ముందుమాట
బాలు మహేంద్ర ఉదకమండలం అందాలను చక్కటి కధ, ఇళయరాజా సంగీతం తో అనుసంధానం చేసి తీసిన వసంత కోకిల 80 లలో ఒక నూతన ఒరవడి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాను చాల మంది మరచిపోరు. ఈ సినిమా ది ఒక విషాదాంతం. అదే ఆధారం గా మరలా కమలహాసన్, శ్రీదేవి లను నాయకా నాయకులుగా ప్రస్తుతం వారున్న వయసు ఆధారం గా దీని కొనసాగింపు సినిమా వస్తే ఎలా ఉంటుంది అనే ఊహతో వ్రాసిన కధ ఇది:
* * * * * *
ప్రారంభం
“శ్రీనివాస్ గారు వచ్చే సమయం అయింది మీరిక సర్దుకోండి!” అని వసంత అందో లేదో తలుపు తెరుచుకొని శ్రీనివాస్ మీటింగ్ రూమ్ లోకి తనదైన రీతిలో వడిగా నడుచుకొంటూ వచ్చాడు .
“అంతా సిద్ధంగానే ఉందా?”
“ఎస్ సర్ .”
“మొదట నాకు మనం చూప బోయే PPT చూపండి. దానిలో ఇంకా మార్పులు చేయాలంటే చూద్దాం”
“సరే సర్”
ప్రొజెక్టర్ పనిచేయడం మొదలైంది. మొదటి స్లయిడ్ స్పష్టంగా ఉంది.
“మీ పేరు ఎక్కడా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం.” అంది వసంత.
అడుగకుండానే చెప్పిన ఈ మాట విని శ్రీనివాస్ హాయిగా నవ్వుతూ చూసాడు వసంత వంక…“నాకు తెలుసు వసంత, ఇది చాల కష్టమైనా నువ్వు ఎంతో చక్కగా చేస్తున్నావు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఎంతమంది ప్రయోజనాన్ని పొందుతున్నారు అనేది ముఖ్యం. “ఆలంబన” అనే మన ఈ సంస్థ ద్వారా చేస్తున్న మానవ సేవ కొనసాగాలంటే వ్యక్తులు కాదు మన పని, పద్ధతులు ముఖ్యం. మన కార్పస్ ఫండ్ ఎంతో చక్కగా నీ తెలివి వలన మంచి వడ్డీని సంపాదిస్తుంది.
ఇప్పుడు మనం ఇవ్వబోయే ఈ వివరణ వల్ల మనకు సంస్థలు ఇతోధికంగా ధన సహాయం చేయగలగాలి. ఇది నా లక్ష్యం. ఈ ఏడాది మనం మన టీమ్ కు మంచి ఇంక్రిమెంట్ తో పాటు ఒక బహుమతి ఇవ్వాలి ఏది ఇస్తే బాగుంటుంది నీ సలహా కావాలి.”
“తప్పకుండా! నేను మీకు వచ్చే సోమవారం మిమ్మల్ని కలిసినపుడు కొన్నినమూనాలు మీకు చూపిస్తాను”
“సార్! మిమ్మల్ని ఎప్పటి నుంచో ఈ ప్రశ్న అడగాలని కాని అడగలేక పోయాను”
“నాకు తెలుసు. నీ ప్రశ్న ఏమిటో నా కుటుంబం గురించేగా”
“ఔను సార్” .
“నా కుటుంబం అందరిలా నాదే కాదు అందరిదీ కూడా అదే మీరు, మనం సేవచేసే మనుషులు, వారి కుటుంబాలు. నేను ఒక అనాధను నేను స్కూల్ టీచర్ గా నా జీవితాన్ని ప్రారంభిచాను ఉదకమండలం లో అప్పడు వయసు చేసే పిచ్చి పనుల్లో భాగంగా ఒక వ్యభిచార గృహాని వెళ్లాను. అక్కడ మతి కోల్పోయిన ఒక అందమైన అమ్మాయిని కలిసాను.
ఆమెను మొదటి చూపులోనే చాల ప్రేమించాను. కానీ ఆమె స్థితి నా మనసుని కలచివేసింది. దానికి తోడు ఆమెను నాదానిగా చేసుకోవాలనే ఒక బలమైన కోరిక నన్ను ఆమెను ఆ చెర నుంచి విడిపించి నాతొ ఊటీకి తీసుకువచ్చేలా చేసింది. ఆమెతో నేను కొన్ని నెలల అద్భుతమైన జీవితాన్ని గడిపాను. ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి ఆమెను తీసుకొని వెళ్లి ఆమెను మామూలు మనిషిని చేద్దామన్న ప్రయత్నంలో ఆమెనే కోల్పోయాను. ఇది 25 ఏళ్ల నాటి మాట. అప్పటి నుంచి నేను ఇలా మానసికంగాఒంటరిగానే ఉన్నాను. కాని నేను నా ఆశయం విషయంలో ఒంటరిని కాదు మీరందరూ నాకు భగవంతుడు ఇచ్చిన ఒక మంచి తోడు.”
“మీరు రొటీన్ భగ్న ప్రేమికుల్లా లేరు. చాల ప్రాక్టికల్ గా వ్యవహరిస్తారు. పైగా జీవితంలో ఇంత గొప్ప స్థితికి వచ్చినా మీరు ఎందుకు అజ్ఞాతం గా గొప్ప పనులు చేస్తారు?”
“ఇది మంచి ప్రశ్నే! ఒకామెను భార్యగా ఊహించుకొని కొన్ని నెలల పాటు సహజీవనం చేసి ఆమెకు అన్నీనేనై నాకు ఆమె సర్వస్వమై కాలం గడిపాకా నేను – ఆ మాటకు వస్తే మనసున్న మనిషి ఎవరూ – వేరొక స్త్రీని నా భార్యగా ఊహించలేను.”
‘”మరి మీరు భాగ్యలక్ష్మి గారి గురించి వాకబు చేయలేదా?”
“చేయకుండా ఉండగలనా? మరునాడు కోలుకొని ఆ ఆయుర్వేద వైద్యుడి దగ్గర కెళ్ళి వివరాలు అడిగా ఆయన చెప్పలేక పోయారు. తిరిగి ఇంటికి వచ్చి మా పక్కింటి అవ్వకు విషయం చెప్పాను. అప్పుడు అవ్వ చెప్పిన మాటలు నాకు ఒక గురువు ఇచ్చిన సలహాగా తోచాయి. అందుకే ఇక నేను వాకబు చేయలేదు.”
“ఏమి చెప్పింది అవ్వ?”
“శీనూ, నీ గురించి నాకు తెలుసు. భాగ్యలక్ష్మిని చేరదీసి నువ్వు ఒక చిన్నపాపలా సాకావు. కాముకత తో ఎప్పుడూ ఆమెను చూడలేదు. నువ్వు ప్రయత్నిస్తే ఆ అమ్మాయి జాడ కనుక్కోవడం పెద్ద విషయం కాదు. కాని ఆ అమ్మాయి నిన్నే గుర్తించనపుడు నీ ప్రేమను ఎలా అర్ధం చేసుకోగలదు?”
