ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నీకు నీవే పరిష్కారం

Like-o-Meter
[Total: 0 Average: 0]

జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే.

కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ జీవితం ఏమాత్రం వడ్డించిన విస్తరిలా ఉండదు. తమ తప్పిదాలవల్లో, ఇతరులు చేసిన ద్రోహాలవల్లో కష్టాల పాలౌతుంటారు. ఐతే అవేవీ వారిని చీకాకు పెట్టవు. వాళ్ళల్లోని ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. జీవితాన్ని ఓ ఊరేగింపులా సాగించేస్తుంటారు. ఇది ఎలా సాధ్యం? కష్టాలనన్నింటినీ అంత సులువుగా మర్చిపోవచ్చునా?

అలాంటివాళ్ళను దగ్గరనుండి చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంతే. కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవడం సాధ్యమేనని. సులువు కూడా అని. ఆ ధైర్యం వేరే ఎక్కడినుండో కాదు మనలో నుండే రావాలని.

బాగా పరిశీలించి చూస్తే ముప్పాతిక భాగం సమస్యలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమూ బాధ్యులమై ఉంటాము. కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా పరిస్థితులపైనా, పరిసరాలపైనా, తోటి వ్యక్తులపైనా నెట్టేస్తుంటాము. విజయాన్ని అనుభవిస్తే కలిగేంత ఆనందం వైఫల్యంలో ఉండదు. అందుచేతనే మన తప్పిదాలను ఒప్పుకొనే మానసిక ధైర్యాన్ని చాలామంది కోల్పోతుంటారు. తమ బలహీనతను కప్పి పుచ్చుకొనే తొందరలో మాట తూలడం, సమ్యమనం కోల్పోవడం, ఇతరుల మనసుల్ని గాయపరచడం జరిగిపోతాయి.

అందుకనే నాకనిపిస్తుంది…..మనల్ని మనం తెలుసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనదని. రోజులో ఓ పదినిముషాల పాటు మన చర్యల్ని, మాటల్ని, ఆలోచనల్ని నిష్పక్షపాతంగా బేరీజు వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోగలిగితే చాలా వరకు చిన్న చిన్న చీకాకుల్ని దూరం చేసుకోవచ్చు.

శరీర నిర్మాణాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది మనిషి ఎంత వైరుధ్యాల పుట్ట అని. తలలో పెట్టుకున్న పూల వాసనను ముక్కు పసిగడుతుంది. కడుపులో వెళ్ళి జీర్ణమైపోయే ఆహారం రుచిని నాలుక గ్రహిస్తుంది. ఐతే ఈ వైరుధ్యాలనన్నింటినీ సమతౌల్యం చేసి చక్కటి అనుభవంగా మార్చగలిగే గొప్ప సాధనం మనసు.

ఒక్క క్షణం ఆలోచించండి…ప్రతి అవయవం తనకు తానుగా ఉండిపోతే మన జీవితం రసమయం అవుతుందా ? మనసు అనే దారం అన్నింటినీ గుదిగుచ్చి మణిహారంగా మార్చకపోతే ప్రేమలు, అభిమానాలు, అలుకలు, బుజ్జగింపులు మన జీవితంలోకి ఇంద్రధనస్సుల్ని తీసుకు వచ్చేవా ?

అందుకే నాకనిపిస్తూ ఉంటుంది…..మన మనసుతోనైనా మనం నిజాయితీగా ఉండాలని. చాలాసార్లు అది మనకు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తుంది. ప్రమాద సూచికలను ఎగురవేస్తుంది. కానీ పరుగెడుతూనే నీళ్ళనైనా పాలు అనుకొని తాగించగలిగే అహమ్ మనల్ని నిలువనీయదు. పరుగెట్టకపోతే పక్కవాళ్ళు దూసుకెళ్ళిపోతారని, ఆఖరున చేరుకొంటే మిగిలేదు బూడిదేనని నలుపురంగు కోణాల్ని ప్రదర్శించేస్తుంది అహమ్. పరుగెడుతున్నామన్న భ్రమలో ఉన్నచోటునే కాళ్ళాడిస్తూ ఉంటాం. ఆ కాళ్ళ కింద మట్టిలో మట్టియైపోతూ, కోట్ల కోట్ల పరమాణువులుగా విడిపోతూ మన మనసు. అహానికి బుద్ధి లేదు. దాని బానిసలకు తీరికలేదు. మనసు గురించి పట్టించుకొనేది ఎవరు ?

రాయి పడ్డ చోటునుంచే అలలు బయల్దేరేది. సమస్య ఐనా సమాధానమైనా మనసునుండే పుట్టుకొచ్చేది. అలలను ఒడ్డుకు చేర్చేసిన చెరువు మళ్ళీ నిశ్చలత్వంను సాధిస్తుంది. సమస్యలను చూసి నవ్వేసే మనసు విజయాన్ని సాధించాక కూడా మౌనంగానే ఉంటుంది.

“మౌనేన కలహం నాస్తి”…అది పక్కవారితో కానివ్వండి, మనలో మనతోనే కానివ్వండి.

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>