“ఇప్పుడు మాత్రం ఈ నీ మందహాసం, నీ ప్రశాంత వదనం గంగవెర్రులు ఎక్కిస్తుంది మాకు. ఈ మధ్య నువ్వు ఇదే రీతిలో ఉంటున్నావు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవు ఏమనుకున్తున్నావు రా” అని అరుస్తూ ఒక్క ఉదుటన రెక్క పట్టుకొని లాగి తనవైపు తిప్పుకున్నాడు కేశవను అతని అన్న భాస్కర్.
కేశవలోమళ్ళీ ఆడే నవ్వు అదే ప్రశాంతత.
“ఎందుకండీ మీరు అలా బతిమాలతారు! మన చిన్నోడు వంశీ ఎన్ని సార్లు బాబాయి అనే ఆర్తితో ఉండమని చెప్పినా అదే తంతు. అంత పసివాడు అంత ప్రేమతో ముద్దుగా చెబితేనే కరగని మనసు కాదు అది ఒక పాషాణం. వీడు సన్యాసం తీసుకొని ఎవరిని ఉద్ధరిస్తాడో చూద్దాం.” అని కళ్ళ నీళ్ళు వత్తుకొని మాలతి వంట ఇంటిలోకి వెళిపోయింది.
మళ్ళీ వంశీ, విజయ (భాస్కర్ పిల్లలు) వచ్చి”బాబాయ్! నిన్ను డిస్టర్బ్ చెయ్యం, అల్లరి చేయం, నువ్వు పిలిస్తేనే వస్తాం ఇక్కడే ఉండు బాబాయి, నీకు ఇష్టం వచ్చినప్పుడే మాకు కధలు చెప్పు మాథ్స్ చెప్పు” అని ఎంతో దీనంగా ఆ చిన్నారులు బతిమలాడుతుంటే కదిలాడు కేశవ.
వాళ్ళను దగ్గరకు తీసుకొని ముద్దాడి “కన్నలూ, మీకు చెప్పినా అర్థం కాదు. కాని ఒకటి మాత్రం చెబుతాను వినండి. మనం ప్రయాణం చేస్తుంటే ఒక బొమ్మలు అమ్ముకొనే వాడు, పాటలు పాడే వాడు, నవ్వించేవాడు మనతో పాటే ప్రయాణం చేసి వాళ్ళ ఊరు రాగానే దిగిపోతారు కదా అలాగే నేనూను. మీతో కొంత కాలం ఆడుకున్నాను ఇప్పుడు నా ప్రయాణం కొనసాగాలి, మీరు ఇక్కడే ఉండాలి కనుక ఉండిపోయారు. అంతే.” అని మరొక్కసారి ముద్దాడి వాళ్ళ కళ్ళు తుడిచి “మీరు మంచి పిల్లలు చక్కగా చదువుకొని మంచి గొప్ప వాళ్ళు కావాలి సరేనా” అని లోనికి పంపిచేసాడు. వాళ్ళు అచేతనంగా వెళ్లి పోయారు.
ఆ దృశ్యం చూడలేక భాస్కర్ “ఒరేయ్! నీకు ఈ భయంకరమైన ఆలోచన ఎందుకు వచ్చిందిరా? అసలు మన ఇంట్లో ఎవరూ సన్యాసం తీసుకోలేదు, నువ్వు గృహస్తుగా ఎంతో సాధించవచ్చు. ఎందరినో ఆదుకోవచ్చు. నీకున్న తెలివి తేటలతో నీ సృజనాత్మక శక్తితోఎన్నో గొప్ప కార్యాలు చేయగలవు . ఎందుకురా ఇలా మారిపోయావు?” అని తమ్ముణ్ణి హత్తుకొని ఒక్కసారిగా కుండ పగిలినట్లు విలపించాడు.
