ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వాగ్గేయకార వైభవ ‘ ఆద్యక్షరి ‘

Like-o-Meter
[Total: 0 Average: 0]

Originally published in AndhraFolks.net on 11/06/2011


అంత్యాక్షరి తెలుసుకాని, ఈ
“ఆద్యక్షరి” ఏమిటి?! కొత్తగా ఉందే! అనుకుంటున్నారా?……. కాస్త ముందుకు పదండి, మీకే తెలుస్తుంది.

మూడు సంవత్సరముల క్రితం కొంతమంది తెలుగుభాషాభిమానులు పూనుకొని మా ఊళ్ళో (మంచిర్యాలలో) “సాహితీ సంరక్షణ సమితి” అనే సంస్థను ఆరంభించారు. ఈ సంస్థ ఆధ్వర్యములో ప్రతి నెల 3వ, 4వ ఆదివారపు సాయంత్రాల్లో సాహిత్యసమావేశములు జరుగుతుంటాయి. నేను కూడా ఈ సంస్థలో సభ్యుడినే! సాధారణంగా కవిసమ్మేళనము, ఒక సాహితీప్రసంగం ఏర్పాటు చేస్తుంటారు. నేను సైతం కొన్ని సాహిత్యప్రసంగములు చేశాను లోగడ!

ఐతే, ఒకే మూసలో వెళ్తున్న కార్యక్రమాలకు కొంత వైవిధ్యం తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచనతో, ఇటీవల నేను ఒక క్రొత్త ప్రయోగం చేశాను. దాని గురించి మీకు తెలపడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

మనకు అన్నమాచార్యుడు, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య, తూము నరసింహదాసు, సదాశివబ్రహ్మేంద్రస్వామి, నారాయణతీర్థులు, జయదేవుడు మొదలైన వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. వారందరూ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు, కృతులు రచించి, గానం చేశారు. వీరి కీర్తనలను ఆధారం చేసుకుని, నేను ఈ నూతనప్రక్రియకు రూపకల్పన చేశాను.

సెప్టెంబరు నెలలోని 3వ ఆదివారమైన 18/09/2011 నాటి సాయంత్రం మావూళ్ళోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రాంగణములో పై కార్యక్రమాన్ని నిర్వహించాను.

రండి! మీరు కూడా ఈ కార్యక్రమములో పాలుపంచుకొని ఆనందించండి!

ఆనాటి సమావేశానికి స్థానిక మధురగాయకులు పి.దక్షిణామూర్తిగారు అధ్యక్షత వహించారు. స్థానిక సంగీత విద్వాంసురాలు శ్రీమతి నెమలికొండ వైదేహిగారు, ఇక్కడి సీనియర్ మోస్ట్ వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ రావుగారు, ప్రముఖ నేత్రవైద్యులు డాక్టర్ బద్రినారాయణగారు ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించారు. అధ్యక్షులవారి తొలిపలుకుల అనంతరం, నేను కొద్దిసేపు ప్రసంగించాను… ఈ క్రిందివిధంగా!

“సంగీతము, సాహిత్యము చదువులతల్లి సరస్వతి యొక్క స్తనద్వయంగా అభివర్ణించారు మన పూర్వీకులు! జ్ఞానపీఠ అవార్డుగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డిగారు ఒక పాటలో “సంగీత సాహిత్య సమలంకృతే! స్వరరాగ పదయోగ సమభూషితే!” అని ప్రస్తుతించారు ఆ శారదామాతను. ఒక సంగీతవిద్వాంసుడు తన పాటకచ్చేరీల ద్వారా సరస్వతీమాతను అలరిస్తాడు, అంటే ఆయన సంగీతమార్గములో ఆ దేవిని అర్చిస్తున్నాడు. ఒక కవీశ్వరుడు తన కావ్యముల ద్వారా వాణీమాతను సేవిస్తాడు, అనగా ఆయన సాహిత్యమార్గములో ఆ తల్లిని పూజిస్తున్నాడు. ఐతే, వీరిద్దరికన్నా వాగ్గేయకారులు ధన్యజీవులు! వారు అద్భుతమైన తమ రచనలతో తెలుగుసాహిత్యమును పరిపుష్టం చేయడమే కాకుండా, ఆ కీర్తనలు/కృతులకు స్వరాలు సమకూర్చి, రాగయుక్తంగా పాడి జగత్తును అలరించారు. ఏకకాలంలో సరస్వతీదేవికి ప్రియమైన 2 మార్గాలలో (సంగీత సాహిత్యాలు) వారు విద్దెలరాణిని ఆనందింపజేశారు.