“నీ దగ్గర ఎలాంటి రుజువు కూడా లేదు. ఆమెతో కలిసి కనీసం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. కేవలం గడిపిన కాలం తప్ప. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు నీకు తోడుగా ఉండి సాక్షులుగా ఆమెకు చెప్పగలం. నీ గురించి చెప్పే నీ తల్లిదండ్రులు నీ చుట్టాలు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు నీవే ఒక అనాధవు. నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు! ఇలాటి పరిస్థితుల్లో నువ్వు వెళ్లి నీ ప్రేమను విన్నవిస్తే ఆమె నమ్ముతుందని నీకు భరోసా ఉందా. మరొక్క మాట, ఆమె అమ్మానాన్నలు ఒకవేళ పెళ్లి కుదిర్చి, ఆ ప్రయత్నాలలో ఉంటే ఏం చేస్తావ్? లేదా ఆమె మామూలు మనిషిగా ఉన్నపుడు ఎవరినైనా ప్రేమించి ఉంటె ఆ ప్రేమించిన వ్యక్తీ ఆమెను ఇప్పుడు చూసి పెళ్ళికి సిద్ధమైతే లేదా వాళ్ళు మరలా వాళ్ళ ప్రేమను కొనసాగిస్తే ? ఆడపిల్లకు ఈ సమాజంలో కొన్ని పరిమితులు ఉంటాయి. భాగ్యలక్ష్మి మతి స్థిమితం లేనిదని నువ్వు చెబితే ఇప్పుడు భాగ్యలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు చాల అభ్యంతరం చెప్పవచ్చు. అసలు ఆమెను చూడనీయకుండా కట్టుదిట్టం చేయవచ్చు. నీపై ఉన్న పోలీసు కేసును మరలా వాడుకోవచ్చు.
ఆమెను నువ్వు ఒక వ్యభిచార గృహంలో కలిసానని నువ్వు ఎలా చెప్పుకోగాలవు? ఆమె అక్కడ ఉన్నది అని ఆమెకు ఎలా చెప్పగలవు? లోకం వ్యభిచార గృహానికి వెళ్లి వచ్చిన ఒక అమ్మాయి పవిత్రంగా ఉందంటే నమ్ముతుందా? ఇన్ని సమస్యలు ఉన్నాయి అని నన్ను వారించింది. అందుకే నేను ఇక ఆ ప్రయత్నాలు మానుకున్నాను.
సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఏ రైల్వే స్టేషన్ లో భాగ్య లక్ష్మిని ఆఖరిసారి చూసానో మరలా అక్కడికి నేను వెళుతున్నాను. నేను అప్పుడు పడ్డ వేదనను నాకు కలిగిన బెంగ మళ్ళీ పొందాలని కాదు. నాకున్న నేను కన్నా, అనుభవించిన ఒక మధుర స్వప్నంగా లో పాత్రలు ఆ ఊరు దాని పరిసరాలు ఆ గాలిని మళ్ళీ అనుభవించాలని వెళుతున్నాను. ఇలా అజ్ఞాతం గా ఉండి పనూ చేయడం చాల మజా గా ఉంటుంది నాకు. మన సంస్థ ద్వారా లబ్ది పొందిన వాళ్ళను కలవడం వాళ్ళ ఆనందాన్ని ఒక సాధారణ వ్యక్తిగా పంచుకోవడంలో ఉన్న ఆనందం వేరు. దానాలు గుప్తం గా చేయాలని పెద్దలు చెబుతారు. ఒక తాత్విక దృష్టితో నా జీవితాన్ని నేను పరికించాను. భాగ్యలక్ష్మిని కలవడం, ఆమె నాకు దూరం కావడం యాధృచ్చికాలు కావు. అవి దైవ సంకల్పాలు అని నాకు గత 25 సంవత్సరాల జీవితం తెలిపింది. నేను ఇలా ఒంటరి జీవనాన్ని గడపడం కూడా.
నిష్కామ కర్మ అంటే ఏమిటో నేను ఈ సంస్థ ద్వారా పనిచేస్తుంటే తెలుస్తుంది. మనిషికి ప్రేమ, ప్రేమించిన వ్యక్తే జీవన పరమార్ధం కాదు. దేవదాసు ఒక అపభ్రంశ జీవన శైలి. ఒక కళాసృష్టిగా తీసుకొంటే తప్పు లేదు కాని ఒక ఆదర్శంగా తీసుకోకూడదు. ఈ విధమైన ఆలోచనా విధానంతో ఒక భగ్న ప్రేమికుడిగా కాక ఒక సాధకునిగా జీవితాన్ని గడపడంలో ఎంతో సంతోషం ఉంది అని అనుభవ పూర్వకం గా తెలుసుకున్నాను. అలాగని ఇక భాగ్యలక్ష్మికి నా మనసులో చోటులేదు అని చెప్పడం లేదు. ఒక విధంగా ఆమె నా సర్వస్వం ఇప్పటికీ అని చెప్పేదే నేను ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉండడం.
* * * * * *
“55 ఏళ్ల వయసు నాది. ఇంకా మీరు నన్ను వదల లేదు. నాతో ఎందఱో పని చేస్తున్నారు, నాకు తోడుగా ఉన్నారు నన్ను నమ్మి నాకు సేవలు చేస్తున్నవాళ్లు ఉన్నారు ఇంత మంది ఉండగా లోటేముంది? నా వాళ్ళు అన్న వాళ్ళు నాకు చాల మంది ఉన్నారు. మీరందరూ లేరా?”
“కాదు మేడం మా ఉద్దేశ్యం లో మీరు ఎవరినైనా పెంచుకొని వాళ్ళ ని సాకడం లో ఒక మంచి జీవితం గడపవచ్చు కదా అని మా ఉద్దేశ్యం.” కవిత చాల సౌమ్యంగా విన్నవించింది. కవిత భాగ్యలక్ష్మికి వ్యక్తిగత కార్యదర్శి.
“ఈ కంపెనీ పెట్టింది లాభాపేక్షతో కాదు. ఒక్కసారి నాకంటూ వారసత్వం ఉందనుకో నేను ఏ ఆశయంతో విలువలతో ఈ సంస్థను నడుపుతున్ననో వాటిని కాలరాచి ఒక వ్యాపారి గా ఆ వారసత్వం మారదని నమ్మకమేమిటి? పిల్లల్ని పెంచంగలం కాని వాళ్ళ బుద్ధుల్ని కాదు కదా! మీరు నమ్మలేని నిజం ఒకటుంది. నాకు ఎప్పుడో పెళ్లి అయింది. నేను ఒక ఆక్సిడెంట్ లో తలకు పెద్ద గాయమై స్మృతిని కోల్పోయాను. అప్పుడు ఈ శీను అనే ఆయన నన్ను చేరదీసి వైద్యం చేయిస్తే నేను మరలా మామూలు మనిషిగా మారాను. నేను మా ఇల్లు చేరాక మా అమ్మ నాన్నలు “నువ్వు ఆడపిల్లవు, ఈ సమాజంలో కొన్ని పరిమితులు ఉన్నాయి గనుక నీ గతం ఎలా నీకు గుర్తులేదు. అలాగే నిన్ను చేరదీసి ఈ వైద్యం ఇచ్చిన వ్యక్తీ గురించి ఆలోచించడం మంచిది కాదు. అని చెప్పి నన్ను ఎన్నో విధాలుగా మరచి పొమ్మని చెప్పారు. నా దురదృష్టం వాళ్ళు నేను మామూలు మనిషినైన ఆరు నెలలకు ఒక ఆక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు అప్పటి నుంచి నా జీవితం ఎన్నో భయాలతో అవాంతరాలతో కొనసాగింది.
మామూలు మనిషినై నేను ఇంటికి వచ్చాక ఒకరోజు గాఢనిద్రలో ఉండగా, నాకు నేను శీను అనే వ్యక్తితో గడిపిన క్షణాలు, అక్కడ చేసిన అల్లరి…అంతా ఓ కలగా వచ్చింది. శీను అనే పేరు అప్పటి నుంచి నాకు తారక మంత్రమై పోయింది. నాకున్న ఒక గొప్ప అదృష్టం ఏమంటే నా కలలే. నా భర్త ఎప్పుడూ నాతోనే ఉంటారు. నా భర్త నాకు కలలో రోజూ కనిపిస్తారు. ఆయనతో నేను రోజూ కలలో గడుపుతాను. నేను అన్నీ నా శీనుకి నా ఏకాంతంలో చెప్పుకుంటాను. కలలో శీను ఎన్నో సార్లు వచ్చి నా సమస్యలకు పరిష్కారాలు కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయనే నా భర్త అని గురి కుదిరింది అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోవాలి నా కలల భర్త నాకు ఉన్నపుడు.
“ఇప్పటికీ మీ శీను మీకు కలలో వస్తుంటారా?”
