ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వర్తమానం – ఒక అద్భుత బహుమానం!

Like-o-Meter
[Total: 0 Average: 0]

“2008 లో వచ్చిన రెసిషన్ పుణ్యమా ఎన్నో కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి రా రాయుడూ!” అని పార్క్ బల్లపై కూర్చొంటూ అన్నాడు నరసింహులు.

“మొన్నటికి మొన్న అప్పలసామి కొడుకూ కోడలు వాళ్ళ బుడ్దొణ్ణి వేసుకొని చక్కగా తిరిగి హైదరాబాద్ కి వచ్చేసారు. బిక్కూ బిక్కూ మంటూ అప్పలసామి వాడి భార్య ఉండే వాళ్ళు. ఇప్పుడు చూడు కార్లో మనవాడి తో చక్కగా తిరుగుతున్నారు. “

“ఔనూ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కదా, అప్పలసామి తమ్ముల్లిద్దరూ విడిపోయారా?”

“విడిపోయి సంవత్సరం అయింది. వాళ్ళు ఉన్న ఇల్లు అమ్ముకొని ఆ డబ్బుతో మూడు ఫ్లాట్లు కొనుకున్నారు. అప్పల సామి మాత్రం ఇక్కడే వాళ్ళ మావగారు ఇచ్చిన ఈ ఇంట్లోనే ఉంటున్నాడు.  వాడి పేరు మీద ఉన్న ఫ్లాటు అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బు తన కొచ్చే వడ్డీ డబ్బులతో హాయిగా గడిపేస్తున్నాడు.”

“వాళ్ళ కూతుళ్ళూ కూడా హైదరాబాదే వచ్చేసారటగా?”

“ఔను పోయిన దసరా తరవాత అందరూ హైదరాబాద్ కి వచ్చేసారు. ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకూ మొత్తం 8 మంది మనవలు.”

ఇంతలో అప్పలసామి కూడా అక్కడకే వచ్చాడు. వస్తూనే

“ఏమిటి విషయాలు చాల సేరియస్ గా మాట్లాడుకుంటున్నారు?” అన్నాడు.

నీ గురించేరా అని నరసింహులు అనడంతో…”నా గురించా నాకంత చరిత్ర ఉందా?”

“ఉందిరా నీకు నువ్వు నీ జీవితాన్ని మలచుకున్న విధానమే ఒక చరిత్ర.” అని అప్పలసామి చేతిలోని డబ్బా లాక్కున్నాడు రాయుడు. “ఏమి తెచ్చావు?”

“వాము ఏసిన జంతికలు  మా అమ్మాయి తెచ్చింది మనకందరకూ!”

“నీదిరా కుటుంబమంటే!” అని ఒక జంతిక తీసుకో ని అస్వాదించాడు నరసింహులు.
 
“నేను నమ్ముకున్న దైవం ఆయనపై మాకున్న విశ్వాసం నన్నూ నా భార్యను ఇప్పుడు సంతోషంగా ఉంచుతున్నాయి. పైగా నా భార్య విసుగెరగని ప్రయత్నం,  సహాయం మా కుటుంబాన్ని ఈనాడు ఇలా సుఖ సంతోషాలతో ఉంచాయి.” చాల గంభీరంగా చెపాడు అప్పలసామి.

“రాయుడు మన వృద్ధ సంఘానికి కొత్త కొంచెం వివరంగా నేనే చబుతాను” అని మొదలుపెట్టాడు నరసింహులు.

**********

అప్పలసామి ఈ ఇంట్లోనే (పార్కుకు ఎదురుగా కనిపించే చక్కని డుప్లెక్స్ ఇల్లు అది) నలుగురు పిల్లలనూ తనకున్న చిన్న జీతంలో చదివించి ప్రయోజకుల్ని చేసాడు. ఆఖరి సంతానం కొడుకు. ముగ్గురు కూతుళ్ళూ .  అందరూ వాళ్ళ తెలివితో మంచి ఉద్యోగాలు సంపాదిచాకనే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసాడు.  అమెరికా మోజు అందరికి ఉంటుంది కదా  వాళ్ళ భర్తల తో కలసి వాళ్ళూ అమెరికా వెళ్ళిపోయారు .