కేశవ కళ్ళు మూతబడ్డాయి ఒక అనిర్వచనీయమైన తన్మయత్వం ఆ పరిష్వంగంలో దొరికినట్లు ఉంది అతని మోము చూస్తే. అంతలోనే కళ్ళు తెరచి తన అన్నను తననుంచి సున్నితంగా విడదీసి కళ్ళలోకి సూటిగా చూసి చెప్పాడు:
“అన్నయ్యా! ఇలా ఇకపై నిన్ను పిలవలేను. ఇది ఆఖరి సారిగా పిలుస్తున్నాను. నేను మాధవిని మరచి పోదామని చేసే ప్రయత్నంలో మాధవుడు నాకు దారి చూపించాడు. నువ్వు అనుకొనే నా తెలివి తేటలు, మేధస్సు, సృజనశీలత , సౌశీల్యం, దలైనవవి లౌకిక విషయాలకు వెచ్చించడం కన్నా హరిని తెలుసుకోవడంలోనే, అతని గుణాలను కీర్తిచండంలోనే ఆయన కధలలు చెప్పడం లోనే ఉంది అని తెలుసు కున్నాను. ఇది నాకు దైవ నిర్ణయంగా తోచింది కనుక నా మార్గం ఇక సుగమం. వదినా నువ్వూ అనుమతి ఇవ్వండి!” అని చెబుతుంటే ఆ వాక్కులో ఒక మహత్తు, ఆ మోములో ఒక తేజస్సు, ప్రేమ, ఆనందం వర్ణనాతీతంగా గోచరమై భాస్కర్, మాలతి, పిల్లలు వంశీ విజయలు అచేతనంగా ఉండిపోయారు వాళ్ళలో ఇక విచారం లేదు మంత్ర ముగ్ధులైనట్లు. కేశవను చేరి ఆనందంతో అందరూ “సరే, నీ ఇష్టం” అన్నారు.
అంతలోనే మాలతి తేరుకొని “కేశవా! ఒక్క నిముషం నీకు ఇష్టమైన ఉప్మా చేసాను. బాక్స్ లో పెట్టి ఇస్తాను. మధ్యలో ఆకలి వేసినపుడు తిను” అని లోనికి వెళ్లబోతుంటే..
“అమ్మా ఒక్క విషయం వినండి. సన్యాసికి రోజులో కనీసం ఒకసారి భోజనం చేస్తే మరోసారి భోజనం గురించి చింత ఉండకూడదు. కేవలం మార్గంలో దొరికే భిక్షపైనే ఆధారపడి బతకాలి. ఆ బతకడం మహదానందంతో బతకాలి. ఒకచోట స్థిరంగా ఉండకూడదు. ఏదీ తనవెంట తీసుకొని వెళ్ళ కూడదు బట్టలు సైతం. భూమి ఇల్లు, ఆకాశం కప్పు అనే భావనతో బతకాలి. కనుక క్షమించు.” అని అన్నావదినతో చెప్పి, పిల్లలను “యశశ్వీభవ” అని దీవించి ఉత్తర దిక్కుగా సాగిపోయాడు కేశవ.
ఆ గేటెడ్ కమ్యునిటీ లో ఎవరికీ తెలియదు ఇక్కడ ఏమి జరిగిందో.
“మాధవి వాళ్ళ అమ్మనాన్న, ఆమె అన్నవదినా వస్తున్నారని తెలిసింది. వాళ్ళు మీకు ఫోను చేసారా?”
“లేదే!” భాస్కర్ విస్మయంతో చెప్పాడు.
“వాళ్ళ నైజం తెలుసు కదా మనకు వస్తున్నట్లు ముందుగా చెబితే మనం వాళ్ళకోసం ఏర్పాట్లు చేస్తామని ఎప్పుడూ అంతే. ఇతరుల ద్వారా మనం ఊళ్ళో ఉన్నామని ఖరారు చేసుకొని మరీ వస్తారు. సరే, మీరు కొంచం ఈ మిక్సీ లో ఇవి వేసి తిప్పండి నేను ఇప్పుడే వస్తాను” అని లోనికి వెళ్ళింది. అలా మిక్సీ వేయడం పూర్తి యింది ఇలా మాధవి కుటుంబం లోనికి వచ్చింది.
మాధవి తల్లి మాలతిని అక్కున చేర్చుకొని విలపించింది. మాలతికి శోకం ఆగలేదు కాని ఎందుకో మనసులో అంత బెంగలేదు.
అంతలో మాలతి తండ్రి కలగజేసుకొని “కేశవ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. ఎంతో మంచివాడు కనుక మాధవిని మరచి పోవడానికి చాల కాలం పట్టవచ్చు ఆనుకున్నాం కాని ఇంత జరుగుతుందని అనుకోలేదు. ఎందుకీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది కేశవకు?” అని అన్నాడు. ఆ గొంతులో ఆర్తి ధ్వనిస్తోంది.