“నా జీవితం నాకే చాల విచిత్రంగా తోస్తుంది తరచూ. ఒక్క నా శీనుకి భౌతికంగా దగ్గరగా లేకపోవడం మినహా నేను ఎప్పుడు నా శీను గురించి ఆలోచిస్తాను. ఏకాంతంలో నా శీనుతో మాటలాడుతాను. ఒక విధంగా నేను ఒంటరిని కాను అనే ప్రగాఢ మైన విశ్వాసం నాకు ఉంది.”
“ఇంతగా ప్రేమించే మీరు ఎప్పుడైనా మీ శీను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా.”
“ప్రయత్నించాను, అమ్మా నాన్న కాలం చేసాక, ఎవరికీ తెలియకుండా. అప్పటికే శీను ఊటీ వదలి వెళ్లిపోయాడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదట!”
“మళ్ళీ ప్రయత్నించలేదా?”
“ప్రయత్నిద్దామని అనుకున్నాను కాని మా ఇంట్లో నాకు బాసటగా ఉండే రామయ్య తాత అన్న మాటలు నన్ను ఆప్రయత్నం చేయనివలేదు.”
“రామయ్య ఏమన్నారు?”
“రామయ్య మంచి మనసున్న మనిషి. మా ఇంట్లో ఎప్పటినుంచో ఉంటున్నాడు. చిన్నప్పడు నన్ను స్కూల్ కి తీసుకొని వెళ్ళడం మొదలు నాకు చాల కధలు కూడా చెప్పేవాడు. అందుకే అతన్ని తాత అని పిలుస్తాను. అతను నాకు ఒక ఆత్మ బంధువు.”
“అవునా! రామయ్య తాతా ఏమన్నాడు?”
“అమ్మా ఒకవేళ ఆ శీను పెళ్లి చేసుకొని గతాన్నిమర్చిపోయి సుఖంగా ఉంటుంటే నువ్వు ఆయనకు దగ్గరకు వెళ్ళడం సబబా? ఒకవేళ ఆయన కూడా నీలాగే పెళ్లి చేసుకోలేదు అనుకుందాం. అప్పుడు నీగురించి ఆయన తప్పక వాకబు చేసి ఉండాలే? ఆయన వాకబు చేసినట్లు నీకు తెలియదు అనుకుందాం, కాని మనకున్న ఈ చిన్ని ప్రపంచం లో ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకో లేకుండా ఉండలేరు కదా? అంటే ఆయన ఆసలు వాకబు చేయకుండా నైన ఉండాలి లేక మిమ్మల్ని మర్చిపోయి ఉండాలి లేదా వేరే దేశానికి వెళిపోయి ఉండాలి. కీడెంచి మేలంచ మంటారు. ఒకవేళ ఆయన కాలం చేసి ఉంటె? నాకైతే ఏదో ఒక బలీయమైన కారణం, అంటే మీకు తెలియంది ఏదో ఆయన్ను మీ గురించి వాకబు చేయకుండా ఉంచి ఉంటుంది. కాబట్టి మీకు ఏది మంచిదైత అది చేయండి అని చెప్పాడు. “
“ఓహ్…” అంది కవిత.
“ఆ తర్వాత నేను చాల ఆలోచించి ఇక వాకబు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను కాని నాలో ఒక బలీయమైన విశ్వాసం ఉంది, నేను ఆయన్ని కలుస్తానని. అందుకే ఇక పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఒకరిని వలచాక మరొకరిని భర్తగా భావించలేను. నా కలలో శీను ఎప్పుడూ వస్తాడు. నాకు ఒక విషయం రూడి అయ్యింది నాకు భర్త ఉన్నాడు కాని నా కలల లో. నా కలలను నేను విశ్వసిస్తాను. ఎందుకంటే మొన్నభగవద్గీత పై ఒక డిస్కోర్స్ విన్నాను. మనలో మనం జాగృదావస్థలో ఉండగా జరిగే అన్ని భౌతిక, మానసిక క్రియలకు సాక్షి / కారణ భూతుడు భగవంతుడేనని. అలాగే మనం నిద్రావస్థలో ఉన్నపుడు మన భౌతిక క్రియలను శాశించే వాడు కూడా ఆ భగవంతుడేనట. అప్పుడు నిద్రావస్థ లో చూసిన కలలపై ఆ దేవుడి ప్రమేయం ఎందుకుండదు? కనుక కలలు కూడా వాస్తవమే అని నేను నమ్ముతాను!”
“మీరు ఎప్పుడైనా మరలా ఊటికి వెళ్ళారా?”
“మొదటిసారి కల వచ్చాక అమ్మకు చెప్పాను. అమ్మ నన్నుమందలించి ఇలా అంది – వద్దు రా! అదొక పీడకలగా మర్చిపో! జీవితంలో కొన్ని విషయాలు మరచిపోవడం చాల ఉత్తమం ముఖ్యంగా నీలాటి ఆడపిల్లకు! నీకు మతి తప్పినట్లు నువ్వు తప్పిపోయి ఎక్కడో పెరిగినట్లు ఈ ప్రపంచానికి తెలిసిన మరుక్షణం నీ చుట్టూ ఎన్నో కధలు అల్లుకుంటాయి. అవి నీకు ఎలాంటి మేలు చేయవు సరిగదా చాల కీడు తేగలవు. ఇప్పుడు నీ గురించి ప్రపంచానికి ఒక్క విషయమే తెలిసింది అది నీకు ఆ కార్ ఆక్సిడెంట్ లో తలకు బలమైన గాయమై గతం మరచిపోయినట్లు. ఒక సిద్ధ వైద్యుడి ఆశ్రమంలో ఉండి మరల స్వస్థత చేకూరినట్లు. ఈ విషయం లో ఎక్కడా సమాజానికి అవాకులు చవాకులు అల్లడానికి ఆస్కారం లేదు కనుక నువ్వు ఇలా నీకొచ్చే కలల ఆధారం గా మరల ఊటి వెళ్లాలని అనుకోవద్దు” అని నాలో చాల ఆలోచనను నా జీవితం గురించి చొప్పించే లా చెప్పింది. నిజానికి మా అమ్మ మంచి మాటకారి. ఆమె మాట్లాడితే ఎవరైనా మరల ప్రశ్నించే అవకాశం ఉండదు. అంటే ఆమె ఒక మాట చెప్పింది అంటే అది వేదం అన్న మాట. ఇది మా ఇంట్లోనే కాదు మా చుట్టాలకు, మా ఇరుగు పొరుగు వారికి మా స్నేహితులకు తెలుసు. అందుకే నేను అమ్మ మాటను తూ.చా. తప్పకుండా పాటించాను. నేను శీను తో పాటు మా అమ్మ తో కూడా ఏకాంతంలో నా ఆలోచనలు పంచుకుంటాను. అలా లౌడ్ థింకింగ్ చేయడం వాళ్ళ నా ఆలోచనలు ఇంకా నాకు స్పష్టం గా తెలుస్తాయి. మాట ఎంత శక్తివంతమైనదో మా అమ్మ నుంచే తెలుసుకున్నాను. ఆమెనే నేను అనుకరిస్తాను ఇతరులతో మాట్లాడే టప్పుడు.”
“మీరు నిజం గా వేదాంతి లా మాట్లాడుతున్నారు మేడం ఈరోజు. మీలో దాగిన ఒక కొత్తకోణం ఇప్పుడు తెలిసింది.” కవిత తన పేపర్స్ తీసుకొని “బాయ్” చెప్పి వెళ్ళిపోయింది.
* * * * * *
“ఇలా కూడా బిజినెస్ చేయవచ్చా?
“ఔను అని నిరూపించింది “సాత్విక్ ఆహారం”
“నిజంగానే ఒక వినూత్న వ్యాపార విధానం”
“గతంలో కొన్ని ప్రయోగాలు ఇలాంటివే జరిగినప్పటికీ చిత్తశుద్ది లోపించడం వల్ల అవి సఫలీకృతం కాలేదు”
“కానీ ఈరోజు “సాత్విక్ ఆహారం”ఒక నూతన ఒరవడిని భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పింది”
“ఏది చెబుతారో అది చేస్తారు అన్న మాటకు ప్రతీక గా నిలిచింది.”
“100 వ బ్రాంచ్ ఓపెన్ చేయడం కేవలం మూడు సం .ల లో సాధ్య మైంది అంటే అందుకు కారణం వాళ్ళ బిజినెస్ మోడల్.”
“ఫ్రీక్వెంట్ గెస్ట్ అనే పధకం నిజం గా ఇక్కడే అద్భుతం గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు”
“ఇక్కడ పనిచేయడానికి చాల పోటీ ఉంది ఒక్క సారి ఇక్కడ ఉద్యోగం దొరికితే ఇక వదిలి పెట్టేది ఉండదు.”
“పైగా ఒక్క సారి ఈ సంస్థలో చేరితే యజమానులూ ఉద్యోగులు అనే భేదం లేని పని వాతావరణం ఉండడం వలన పని చేసే తీరు ఆశ్చర్య పరచే లా ఉంటుంది. ఎన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే ఇది సాధ్యం?”
ఇది 100 వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిధులు మాట్లాడుకుంటున్న మాటలు.
భాగ్యలక్ష్మి చాల సాదా సీదా చీర చాల అందంగా కట్టుకొని చాల పొందికగా చిరునవ్వుతో వేదిక మీదకు వచ్చింది.
“మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాల సంతోషం. మీ అందరి ఆదరణ మీరు స్వచ్చతకు పరిశుభ్రత కు ఇచ్చే ప్రాధాన్యత వల్లే మేము ఈరోజు ఈ 100 వ బ్రాంచ్ ని ప్రారంభించగలుగు తున్నాము. మీకు నచ్చే రీతిని మా సేవలను ఉత్పత్తులను అందిస్తూ ఇంకా ప్రగతి ని సాధించగలమనే అచంచలమైన విశ్వాసం తో ఈరోజు ఉన్నాము.
అన్నాన్ని అమ్ముకోవడం మన సనాతన ధర్మం లో నిషిద్ధ కర్మ అలాటి కర్మను కామ్యం తో కాకుండా శ్రద్ధ తో చేయడం వలన ఆ పాపాన్ని కొంతైనా తగ్గించుకొని ఎంతో కొంత పుణ్యాన్ని మూట కట్టుకోవాలనే మా తపన ఈరోజు ఆ భగవంతుని ఆమోదాన్ని కూడా పొందింది అనడానికి తార్కాణమే మేము మీ సహకారంతో సాధించిన ప్రగతి. లాభం అనే పదానికి ఉన్న తాత్విక అర్ధం మేము ఒక స్థాయిలో అర్ధం చేసుకున్నాము . మేము ఈ పదానికి ఉన్న పరమార్ధాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్న రోజు మేము అసలైన ప్రగతి సాధించినట్లు. అంటే మేము ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది.
ఈ సందర్భం లో మీకొక నిర్ణయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తాం. అదేమంటే “ఆలంబన” అనే ఒక సేవా సంస్థ తో మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. మా సంస్థ ఈ 100 వ బ్రాంచ్ ద్వారా సంపాదించిన లాభంలో 1 శాతం మా డొనేషన్ గా ప్రతి నెలా పంపుతామని. ఈ సంస్థ చాల జీవితాలలో వెలుగులు నింపింది. ఇక పై మా CSR కార్యక్రమాలన్నీ ఈ సంస్థ ద్వారానే జరుపుదామని నిర్ణయించుకున్నాం. “ఆలంబన” తరఫున వసంత గారు వచ్చారు ఆమె ను మా ప్రముఖ కస్టమర్ అయిన శారద గారినుంచి ఒప్పందం డాక్యుమెంట్ ను స్వీకరించా వలసినది గా కోరుచున్నాం.
* * * * * *
“చాల సంతోషం వసంత గారు మీరు వచ్చినందుకు.”
“మీకు మేము ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మా ప్రపోసల్ పై ppt చూసిన వెంటనే మీరు ఆమోదించడం పైగా 1% లాభాన్ని మీరు డొనేషన్ గా మాకు కేటాయించడం మాకు చాల ప్రోత్సాహాన్ని ఇచ్చింది.”
“మీ సంస్థ పని తీరు పారదర్శకత చూసి నేను మన దేశం లో ఇలాంటి సేవా సంస్థ ఉందా అని ఆశ్చర్య పోయాను. మీ సంస్థ ద్వారా లబ్ది పొందిన వారిలో మా సంస్థ లో పని చేసే ఉద్యోగి అక్క కూతురు కూడా ఉంది. ఆమె మెడికల్ కాలేజీ ఫీజు మీ సంస్థ కడుతున్నట్లు ఆమె ఈ సం . రం పట్టా తీసుకొని ప్రభుత్వ డాక్టర్ గా సేవ చేయడానికి సమాయత్తమౌతుంది అని నాకు తెలిసింది. మీరు సహాయాన్ని అందించడానికి పెట్టిన షరతులు నాకు బాగా నచ్చాయి ఈ అమ్మాయి విషయంలో.”
“థాంక్స్ మేడం మీ ప్రోత్సాహానికి”
“యు అరె వెల్కమ్ వసంత”
కవిత వసంతను సాదరంగా సాగనంపడానికి సమాయత్తమైంది
“నా పేరు కవిత”
“చాల సంతోషం మీ వాచ చాల బాగుంది ఫోనులో దానికి తగ్గట్టుగా రూపం కూడా”
“చూసే వాళ్ళ కళ్ళలోనే అంతా ఉంటుంది అంటారు”
“కాదు ఇది నిజం కవిత గారు’
“థాంక్స్”
“మీ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చాల ముచ్చటగా మాట్లాడతారు మీ బాస్ కూడా మా మేడం లానే ఒక గొప్ప వ్యక్తీ అయి ఉంటారు”
“మా కు బాస్ లేరు కవిత గారు, మేము సమిష్టిగా అన్ని నిర్ణయాలు తీసుకుంటాము. నేను చేసే పనివలన నా స్థితి ఉంటుంది.”
“నిజం గానా, నమ్మశక్యం గా లేదు వసంత గారు!”
“నిజమే కొన్ని నిజాలు అలానే ఉంటాయి, ఈ విషయం లో నేను చాల సార్లు ఇరకాటం లో పడుతుంటాను”
“అంటే మీరే బాస్ అన్న మాట”
“ఎంత మాత్రం కాదు కవిత గారు, మాది సమిష్టి బాధ్యత”
* * * * * *
“సార్ “సాత్విక్ ఆహారం” గురించి విన్నారా?”
“విన్నాను చాల వినూత్నమైన వ్యాపార దృక్పధం అది.”
“లక్ష్మి గారు అని ఆ సంస్థ ఛైర్పర్సన్ నిన్నేనే కలిసాను.”
“ఔనా వెరీ గుడ్ ”
“మన ppt నచ్చి వెంటనే వాళ్ళ నూరవ బ్రాంచ్ లాభాలలో 1% మనకు ప్రతినెలా డొనేషన్ గా వస్తుంది ఈ నెల నుంచి”
“ఇట్స్ రియల్లీ వెరీ నైస్ అఫ్ థెం, వెరీ గుడ్ ఇంకా ఎన్ని సంస్థలు మన టార్గెట్ లో ఉన్నాయి?”
“మన అసెస్మెంట్ కరెక్ట్ సర్ ఎందుకంటే మనం టార్గెట్ చేసిన కంపనీలలో మనం ఇప్పటికే 80% కవర్ చేసాం మనకు ఆల్రెడీ ఆ 80% కంపెనీల నుంచి 60% commitments వ్రాత పూర్వకంగా వచ్చాయి. ఈ ఏడాది మన కార్పస్ ఫండ్ 230 కోట్ల నుంచి 300 కోట్లకు పెరుగుతుంది అనే ఆశ ఉంది.”
“చాల మంచి వార్త చెప్పావు.”