ఇద్దరికి  గ్రీన్ కార్డు కూడా ఉంది.  అప్పల సామి వాడి భార్య ఒక్కసారి కూడా అమెరికా వెళ్ళలేదు.  రమ్మనమని చాలాసార్లు అన్నా వెళ్ళలేదు.  ఏమైందో తెలియదు, పోయిన దసరా తరవాత వాళ్ళ పిల్లలందరూ కూడబలుక్కున్నట్లు అమెరికా విడచి హైదరాబాద్ కి వచ్చేసారు .
 
రాగానే వాళ్ళు స్వంతం గా ఒక్కొక్క అపార్ట్మెంట్ కూడా కొనుక్కున్నారు. ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క చోట సిటీలో ఉంటారు. వీడి కొడుకు కూడా ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడే ఉంటున్నాడు. పోయిన దీపావళి రోజు రాత్రి ఈ అప్పలసామి ఒక అద్బుతమైన ఉపన్యాసం ఇచ్చాడు అంతే మొత్తం మారిపోయింది.

“ఏమా ఉపన్యాసం ఏది మారిపోయింది?” అని ఉత్సుకతో రాయుడు అడగ్గా …

**********

“చాల సంతోషం పిల్లలూ మీరంతా తిరిగి హైదరాబాద్ రావడం తో మాకు ఎంతో ఆనడం కలిగింది. నా వయసు అరవై ఎనిమిది మీ అమ్మ లేక అత్త వయసు అరవై రెండు. ఇంకా మేము మా పనులు  మేమే చేసుకుంటూ నేనొక  పదేళ్ళు తనొక పదిహేనేళ్ళు బతుకుతాం అని అనుకుంటున్నాము. అంటే మే మిద్దరం కలసి ఒక పదేళ్ళు మీముందు ఉంటాము.
ఈ ముసలి వాళ్ళ కు ఒక చిన్న కోరిక మీరు నేరవేరుస్తారని చెబుతున్నాను.”

“చెప్పండి నాన్నగారు!” – అని పెద్ద కూతురు అనడంతో,

“నాకు భగవంతుడి దయవల్ల ఎనిమిది మంది మనవలు. ఇంకో ఏడు గడిస్తే బహుశః తొమ్మిది మంది మనుమలు. మా  ఇద్దరకూ మా అందరి మనుమల పుట్టిన రోజులు, పండుగలు, ఇక్కడే ఈ ఇంటిలోనే జరుపుకోవాలని ఉంది.  మా వియ్యలవారిని కూడా వారి వారి మనుమల పుట్టిన రోజులకు సాదరం ఆహ్వానిస్తాము. మీకు మా పై ప్రేమ ఉన్నది అని చెప్పడానికి మీరు మా ఈ చిన్ని కోరికను తీర్చాలి.

నాకు వస్తున్నా వడ్డీ డబ్బులు ఈ పుట్టిన రోజులు జరుపునేలా చేస్తాయి. నా తదనంతరం మీ అమ్మకు నా ఎఫ్.డీ ల పై వడ్డీ లు నాకు వచ్చే పెన్షను మీ అమ్మకు వస్తుంది. తన తదనంతరం ఉన్న సొమ్ము అంతా  మీ అందరకూ సమానంగా చెందుతుందని మీ అమ్మ  నేను సంతకం పెట్టిన రెండు వీలునామలు ఇవిగో. ఎందుకంటే ఎవరం ముందు పోతామో తెలియదు కదా అందుకని లాయర్నఅడిగి  మరీ  వ్రాసాము.

ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మరొక్క పది సంవత్సరాలు లేదా మేము బతికి ఉన్నన్ని నాళ్ళు మా మనుమల పుట్టిన రోజులన్నీ ఇక్కడే జరగాలి అలాగే మీ మేరేజి డే లు కూడా మీకు సమ్మతమైతే ఇక్కడే జరగాలి. అలా మన ఇంటిలో సంవత్సరంలో తొమ్మిది పుట్టిన రోజులు, నాలుగు మేరేజి డేలు ఇంకా మాపై ఎక్కువ మీకు ప్రేమ ఉంటే మీ పుట్టిన రోజులు కూడా ఇక్కడే జరగాలి .  అంటే 17 పుట్టిన రోజులు 4 మేరేజి డేలు వెరసి ఒక ఏడాదిలో 21 రోజులు ఇక్కడ మనమంతా కలసి ఉంటాము. 

అలాగే పండుగలు కూడా అంటే ఉగాది, రామ నవమి, మహాశివ రాత్రి,  కృష్ణాష్టమి, వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, కేదార వ్రతం ఇక మన పెద్ద పండుగ నాలుగు రోజులూ కలసి మొత్తం 12  పర్వ దినాలు – మీకు వీలుంటే – ఇక్కడ జరుపుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను మా వియ్యాల వారిని కూడా ఆహ్వానిస్తాము. ఇలా సం. లో  33 రోజులు పండగ వాతావరణం ఈ మన ఇంట్లో వెలసిల్లాలని  కోరుకుంటున్నాము” అని ముగించాడు అప్పల సామి .

 
అప్పల సామి భార్య చాల తెలివైనది మృదు స్వభావి పైగా చక్కగా మాట్లాడుతుంది.  ఆమె పేరు శారద. ఆమె అందుకొని:
 
“మీ నాన్నగారు/ మీ మామయ్యా గారు కొంచం పేరాశకు పోయారు అని మీరు అనుకొంటే ఈ 33 రోజుల్లో కనీసం 11 రోజులైనా  మీరందరూ మాముందు కdaలాడుతూ ఈ ఇంట్లో సంతోషంగా గడపాలి. ఇది నా ఆశ.  చివరకు మిగిలేవి కలకాలం గుర్తుంచుకోనేవి ఇలా మనం ఆనందంగా గడిపిన క్షణాలే కదా.  పైగా మేము మిమ్మల్ని 365 రోజులలో కనీసంగా 11 రోజులు మాతో గడపమనడం పేరాశ కాదనే అనుకుంటాను. ఏమో ఆయన చెప్పినట్లు ఇంకా మేము కలసి 10 ఏళ్ళు ఉంటె ఆ 110 రోజుల కోసం  ఈ పది ఏళ్ల కాలం గడిపేస్తాము. ఒక వేళ ఇంకా ముందుగానే వెళ్ళిపోతమేమో !! కనీసం మీతో గడిపాము అనే సంతోషం మిగులుతుంది.” అని ముగించింది.
 
పెద్దల్లుడు వాసు కలగజేసుకొని “అత్తయ్య! మీరు, మామయ్య గారు ఇంతగా చెప్పాలా మాకు. కాని మీరు లెక్కల్లో ఒక పొరపాటు చేసారు. మొత్తం 33 కాదు 36 – మీ ఇద్దరి పుట్టిన రోజులు మీ పెళ్లి రోజు కలుపుకొని.  దేనికి వీలు కాక పోయినా ఈ మూడు రోజులకు తప్పక వస్తాను నేను. ఇక మీ మనుమల పుట్టిన రోజుల పై మీకు పూర్తి అధికారం ఉంది. వాళ్లకు మీ దగ్గిరే  జరుపుకోవాలి ఉంటుంది. మీ ఆశీస్సులు మాకు కావాలి కనుక మా పెళ్లి రోజున మిమ్మల్ని కలవకుండా ఉండం.  ఇంకొక్క మాట. మీ ఆలోచన నాకు చాల బాగా నచ్చింది. మాకు ఇది మార్గదర్శకం కూడా.”

“తాతయ్య! నేను ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాక కూడా ప్రతి సారి ఇక్కడే పార్టి చేయాలి!” అని పెద్ద మనుమరాలు అంటే…
చిన్న మనుమడు కాశీ “ఇక్కడే ఎప్పుడూ ఉండిపోతే పోలా  ఇక్కడే హ్యాపీ గా ఉంటుంది” అని అన్నాడు.   అందరూ గొల్లుమని నవ్వేసారు.