ఆ మాటలకు సమాధానంగా భాస్కర్ “మాధవిని మరచిపోయే ప్రయత్నంలో మాధవుడు కలిసాడు అని చెప్పాడు. వాడు గత పది నెలలుగా ఎన్నో పుస్తకాలు చదివాడు. ఎప్పుడూ నెట్ ముందే ఉండేవాడు. ఏవేవో వేదాంతానికి సంబంధించిన విషయాలు ఉన్న సైట్లు చూసేవాడు. నాతో, వాళ్ళ వదినతో ఎన్నో వేదాంత విషయాలు చెప్పేవాడు. వాడు సంపాదించిన జ్ఞానం మాతో కొంచం కొంచం పంచుకొంటుంటే మాకు ఆశ్చర్యమేసింది. మేము కూడా పోనీలే ఇలాగైనా సంతోషంగా ఉంటున్నాడని మురిసిపోయే వాళ్ళం. కాని వాడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మేమూ ఊహించలేదండీ” అని ఖిన్న వదనంతో మౌనం దాల్చాడు.
మాధవి అక్క సుజన మాలతి వద్దకు చేరి: “నిజమే అక్కా ఇది మమ్మల్ని నిశ్చేష్టుల్ని చేసింది. నేను ఒకసారి ఫోన్ చేసినపుడు ఆశ్రమ ధర్మాలు అనే అంశంపై ఒక ఉపన్యాసానికి వెళుతున్నాను అని చెప్పి దానిపై తను చదివిన విషయాలు గురించి చాల చెప్పాడు. నేను కూడా కేశవ చాల ఆధ్యాత్మిక చింతనలోకి వెళిపోయాడు అని అనుకున్నాను. మధ్యలో మామూలుగానే కుశల ప్రశ్నలు కూడా వేసాడు. ఇది నాకు ఒక షాక్”
“సాధారణంగా ఏదో ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా వెళ్లడమో, లేదా ఏదో ఊరు వెళుతున్నట్లు చెప్పి తిరిగి రాక పోవడమో చేస్తారు ఇలా మీకు చెప్పి మరీ వెళ్ళడం మీరు కేశవను ఆపలేక పోవడం మాకు చిత్రంగా తోస్తుంది” అని మాధవి తండ్రి విస్తుబోయాడు.
“ఔను మాకు అలానే అనిపించింది కాని వాడు ఆఖరిసారి మమ్మల్ని చూసిన చూపులో వాడి ముఖం లోని కళ, తేజస్సు, వాడి మాటల్లో శక్తి మమ్మల్నిఏమీ చేయనీయలేదు. నిజానికి మాకు ఆ క్షణం ఇప్పుడు తలచుకున్న విచారం లేదు. ఏదో ఒక అతీత శక్తి వాడిని నడిపిస్తుంది అని మాకు అనిపిస్తుంది. అందుకే వాడిని తలచుకున్నపుడల్లా వాడి ఆ తేజోమయమైన మోము మాకు కళ్ళకు కట్టినట్లు మనసులో మెదులుతుంది.”
మొదటి రోజు:
కేశవ ఉత్తరాభిముఖంగా విశాఖ పట్నం నుంచి నడక ప్రారంభించాడు. సాయంత్రానికి అనకాపల్లికి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్న చెరువులో కాళ్ళు చేతులూ కడుగుకొని అక్కడ ఉన్న దేవాలయంలో సేదతీరి ఆ రాత్రి ఆకలి తీర్చుకోవడానికి బిక్షకు వెళ్ళగా అడిగిన మొదటి ఇంటిలోనే చక్కని ఆతిధ్యం లభించింది.
“ఎవరో మహానుభావులు మన ఇంటికి బిక్షకై వచ్చారు వెంటనే రా” అని తన భార్యను పిలిచి తను కేశవ కాళ్ళు కడిగి నీళ్ళు తలపై చల్లుకొని వస్త్రంతో కాళ్ళు తుడిచి ఉచితాసనాన్ని చూపించాడు ఆ ఇంటి పెద్ద.