“మన బ్యాంకు ద్వారా నగదు సహాయం చెల్లింపులు ఈ సారి 50% పెరగనున్నాయి.
“సాత్విక్ ఆహారం” వాళ్ళు కూడా బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారానే డొనేషన్ అందిస్తానన్నారు ప్రతి నెలా.
మీరు వీలు చూసుకొని ఒక్క సారి “సాత్విక్ ఆహారం” కి వెళ్లి లంచ్ లేదా డిన్నర్ తినండి. వాళ్ళ 100 వ బ్రాంచ్ కేవలం ఉపహారాన్నే సర్వ్ చేస్తుందట మీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా అక్కడ ఒక సారి ట్రై చేయండి.”
“ఓ సరే, వసంత, నేను వస్తాను” అని తన కార్ వైపు నడిచాడు శ్రీనివాస్.
* * * * * *
“గుడ్ మార్నింగ్, వసంత హియర్”
“నమస్కారం వసంత గారు, నేను కవితని “సాత్విక్ ఆహారం” నుంచి.”
“వావ్, నమస్కారం కవిత గారు బాగున్నారా వాట్ ఎ సర్ప్రైజ్”.
“ఏమీ లేదు నేను ఒక పనిమీద మీ ఆఫీస్ దగ్గరకే వస్తున్నాను ఈ సాయంత్రం మీకు వీలుంటే మిమ్మల్ని కలిసి మీ ఆఫీసు కూడా చూద్దామని”
“మోస్ట్ వెల్కమ్ కవిత గారు. తప్పక రండి. ఎన్ని గంటలకు వస్తున్నారు ?”.
“థాంక్స్, వసంత గారు నేను 5.00 గంటలకు మీ ఆఫీసు లో ఉంటాను”
“వెరీ నైస్ కవిత గారు. మీ కోసం వెయిట్ చేస్తాను”.
* * * * * *
శ్రీనివాస్ తలుపు తెరుచుకొని లోనికి వెళ్ళగానే ఒక యువకుడు నవ్వూతూ నమస్కరించి ఖాళీ గా ఉన్న టేబుల్ వైపు సాదరం గా ఆహ్వానిస్తూ “సర్ మీరు ఒక్కరేనా మీతో ఎవరైనా వచ్చార?” అని మృదువైన స్వరం తో అడిగాడు
“నాకు రెండు సీట్స్ కావాలి”
ఓకే సర్ అని ఒక కార్నర్ టేబుల్ వద్దకు తీసుకొని వెళ్ళాడు.
కొంచం సేపటికి శ్రీనివాస్ డ్రైవర్ రాజు వచ్చాడు.
“సర్, ఈ హోటల్ చాల డిఫరెంట్ అన్ని విధాల. రెట్లు కూడా చాల న్యాయం గా ఉంటాయి.”
“ఔనా” అని అనే లోపున ఒక యంగ్ సర్వర్ వచ్చాడు.
“మీరు ఇలా లోనికి వచ్చారు అప్పుడే మా లక్ష్మి మేడం గారు కిచెన్ నుంచి బయటకు వచ్చి కిందకు వెళ్లి పోయారు ఆమె మా అందరి పాలిటి నిజంగానే శ్రీమహాలక్ష్మి”
“చాల సంతోషం బాబు” అని టిప్ గా ఒక 10 అదనంగా రూపాయలు ఇచ్చి బయలు దేరాడు.”
ఆ టిప్ ఆ సర్వర్ ఒక బాక్స్ లో జారవిడిచాడు శ్రీనివాస్ చూస్తుండగానే. అ బాక్స్ పారదర్శకం గా ఉండడం తో అప్పటికే సమకూరిన చాల ధనం కనిపిస్తుంది. ఆ బాక్స్ పై “ఆలంబన” అని వ్రాసి ఉంది లోగో తో సహా!!
శ్రీనివాస్ వదనం లో ఒక విచిత్రమైన మార్పు కనిపించింది.
***
కవిత గారు వెల్కమ్.
కుర్చీలో కూర్చొంటూ “ఇక్కడ ఒక ISB ప్రొఫెసర్ ఉంటారు ఆయన ఇంటికని వచ్చాను వాళ్ళ మనుమరాలిని చూడడానికి. అప్పుడు గమనిస్తే మీ ఆఫీస్ ఇక్కడే చూసా అందుకే ఇంత షార్ట్ నోటీసు లో మిమ్మల్ని కలిసాను”
“మీరు చెప్పే ప్రొఫెసర్ కృష్ణ మూర్తి గారు కదూ”
“ఓహ్ వరల్డ్ ఇస్ సో స్మాల్ ఆయనే వసంత గారు”
ఆయన మా “ఆలంబనపై ఒక కేస్ స్టడీ వ్రాసారు అందుకు నేనే కావలసిన డేటా ఇచ్చాను”
“ఇప్పుడు ఆయన మా సంస్థపై ఒక కేస్ స్టడీ వ్రాస్తున్నారు అలా పరిచయమింది ఆయనతో నాలుగు నెలల .క్రితం ఆయన చాల మంచి మనిషి”
“ఔను నాలుగు నెలలో మీరు ఆయన మనుమరాలిని చూడడానికి వచ్చారంటేనే తెలుస్తుంది ఒక మంచి పరిచయం ఆయనతో మీకు ఏర్పడిందని.”
“ఔను ఆయన ఒక మంచి గురువు కూడా”
“మీ ఆఫీస్ చాల బాగుంది” కవిత
“చాల ఆశ్చ్యరం గా ఉంది మీ సంస్థ పని తీరు” వసంత
ఒక్కటి మాత్రం నిజం మనం రెండు మంచి సంస్థల్లో పనిచేస్తున్నాం : కవిత
ఔను ఆ సంతృప్తి జీవితంలో చాల ముఖ్యమైనది. మీ మేడం గార్ని చూడగానే చాల ప్రశాంతత కలిగింది. మీరు నిజంగా అలాంటి వారి దగ్గర పనిచేయడం మీరు చేసుకున్న పుణ్యం. మీ మేడం పని తీరు,ఆలోచనా విధానం చూస్తుంటే చాల ఉత్తేజం కలుగు తుంది ఒక స్ఫూర్తి ని పొందుతాం కూడా: వసంత :
ఔను మీరన్న మాటలే చాల మంది అన్నారు ఈ మాటలు విన్నపుడు నాకు నా పై ఉన్న విశ్వాసం ఎక్కువ ఔతుంది ఎందుకంటే మాకు మా మేడం పై ఉన్న విశ్వాసం నిజానికి ఆమె చెప్పినట్లు మాకు మా పై ఉన్న విశ్వాసమే: కవిత
వెల్ సెడ్. మీ రన్న మాటలో చాల అర్ధం దాగి ఉంది. మీరు ఏమీ అనుకోనంటే నాకు మీరు మీ మేడం గురించి చెబుతారా?:వసంత
కవిత: ఆ ఒక్కటీ అడగొద్దు. ఆమె ఒక మాట అన్నారు మాతో. నిజానికి ఒక మాట తీసుకున్నారు మా నుంచి. “నా గురించి మీరు తెలుసుకోవలసింది ఏమి లేదు ఎందుకంటే నేను ఒక సాధారణ స్త్రీని. పెద్ద చరిత్ర ఉన్న దానను కాను నేను ఏపని చేయడాని మొదలు పెట్టానో అదే ఈ వ్యాపారం. అది తెలుసుకొంటే నన్ను తెలుసుకున్నట్లే” అని చెప్పారు. అదుకే మేము ఎవ్వరం ఇక ఆ విషయంపై ఆమెను ఇబ్బంది పెట్టలేదు పెట్టబోము కూడా.
