వరలక్ష్మిని ఏరికోరి పెళ్ళి చేసుకుని భాష తెలియని భోపాల్ తీసుకు వచ్చాడు కృష్ణారావు. వరలక్ష్మి కోనసీమలో పుట్టి పెరిగింది హైస్కూలు చదువు పూర్తి చేసింది. బి.హెచ్.ఇ.ఎల్ లో ఉద్యోగం చేస్తున్న కృష్ణారావుని పెండ్లాడి భాష తెలియని వూరువచ్చేసింది. హిందీ మాటలు ఏనాడూ వినకపోవడం వల్ల భోపాల్‍కు వచ్చిన దగ్గర నుండి ప్రతిదానికి ఆశ్చర్యం, భయం కలుగుతుండేవి.
“కొద్ది రోజులు ప్రయత్నించావంటే తప్పకుండా నీకూ హిందీ మాట్లాడటం వచ్చేస్తుంది. తరుచూ హిందీవాళ్ళతో మసలుతూంటే సరి. ఈ భయం, జంకు పోతాయి. వూరికే కంగారు పడుతూ కూర్చుంటే లాభం లేదు వరం!” భార్యకి ధైర్యం చెప్పాడు కృష్ణారావు.
భర్త యింటిలో వున్నంతసేపు ఎంతో చలాకీగా తిరిగేది. అతను డ్యూటీకి వెళ్ళగానే డల్‍గా తయారయ్యేది. అతను లేని సమయంలొ ఎవరైనా వస్తే ఎలా మాట్లాడాలి అన్నదే ఆమె చింత. వరలక్ష్మి స్వతహాగా మాటకార., వాళ్ళ వాళ్ళు “కాసేపు వూరుకుంటావా? నీకేమైనా ఇచ్చుకుంటాం!” అని బతిమాలినా వినకుండా వాగుతుండే వరలక్ష్మి యిక్కడికి వచ్చాక యించుమించు మూగదైపోయినట్లయింది.
@@@@@@
స్వంత కాపరానికి వచ్చిన పదిహేను రోజులకేమో కృష్ణారావు ఫేమిలీ ఫ్రెండు గోయల్ తన ఫేమిలీతో వచ్చాడు. అతిధి మర్యాదలు చెయ్యడానికి తలకిందులవుతున్నాడు కృష్ణారావు. భార్య చేత బజ్జీలు చేయించాడు. వాళ్ళు వద్డంటున్నా కొసరి కొసరి ప్లేట్లో వడ్డించాడు. గొయల్”కాఫీ హై బస్ కరో”అనేసరికి వరలక్ష్మి కాఫీ కావాలంటున్నారనుకుని, తనకి వాళ్ళ మాటలు అర్ధమౌతున్నాయ ని తెలియాలని వుబలాటపడి చక్కగా స్ట్రాంగు కాఫీ చేసి పట్టుకొచ్చింది. ఒక గుక్కడు కాఫీ తాగి ఆముదం తాగినట్లు ముఖం పెట్టారు.”అయ్యో! కాఫీ యెందుకు చేసావు వరం? వాళ్ళు తాగరు” కృష్ణారావు బాధపడుతూ.
“అదేమిటండీ విడ్డూరం వాళ్ళే కదా కాఫీ కాఫీ అంటే కాఫీ చెయ్యమన్నారనుకున్నాను”
“పిచ్చిదానా కాఫీ అంటె చాలు యింక వద్దు అని.”
“మరి టీ అనడానికి ఏమంటారు?”
“సర్లె నీకు హిందీ నేర్పడం నా వల్ల కాదు”
వీళ్ళిద్దరి సంభాషణతో గాభరా పడిపోయి అంత స్ట్రాంగు కాఫీ గటగట మూడు గుక్కల్లొ తాగేసారు గోయెల్, అతని కుటుంబ సభ్యులున్నూ.
@@@@@@
ఒక రోజు డ్యూటీలో వున్న కృష్ణారావుని పట్టుకుని సిన్హా బజకడిగేశాడు.”మీ ఆవిడకి మంచి మర్యాదా తెలియదు.మేం వెళితే అసహ్యంగా తిడుతోంది. నువ్వు యింట్లో లేవు. సరేలే కొత్త అని వూరుకుని వెంటనే వచ్చేసాము.ఇన్నాళ్ళ నీ స్నేహం మనసులో వుంచుకుని వూరుకున్నాను”
ప్రవాహంలా సాగిపోతున్నాయి సిన్హా మాటలు. కృష్ణారావుకి మూర్ఛ వచ్చినంత పనయింది. ముందు రోజు డ్యూటీలో పని ఎక్కువగా వుండి యిల్లు చేరేసరికి రాత్రి పదయింది.ఇంటికి వెళ్ళగానే వరం చెప్పింది ఎవరో ఫేమిలీతో వచ్చేరని ఎంత రమ్మన్నా లోపలికి రాలేదని ఎందుకో చిరచిరలాడుతూ వెళిపోయారని. వాళ్ళు ఎవరా అనుకుంటే యిప్పుడు లింకు తెలిసింది వచ్చినది సిన్హా ఫేమిలీ అని. “పోనీ ఏం తిట్టిందో చెప్పు భాయ్ నేను క్షమాపణ కోరుకుంటాను.”బతిమాలాడు కృష్ణారావు.
