.

దివాను యుక్తికి మహారాజులుంగారు మనస్సులో చాలా సంతోషించారు.

అయితే, ఇప్పుడీ సమస్య తేలడమెలాగా? తన కేమిన్నీ పాలుపోలేదు.

ఎంత ఇవ్వాలో తెలియడం లేదు. ప్రభువువారు దివాను వైపు అమాయిక దృష్టితో చూశారు.

ఆయన మనోభావం గ్రహించాడు దివాను. తనను ఈ చిక్కులోంచి గట్టెక్కించాలంటూ ఆ చూపు అర్థమని తెలుసుకున్నాడు.

ఆ ఇద్దరి మూగభాషా వారికే కాని, మరొకరికి అర్థం కాలేదు.

దివానుగారు లేచారు.

“బాలామణి నట్టువకత్తెల్లో అగ్రగణ్య అని మెచ్చుకుంటూ ప్రభువులు ఆమెకు ’నాట్యకళాప్రపూర్ణ’ అనే బిరుదును అనుగ్రహిస్తున్నారు.” అని ప్రారంభించాడు. సభ్యులందరూ కరతాళ ధ్వనులు చేస్తూ తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

“బాలామణి నైపుణ్యాన్ని డబ్బుతో విలువ కట్టడమనేది అసాధ్యం. అయినా ప్రభువులు ఆ విషయంలో తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు…” అని ఒక నిమిషం ఆగి “…ఇప్పుడే లక్ష రూపాయిల దస్తు వసూలయి రావడం మీరందరూ చూచారు…” అని మళ్ళీ ఆగాడు దివాను.

“ఔ”నని అందరూ తల లూపారు.

“ఈ ధనరాశిలో ఆమె మొయ్యగలిగినంత ధనాన్ని సత్కారంగా బాలామణే తీసుకోవాలని ప్రభువులు అనుగ్రహించారు. ఆమె ఎంత తీసుకున్నా అభ్యంతరం లేదు. ఈ లక్ష రూపాయలు ఆమె మొయ్యగలిగితే ప్రభువులు నిరాక్షేపణగా అనుగ్రహిస్తారు.”

ఆ చివరి వాక్యాన్ని నవ్వుతూ అన్నాడు దివాను.

మహారాజులుంగారి విశాలహృదయాన్ని అందరూ ప్రశంసించారు.

లక్ష రూపాయలూ ఆమెకు ముడుపు చెల్లిస్తారేమోనని కొందరు మొదట దిగులుపడ్డారు. దివానుగారి యుక్తికి వారందరూ మెచ్చుకున్నారు.

బాలామణి ముఖం వెలవెల పోయింది. తొలుతనే ఆమె అబల. అందులోనూ సుకుమార శరీర. ఆమె ఎన్ని రూపాయలు మొయ్యగలదు?

అయినా సాహసించి సంచుల దగ్గరకు వెళ్ళి రెండు చేతులతోనూ రెండు సంచులు లంకించుకుని ఎత్తింది. అవే బరువుగా తోచాయి ఆమెకు. అయినా లేని బలం తెచ్చుకుని ఆ రెండు సంచులనీ పట్టుకున్న చేతులతోనే మహారాజులుంగారికి నమస్కారం చేసింది.

నమస్కారం చేసేటప్పుడు కొంచెం చేతులెత్తవలసి వచ్చింది. ఆ సంచులు మరీ బరువు అనిపించాయి. వెంటనే అవి చేతుల్లోంచి జారిపోయి గల్లుమని ధ్వనిచేస్తూ క్రింద పడిపోయాయి.

అందరూ గొల్లుమని నవ్వుతూ కోలాహలం చేసారు.

బాలామణి కన్నులలో నీళ్ళు గిర్రుమని తిరిగాయి.

చివరికి ఆమెకు ఒక దమ్మిడీ అయినా ముట్టకపోయిందన్న మాట!

దివాను లేచి నిలవగానే కోలాహలం మాని జనం సర్దుకున్నారు.

“మరేం ఫర్వాలేదు! బాలామణి మొయ్యలేకపోయినా ఆ రెండు సంచుల రూపాయిలూ ఆమెవే. శ్రీ మహారాజులుంగారు ఆ రెండు వేల రూపాయిలు ఆమెకు సమ్మానంగా సమర్పిస్తున్నారు. ఆమె ఎలాంటి సంకోచమూ పడనక్కర్లేదు. వాటిని గ్రహింపవచ్చును.” అన్నాడు.

సభ్యులందరూ చాలా సంతోషించారు.
మహారాజులుంగారు నిర్ఘాంతపోయారు.

లక్షరూపాలు ఇవ్వదలచుకున్న తన చేత రెండువేల రూపాయిలు తన ఔదార్యానికి లోపం లేకుండా దివాను ఎలా ఇప్పించినదీ తలచుకుని మనస్సులోనే అతన్ని మెచ్చుకున్నారు ప్రభువులు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY