ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వెలుగులోకి…

Like-o-Meter
[Total: 1 Average: 5]

టివిలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. “ఐదు రోజులు వేస్టు, అగుటకెయ్యది బెస్టు, చూడు క్రికెట్ టెస్టు” అన్న ఆరుద్ర మాటల్ని నిజం చేస్తోందు ఆ మ్యాచ్. దాన్ని చూడలేక దేశంలో ముప్పాతిక భాగం జనం టివి కట్టేసుంటారు. కానీ వివేక్ మాత్రం అలా చెయ్యడు. అదే అతనిలోని ప్రత్యేకత. ఏది ఏమైనా, ఏది ఎలాగున్నా అతను క్రికెట్ చూడక ఉండలేడు.

“ఒరేయ్! ఎంతసేపూ ఆ వెధవ క్రికెట్టేనా వేరే చానెల్ ఏదీ పెట్టవా? ఈటీవీలో మంచి సినిమా వస్తోంది పెట్టరా!” అన్న తల్లి మాటలకి వెంటనే జవాబు ఇవ్వలేదు వివేక్. “నిన్నేరా! ఈటీవీ పెట్టు” అని రెండోసారి అడిగింది ఆవిడ.

“అబ్బా ఇప్పుడు నువ్వు సినిమా చూడకపోతే దేశమేమీ మునిగిపోదులే!” విసుగ్గా అరిచాడు వివేక్. “పనికిమాలిన మ్యాచును నువ్వు చూసేస్తే దేశం బాగుపడిపోతుందా?” అని రెట్టించి అడిగింది ఆమె.

“ఎప్పుడు చూసినా నన్ను ఆడిపోసుకోవడమేనా నీ పని?” మరింత గట్టిగా అరిచాడు వివేక్. “నాకు ఆ పనన్నా ఉంది. నీకటువంటిది కూడా ఏదీ లేదే! డిగ్రీ ఐపోయి మూడేండ్లు కావస్తోంది. ఏమైనా సాధించివుందా? పొద్దస్తమానం టివి ముందు కూర్దుడం, అందులో వచ్చే ప్రతి దిక్కుమాలిన మ్యాచును చూడ్డం లేదంటే బయట తిరగడం్ అంతేగా నువ్వు చేసేది” కోపంగా అరిచింది వివేక్ తల్లి. తను కూడా ఏదో అనబోయి తమాయించుకొన్నాడు వివేక్.

“వివేక్! నీ ఫ్రెండ్స్ ను చూడు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సెటిలవుతున్నారు. మరి నువ్వెందుకు ఏ ప్రయత్నం చేయడం లేదు?” కాస్త అనునయంగా అడిగింది.

“ఎందుకు చేయడం లేదు. కనిపించిన ప్రతి పరీక్షకీ అప్లయ్ చేస్తున్నానుగా”

“అప్లై చేస్తున్నావు సరే! దానికి తగినట్టుగా చదవడం లేదేమోరా”

“ఏంలేదు నాకు చేతనైనంత చదువుతున్నాను. రాస్తున్నాను”

“మరి చదివితే ఫలితం కనబడాలిగా?”

“ఎమో నాకేం తెలుసు? నువ్వు పోయి నా కొడుక్కు ఉద్యోగం ఎందుకివ్వడంలేదని ఆ బ్యాంకువాళ్ళని, రైల్వే వాళ్ళని అడిగిరా” అని విసుగ్గా అన్నాడు వివేక్.

“పిచ్చిగా మాట్లాడకు వివేక్! ఆడలేక మద్దెల వోడన్నట్టు ఆ తప్పు నీలో ఉంచుకొని వేరేవాళ్ళనంటే ఎలా?”

“తల్లీ! నీకో నమస్కారం…నీ ఉపదేశానికో సాష్టాంగదండప్రమాణం. ఛ! మూడౌట్ చేసావ్ !” అంటూ విసురుగా వెళ్ళిపోతున్న కొడుకు వంక చూస్తూ నిరాశతో నిట్టూర్చింది ఆ తల్లి.

 

*********


“మధూ….మధూ” అని పిలిచాడు వివేక్.

“అరే వివేక్ నువ్వా! రా రా చాలా రోజులకొచ్చావ్, ఏంటి సంగతులు” ఆహ్వానిస్తూ అడిగాడు మధు. “ఏం లేదురా! మా ఇంట్లో టివి రిపేరు. మ్యాచ్ చూడ్డానికని…” అన్నాడు వివేక్. “మ్యాచా….! మా అమ్మావాళ్ళు సినిమా చూస్తున్నారే….అయినా ఏం మ్యాచు లేరా మరీ జిడ్డుగా ఆడుతున్నారు” అన్నాడు మధు. “అవునవును….చాలా జిడ్డు”, కలిగిన ఆశాభంగాన్ని కప్పిపుచ్చుకొంటూ అన్నాడు వివేక్.


కాసేపటి మౌనం తర్వాత తనే అడిగాడు వివేక్ “ఏంట్రా కొత్త విషయాలు?”

“అబ్బే ఏముందిరా! అంతా మామూలే! పొద్దున్నే లేవడం, ఆఫీసుకు పరుగెత్తడం…”


“ఆఫీసుకా…?” అడ్డుపడి అడిగాడు వివేక్.

“ఆఫీసుకే! ఓహ్ ! నీకు చెప్పలేదు కదూ. మెయిన్ రోడ్డులో ఈ మధ్యే ఓ ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెన్ చేసారు కదా. అందులో జూనియర్ అకౌంటెంట్ గా చేరాను. ప్రస్తుతానికి రెండున్నర వేలిస్తున్నారు. మంచి ఉద్యోగం వచ్చేవరకు ఖాళీగా ఉండడమెందుకని చేరాను. నువ్వూ అప్లికేషన్ వెయ్యకూడదూ…ఇంకో రెండు వేకెన్సీలున్నాయి” అన్నాడు మధు.

టాపిక్ టక్కున తనవైపుకు తిరిగేసరికి సర్ధుకొన్నాడు వివేక్. “ఇంక ఇక్కడుంటే వీడు మరింత ఉపదేశాలు చేస్తాడు. తప్పుకోవడం మంచిది” అని మనసులో అనుకొని పైకి “సరేరా వస్తాను. అమ్మ అర్జెంటుగా సామాన్లు కొనుక్కురమ్మంది. జుస్ట్ స్కోర్ కనుక్కొందామని వచ్చాను.” అని వేగంగా బైటకు వచ్చేసాడు వివేక్. 

అతనంతే సినిమాల గురించి, క్రికెట్ గురించి ఎంతైనా మాట్లాడగలడు. చదువు, ఉద్యోగం అనగానే అతనిలో వికారం బయల్దేరుతుంది. దానికి సరైన కారణాలు ఉండవు.

కాలింగ్ బెల్ మోగడంతో వాకిలి తీసింది వివేక్ తల్లి. “వివేక్ వున్నాడాండీ?” అన్నాడు ఉదయ్. “నువ్వా ఉదయ్! వాడు బజారుకెళ్ళాడు. వచ్చేస్తాడు…లోపలికిరా” అని అంది వివేక్ తల్లి. “బెంగళూరు వాతావరణానికి సర్దుకున్నావా? కొత్త జాబ్ లో సెటిలయ్యావా?” అని మళ్ళీ అడిగింది ఆవిడ.

“బెంగుళూరుకేమండీ మహాపట్టణం. నా ఉద్యోగం బాగుంది” అంటూనే “ఇంతకీ వీడేం చేస్తున్నాడండీ?” అని ఉదయ్ అడగడంతో “వాడా…వాడు..” అని ఆవిడ నీళ్ళు నములుతుండగానే బైట హారన్ శబ్దం వినబడడంతో “అదిగో, వాడే వచ్చేసాడు” అంటూ వంటింట్లోకి వెళ్ళింది ఆవిడ.