అటువంటి ధన్యజీవులైన వాగ్గేయకారులపై నేనొక కార్యక్రమమును రూపొందించాను. ప్రసంగరూపములో వారందరి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని తక్కువ సమయములో వీలైనంత ఎక్కువమంది వాగ్గేయకారులను, వారి కీర్తనలను మీకు పరిచయం చేయాలనే తలంపుతో నేను “వాగ్గేయకార వైభవ ఆద్యక్షరి” పేరుతో ఒక వినూత్న ప్రక్రియను మీ ముందుకు తెస్తున్నాను.


“అంత్యాక్షరి”
అంటే అందరికీ తెలిసినదే, ఒకరు పాడిన పాటలోని చివరి అక్షరాన్ని అందుకుని, దానితో ఆరంభమయ్యే మరో పాటను మరొకరు పాడడమే “అంత్యాక్షరి”. ఈ ఆట ఆడడానికి ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు అవసరం… మరి, ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించేది నేనొక్కడినే కనుక, దీనికి “ఆద్యక్షరి” అని నామకరణం చేశాను; అనగా మొదటి అక్షరం! ఈ సభకు విచ్చేసిన సాహితీమిత్రులు, శ్రోతలు ఎవరైనా నాకు ఒక అక్షరం చెప్పాలి. ఆ అక్షరముతో ఆరంభమయ్యే కీర్తన/కృతి/తరంగం/అష్టపది ఏదైనా నేను అప్పటికప్పుడు స్ఫురణకు తెచ్చుకుని, అది ఎవరి రచనో చెప్పి, పల్లవి పాడి వినిపించాలి. నాకు బాగా తెలిసిన కీర్తన ఐతే, పల్లవితో పాటు చరణములు కూడా వినిపిస్తాను. నా చేతిలో ఏవిధమైన కాగితాలు గాని, నోట్స్ గాని ఉండవు; కేవలం నా జ్ఞాపకశక్తి, ధారణలే ఆధారం!… “అంత్యాక్షరి” కన్నా ఈ “ఆద్యక్షరి” కొంత కఠినమైనదని చెప్పవలసివుంటుంది. ఎందుకంటే, “అంత్యాక్షరి” లోని సినిమాపాటలు అందరికీ తెలిసేవుంటాయి. కనుక పాడే పాటలోని చివరి అక్షరం ఏమైవుంటుందో ఊహించుకుని, తర్వాతి పాటకు సిద్ధంగా ఉండవచ్చు. “ఆద్యక్షరి” లో అటువంటి సౌకర్యం లేదు. అక్షరం చెప్పినదే తడవుగా పాట వినిపించవలసివుంటుంది, ఆ పాట కూడా కేవలం వాగ్గేయకారుల రచనే అయివుండాలి.

తెలుగు వర్ణమాలలోని “అ” నుండి “క్ష” వరకు గల అక్షరాల్లో ఏదైనా మీరు అడగవచ్చు. ఐతే, ఒక విన్నపం! దయచేసి, మహాప్రాణాక్షరములను (ఒత్తు అక్షరాలను) మాత్రం అడగవద్దు. ఎందుకనగా, ఒత్తు అక్షరాలతో ఆరంభమయ్యే కీర్తనలు అతి తక్కువగా, ఒకటి, రెండు అక్షరాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి.

ముందుగా ముఖ్యమైన కొందరు వాగ్గేయకారుల గురించి సంక్షిప్తంగా పరిచయం చేస్తాను” అని చెప్పి, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, తూము నరసింహదాసు, క్షేత్రయ్య, జయదేవుడు, సదాశివబ్రహ్మేంద్రస్వామి. నారాయణతీర్థులు మున్నగువారి రచనల గురించి, వారి జీవితకాలాల గురించి క్లుప్తంగా చెప్పాను.

ఆ తర్వాత “ఆద్యక్షరి” కొనసాగింది ఉత్సాహంగా!