కేశవకు ఇది చాల వింతగా తోచింది మనసులో “శ్రీహరీ” అనుకున్నాడు. “క్రిష్ణార్పణమస్తు” అని పీటపై కూర్చోగానే పిల్లలు విస్తర, నీళ్ళు, నెయ్యి పట్టుకొని వచ్చారు. ఇంటావిడ వేడి వేడిగా అన్నం చారు, వేపుడు కూర తీసుకొని వచ్చింది. ఇంటాయన శ్రద్ధగా కేశవకు వడ్డించాడు.
మనసులో శ్రీహరి కి అర్పణ చేసి భోజనం ముగించి లేచాడు కేశవ. అతని చేతులకు నీళ్ళు పోస్తూ “అయ్యా! మీరు ఈ రాత్రికి మా ఇంటిలో నే ఉండి ఉదయాన్నే బయలుదేరవచ్చుగా?” అని ఇంటాయన అనగా – “మీ ఆతిథ్యానికి చాల సంతోషం! కానీ నేను వెళ్ళాలి” అని చెప్పి బయల్దేరాడు కేశవ.
ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఇంటాయన ఆయన భార్య కాళ్ళకు నమస్కరించారు. “శుభం భూయాత్” అని వడివడిగా బయటకు నడిచాడు కేశవ. ఆ గృహస్థు సంభ్రమంతో కేశవను చూస్తూ ఉండిపోయాడు.
ఊరు దాటి జాతీయ రహదారి లో నడుస్తూ రాత్రి 12 గం. లకు రోడ్డుకు పక్కనే ఉన్న మరో పెద్ద ఊరులో ప్రవేశించి ఆక్కడ ఉన్న రచ్చబండపై నిద్రాదేవి ఒడిలోకి ఒరిగిపోయాడు.
ఉదయాన్నే పక్షుల కిలకిలతో ఎవరో లేపినట్లు మెలకువ వచ్చింది. ఎందుకో ఆ ఉదయం ఎంతో ప్రశాంతతని ఇచ్చింది. అక్కడే ధ్యానమగ్నుడై అలాగే చాల సేపు ఉండిపోయాడు. కొంత సేపటికి మరలా మెలకువ రాగా దంతధావనం చేసి పక్కనే ఉన్న పంపులోని నీళ్ళతో శౌచాన్ని ముగించి మరలా ప్రయాణం మొదలు పెట్టాడు.
మార్గమధ్యంలో కాలకృత్యాదులూ తీర్చుకొని తనకు నచ్చిన చోట ఆగి తన్మయంతో ధ్యానంలోకి జారి మరల బాహ్యస్పృహ రాగానే ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. ఇలా మధ్యాహ్నం 3 గంటలకు ఒక చిన్న పట్టణంలో అన్నదానం జరుగుతుంటే అక్కడ వైశ్వానర యజ్ఞం చేసి కొంత సేద తీరి మరల నడక మొదలు పెట్టాడు.
మధ్యలో గోదావరి తీరంలో ఎన్నోచోట్ల ఆగి పరవశంతో ధ్యానంలో మునిగి తేలుతూ దారిలో బిక్ష అడుగగా దొరికింది తింటూ, ఏమీ లేకపోతె నీళ్ళు తాగి, అక్కడక్కడ పిల్లలు ఆడుతుంటే చూస్తూ తనకు తెలిసిని అన్ని ప్రముఖ దేవాలయాలను దర్శించి ఇలా పల్లెలూ పట్టణాలు దాటి విజయవాడ చేరే సరికి ఇదు రోజులు పట్టింది. సాయంత్రానికి దుర్గమ్మ గుడి చేరి అమ్మవారిని దర్శించుకొని బయటకు వస్తుంటే ఒక భక్తి టి.వి చానల్ వాళ్ళు ఆయన వర్చస్సు చూసి
“స్వామి తమరు ఎవరు ఎక్కడికి ప్రయాణం అని అంటే”
“నేనొక సన్యాసిని గంగా తీరానికి నా ప్రయాణం”
“అక్కడ ఏమైనా విశేష పూజలు గాని యాగాలు గాని చేస్తున్నారా?”
“నన్ను నేను ప్రక్షాళనం చేసుకొనే ఒక గొప్ప యాగం చేయడానికి” అని వెళుతూనే చెబుతున్నాడు.
“ఒక మనిషి గంగలో మునిగినంత మాత్రాన తన పాపాలు పోయి పరిశుద్ధుడౌతాడా?”
“అన్నం తింటే ఆకలి తీరినపుడు గంగలో మునకా అంతే”
టి.వి చానల్ ఫోటోగ్రాఫర్ కేశవ ఫోటోలను చాల తీసాడు.