శారద కళ్ళు వత్తుకుంది…మనుమడిని అక్కున చేర్చుకుంది.

**********

“ఇది రా రాయుడు నాకు తెలిసిన విషయం” అని నరసింహులు ముగించాడు.

అప్పల సామి కలుగచేసుకొని  “నరసింహులు చాల బాగా చెప్పాడు.  ఒకటి మాత్రం నిజం మా కోడలూ మా అల్లుళ్ళూ విశాల దృక్పథం ఉన్న వాళ్ళు. తారతమ్యాలు వారి మధ్యన ఆర్ధికంగా ఉన్నా, ఉన్నదానితో సంతోషపడడం వాళ్ళ నైజం.  అందువల్లే మా ఇంట్లో ఎప్పుడూ సంతోషమే తప్ప సంకటం ఉండదు.  ఆ మరొక్క ముఖ్యమైన విషయం ఏమంటే మా వియ్యంకులు పెద్ద మనసు కలవారు.  నేను మా పిల్లలతో కంటే మా వియ్యాలవారి తోనే ఈక్కువ సార్లు మాట్లాడతాను.  ఈ విషయం తెలిసి వాళ్ళూ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మనుమల, పిల్లల పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు.  ఒక విధంగా మాకు పోటీ కి వచ్చారు! ఇది నిజం గా ప్రేమ లో పోటీ ప్రేమించడం లో పోటీ.  మా మనుమలు వాళ్ళ పుట్టిన రోజు ఒకసారి మా దగ్గిరా ఇంకోసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర జరుపుకోవాలట!” అని ఆగి, మళ్ళీ కొనసాగించాడు.. 
 
“నిజానికి నాకు స్పూర్తిని ఇచ్చిన వ్యక్తి మా బాబాయి. మా బాబాయికి నలుగురు కొడుకులు.  ఆఖరి సంతానం కొడుకు అంటే వాడికి వాళ్ళ మాలిన ప్రేమ . అలాగే కూతురు అంటే కూడా. పెద్ద కొడుకు, రెండోవాడు, మూడోవాడు వాళ్ళ నాన్న అందర్నీ సమానంగా చూడడని  కొంత దూరంగా ఉంటారు.

మా బాబాయికి తగని కోపం.  మనవలు ఆడుకుంటూ అల్లరి చేస్తే కూడా సహించడు. మనవలు దగ్గరికి రారు.  ఒక్క ఆఖరి కొడుకు సంతానం కూతురి సంతానం మినహా. వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఏమీ అనడు.  ఒక రోజు పెద్దకొడుకు కూతురు చొరవ చేసి గాలికి గంటలు మోగే ఒక వేలాడేది హాల్ లో కడితే “ఇక్కడ ఇది ఎవ్వరు కట్టారూ?”  అని చాల చిరాకు పడుతూ దాన్ని పనివాడితో తీయించేసాడు.  అప్పుడు మొదలు, పెద్ద అబ్బాయి సంతానం ఇంటికి రావడమే తగ్గించేసారు. కేవలం సమయాలకు సందర్భాలకు వస్తారు. 

ఈ కోపంతోనే ముగ్గురు కొడుకుల్ని దూరం చేసుకున్నాడు .  ఈ ముగ్గురు కొడుకుల సంతానం లో ఒక మనుమడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు “మా తాతయ్యకు అసలే కావాలి వడ్డీ వద్దు”  అని మా అమ్మ అంటుంది ఎందుకంటే మా తాత మా  నాన్నతోనే మాట్లాడతాడు మాతో అసలు మాట్లాడాడు.  మాకు ఒక్క కథ కూడా చెప్ప లేదు.  మా చిన్న బాబాయి కొడుకునైతే తన బొజ్జ మీద ఎక్కించు కుంటాడు వాడితో గంతులు కూడా ఎస్తాడు.  మా అత్త పిల్లని కూడా బాగా ముద్దు చేస్తాడు. మా చిన్న బాబాయి మా అత్తయ్య పుట్టాకే మా తాతయ్యకు బాగా డబ్బులు వచ్చాయట. మా నాన్నకు మా తాతయ్య అంటే భయం.  ఎక్కువ మాట్లాడడు. మీకు ఇంకో విషయం తెలుసా మా తాతయ్య మా చిన్న బాబాయి కొడుక్కి ఒక పెద్ద బొమ్మల స్టాండు కూడా కొన్నాడు. వాడు ఎంత అల్లరి చేసినా ఏమీ అనడు. వాడి మాటలే మాకు ఎప్పుడు చెబుతాడు. మా తాతయ్య చాల బాడ్ బాయ్. 
 