ప్రథమంగా ముత్తుస్వామిదీక్షితార్ గారి సుప్రసిద్ధ కీర్తన “వాతాపి గణపతిం భజేహం” తో వినాయక ప్రార్థన చేశాను. తర్వాత సభకు వచ్చిన శ్రోతలందరినీ ఉద్దేశించి “ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు” పల్లవి ఆలపించాను. త్యాగరాజుగారి ప్రసిద్ధ పంచరత్నకీర్తనలులో ఇది ఒకటి.

ఆ పిమ్మట శ్రోతలను అక్షరాలు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాను.

మొట్టమొదటగా ఒక శ్రోత లేచి “న అక్షరముతో అన్నమాచార్య కీర్తన వినిపించండి” అని కోరారు. “వాగ్గేయకారులలో ప్రాచీనుడు, పదకవితా పితామహుడైన అన్నమయ్య కీర్తనను ప్రప్రథమంగా ఆలపించే అవకాశం రావడం సముచితంగానూ, సంతోషంగానూ ఉంది. ఇది చాలా మధురమైన కీర్తన. ఇందులో కేవలం ఆ శ్రీమన్నారాయణుని వివిధనామాల సంకీర్తనే తప్ప, మరొక విషయం ఏదీ లేదు” అని చెప్పి “నారాయణతే నమో! నమో! భవ నారద సన్నుత నమో! నమో!” కీర్తనను పల్లవితో పాటు 2 చరణములు పాడి వినిపించాను. శ్రోతలంతా నిశ్శబ్దంగా విన్నారు; ఆ తర్వాత వారి కరతాళధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.

వెంటనే మరొక శ్రోత “స” అక్షరం అడిగారు. “రామదాసు కీర్తన వినండి, చాలా బాగుంటుంది” అని చెప్పి “సీతారామస్వామీ! నే చేసిన నేరములేమీ!” అనే కీర్తన పల్లవి, ఒక చరణం ఆలపించాను.

పిమ్మట “మ” అక్షరంతో చెప్పమన్నారు. “మరుగేలరా ఓ రాఘవా!” అనే త్యాగరాజకృతి పల్లవిని వినిపించాను. “ఇదే అక్షరంతో సదాశివబ్రహ్మేంద్రులవారి రచన కూడా వినండి; చక్కని కీర్తన” అని చెప్పి “మానస సంచరరే!” పల్లవి, ఒక చరణం వినిపించాను

తదుపరి ఒక మహిళాశ్రోత “హ” అక్షరం ఇచ్చారు. “హరిహరి! రామ! నన్నరమర చూడకు!” అనే రామదాసు కీర్తన పల్లవి పాడాను.

అటుపిమ్మట “వ” అక్షరంతో చెప్పమని కోరారు. “విన్నపాలు వినవలె వింతవింతలూ” అనే అన్నమయ్య కీర్తన పల్లవి, ఒక చరణం వినిపించాను.

తదనంతరం “ఇ” అక్షరం అడిగారు. రామదాసుగారి అద్భుత కీర్తన “ఇక్ష్వాకు కులతిలకా! ఇకనైనా పలుకవే రామచంద్రా!” పల్లవితో పాటు దాదాపు మొత్తం కీర్తన ఆలపించాను. ఈ కీర్తనలో రామదాసుగారు తాను సీతారాములకు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు చేయించిన స్వర్ణాభరణముల గురించి వర్ణించారు. ఆయన బాధ, ఆక్రోశం చివరి చరణాల్లో బాగా వ్యక్తపరచబడింది. శ్రోతలందరూ మంత్రముగ్ధులై ఆలకించారు… తర్వాత ఇదే అక్షరంతో “ఇప్పుడిటు కలగంటి” అనే అన్నమాచార్య కీర్తన పల్లవి, ఒక చరణం పాడాను.

ఆ తర్వాత ఒక సోదరీమణి “య” అక్షరముపై వినిపించమన్నారు. జయదేవ కవీంద్రుని అష్టపది “యారమితా వనమాలినా” పల్లవి, ఒక చరణం వినిపించి, వెనువెంటనే త్యాగయ్యగారి “యోచనా?… కమలలోచనా నను బ్రోవ!” అనే కృతి పల్లవి పాడాను.

ఆపై “బ” అక్షరం వచ్చింది. అన్నమయ్యగారి సుప్రసిద్ధ కీర్తన “బ్రహ్మ కడిగిన పాదమూ” పల్లవి, ఒక చరణం ఆలపించాను.