“మరోటీ మరోటీనా రండి రండి అని చాలా అసహ్యంగా తిట్టింది”అన్నాడు సిన్హా.
కృష్ణారావు పొట్ట చెక్కలయేటట్లు నవ్వడం మొదలుపెట్టాడు.”నీ ముద్దుల భార్య మమ్మల్ని తిట్టి అవమానిస్తే నీకు అంత నవ్వుగా వుందా?”కినుకగా ప్రశ్నించాడు సిన్హా. “రండి” అన్న మాట తెలుగులో ఎంత మర్యాదయిన పిలుపో నచ్చ చెప్పేసరికి కృష్ణారావుకి తాతముత్తాతలు కనిపించారు.
కృష్ణారావు పొరుగునే కపూర్ కుటుంబం వుంది. వరలక్ష్మిని భోపాల్ తెచ్చిన వెంటనే వాళ్ళకి పరిచయం చేసి ఆమెకి హిందీ రాదని, తను యింట్లో లేని సమయాల్లో ఏ అవసరమైనా సహాయం చెయ్యమనీ వాళ్ళ ముగ్గురు పిల్లలతో పాటు ఆమెనీ చూసుకోమని అప్పచెప్పేడు. వరలక్ష్మి వచ్చీరాని హిందీ మాటలు ముద్దుముదుగా పలుకుతూంటే వాళ్ళకి ఎంతో ముచ్చట. మాట అర్ధమయేలా చెప్పే తాపత్రయంలో మాట తొందరగా చెప్పలేక చేతులు తిప్పుతూ తన వుద్దేశాన్ని తెలియజేయటానికి ఆమె పడే అవస్థ చూస్తే సరదాగా వుండేది. అయినా ఏ విషయంలోను విమర్శించకుండా నెమ్మదిగా మాట్లాడించడానికి ప్రయత్నించేవారు.
ఒక నెల గడిచింది వరలక్ష్మి హిందీ కాస్త మెరుగయింది. మాటల్లో కృష్ణారావు తోటకూర పులుసులో బెల్లం వేస్తే యిష్టమని చెప్పేడు. ఆరోజు తోటకూర పులుసు చెయ్యడానికి సిధ్దపడింది. తీరా డబ్బాలో చూస్తే బెల్లం లేదు పోనీ కపూర్ వాళ్ళింటినుంచి తెస్తే మళ్ళీ యిచ్చెయ్యొచ్చు యిప్పటికి పనైపోతుంది భర్తకి నచ్చిన విధంగా వండి అతని మెప్పు పొందుదామని ఆశపడింది. బెల్లాన్ని హిందీలో ఏమంటారో గుర్తు రాలేదు సరేలే ఎలాగో ఒకలా తెలియజెప్పి పనిజరిగేలా చూద్దామని వెళ్ళింది “భాభీ బెదరఖ్ దేనా”అంది. గాభరా పడ్డారు యింటిల్లిపాదీ.
వరలక్ష్మి ఏమంటోందో వాళ్ళకర్ధం కాలేదు ఎన్నిసార్లడిగినా అదే మాట.ఇంతలో వరలక్ష్మికో వుపాయం తట్టింది.కూరలబుట్టలోంచి అల్లం ముక్క తీసి” ఏ అదరఖ్ హైనా?” అవునన్నారు. అలా అయితే బెదరఖ్ ఎందుకు తెలియడు అంది. ఆమెకేం కావాలో తెలుసుకోలేక అయోమయంలో వుంటే వరలక్ష్మికి మరో అయిడియా వచ్చింది. పంచదారలా తియ్యగా వుంటుంది, చాక్లెట్ కలర్ లాగా వుంటుంది ముక్కలాగ వుంటుంది అంటూ వివరించింది. పది నిముషాలు అవస్థ పడితే కపూర్ భార్య మీనా బెల్లం ముక్క చూపించి యిదేనా అనడిగే సరికి ఎవరెస్ట్ ఎక్కినంత గర్వంగా ఫీలయింది.
సాయంత్రం కృష్ణారావు డ్యూటీ నుంచి వచ్చాక కపూర్ కుటుంబ సభ్యులంతా వరలక్ష్మి సాహసోపేతమైన యీ సంఘటన చెప్పి నవ్వుకున్నారు కృష్ణారావు సందేహంగా “బెల్లాన్ని బెదరఖ్ అంటారని నీకెవరు చెప్పారు?”అడిగాడు.” నాకేం తెలుసు?మనం తెలుగులో అల్లం బెల్లం అనటంలే అలాగే వీళ్ళు అదరఖ్ బెదరఖ్ అంటారనుకున్నాను.”
నవ్వడానికి కూడా ఓపిక మిగల్లేదు కృష్ణారావుకి.