ఒక్క సారిగా వసంత మదిలో ఎదో తెలియని భావం మెదిలింది. ఈ లక్ష్మి భాగ్యలక్ష్మి అయితే అని ఒక ఆలోచన, ఆశ. మళ్ళీ తనలో తానె నా పిచ్చి కాని ఇది సాధ్యమా అని కూడా. ఇదే మాట వసంత ఇంటికి వెళ్లి తన భర్తకు (మోహన్) చెప్పింది. మోహన్ కూడా అలానే ఆశ పడ్డాడు. ఒక్క వసంత కు తన భర్త మోహన్ కు తక్క ఎవ్వరికీ తెలియదు శ్రీనివాస్ “ఆలంబన” అనే సంస్థకు అజ్ఞాత మార్గదర్శి అని.
“మనకు తెలుసు శ్రీనివాస్ గారు ఎంతటి ఉన్నతమైన వ్యక్తో అలాగే మనకు తెలుసు ఆయన జీవితంలో ఏది కోల్పోయారో. ఇది మనకు సహజం ఆయనకు మంచి జరగాలని అనుకోవడం. కాని ఎట్టి పరిస్థితుల్లోను మనం శ్రీనివాస్ గారి గురించి ఎవ్వరికీ ఇసుమంత కూడా చెప్పకూడదు. మాటల్లో నాకు చాల సార్లు నాలుక చివరి వరకూ ఆయన పేరు వస్తుంది కాని నేను అలాగోలా కంట్రోల్ చేసుకుంటాను. శ్రీనివాస్ గారు చెప్పినట్లు కలి కాలంలో తనది కాని ధనాన్ని ఇతరులకు ఇస్తూ తనది ఇచ్చినట్లుగా పేర్లు ఫొటోలతో పేపర్లకు ఎక్కే కుహనా నాయకులున్న చోట ఆసలైన నాయకులు ఉండరు అని. అందుకే నేను నీకే మొత్తం వ్యవహారాలు వదిలిన ఒక నిమిత్త మాత్రుని గా నా విధులు చేసుకొని పోతున్నాను. శ్రీనివాస్ గారు ఈ మధ్య భగవద్గీత ను బాగా అధ్యయనం చేస్తున్నట్లు ఉన్నారు ఆయన తరచూ దానిలో దాగిన అద్భుతమైన చాల సరళమైన విషయాలను, నియమాలను చెబుతున్నారు. ఆయన మనకు దొరకడం మనం చేసుకున్న పుణ్యం సుమీ” అని ఒక్క సారి కళ్ళు మూసుకున్నాడు మోహన్.”
వసంత మోహన్ భుజంపై తన తలను ఆన్చింది… నిశ్శబ్దం ఎన్నో ఊసులు చెప్పింది.
***
“గత 5 సం లు గా “ఆలంబన” పనిచేస్తూ కోట్ల కొలదీ ధనాన్ని కార్పస్ ఫండ్ గా సమకూర్చుకొంది. అది ఒక బంగారు బాతు.
మనం “ఆలంబన” సొసైటీ లో సభ్యులు గా చేరదాం, మనం కూడా కొంత కార్పస్ ఫండ్ దానికి ఇద్దాం. ఆ సంస్థ వ్యవహారాలపై మనం కూడా ఇష్టత చూపుతూ మమైకమైనట్లే ప్రపంచానికి రుజువు చేసి దాన్ని వశం చేసుకుందాం. ఆ వసంత-మోహన్ లను తొలగిద్దాం. ఈ చాప క్రింద నీరు తరహానే మనకు సబబైనది.” స్థానిక ఎం ఎల్. ఎ . తన మనసులో మాట తన మిత్ర బృందం తో చెప్పేసాడు. ఆ మిత్రం బృందం లో ఉన్న ఒకాయన తమ్ముడు “సాత్విక్ ఆహారం” 100 వ బ్రాంచ్ లో అకౌంటెంట్.
“ఒక్క మాట “ఆలంబన” నిజంగానే చాల చిత్తశుద్ధి తో పనిచేస్తున్న సంస్థ దాని విషయంలో మనం ఆచి తూచి అడుగు వేయాలి. ఆ సంస్థ సభ్యులు ఎవ్వరూ విలాస వంతమైన జీవితం గడపరు. సాధారణ జీవితం చీకు చింత లేకుండా గడుపుతారు. పైగా వాళ్లకు అందరకూ పెన్షన్ పాలసీ ఉంది. ఆర్ధిక స్వావలంబన ఆ సంస్థకే కాదు అందులో పనిచేసే ప్రతివారికి అలవడిన ఒక సూత్రం. అందుకే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడే రిటైర్ ఔతారు. అందువల్ల మనం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయవలసి ఉంటుంది” అని మరొక మిత్రుడు సుధాకర్ అన్నాడు. ఆయన ఒక బ్యాంకు జనరల్ మేనేజర్.
“సరే రేపే మన సుధాకర్ తన బ్యాంకు ద్వారా ఒక డొనేషన్ అందచేస్తాడు మెల్లిగా కోటలో పాగా వేస్తాడు” అని నవ్వుల మధ్య చెప్పాడు ఆ స్థానిక ఎం. ఎల్. ఎ.
***
“లక్ష్మి గారు మీకు నా అభినందనలు” అవతలి వ్యక్తి పరిచయం కూడా చేసుకోకుండా చెప్పాడు ఫోన్ లో
“ధన్యవాదాలు మీకు, మీరు ఎవరో తెలుసుకో వచ్చా అలాగే ఎందుకు నన్ను అభినందిస్తున్నారో కూడా ?” లక్ష్మి చాల శాంతం గా అడిగింది.
“నేను నిన్న మీ “సాత్విక్ ఆహరం” లో ఒక చక్కని ఉమ్పా పెసరట్టు తిన్నాను. వెళ్ళగానే నాకు మీ స్టాఫ్ ఇచ్చిన ఆదరణ చాల ముచ్చట గొలిపింది. మీరు మంద్రంగా వినిపించిన ఘంటసాల భగవద్గీత లోని “అహం వైశ్వానరో భూత్వా …., బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: …… యుక్తాహార విహారస్య ….., అన్న సూక్తం… వింటూ నేను మీ సాత్విక ఆహారాన్ని ఆస్వాదించాను. కలియుగంలో ఇంత చక్కని ఆతిధ్యం, మర్యాద, శుచి సౌచం తో కూడిన వంట విధానం, చక్కని ఆహారం అదీ సాత్వికమైనది దొరకడం ఒక అద్భుతం. అందుకే మీరు 100 శాఖలు గా విస్తరించగలిగారు. అందుకు మీకు అభినందనలు. నా పేరు శ్రీనివాస్” అని చక్కని స్వరం తో పలికిన ఆ పలుకులు భాగ్యలక్ష్మి ని మంత్రముగ్ధురాలిని చేసాయి.
“చాల సంతోషం శ్రీనివాస్ గారు” అని చెప్పి ఫోన్ పెట్టలేదు.
“మరొక్క మాట ఇలా కూడా వ్యాపారం చేయవచ్చు అని నిరూపించారు. అలాగే “ఆలంబన” లాంటి సంస్థ కు చక్కని చోటు మీరు ఇచ్చారు. నేను కూడా “ఆలంబనకు” నాకు తోచిన సహాయం చేస్తుంటాను. మీ సిబ్బంది మొహం లో ఉన్న ఆనందం మీ నాయకత్వ లక్షణాలకు దర్పణం” అని శ్రీనివాస్ అనే సరికి భాగ్యలక్ష్మి మరొక్క సారి నవ్వుతూ “మీకు మా సంస్థ నచ్చడం మీ మంచి మనసుకి తార్కాణం. ధన్యవాదాలు” అని చెప్పింది
“మై ప్లెషర్” అని చెప్పి శ్రీనివాస్ ఫోన్ పెట్టేసాడు.
ఒక్క క్షణం భాగ్య లక్ష్మి లో మౌనం అందంగా తన మోముపై ప్రతిఫలించింది. లౌడ్ థింకింగ్ లా “శ్రీనివాస్ అంటే శీనే అని అనుకోవడం నా పిచ్చి. కాని, ఈయన మాట ఎక్కడో విన్నట్లే ఉంది అనుకోని ఒక్క సారి తను చూసిన “కలల్లో ని శీను” ని మనసులో నిమ్పుకొంది.