తదుపరి ఒక మిత్రుడు “శ్రీ” తో ప్రారంభమయ్యే కీర్తన కావాలని అడిగారు. వెంటనే రామదాసుగారి “శ్రీరామ! నీ నామమేమి రుచిరా!” కీర్తన పల్లవి, 2 చరణాలు పాడాను.

పిమ్మట “ఆ” అక్షరం అడిగారు. నారాయణతీర్థులవారి “ఆలోకయే శ్రీ బాలకృష్ణం” అనే తరంగం పల్లవి వినిపించాను.

ఇంతలో ఒక శ్రోత మళ్ళీ “న” అక్షరముతో కావాలని కోరారు. వారి కోరికను మన్నిస్తూ తూము నరసింహదాసుగారి “నిద్రాముద్రాంకితమైన నీ కన్నుల నీటు చూడగగల్గెనూ” అనే అందమైన కీర్తన పల్లవి, ఒక చరణం పాడాను. భగవంతుణ్ణి మేలుకొలిపే కీర్తనలు మనకు చాలా ఉన్నాయి. ఐతే, ఈ కీర్తనలో నరసింహదాసుగారు నిద్రిస్తున్న ఆ పరంధాముని సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించారు… నరసింహదాసుగారివి చాలా చక్కని కీర్తనలు.

తర్వాత “గ” అక్షరం వచ్చింది. “గోవింద! గోవింద! యని కొలువరే!” అనే అన్నమయ్య కీర్తన పల్లవి, ఒక చరణం ఆలపించాను.

పిదప మరొక మిత్రుడు “ద” అక్షరం ఇచ్చారు. “దీనదయాళో! దీనదయాళో! దీనదయా పరదేవ దయాళో!” అనే రామదాసు కీర్తన పల్లవి, ఒక చరణం పాడాను. ఇదే అక్షరంతో తూము నరసింహదాసుగారి “దొర వలె కూర్చున్నాడూ! భద్రగిరినాథు డితడేమొ చూడూ!” కీర్తన పల్లవిని సైతం వినిపించాను.

తదుపరి ఒక సోదరి “ల” అక్షరంతో పాడమని కోరారు. “లాలనుచు నూచేరు లలన లిరుగడలా” అనే అన్నమాచార్య కీర్తన పల్లవితో పాటు ఒక చరణం పాడాను.

పిమ్మట “ర” అక్షరం ఇవ్వబడింది. రామదాసుగారి మనోహరమైన కీర్తన “రామచంద్రులు నాపై చలము చేసినారూ! సీతమ్మా! చెప్పవమ్మా!” పల్లవి, ఒక చరణం ఆలపించాను. ఈ కీర్తనలో రామదాసుగారు తన బాధ, ఆవేదన, దుఃఖముతో కూడిన వెటకారం ఎంతో బాగా వ్యక్తీకరించారు. కాస్త భావుకులైనవారు ఈ కీర్తనను ఆలపించినా, ఆలకించినా కంట నీరు తిరగడం ఖాయం!

తదనంతరం ఒక మిత్రుడు “అం”తో పాడమన్నారు. అన్నమయ్యగారి “అంతయు నీవే హరి! పుండరీకాక్షా!” కీర్తన పల్లవితో పాటు ఒక చరణం పాడాను. ఇది కూడా చక్కని కీర్తన. ప్రతి పంక్తి చివరన ఆ శ్రీహరి నామాల్లో ఏదో ఒకటి వస్తుంటుంది.

తర్వాత ఇంకొక శ్రోత “జ” అక్షరం ఇచ్చారు. “జయజయ రామ! సమరవిజయ రామ!” అనే అన్నమాచార్య కీర్తన పల్లవి వినిపించాను. దానితో పాటు, తెలుగునాట ప్రతి తల్లికీ తెలిసిన “జో అచ్యుతానంద! జోజో ముకుందా! రావె పరమానంద! రామగోవిందా!” పల్లవి కూడా ఆలపించాను. ఇది అన్నమయ్యగారి కీర్తన అనే సంగతి చాలామందికి తెలియకపోవడం విశేషం!.. ఐతే, ఆ శ్రోత “త్యాగరాజకృతి వినిపించలేరా?” అని అడిగారు. వారి అభ్యర్థనను గౌరవిస్తూ “జగదానంద కారకా! జయ జానకీ ప్రాణనాయకా!” పల్లవి పాడాను. సుప్రసిద్ధమైన త్యాగరాజ పంచరత్న కీర్తనలులో ఇది కూడా ఒకటి.