@@@@@@
వరలక్ష్మి వచ్చి ఆరు నెలలు గడిచాయి.హిందీ చక్కగా మాట్లాడటం నేర్చుకుంది.కాని భార్య హిందీ పాండిత్యం మీద కృష్ణారావుకింకా పూర్తి నమ్మకం కలగలేదు. ఒక రోజు సాయంత్రంవేళ కపూర్ యింటికి యిద్దరు పఠాన్లు వచ్చారు. అంతకు ముందురోజు కపూర్ తన తల్లికి సీరియస్ గా వుందని ఢిల్లీ వెళ్ళేడు.వచ్చిన పఠాన్లు మీనాతో గట్టిగా వాదిస్తున్నారు సంగతేమిటోనని వెళ్ళింది వరలక్ష్మి. చాల అత్యవసర పరిస్థితిలో వాళ్ళ వద్ద వెయ్యి రూపాయిలు అప్పు చేశారని, కపూర్ వూళ్ళో లేని విషయం తెలుసుకుని తనని బెదిరించాలని వాళ్ళు వచ్చారని కన్నీళ్ళతో వరలక్ష్మికి చెప్పింది. అంతే, వరలక్ష్మికి ఎక్కడలేని ఆవేశం ఆవహించింది అవసరం పడి అప్పు చేసినంత మాత్రాన యింటి యజమాని వూళ్ళో లేని సమయంలో కుటుంబాన్ని రచ్చకీడ్చడం ఏం మర్యాదని దుమ్మెత్తి పొసింది. మీ భార్యా బిడ్డల్ని దూరాభారాన వుంచి డబ్బే సర్వస్వం అని యిక్కడ స్త్రీలనిలా దుఃఖపెట్టి వ్యాపారం చేస్తె మీ కుటుంబాలకి శ్రేయస్సేనా అంటూ ప్రశ్నించింది. మర్యాదగా వినకుంటే పొలీసుల్ని పిలిచి న్యూసెన్సు కేసు పెడతానని బెదిరించింది వరలక్ష్మి. వచ్చిన పఠాన్లిద్దరూ మాట్లాడకుండా వెనుతిరిగి వెళిపోయేరు.
సంగతేమిటో తెలుసుకుందామని వచ్చిన కృష్ణారావు భార్య అనర్గళంగా హిందీలో వుపన్యసిస్తూ పెద్ద పులుల్లాటి పఠాన్లని బెదిరించడం చూసి తబ్బిబ్బయిపోయాడు.
ఇంతలో కపూర్ భార్య వున్నట్లుండి విరుచుకు పడిపోయింది, ఆమె అయిదు నెలల గర్భిణి , వరలక్ష్మి హడావిడిగా ఆటో తెప్పించి భర్త సహాయంతో హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆమెని పరీక్షించిన డాక్టరు విసుగ్గా “నలుగురేసి పిల్లలయితే యిలా తెలివి తప్పకేమవుతుంది డాక్టర్ల సలహా పాటించక ప్రాణాలమీదకు తెచ్చుకుని మా ప్రాణాలు తియ్యడంఏం బాగుందని” కామా ఫుల్ స్టాపు లేకుండా తిడుతోంది. పఠాన్ల గొడవవల్ల యిలా జరిగిందని వరలక్ష్మికి తెలుసు అయినా నచ్చచెప్పే మూడ్ లో లేదు.
“డాక్టర్, మీరు చాలా శాంతంగా ఓర్పుగా పేషెంట్లని చూస్తారని తెలిసింది. అయినా రోజూ వందల కొద్ది పేషెంట్లొస్తే మీరు మాత్రం విసుక్కోరా? నయం మీరు కాబట్టి ఈ పాటేనా శాంతంగా వున్నారు, యింకో డాక్టరయితేనా?” అంది వరలక్ష్మి. దాంతో సగం ఐసైపోయింది డాక్టర్. మీనాని పరీక్షించి మందులు రాస్తోంది.
వరలక్ష్మి ఒడుపుగా యోగక్షేమాలు విచారిస్తూ “మీ యింట్లో మీరు ఎన్నో వారు డాక్టర్? నాకు కొద్దిగా ఆస్ట్రాలజీ వచ్చు. మీ తెలివి తేటలు చూస్తుంటే మీరు అయిదో లేక ఆరో వారో కదూ!”
పూర్తిగా బుట్టలో పడిపోయింది డాక్టరు. “నువ్వు చాలా కరెక్ట్ నేను ఆరోదాన్ని” చాలా వుత్సాహంగా జవాబిచ్చింది.
“చూశారా, మీ తలిదండ్రులు డాక్టర్ల సలహా పాటించి వుంటే మాకింత మంచి డాక్టరు లభ్యమయేదెట్లా?” హిందీలో నవరస భరితంగా గది బయటి దాకా వినిపిస్తున్న భార్యా-డాక్టర్ల సంభాషణ విని
“ఔరా, వరం! నీ సంభాషణా చాతుర్యానికీ భాహా ప్రావీణ్యానికీ హేట్సాఫ్.” మనసులోనే భార్యని అభినందించేస్తున్నాడు కృష్ణారావు.
@@@@@@