మరలా నిశ్శబ్దం రాజ్యం ఏలింది.
శ్రీనివాస్ తన ముందే ఉన్న ఐ పాడ్ లో “సాత్విక ఆహరం” అని టైపు చేస్తే ఒక న్యూస్ పేపర్ లింక్ కనిపించిది అది హిందూ పేపర్ లో పడిన వ్యాసం ఓపెన్ చేసి చూస్తె భాగ్యలక్ష్మి ఫోటో కనిపించిది. శ్రీనివాస్ ఉద్వేగం కట్టలు తెంచుకొని కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తూనే ఉంది . ఒక్క సారిగా చేష్టలుడిగి అలానే ఉండిపోయాడు శ్రీనివాస్. వ్యాసం ఆసాంతం చదివాక తెలిసింది భాగ్యలక్ష్మి అవివాహిత అని.
వెంటనే మోహన్కు ఫోన్ చేసి “మోహన్ నీతో మాట్లాడొచ్చా అని అడిగాడు”
తప్పని సరిగా సార్ అని మోహన్ అన్నాడు .
ఏమీ లేదు ఈ “సాత్విక ఆహారం” గురించి తెలుసుకోవాలి అని ఫోన్ చేసాను.
“ఓహో నిన్న మీరు అక్కడ ఉప్మా పెసరట్టు తిన్నరన్న మాట”.
ఔను
సార్ ఆ సంస్థ గురించి మీకు బాగా తెలిసే ఉండాలే.
తెలుసు కాని ఈరోజే నెట్ సెర్చ్ చేస్తే వివరాలు తెలిసాయి.
సార్ సాత్విక ఆహారం ఎక్కువ గా ప్రకటనలు మీడియా లో ఇవ్వదు. కేవలం వాళ్ళు అందించే క్వాలిటీ వలెనే ఆ సంస్థ చాల పేరు సంపాదించింది.
మీరు హోటల్ ఫుడ్ తినరు కనుక మేము అంతగా దీని గురించి చెప్పలేదు. పైగా అన్నాన్ని అమ్ముకోవడం అవైదికం అని మీరు ఖరాఖండి గా చెప్పడం తో నేను చొరవ చూపలేదు.
సాత్విక్ ఆహారం ఎం.డి గారి పూర్తీ పేరు ఏమిటి?
లక్ష్మి గారనే అందరికీ తెలుసు.
ఓకే.
వాళ్ళ అమ్మ నాన్న గారు ఎవరు?
నాకు తెలియదు సార్ కాని తెలుసుకొని చెప్పగలను
ఏమీ లేదు ఈమె నాకు తెలిసిన వారి తాలూకు మనిషి అని ఒక అనుమానం అందుకే దాన్ని నివృత్తి చేసుకోవడానికి అడుగు తున్నాను.
మోహన్ కి మొదటి సారి శ్రీనివాస్ కొంచం తడబడుతూ మాట్లాడుచున్నట్లు అనిపించింది.
సంభాషణ ముగిసిన వెంటనే తన మిత్రుడు – సాత్విక్ ఆహారం 50 వ బ్రాంచ్ లో పనిచేస్తున్న రమణ కు ఫోన్ చేసాడు
రమణ: హే మోహన్ చాల కాలం తరువాత గుర్తుకి వచ్చానే!
మోహన్ : ఔను రా ఎలా ఉన్నావ్. పిల్లలు ఎలా ఉన్నారు
రమణ: చాల హ్యాపీ గా ఉన్నాం మా ఎం. డీ చలవ అంతా.
మోహన్ : ఔను మీరు నిజంగా అదృష్టవంతులే. మీ ఎం. డీ గారి పూర్తీ పేరు ఏమిటి?
రమణ : లక్ష్మి గారనే అందరికీ తెలుసు. ఆమె దగ్గర పనిచేసే కవిత గారికి మాత్రమె ఆమె వివరాలు తెలుసు. చాల సార్లు ఆమె అంటుంటారు పేరులో ఏముంది పని లో నిజమైన పేరుంది అని. అందుకే మేము ఆమె వ్యక్తిగత విషయాల పట్ల అంత ఉత్సుకత చూపము.
మోహన్ : నిజం రా పేరులో కాదు పని లో పేరు ఉంటుంది. సరే మళ్ళీ కలుద్దాం.
వెంటనే తన భార్య వసంతకు ఫోన్ చేసాడు.
ఔను నిన్ను మొన్న కవిత అని ఒకామె సాత్విక్ ఆహారం నుంచి కలిసింది అన్నావు కదా. నీకు ఆమెతో బాగా పరిచయమేర్పడింది అని కూడా అన్నావు. ఆ లక్ష్మి గారి పూర్తి పేరు ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోగాలవా ?
ఎందుకు సడన్ గా ఈ ప్రశ్న అడుగుతున్నారు
మన సార్ “సాత్విక్” ఆహరం తిన్నాక ఈ వివరాలు అడిగారు
అలానా సరే నేను ట్రై చేస్తాను రేపు నేను వెళ్ళే కాన్ఫరెన్స్ కు ఆమె కూడా వస్తున్నారు రోజంతా ఇద్దరం అక్కడే ఉంటాం వీలు చూసుకొని అడుగుతాను.
సరే.
***
నమస్కారం వసంత గారు. నా పేరు సుధాకర్ నేను యు బ్యాంకు జి.ఎం ని. మా బ్యాంకు CSR కార్యక్రమాల ద్వారా మేము ప్రతి ఏడూ ఒక కొంత మొత్తాని మా బ్రాంచ్ నుంచి చక్కని సామాజిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తాము ఈ సం .రం. మీ ఆలంబన ద్వారా ఏదైనా కార్యక్రమం చేద్దా మని అనుకుంటున్నాము. ఈ విషయంపై మిమ్మిల్ని కలవాలి.
తప్పక రండి సార్. మీకు ఎప్పుడు వీలుంటుందో అప్పుడే మాకూను.
థాంక్స్ వసంత గారు
వచ్చే శనివారం సాయంత్రం 4.గం.లకు వస్తాను
వెల్కమ్ సర్.
***
కాన్ఫరెన్స్ లో ఒక వక్త చాల గంభీరం గా ప్రసంగిస్తున్నారు. ఆయన చెప్పిన ముగింపు మాటలతో కాన్ఫరెన్స్ ముగిసి పోయింది.
వసంత కవిత పక్క పక్కనే కూర్చున్నారు.
హై టీ కి జాయిన్ అవమని విన్నపం రావడం తో వాళ్ళిద్దరూ హాల్ కి ఆనుకొని ఉన్న లాన్ వైపు కి నడిచారు.
వసంత : మిమ్మల్ని మళ్లీ కలవడం చాల సంతోషం గా ఉంది
కవిత : ఆ మాట నేను చెప్పాలి ఎందుకంటే వ్యాపారం కంటే సేవ ఉన్నతమైనది ఎప్పటికీ.
వసంత : మీది కూడా సేవే ఎందుకంటే లాభం మీ ముఖ్యోద్దేశ్యం కాదు కనుక
కవిత: ఔను ఇదే మాట మా లక్ష్మి గారు కూడా అంటారు
వసంత : మీ లక్ష్మి గారి పూర్తీ పేరు ఏంటి?
కవిత : భాగ్యలక్ష్మి
వసంతలో ఒక్కసారిగా ఉద్విగ్నత పెరిగిపోయింది… సంయమనం తో మరలా సాధారణంగానే మాటలు కొనసాగించింది.
కవిత: మా లక్ష్మి గారు ఒక విలక్షనమైన వ్యక్తి. ఆమె మాట్లాడుతుంటే అలా చూస్తూ వింటూ ఉండిపోతాను.
వసంత: లక్ష్మి గారు అవివాహితగానే ఉండిపోయారు ఎందుకు? మీకు అభ్యంతరం లేదంటేనే చెప్పండి.