“హాయ్ ఉదయ్ ! ఎప్పుడొచ్చావురా? వస్తున్నట్టు ఇన్ఫర్మేషనే లేదు” అన్నాడు వివేక్ లోనికి వస్తూ. “అనుకోని ప్రయాణం రా. నీ సంగతులేంటి? 

ఖాళీలను పూరించను అని అంటూనే ఉన్నావంట!” అన్నాడు ఉదయ్.

“పైకెళ్ళి మాట్లాడుకొందాం రా” అని మేడ మీదకు దారితీసాడు వివేక్.

********


“ఇప్పుడు చెప్పరా, నీ ఆరోపణలేమిటో. ఆప్ కీ అదాలత్ మే ముజ్రిం హాజిర్ హై” అని అన్నాడు వివేక్.

“వివేక్ ! నేను తమాషాకు అడగడం లేదు. ఇంతకు ముందు ఇదే ప్రశ్న మీ అమ్మగారికి వేస్తే ఆవిడ తెగ ఇబ్బంది పడ్డారు. నువ్వేమో ఇలా నిర్లక్ష్యంగా…” ఉదయ్ మాటలు పూర్తి కాకుండానే అడ్డు పడ్డాడు వివేక్ “అరే ఉదయ్ ! నువ్వు కూడా….!! చెయ్యాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నానురా. కాలం, ఖర్మం కలిసిరావడం లేదు. లక్షలిచ్చి ఉద్యోగం కొనుక్కోలేను. వాలెంటరీ రిటైర్మెంట్ తో నాకు ఉద్యోగమిప్పించేటటువంటి ఉద్యోగం కాదు మా నాన్నది. ఐనా ఈ విషయంలో ఎవర్నీ అని లాభం లేదు. వచ్చే జూన్ దాకా జాతకం ఇలానే అఘోరిస్తుందని ఓ పండితుడు చెప్పాడులే.” అన్నాడు వివేక్.

“ఛా! నా ఖర్మ ఇంతే, నా జాతకం ఇంతే అనే వాళ్ళని చూస్తే నాకు చిరాకు. అదొక సెల్ఫ్ పిటీని పెంచే వ్యసనం. సెల్ఫ్ పిటీ ఒక ఊబిలాంటిది. వచ్చే జూన్ వరకూ నీకు టైమ్ బాగోలేదంటే నువ్వు అసలు అప్లై చేయడమే మానేయాలని కాదుగా. ఇప్పుడు అప్ప్లై చేసుకొంటే జూన్ తర్వాత రిప్లై వస్తుందని అనుకోవచ్చుగా. వివేక్ ! ఈ నిరాశావాదాన్ని, పలాయనవాదాన్ని కట్టి పెట్టు. నాకంటూ ఓ లక్ష్యం పెట్టుకో. సాధించు.’ అని అంటూ తలవంచుకొని నిలబడివున్న వివేక్ ను చూసి….

“ఆరు నెల్ల తర్వాత కలిసిన మిత్రుడు ఇలాగేనా మాట్లాడవలసింది అని నీవనుకోవచ్చు. ఈ మాటలకు బదులుగా నిన్న మనవాళ్ళు డ్రా చేసుకొన్న మ్యాచు గురించో, లేటెస్టు సినిమా రిలీజు గురించో నేను మాట్లాడివుంటే నీకు మంచివాడిగా అనిపించేవాడినేమో. కదూ!” అని అన్నాడు ఉదయ్. ఆశ్చర్యంగా, బాధగా అతనికేసి చూసాడు వివేక్.

“వివేక్ ! స్నేహితుడంటే కాలక్షేపానికి చదివి అవతల పారేసే కథల పుస్తకం లాంటి వాడు కాడని నా అభిప్రాయం. అందువల్లే ఇలా మాట్లాడాను. నా మాటల్ని ఆవేశంతో తీసిపారేయకు. ప్లీజ్” అన్నాడు ఉదయ్. మళ్ళీ తలవంచుకొన్నాడు వివేక్.