కేశవ వడిగా అడుగులేస్తూ గుడి బయటకు వచ్చేసాడు. నుదుటన అమ్మవారి కుంకుమతో దీదీప్యామానంగా మెరిసిపోతున్న మోముతో కృష్ణా తీరాన నడక సాగుతుంది. అంతకుముందే చాల సార్లు అలా నడచి నడచి ఒక తాటాకు పాక వద్ద ఆగి “భవతి భిక్షాం దేహి” అని అనగానే ఒకాయన బయటకువచ్చి “అయ్యో ఏమీ లేవు కాని సామి! ఈ కొబ్బరినీళ్ళు తాగండి” అని ఒక కొబ్బరిబోండాం కొట్టి ఇచ్చాడు. “మహా ప్రసాదం నారాయణార్పణమస్తు” అని స్వీకరించి మళ్ళీ ఆ మసక చీకటిలో కలసి పోయాడు.
ఎందుకో తెలియని ఉత్సాహం ఆ రాతంతా అలా నడుస్తూనే ఉన్నాడు. అలా మరో 5 రోజులు గడచి పోయాయి. ఈ 5 రోజుల్లో ఎందఱో కేశవని చూసి ఆ వర్చస్సుకు అభివాదాలు చేసారు
సరిగ్గా అదే సమయానికి మాధవి తల్లిదండ్రులు చూసి వెంటనే భాస్కర్ కు ఫోను చేసి “కేశవ గంగా తీరానికి వెళుతున్నాడట. బెజవాడ దుర్గమ్మ వారి గుడిలో ఉండగా భక్తి టి.వి. వాళ్ళు కేశవతో మాట్లాడారు” అని చెప్పి మరలా గతాన్ని నెమరువేసుకున్నారు.
కేశవ తీసుకున్న నిర్ణయం అతని మిత్రులకు కూడా తెలిసిపోయింది. కేశవ బాల్య మిత్రుడైన రఘు హుటాహుటిన గూగుల్ మ్యాప్ ద్వారా కాలి నడకన విజయవాడ నుంచి ఉత్తర భారత దేశానికి వెళ్ళే వివిధ దారులను తెలుసుకొని అన్ని దారులలోను విచారణ చేయించి తన మిత్రులతో కేశవ ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి శత విధాల ప్రయత్నాలు ప్రారంభించాడు.
మరునాడు సాయంత్రం ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు “నడచే సన్యాసి” శీర్షికన కేశవతో పాటు నడుస్తూ ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు:
“పూర్వాశ్రమం లో మీరు ఎవరు స్వామి?”
కేశవ చిన్నగా నవ్వుతూ “పూర్వాశ్రమం వదిలేశాక మళ్ళీ దానిని ఏ విధంగాను పట్టుకోకపోవడమే సన్యాసం”
“అంటే మీరు మీ పూర్వాశ్రమం గురించి చెప్పరా?”
మళ్ళీ అదే నవ్వు.
ఈసారి నిశ్శబ్దం. ప్రశ్నలు లేవు కొన్ని క్షణాలు. ఈ సమయంలోనే కేశవను అతని మంత్రజాలమైన మందహాసాన్ని కెమెరాలో బంధించేసారు.
“మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు?”
“ప్రయత్నమేవ అగ్రజం – మొదట నా ప్రయత్నం నేను చేయాలిగా!”
“ఆ ప్రయత్నం దేనికోసం”
“గంగా స్నానం !”
“అటు తరువాత?”
“ఆలోచించలేదు.” నడక కొనసాగిస్తూ సాగిపోయాడు కేశవ
ఇంతలో ఎదురుగా కేశవ బాల్యమిత్రుడు రఘు. కేశవను చూసి ఒక పక్క ఆనందం ఒక పక్క దుఃఖం మరోపక్క ఆశ్చ్యర్యం !
“ఏరా! ఇలా ఎందుకు చేసావ్రా? నీతో చాల మాట్లాడాలి.” అని రెక్క పట్టుకొని లాక్కుపోతుంటే కేశవ్ మౌనంగా అనుసరించాడు.
ఈసారి దొంగ కెమేరాతో మరొకడు అనుసరించాడు వాళ్ళని.