కవిత : మన మనసులు ఇంత గా కలిసాక నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడం లో భద్రత ఉంటుందనే భరోసా ఎప్పుడో కలిగింది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది ఆ వ్యక్తి ఆమె కలలకే పరిమితమైన వ్యక్తీ అందుకే వివాహం చేసుకోవడం కుదరలేదు కనుక అవివాహితగానే ఉండిపోయారు!
వసంత: ఓహ్!
కవిత : నేను మీకు చెబుతున్న విషయాలు లక్ష్మి గారు నాపై నమ్మకంతో చెప్పినవి. ఆమెకు ఈ విషయాలు ఇతరులకు తెలియడం తద్వారా ఇతరుల నుంచి సలహాలు మొ.నవి పొందడం ఇష్టముండదు.
వసంత : అర్ధమైంది. నాపై భరోసాతో చెబుతున్న ఈ మాటలు నాతోనే ఉండిపోతాయి. ఇది నా మాట మీకు.
కవిత : నాకు తెలుసు అందుకే మీకు చెప్పదలచాను. గతంలో ఒకాయన ఆమెను వివాహం చేసుకుంటాను అని ముందుకు వచ్చాడు. చాల ప్రయత్నం చేసాడు కూడా చివరకి లక్ష్మి గారు ఆయనతో ముఖతః మాట్లాడి ఆయన్నే కన్విన్సు చేసి ఆయనతో నమస్కారం పెట్టించుకొనే స్థితికి చేరారు . అది మా ఆఫీసు లోనే జరిగింది . అప్పటి నుంచి ఎవరూ ఇక అటువంటి ప్రయత్నం చేయలేదు.
గతం మర్చిపోయిన వ్యక్తిగా మరొక వ్యక్తితో ఒక విచిత్రమైన కాలం గడిపి, మరల గతం స్మృతికి వచ్చి ఆవ్యక్తితో గడిపిన కాలం కలలు గా మారి ఆమెను ఒక వింతైన పరిస్థితి లో ఉంచాయి.
వసంత : ఒక్కసారిగా ఉత్కంఠ కు గురియైంది. ఒక్క సారిగా ఆమెకు గత ఆదివారం రాత్రి తన భర్త మోహన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
ఆ మాటలు అలవోకగా ఆమె పలికింది…
భగవంతుడు ఘటనాఘటన సమర్ధుడు, అత్యద్బుత సమన్వయ కర్త మనుషుల కర్మలను వాటి ఫలితాలను ఏక కాలంలో అనూహ్యమైన రీతిలో జోడిస్తూ ఎన్నో జీవుల జీవితాలను ప్రతి క్షణం ప్రభావితం చేస్తూ అంతటా ఉంటూ అన్నీ నడిపిస్తాడు అందుకే ఆయన సర్వోత్తముడు. ఇది ఈ క్షణం మరొక్క సారి ఋజువైంది.
వసంత మాటలు వింటూ కవిత నిస్చేష్టురాలై ఉండిపోయింది.
మళ్ళీ వసంతే మాట్లాడుతూ…. కవిత గారు ఈరోజు మన సంభాషణ ఒక అధ్బుత మైన కార్యానికి ఒక వింతైన కలయిక కు నాంది పలికింది . మనం ఆ జగన్నాటక సూత్రధారి కి పనిముట్లుగా మరి ఒక మంచి కార్యాన్ని జరుపబోతున్నాము. మీ లక్ష్మి గారి కలల ప్రేమికుడు మా నాయకుడు శ్రీనివాస్ గారు. మీ లక్ష్మి గారే మా శ్రీనివాస్ గారి భాగ్యలక్ష్మి.
ఈసారి కవిత ఇంకా ఆశ్చర్య పోయింది.
నా భర్త పేరు గోపాల్ ఆయన ఒక మంచి న్యాయవాది కేవలం డబ్బే పరమావధి గా కాకుండా న్యాయం కోసం పని చేస్తాడు. నేను సంపాదిచిన దానితో మా కుటుంబ పోషణ చాల చక్కగా జరిగి పోతుంది. అందుకే ఆయన కొన్ని కేసులకు కేవలం ఖర్చులు మినహా ఫీజు తీసుకోకుండా పనిచేస్తాడు. చాల సార్లు ఆయన వాళ్ళ కేసులు నెగ్గిన వాళ్ళు వాళ్లంతట వాళ్ళే తమకు తోచిన పారితోషికం ఇస్తారు కొందరు చిన్న చిన్న ఇస్తారు . ఆయన చాల పదిలంగా చూసుకుంటారు. మా కప్ బోర్డు లో అలాంటివి చాల ఉన్నాయి. ఆయన కూడా ఇదే మాట అంటారు.
మనమంతా ఆ భగవంతుని పనిముట్లము అని. మీ వారు కూడా అదే మాట అన్నారు. నిజాలు ఇలానే ఉంటాయి కదా.
వెంటనే తన సహోద్యోగికి ఫోన్ చేసి ఈరోజు నేను బయట పని ఉండి వెళ్తున్నాను రేపు సంతకాలు చేస్తాను అని చెప్పింది.
వసంత గారు ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళాలి అర్జెంటు గా అని ఆమెను బయలుదేరతీసింది. వసంత కూడా యాంత్రికం గా ఒక సంభ్రమాని కి లోనై చాల సంతోషం తో “అలాగే” అని కూడా నడిచి కార్ ఎక్కింది. వసంత తన డ్రైవర్ కి ఈరోజుకి నీకు ఇక పనిలేదు ఇంటికి వెళిపో అని చెప్పి తనే డ్రైవ్ చేసింది
కార్ లో వసంత మీరు అనుమతిస్తే నా భర్త మోహన్ ని కూడా పిలవాలి శ్రీనివాస్ గారి కి ఆయన అనుంగు శిష్యుడు . తప్పక కుండా కాల్ చేసి రమ్మనండి అని చెప్పి వసంత తన భర్త గోపాల్ ఒక మంచి న్యాయవాది కేవలం డబ్బే పరమావధి గా కాకుండా న్యాయం కోసం పని చేస్తాడు.
***
భాగ్య లక్ష్మి ఎప్పటిలా సాదా సీదా దుస్తుల్లో తయారై కవిత చెప్పిన చోటుకి వచ్చింది అది విశాఖ సముద్ర తీరం భీమిలి కి కొంచం దూరం లో ఉన్న ఒక చిన్న పొదరిల్లు లాటి కాటేజీ. సాయం సంధ్యా సమయం అక్కడే అప్పటికే వచ్చి ఉన్నాడు శ్రీనివాస్ అక్కడ – సముద్రం వైపుకి ఉన్న బల్లపై కూర్చొని.
కవిత, వసంత మోహన్ గోపాల్ కూడా వచ్చి ఉన్నారు. భాగ్యలక్ష్మి రాగానే ఆమెను తోడ్కొని శ్రీనివాస్ ముందుకు తీసునోని వచ్చింది కవిత.
శ్రీనివాస్ పైకి లేచి చేతులు జోడిస్తూ అచేతనం గా భాగ్యలక్ష్మి వైపు చూస్తూ ఉండి పోయాడు. భాగ్య లక్ష్మి శ్రీనివాస్ వంక చూసి తనూ అచేతనం గా ఉండి పొయిన్ది.
కవిత, వసంత, గోపాల్, మోహన్లు అక్కడినుంచి నిష్క్రమించారు.
ఒక అల చాల సౌమ్యగా వడ్డు ని తాకింది.
ఒక్క క్షణం గాలి స్తంభించింది ఇరువురి నడుమ.
భాగ్యలక్ష్మి ముందు గా తేరుకొని శ్రీనివాస్ చేతిని తన చేతిలోకి తీసుకొని “ఎక్కడి కి వెళ్లి పోయావ్ శీను ” అని ఎంతో బేలగా అడుగుతూ ఆనందం దుఖం కలసి పోయి కన్నీరు మున్నీరైంది.
శ్రీనివాస్ “భాగ్యం” అని సుతారంగా దగ్గరకు తీసుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు.
ఏడుపు ఇప్పుడు వాళ్ళకు వేలుపు !!
//శుభం //