 

********

ఉదయ్ చెప్పిన విషయాలపట్ల వివేక్ మనసు ఆలోచించడం మానుకోవడం మొదలుపెట్టి కొన్ని రోజులైంది. మనిషిలో మార్పు స్విచ్ వేసిన వెంటనే వెలిగే లైటులా తొందరగా రాదు. అది చీకట్లను చీల్చుకొంటూ కొద్దికొద్దిగా వెలుపలికివచ్చే సూర్యుడులాంటిది.

అన్ని రోజులూ ఒకేలా గడిచిపోవు. ఆరోజు జరిగిన సంఘటన వివేక్ లోని అలసత్వాన్ని పూర్తిగా పోగొట్టింది. నిజానికి అతను జ్ఞానోదయపు ముహూర్తానికి కొద్ది నిముషాల వెనకవున్నాడు.

ఆరోజు కూడా వివేక్ అలవాటు కొద్దీ అమ్మతో టివి పెట్టే విషయంలో గొడవపడ్డాడు. టివి కట్టేసి ఊరకే సోఫా మీద కూర్చొన్నాడు. వీధిలో పిన్నులు, బొట్టుబిళ్లను అమ్ముకొనే కుర్రవాడొకడు అరుస్తున్నాడు. తల్లి ఆ 

అబ్బాయిని పిలవమనడంతో వీధిలోకి వెళ్ళి పిలిచాడు.

“ఈ వీధిలో నిన్ను ఇదే మొదటిసారి చూడ్డం. కొత్తగా వస్తున్నావా?” అని తల్లి ఆ అమ్ముకొనే అబ్బాయిని అడుగుతోంది. “అవునండీ. ఈమధ్యనే ఈ వ్యాపారం చేస్తున్నాను” అంటున్నాడా అబ్బాయి. ఆ పిల్లవాడి భాషలో ఎలాంటి యాసా లేకపోవడం గమనించినట్టుగా “చదువుకొన్నావా?” అని అడుగుతోంది తల్లి. “తొమ్మిదో తరగతి చదువుకొంటున్నాను అమ్మా” అంటున్నాడు అబ్బాయి. “చదువుకొంటున్నావా? మరి ఈ వ్యాపారం ఎందుకు?” అని ఆశ్చర్యంగా అడుగుతోంది అమ్మ. “సెలవులు కదమ్మా…ఊరకే కూర్చోడమెందుకని” అంటున్నాడు ఆ అబ్బాయి.

ఛళ్లుమని చరిచినట్టైంది వివేక్ కు. తనకన్నా చిన్నవాడు. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నవాడు…ఐతేనేం ఆత్మవిశ్వాసం, బ్రతుకుపై గొప్ప నమ్మకం ఉన్నవాడు. అందుకే ఖాళీగా ఉండడానికి సిగ్గుపడుతున్నాడు.

వివేక్ మనసు సుడులు తిరుగుతోంది. ఆలోచనలు అలలై ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయ్. తనలోతానే అంతర్ముఖుడైనాడు. ఒక్క నిముషం తర్వాత అలజడి అణిగి అణిగి నిశ్శబ్దంగా మారింది.

జ్ఞానగవాక్షమొకటి తెరుచుకొని చీకటి తొలగినట్లైంది.

“ఒరేయ్ ! అబ్బాయికి పది రూపాయలివ్వు” అంటూ లోపలకి వచ్చింది అమ్మ. వెళ్ళి డబ్బిచ్చాడు వివేక్. చిల్లరివ్వబోతున్న అబ్బాయి ఆపి “ఉంచుకో” అన్నాడు వివేక్.

“సార్!” అని మళ్ళీ ఇవ్వబోతున్న అబ్బాయి ఆపి ” అది నా గురు దక్షిణ” అని చెప్పి వెనక్కి తిరిగాడు వివేక్. అతని మొహంలో వెలుగు. కంటికి కనబడేది కాదు. మనసుకు మాత్రమే తెలిసేది.

@@@@@