“ఆద్యక్షరి” లో “నిషిద్ధాక్షరి” :

అష్టావధానంలోని 8 అంశములలో “నిషిద్ధాక్షరి” అనేది ఒకటి. మీలో కొంతమందికి దీని గురించి తెలిసేవుంటుంది. తెలియనివారి కొరకు కాస్త వివరిస్తాను… అవధానికి పృచ్ఛకుడు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి, దానిపై పద్యం చెప్పమని అడుగుతాడు. అవధాని పద్యాన్ని ప్రారంభించిన తర్వాత “ఇక్కడ ఈ అక్షరం రాకూడదు” అని మధ్యమధ్యలో షరతులు విధిస్తుంటాడు. ఆ, యా అక్షరాలు రాకుండా, ఇతర అక్షరములను ఉపయోగించి అవధాని పద్యమును పూర్తిచేయవలసివుంటుంది. ఇదే “నిషిద్ధాక్షరి”!… ఈ “నిషిద్ధాక్షరి” ప్రస్తావన ఇప్పుడెందుకంటారా?… నా కార్యక్రమములో కూడా కొందరు సాహితీమిత్రులు ఈవిధమైన పరీక్షనే పెట్టారు నాకు!

ఒక మిత్రుడు “అ” అక్షరముతో పాడమని అడిగి “అదివో! అల్లదివో! శ్రీహరివాసమూ! మాత్రం వద్దు” అన్నాడు. నేను అప్పుడు అన్నమయ్యగారిదే మరో కీర్తన “అన్ని మంత్రములు ఇందే ఆవహించెనూ!” పల్లవి, ఒక చరణం పాడి వినిపించాను.

తర్వాత మరో మిత్రుడు పై తరహాలోనే “ప” అక్షరం ఇస్తూ “పలుకే బంగారమాయెనా!” వద్దన్నారు. “పలుకుతేనెల తల్లి పవళించెనూ!” అనే అన్నమాచార్య కీర్తన పల్లవి, ఒక చరణం ఆలపించి ఆయనకు సంతృప్తిని కలిగించాను. శృంగారపరమైన ఈ కీర్తన సభికులందరికీ అమితంగా నచ్చింది.

సమయాభావము :

ఈ దశలో కార్యక్రమ నిర్వాహకులు కల్పించుకుని “తర్వాత కవిసమ్మేళనం ఉంది కనుక, చరణాలు పాడుతూ పోతే కాలాతీతం అవుతుందనీ, కేవలం పల్లవులు మాత్రమే ఆలపించమనీ, ఒక అక్షరానికి ఒక్క కీర్తన మాత్రమే వినిపించమని” అన్నారు. అందువల్ల మిగతా కార్యక్రమాన్ని కాస్త వేగవంతం చేయవలసి వచ్చింది; ఇక్కడినుండి కేవలం పల్లవులే పాడాను.

తదుపరి ఒక మహిళాశ్రోత “చ” అక్షరముతో పాడమన్నారు. “చూడగల్గెను రాముని సుందరరూపమూ!” అనే తూము నరసింహదాసు కీర్తన పల్లవి పాడాను.

పిమ్మట మరొక శ్రోత “డ” అక్షరం అడిగారు. అన్నమయ్య కీర్తన “డోలాయాంచల డోలాయాం! హరే! డోలాయాం!” ఆలపించాను.

తర్వాతి శ్రోత “త” అక్షరం ఇచ్చారు. “తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ!” అనే రామదాసు కీర్తన వినిపించాను. ఈ కీర్తనలో రామదాసుగారు శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములను వర్ణించారు.

ఇంతకుముందు “అ” అక్షరాన్ని అడిగిన మిత్రుడు మళ్ళీ లేచి “వర్ణమాలలోని మొదటి అక్షరమైన ‘ అ ‘ తో పాడారు; చివరి అక్షరమైన ‘ క్ష ‘ తో పాడగలరా?” అని ప్రశ్నించారు. “పాడగలనండీ!” అని “క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం” అనే అన్నమాచార్య కీర్తన ఆలపించాను.

పిదప ఇంకొక శ్రోత “ఏ” అక్షరం ఇచ్చారు. రామదాసు కీర్తన “ఏ తీరుగ నను దయ జూచెదవో ఇనవంశోత్తమ! రామా!” పాడి వినిపించాను.

