ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అమ్మ చిక్కిపోతోంది!

Like-o-Meter
[Total: 2 Average: 5]

ఆంధ్రుల భాషకు అక్షరాలు ఏబది ఆరు అంటే అవునా అని ఆశ్చర్యపయేవారు, అవును కాబోలు అని సర్దుకుపయేవారూ ఈ మధ్య ఎక్కువమందే కనిపిస్తునారు.అదివారితప్పా??

ఏమోమరి!

ఋ, ౠ తరువాత లు లూ( వాటిని ఇక్కడ వ్రాయ వీల్లేదు కదా) ఎప్పుడో మరుగునపడ్డాయి. సరేలే “ర” తోనూ “ల” తోనూ పని నడిపించుకోవచ్చు అనుకున్నాం. మరి ఆ “ర” తోనే ఇంకాస్త పని నడిపించుకోండి అని బండి ర ని కూడా అక్షరమాలనుంచి ఆవల పడేసేరు (ఎవరూ అని మాత్రం అడగకండి). అక్కడితో ఋషులంతా రుషులయ్యేరు. అది అచ్చులకు పట్టిన గతి.

ఇక హల్లుల విషయానికొస్తే క వర్గు, చ వర్గుల చివర వచ్చే అనునాసికాలను వాడడం ఎలాగో కూడా తెలియకుండా పోయింది ప్రస్తుతం. శంకరుడు, పంకజము, పంచాంగములు రూపాంతరం చెందిపోయేయి. అయినప్పటికీ పెద్ద ఇబ్బంది ఏమీలేదని సరిపెట్టేసుకుంది ఆంధ్రమాత.

ఎంత సర్దుకుపోయినా మరీ ఇంతలా చేస్తారా అంటూ ఈ మధ్యనే కలలో కనపడి వాపోయింది. “ఏమమ్మా ఏమయింది?” అని అడిగేను.

అంతే పట్టరాని దుఃఖంతో “ఏమని చెప్పమంటావు కామేశా, అది వృధా, ఇది దండగ అంటూ ఎన్ని అక్షరాలు తొలగించినా ఏమీ మాట్లాడక ఊరుకున్నాను. అదే అలుసుగా చేసుకుని ఇంకా చిత్రవధ చేస్తుంటే ఏడ్వక ఏం చెయ్యనయ్యా?” అంది.

“ఏడవకమ్మా, తెలుగుభాషంటే ప్రాణంగా ప్రేమించే నేను నీవు దుఃఖిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? అసలు నీ దుఃఖ కారణం వివరంగా చెప్పు తల్లీ!” అంటే ఇలా చెప్పుకొచ్చింది…

 

“ఇప్పటివరకూ మింగిన అక్షరాలతోపాటూ ‘‘ ని కూడా ఈ మధ్య మింగేసేరు. కళ్ళు అనడానికి కల్లు అంటునారు. కల్లు అంటే నీకు తెలుసుగా! తాటికల్లో ఈతకల్లో అవదా? ఇంకొంచెం లోతుకు వెళితే కల్లు అంటే రాయి కూడా అవుతుందికదా (ఉప్పు కల్లు, సన్నికల్లు) మరి వీళ్ళు కళ్ళని కల్లు అంటే బాధపడనటయ్యా?

పెళ్ళిని పెల్లి అంటునారు. కళని కల అంటునారు. వాళ్ళని వాల్లు అంటునారు. టీవీ లంగరులూ, సినిమాల్లో డబ్బింగు చెప్పేవారూ, వార్తలు చదివేవారు ఇక వారూ వీరూ ఏమిటయ్యా అందరూ ఇదే వరస”.

తీరా ఆవిడ చెప్పేక అనిపించింది అడిగి పొరబాటు చేసేనా అని ఎందుకంటే పెల్లి కాదర్రా పెళ్ళి అనాలి అని ఈ మధ్య ఎవరితోనో అంటే, నేనలా పక్కకి వెళ్ళగానే “అతనో చాదస్తం మనిషిలెండి” అనుకోవడం నా చెవిని పడింది.

పోతనగారైతే కాటుక కంటినీరు అని గబగబా ఒక పద్యం అందుకుంటారు. నేను అంతటివాణ్ణి కాను కదా అందుకని అయ్యో ఎంత చిక్కిపోతోందో ఆంధ్రమాత అని వలవల్లాడేను.

అదీ భోగట్టా!