ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అధ్యాయం-10 పల్నాటి వీరభారతం

Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు.

మాచెర్ల పందెగాడు “గోపన్న” బ్రహ్మనాయుడి చేతిలోంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా “మా భవిష్యత్తు నీ మీద ఆధారపడి వున్నది” అన్నాడు.

మాచెర్ల పుంజు “కొక్కొరొక్కో” అని విజయగీతం పాడినట్టు కూతకూస్తే, మాచెర్ల వీరుల చేతులు మూతుల మీదకొచ్చి మీసాలను సగర్వంగ దువ్వుకున్నాయి.

నాగమ్మ తెచ్చిన నలగాముని తరఫు పుంజు పేరు “నల్లమల్లు”. పెట్టమారి పుంజును చూసిన గురజాల వీరులు సిగ్గుతో తలలు దించుకున్నారు. ఐతే తమ పరువు కోసం నలగామరాజు వైపున నిలబడటం తప్పనిసరయినది.

చరిత్ర పుట్టిన తర్వాత ఇంత గొప్ప కోడిపోరు ఎక్కడా జరగలేదనే విషయంతో చాలామంది ఏకీభవిస్తారు. (ఇవ్వాల్టివరకూ – పల్నాడు వాడవాడలా ఈ సంగతిని ప్రస్తావించి, వీరత్వం ఉద్భవించిన పల్నాటి వీరకథను వింపిస్తారు).

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

**********

రెండు పుంజులూ గోదాలోనికి దిగాయి. పందెగాళ్ళిద్దరూ పుంజులను వదిలారు. మధ్యవర్తి ఇరుపక్షాలకూ కావలసినవాడైన అలరాజు.

పందెం ప్రారంభించబోయే సమయానికి ఇరుపక్షాల పందెగాళ్ళకు పాటించవల్సిన విధులను గురించి హెచ్చరించాడు అలరాజు.

పోరు మొదలైంది.

ఇరుపక్షాల్లో పౌరుషం పెరిగిపోతున్నది.

కత్తులు కుత్తుకల్లో గుచ్చుకోవాలన్నట్లు – రెక్కలు రిక్కించి – డొక్కలు వుబ్బించి – ఈకలు మెడల మీద గుండ్రని గుత్తిలా ఏర్పరచుకుని – చావుబ్రతుకుల మధ్య, నెత్తుటిధారల మధ్య పుంజులు పోట్లాడుకుంటున్నాయి. మాచెర్ల ప్రభువుల పుంజు ధాటికి, గురజాల పుంజు గింజుకుంటోన్నది. తప్పకాళ్ళు పడ్డాయి.

విరామంలో పుంజులను నీళ్ళకు ఎత్తారు.

మాచెర్ల ప్రభువులు, వీరులు పొందబోయే విజయం యొక్క ఉత్సాహంతో అరుస్తూ, మీసాలు దువ్వుకుంటున్నారు.

నాగమ్మ గుండె నీరయితే, నలగాముడు దిగాలుగా తలను నేలకు వంచుకున్నాడు.

**********

రెండవసారి పుంజులను బరిలో వదిలారు.

ఇప్పుడు గురజాల పుంజు రెక్కల మధ్య ఉక్కుకవచం ఉంది.

యుద్ధం తారుమారయింది.

ఈ విచిత్రమైన మార్పేమిటో మాచెర్ల ప్రభువులకు అర్థం కాలేదు. కానీ ఇందులో ఏదో కుతంత్రం వున్నదని బ్రహ్మన్న గుర్తించాడు.

ఐనా మాచెర్ల ప్రభువుల పుంజు విసిరే విసుర్లకు గురజాల పుంజు గుక్కతిప్పుకోలేక పోతున్నది.

మోసమే జయించటం అనాదిగా చరిత్రల్లో జరుగుతున్నదే గనుక ఇక్కడా నాగమ్మే గెలిచింది.

బ్రహ్మన్న ఓడిపోయాడన్న వార్త పల్నాడంతా పాకిపోయింది.

మాచెర్ల పందెగాడు గోపన్న లేచి – “మోసంతో పందెం జయించింది నాగమ్మ. ఈ పందెంలో తీర్పు ఇవ్వకూడదు” అన్నాడు.

అప్పటికే నాగమ్మ పుంజును బరి నుంచి తప్పించింది.

అలరాజు గురజాల ప్రభువులు పందెంలో నెగ్గినట్టు తీర్పు చెప్పాడు.

సంతోషంతో నాగమాంబ నవ్వితే – కోపమొచ్చిన అలరాజు కత్తి విసిరాడు. కొంచెంలో కత్తి నుంచి తప్పుకుంది నాగమ్మ. అలరాజు క్రోధంతో “న్యాయానికి కట్టుబడి ఈ తీర్పునిచ్చాను. ఇదీ విజయమనుకుంటే నువ్వెంత పొరబడుతున్నావో అర్థమవుతుంది. తల్చుకుంటే ఈ క్షణంలో మాచెర్ల వీరులు మిమ్మల్ని మసిచేస్తారు. ఆడదానివని క్షమించాను. ఫో!” అన్నాడు.

(“చాతబడి” అనే క్షుద్ర దేవతా ప్రక్రియతో మాచెర్ల పుంజును నాగమ్మ నిర్వీర్యం చేసిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. అలాగూ జరిగివుండవచ్చు. ఏది ఏమైనా ఈ ధర్మయుద్ధంలో అధర్మం జయించింది. ఆరవెల్లి నాగమాంబ గెలిచింది)

మాచెర్ల పందెగాడు గోపన్న ఒక్కడిని స్వేచ్ఛగా వదిలినట్లైతే అతని చేతిలో చాలామంది పల్నాటి ప్రజలు చచ్చేవాళ్ళు. కానీ ధర్మానికి, మర్యాదకు కట్టుబడ్డ మాచెర్ల ప్రభువులు మౌనంగా ఉండిపోయారు.

**********




 

సశేషం…