తదుపరి ఒక సోదరి “క” అక్షరం అడిగారు. “కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడూ!” అనే అన్నమయ్య కీర్తన ఆలపించాను.

మరొకరు “ఉ” తో చెప్పమన్నారు. “ఉన్నాడో లేడో భద్రాద్రియందు” అనే రామదాసు కీర్తన వినిపించాను.

తర్వాతి శ్రోత “ఒ” అక్షరం ఇచ్చారు. “ఒకపరి కొకపరి ఒయ్యారమై” అనే అన్నమాచార్య కీర్తన పాడాను.

వెంటనే మరొకరు “ఓ” తో అడిగారు. రామదాసు కీర్తన “ఓ రఘువీరా! యని నే పిలిచిన ఓహో యనరాదా!” వినిపించాను.

అటుపిమ్మట “ఊ” అక్షరం వచ్చింది. “ఊరకయే కలుగునా రాముని భక్తి” అనే త్యాగరాజ కృతి ఆలపించాను.

ఇంకొక సభికుడు “ఎ” అక్షరంతో పాడమన్నారు. “ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమేమున్నది?” అనే అన్నమయ్య కీర్తన పాడాను.

తదనంతరం ఒక శ్రోత “ఔ” అక్షరం అడిగారు. అన్నమయ్యదే మరో కీర్తన “ఔనయ్యా జాణడవు! ప్రహ్లాదవరదా!” వినిపించాను.

తర్వాత మరొకరు “ఈ” అక్షరముతో కోరారు. “ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు!” అనే కీర్తన పల్లవి పాడాను. ఐతే, ఈ కీర్తన వ్రాసిన కవి యెవరో మాత్రం నాకు తెలియదు; ఎవరో అజ్ఞాత కవీశ్వరుడు!

దీనితో తెలుగు వర్ణమాలలోని అన్ని అక్షరాలూ పూర్తయినవి. ఆ శారదామాత కృప వలన నేను ఏ అక్షరానికీ తడుముకోవడంగానీ, తత్తరపడడంగానీ జరగలేదు. శ్రోతలు అడిగినదే తడవుగా వెనువెంటనే ఆ, యా కీర్తనలు పాడగలిగాను. గంటకు పైగా సాగిన కార్యక్రమంలో మొత్తం 41 కీర్తనలు ఆలపించాను.

సాధారణంగా సాహిత్యసమావేశాలకు మహిళలు తక్కువగా వస్తుంటారు. కాని, ఆనాటి కార్యక్రమానికి స్త్రీలు చెప్పుకోదగిన సంఖ్యలో రావడమే కాక, ఉత్సాహంగా పాల్గొని నాకు అక్షరములు ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది.

ఇంక చివరిగా, రామదాసుగారి మంగళాశాసనం “రామచంద్రాయ! జనకరాజజా మనోహరాయ! మామకాభీష్టదాయ! మహిత మంగళం!” అనే మంగళహారతితో కార్యక్రమమును ముగించాను. ఈ హారతి పాట పాడేటప్పుడు శ్రోతలందరూ చప్పట్లు చరుస్తూ, నాతో గొంతు కలిపి పాడుతూ తమ ఆనందమును వ్యక్తం చేయడం ఎంతో సంతృప్తిని కలిగించింది.

ఆ తర్వాత పలువురు పురప్రముఖులు, సాహితీవేత్తలు వేదిక పైకి వచ్చి “అద్భుతమైన కార్యక్రమం ఈనాడు చూడగలిగామనీ, ఇటువంటి వినూత్న ప్రక్రియ గురించి ఎప్పుడూ విననైనాలేదని” ప్రశంసించారు.

చదువరులందరికీ ఒక విన్నపం! దయచేసి దీనిని స్వోత్కర్ష (సొంతడబ్బా) గా భావించకండి! నా మనసుకు కలిగిన ఆనందమును మీ అందరితో పంచుకోవాలనే ఉబలాటమే నన్ను ఈ వ్యాసరచనకు ప్రేరేపించింది.

ఇది చదివిన మిత్రులంతా తమ అభిప్రాయమును కామెంట్ రూపములో తెలపాలని కోరుతున్నాను. కామెంట్ వ్రాసే అవకాశం లేనివారు, క్రింద ఇస్తున్న నా మొబైల్ నంబరుకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు!

భవదీయుడు,

సత్యనారాయణ పిస్క,

మొబైల్ : 9849634977.