రఘుని అంతా చెప్పనిచ్చి చెక్కు చదరనీ నవ్వుతో ఒకే మాట చెప్పాడు కేశవ “నువ్వు విశ్వసించేది నిన్ను విశ్వసించవద్దు అంటే మానతావా?”
“లేదు. కానీ…” అని రఘు చెప్పెలోపల ఒక మహత్తరమైన చూపు రఘు అంతరంగాన్ని తాకింది. కేశవ తన చేతిని సున్నితంగా రఘు చేతినుంచి వదిలించుకొని నడక సాగించాడు. రఘు అచేతనంగా ఉండిపోయాడు.
దూరంగా ఒకాయన గృహస్తు ధర్మ పై ప్రవచనం చేస్తున్నాడు ఆయన మాటలు చిన్నగా చెవిని తాకుతున్నాయి
“ఆశ్రమ ధర్మాలు నాలుగు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇవి వరుస క్రమంలో గొప్పవి అనగా సన్యాసం ఉత్తమమైనది. యథానదీనదాః సర్వేసాగరేయాంతి సంస్థితిం-తదైవాశ్రమిణః సర్వేగృహస్థేయాన్తి సంస్థితిం. అంటే ఒక్క వానప్రస్థాశ్రమాన్ని వదిలేస్తే – ఇది కలియుగంలో నిషిద్ధం గనుక – మిగిలిన ఆశ్రమాలైన బ్రహ్మచర్య మరియు సన్యాసులు తమతమ దైనందిన భుక్తి కోసం గృహస్థు పైనే ఆధారపడాలి. అన్నం లేనిదే దేహం నిలువదు, దేహం లేనినాడు సమస్త ధర్మ, కర్మలు జరుగవు. ఎలాగైతే నదీనదాల నీళ్ళు సముద్రంలో కలవకపోతే, మేఘాలు పుట్టవో, వానలు కురవవో, అలానే గృహస్థు యొక్క స్థానం. అంటే బ్రహ్మచారులకు, సన్యాసులకు యదా శక్తి ఆతిధ్య సేవ చేయడం. అంటే గృహస్తు ఒక ముఖ్య బాధ్యతను బ్రహ్మచారుల సన్యాసుల పట్ల అవశ్యం నిర్వహించి తద్వారా ఉన్నతిని పొందాలి. ఇంకో మాటలో చెప్పాలంటే బ్రహ్మచారులు సన్యాసులు గృహస్థుకు ఒక అమోఘమైన పుణ్యాన్ని వారికి ఆతిధ్యం ఇవ్వడం ద్వారా గృహస్తుకు కలుగచేస్తున్నారు. ఈ భావనతో గృహస్థు సేవచేసి తరించాలి. నాపై ఆధార పడ్డారు అని అహంకరిస్తే కాలుని సమ్మెట వాతలు తినక తప్పదు.”
ఒక్క గంటలో కేశవను చేరాడు. తన డ్రైవర్ ను విశ్రాంతి తీసుకొమ్మని తను కేశవ వెంట నడిచాడు.
“మీరు కూడా సన్యసించారా ఏమిటి?” కేశవ అడిగిన మొదటి ప్రశ్న.
“లేదు మీ నుంచి సన్యాసం గురించి వినాలని వచ్చాను”
“నేను నా దేహాన్ని మనసును ప్రక్షాళనం చేసుకోవడానికి గంగమ్మ దగ్గరకు వెళుతున్నాను. నేను నాలోని మలినాలను కడుగుకున్నాకే నాగురించి చెప్పగలను. నేను సన్యసించి ఇప్పటికి కొద్ది రోజులే అయింది. సన్యాసిగా నేను మీకు ఏమి చెప్పగలను?” అని ఆగాడు కేశవ.
“సరే మిమ్మల్ని ఏది సన్యాసి గా మారడానికి ప్రోత్సహించిందో చెప్పండి”
“బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం. బ్రహ్మచారిగా నాకు జరుగ వలసిన సమయానికి బ్రహ్మోపదేశం జరగలేదు. అందువల్ల నేను ఒక భ్రష్టు పట్టిన బ్రహ్మచారిని. దైవ కృప వలన గృహస్తాశ్రమం లో ప్రవేశించి మరలా బయటపడ్డాను. ఇక నాకు అత్యంత అనువైన ఆశ్రమం సన్యసించడం. అది కనీసం వైదికంగా చేసి నన్ను నేను సంస్కరించుకొని, తెలుసుకొని తరించాలి అనే సంకల్పంతో ఈ గంగా తీర్ధ యాత్ర”
“ఇకపై అక్కడే అదే గంగా తీరంలోనే ఉంటారా?”
“ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఈ ప్రశ్నకు బదులు ఎలా చెప్పగలను?”
ఒక 29 ఏళ్ల కుర్రాడు సన్యసించి కాలి నడకన విశాఖ తీరంనుంచి గంగా తీరానికి ప్రయాణమయ్యాడు అనే వార్త దావానలంలా “వార్తలు తెలుసుకోలేని” వార్తా చానళ్ళకు ఒక మంచి మసాలా వార్తలా దొరికింది. దీనిపై పలు చానళ్ళు సన్యాసం అంటే ఏమిటి అని కొందరు సన్యాసుల్ని ముఖాముఖి కార్యక్రమం ప్రసారం చేయడం, ఆశ్రమ ధర్మాలపై చర్చ, కేశవను వెంబడించే ప్రయత్నం, దొంగగా చిత్రించిన రఘు కేశవను కలిసిన సంఘటన…. ఇలా తామర తంపరగా వార్తకు ఎన్నో వార్తలు చేరి చానళ్ళ చేతినిండా పని పడింది.
మరొక ఛానల్ నేరుగా భాస్కర్ ను కలవగలిగింది!!
కేశవ మిత్ర బృందంలో ఒకరు మాధవి మరణం గురించి ఆమెతో ప్రేమ, పెళ్లి గురించి చెప్పేశారు. ఇక కేశవ గురించి తెలుసుకోవడానికి అన్ని దారులూ తెరుచుకున్నాయి.
మాధవి తల్లిదండ్రుల్ని కూడా కలసాయి కొన్ని చానళ్ళు. ఇంతలో రఘు కేశవను ఫాలో ఔతూ నడుస్తూ మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకొని రఘుని ఆశ్రయించాయి.
పత్రికలూ, టివి చానళ్ళు పండగ చేసుకుంటున్నాయి. రఘుకి ఇది చాల రోతగా తోచింది. తన దగ్గరకు వచ్చిన ఒక పాత్రికేయునితో సావధానంగా అన్ని విషయాలు చెప్పి ఈ అనవసర ఆర్భాటానికి తెరదించాలని అనుకున్నాడు.
ఇంతలో మొదట కేశవకు భోజనం పెట్టిన గృహస్థు టివీలో ప్రత్యక్షమయ్యాడు:
“ఆ సన్యాసి ముఖం చాల తేజస్సుతో వెలిగిపోతుంది. మా ఇంట చాల తృప్తిగా ఆ రాత్రి భోజనం చేసి వెళ్లారు. ఆయన వెళ్ళిన సరిగ్గా నాలుగు రోజులకు నాకు ఎప్పటినుంచో తీరని భూమి తగాదా ఆశ్చర్యకరమైన రీతిలో తీరి మాకు ఎంతో లాభాన్ని బతుకు పై చాల ఆశలని కలిగించింది. ఈ సన్యాసి చాల శక్తివంతుడు ఆయన భోజనం చేస్తుంటే మా చంటోడు సెల్ తో ఫోటో తీసాడు అది మేము ప్రింట్ తీసి మా ఇంట్లో పెట్టుకున్నాము” అని చూపించాడు.
అంతే రాష్ట్రం మొత్తం ఈ యువ సన్యాసిని చూడడానికి ఉర్రూతలూగింది !!