ఈ మాటలు విన్నాక తెలిసింది ఈ పసి మనసు పై మా బాబాయి eMత వైషమ్యపు ముద్రను వేసాడో అని.
 
మా బాబాయి వియ్యంకులు కూడా మా బాబాయిని పెద్ద గా పట్టించుకోరు. ఎందుకంటే మా బాబాయి ఏమి చేసినా ఒక వ్యవహారంగా ఉంటుంది కాని దానిలో ప్రేమ కనిపించదు. కాని తన కూతురు ఆఖరి కొడుకు విషయంలో మాత్రం ప్రేమ ప్రస్పుటంగా తెలుస్తుంది.  ఇది అందరకూ తెలిసి అందరూ తనకు దూరమైయారు.   ఈ నగ్నసత్యం నాకు మంచి పాఠాన్ని చెప్పింది.  మా బాబాయి చేసిన తప్పు నేను చేయకూడదు అని. 

పైగా నాకి మధ్య ఒకాయన పరిచయమయ్యాడు.  పేరు గురునాధం. ఆయన ఒక మాట అన్నాడు:  “ఈ జనంలో చాలామంది భారతం, భాగవతం రామాయణం, భగవద్గీత చదవ కుండానే చనిపోతున్నారు.  వాళ్ళని పక్కన పెడితే చాల మంది కోపాలతో,  తారతమ్యాలతో , పాత సంఘటనలతో శాంతిని కోల్పోయి గతాన్నే నెమరు వేసుకొంటూ వర్తమానాన్ని వృధాగా గడిపేస్తున్నారు.  వర్తమానం మనకొక అద్భుతమైన కానుక దీనిని చక్కగా స్వీకరిస్తే మన ఘనమైన గతాన్ని సృష్టించుకుంటాం.  ఇక భావితవ్యమంటారా దానికి దారి మన వర్తమానమే చూపిస్తుంది.  ఈ అవగాహనతో బతికే వాళ్ళు కేవలం 1% ఉంటారేమో?”  ఇది నాకు ప్రమాణం గా మారింది.   నేను ఆ 1%  లో ఉండాలని కోరుకుంటాను. అందుకే నేను కనీసం మా పరివారంలో అందరినీ సమానంగా ప్రేమించ గలుగుతున్నాను.  సమాజంలో అందర్నీ సమానంగా చూడలేము, ప్రేమించలేము.  కనీసం నా పరివారంలో అందరినీ సమానంగా ప్రేమించ గలిగితే చాలు.   మా వియ్యంకుడు మొన్నీమధ్యన కలిసినప్పుడు చెప్పాడు “నేను ఎంతో మారాను బావగారు మిమ్మల్ని చూసి” అని.  నిజానికి నా గొప్పతనం ఏమీ లేదు ఇది ప్రతిఫలాన్ని ఆశించని ప్రేమ గొప్పతనం”.  వృద్ధాప్యం లో మనకు కావలసింది ప్రేమ కాని ఆ ప్రేమ మనం ముందు ఇస్తేనే వస్తుంది.  ఇది చాల మంది వృద్ధులు గమనించరు. అలాగే ఇప్పుడు వృద్ధులు కాని వారు కూడా  వృద్ధులు ఔవుతారనే సత్యాన్ని గమనిస్తే వారి వృద్ధాప్యం చక్కగా ఉంటుంది.

ఔనన్నట్టుగా తలలూపారు మిగతా వారు.

**********