ఈ లోగా మార్గంలో కేశవకు కొబ్బరి నీళ్ళు ఇచ్చిన ఒక రైతు కూలి మీడియా ముందుకొచ్చి “నేను ఆయనకు ఒక కొబ్బరి బొండం ఇచ్చాను అంతే నాకు మరునాడు ఇదిగో ఈ మిల్లులో మంచి పని దొరికింది నేను నెలంతా కష్టపడి సంపాదించిన దానికన్నా రెట్టింపు వస్తుంది ఆ కేశవ స్వామి సాదారనమైనోడు కాదు”
ఈ వార్తలను విశ్లేషన చేస్తూ చర్చల్లో కొందరు ప్రముఖులు, భాగవతులు, మేధావులు కూడా పాల్గొన్నారు. అందులో ఒకాయన : “కలి యుగంలో సన్యాసం చాల కష్టమైనది. నిజమైన సన్యాసులు మనం చాల తక్కువ మందిని చూస్తాం. నిజమైన సన్యాసికి అతను కోరకుండానే కొన్ని శక్తులు సిద్ధిస్తాయి. ఆయనకు భోజనమో, ఒక పండో, కనీసం మంచి నీరో ఇచ్చిన మాత్రాన విశేష ఫలం సిద్ధిస్తుంది. ఆయన దీవిస్తే నిజమౌతుంది, ఆయన ఏ దేవతను అర్ధించినా ఆ దేవత అవశ్యం ఆ కోరికను తీరుస్తుంది ఎందుకంటే నిజమైన సన్యాసులు వారికోసం ఏదీ కోరరు కనుక.. కనుక మాలాంటి వాళ్లకు సైతం అలాటి యతి పురుషుని చూడాలని ఉంటుంది” అని చెప్పేశారు!
***
రఘుకి ఇప్పుడు కేశవను ఈ మీడియా నుంచి ఎలా కాపాడాలి అనే కొత్త సమస్య ఎదురైంది. రఘు పేరు కూడా కేశవ పేరుతొ పాటు మార్మోగిపోతుంది ఇపుడు.
ఇది గమనించిన కేశవ “అయ్యా, మీరు నాగురించి కలత చెందవద్దు. నన్ను నామానాన వదిలేయండి అంతా నేను నమ్మే ఆ శ్రీ హరే చూసుకుంటాడు” అని రఘుని సాగనంపే ప్రయత్నం చేసి మరలా తన దారిన నడచుకొంటూ సాగిపోయాడు.
మధ్యలో పొలం గట్ల వద్ద, చెరువు గట్ల మీదా చెట్ల కిందా, తనను చూడడానికి వస్తున్న ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా వెళిపోతున్నాడు. ఈ మీడియా వలెనే ఒక మేలు కూడా జరిగింది. జనం నిశ్శబ్దంగా ఈ సన్యాసిని చూస్తున్నారు మినహా అతన్ని ఏమీ ఇబ్బందికి గురిచేయడం లేదు ఎందుకంటే రఘు ఒక చోట మీడియాతో మాట్లాడుతూ అన్న ఈ మాటల వల్ల: “ఒక యతి పురుషునకు ప్రతిబంధకాలు కలిగిస్తే మహా పాపం చేసినట్లు ఔతుంది. తిన్నగా నరకానికి టిక్కెట్ తీసుకున్నట్లే అని అన్నాడు”
రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆకట్టు కున్నది కేశవ గురించి వార్త.
ఇక రెండుమూడు రోజుల్లో రాష్ట్ర సరిహద్దుని దాటి మహారాష్ట్రలో ప్రవేశించవచ్చు అన్న వార్త తెలుగు ప్రజలను ఉద్వేగానికి గురిచేసింది. ఈలోగా మహారాష్ట్ర ప్రజలు కేశవకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు.
కేశవ వదిన మాలతి, కేశవ వెళిపోతూ సన్యాసిగా ఎలా జీవించ దలచాడో చెప్పిన మాటలు చాల టివీలు ప్రసారం చేసాయి. CNN-IBN అయితే తెలుగు చానళ్ళ నుంచి సేకరించిన క్లిప్పింగులతో చక్కటి కార్యక్రమం ఒకటి ప్రసారం చేసింది.
ఒకానొక దశలో కేశవ బిక్ష అడగడానికి కూడా భయపడే స్థితి వచ్చింది. అందుకనే ఆయన దేవాలయంలోకి వెళ్లి స్వామి తీర్ధ ప్రసాదాన్ని, అక్కడ పూజారి ఇచ్చిన కొబ్బరి ముక్క, అరటిపండ్లలు తీసుకోవడం మొదలు పెట్టాడు. ఇది తెలిసీ కేశవ నడిచే దారిలోని దేవాలయాలలో ఎందఱో దాతలు విశేష ప్రసాద వితరణ సైతం ప్రారంభిచారు!!
ఇక ఈ కధను మీ ఊహకు వదిలేస్తున్నాను.
ఉత్సాహం ఉన్నవాళ్ళు దీనికి కొనసాగింపు వ్రాయ వచ్చు – గొలుసు కధగా….