ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అధ్యాయం 7-పల్నాటి వీరభారతం

Like-o-Meter
[Total: 1 Average: 5]

 

గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది “చంద్రవంక” – నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు.

ఈ చంద్రవంక నదీ తటానే, బ్రహ్మనాయుడు వూరును వెలయింపజేసి “మాచెర్ల” అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది అన్ని హంగులునూ సంతరించుకుని, పట్టణంలా రూపుదిద్దుకుని – మలిదేవాదులకు రాజధానీ నగరమయింది.

అంతేకాదు – కులదైవమైన చెన్నకేశవుడికి మాచెర్లలో గుడి కట్టించాడు బ్రహ్మన్న.

నిజానికి బ్రహ్మనాయుడంత తెలిగివిగలవాడు, సాధువర్తనుడూ పల్నాటిసీమలో ప్రభవించనేలేదేమో! అందుకనే, మాచర్ల ప్రభువులకు మంత్రయిన బ్రహ్మన్న – వీరుల్నీ, పండితుల్నీ, శూరుల్నీ – ఏ తెగకా తెగగా విభజించి కట్నకానుకలతో సన్మానించాడు. చరిత్ర మొత్తాన్ని తిరగేస్తే, కుల మతాల విషయంలో, బ్రహ్మన్నంత విశాలమైన మనసు గలవాడు మరొకడు దొరకడు. అతను నిజమైన దేశసేవకుడు.

బ్రహ్మన్న మలిదేవాదులతో మాచెర్ల స్థిరపడటానికి రెండు, మూడేళ్ళు పట్టింది. వీరులైన కొంతమందితో తరలివచ్చిన బ్రహ్మనాయుడు చంద్రవంక నదికి, కొత్త రూపురేఖల్ని ఏర్పరిచాడు. మాచెర్లను కట్టటంతో, చంద్రవంకనది రాజమాతలాగా వున్నది.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

*****

 

మాచెర్ల ప్రభువులకి కావల్సిన ప్రస్తుత కార్యం పెళ్ళి.

పెదమలిదేవుడికి అందమైన, కులవతియైన రాచకూతురుని ఇచ్చి చెయ్యాలన్నది వీరవిద్యాదేవి సంకల్పం.

మాచెర్లకు కూతవేటు దూరంలో వున్న “కళ్యాణపురం” రాజు వీరసోముడికి అపరంజి బొమ్మలాంటి అందమైన పిల్ల వున్నది. ఆ కుందరదన పేరు “శ్రీరమాదేవి”.

(శ్రీరమాదేవిగా రూపాంతరం చెంది వుండవచ్చునని నేను (రచయిత)భావిస్తున్నాను. పేర్లు రకరకాలుగా మార్పులను చెంది, కొంతకాలానికి ఒక పేరుతో స్థిరపడిపోతాయి)

స్వతహాగా శైవుడైన వీరసోముడు – వైష్ణవుడయిన మలిదేవుడికి తన కూతుర్ని ఇవ్వటానికి ఒప్పుకోక బ్రహ్మన్నతో విరోధం తెచ్చుకున్నాడు.

“పగవారిలో నగుపాలు చేయటం ప్రజ్ఞకాదు వీరసోమా! ఆడపిల్లను అడగటానికొస్తే నిరసిస్తావా? మా అవసరం వచ్చిన రోజున నీవే “దేహీ” అంటూ వస్తావు. చూసుకో” అని బ్రహ్మన్న వీరసోముడికి కబురుపెట్టాడు.

వీరసోముడు కొన్ని నిబంధనలకూ, కొన్ని కట్టుబాట్లకూ లోబడిన మనిషి. దాన్ని ఛాదస్త స్వభావంగా కూడా చెప్పుకోవచ్చు.

కావలసిన కార్యం కానందుకు తిరిగి మాచెర్ల చేరాడు బ్రహ్మన్న.

********

(పల్నాటి వీరచరిత్రలో మనస్సులను కదిలించే పవిత్ర ప్రేమకథ ఒకటున్నది. అయితే ఇది పల్నాటినాట ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకోలేదో ఇప్పటికీ అంతుపట్టదు. ఆ కథను ఇక్కడ ఉటంకించాల్సిన అవసరంవుంది.)

వీరసోముడికి అయిదుగురు తమ్ములు. వారిలో ఒకడయిన “నంది సోముడు” కూతురు “నాగులాదేవి”. ఆ పిల్ల తన మేనత్త కొడుమైన “శివసింగు”ను ప్రేమించింది.

ఈ ప్రేమాయణం వీరసోముడికి గానీ, అతని తమ్ములకుగానీ ఇష్టం లేదు. దానికి ఇతమిత్థమైన కారణం దొరకదు. రాజ్యాధికారాలు, రాజుల మనస్తత్వాలూ భయంకరమైనవి. రాజచరిత్రల్లో “ప్రేమ” అనే రెండక్షరాల మాట రక్తపాతాలు చేయించిన సంఘటనలు కోకొల్లలు.

శివసింగు వుంటున్న చోటు “శివనండ్ల”. నాగులాదేవీ, శివసింగు తరచూ రహస్యంగా కలుసుకుంటూ వుండేవారు. వీరసోముడు తన తమ్ముని కూతురు శివసింగుతో కలుకోవటానికి వీల్లేదని కట్టడి చేశాడు.

ప్రేమ ఎన్ని త్యాగాలనైనా చేయిస్తుంది. అది కోటలను ఎక్కిస్తుంది. కాపలాదారుల్ని నరికిస్తుంది. దొంగతనాలు చేయిస్తుంది.

శివసింగు కోట ఎక్కి వచ్చి, కాపలాదారుల కళ్ళల్లో కారం చల్లి, రాజాంతఃపురంలోకి ప్రవేశించి, నాగులాదేవిని కలుసుకుంటూనే వుండేవాడు. నాగులాదేవి భయపడుతూ వుండేది.

“బావా! నాకు భయంగా వుంది. ఏదో ఒకనాడు మన అదృష్టం బాగుండక నీవు పట్టుబడితే, నిర్దయగా నా తండ్రులు నిన్ను వధిస్తారు. ఆనాడు నాకు ఆత్మహత్య మినహా మరో మార్గం లేదు.”

“నన్నేం చెయ్యమంటావు నాగులా?”

“నన్ను ఇక్కణ్ణుంచి శివనండ్లకు తీసుకుపో!”

“ఎట్లా?”

“దానికి నేనొక పథకం వేశాను.

కాపలా సైనికులకు లంచం ఇచ్చి, అర్ధరాత్రిపూట నాగులాదేవి తన బావతో పారిపోయి వచ్చి శివనండ్లకు చేరింది.

ఈ ఉదంతం తెల్సిన వీరసోముడు, అతని సోదరులు ఉగ్రులై శివసింగుకు తమ కూతురును ఒప్పజెప్పవలసిందిగాను, చేసిన పనికి క్షమాపణలు చెప్పుకోవల్సిందిగానూ కబురుపెట్టారు.

శివసింగు మేనమామలకు ఇట్లా కబురు పంపాడు:

“నాగులాదేవి నా భార్య. పెళ్ళయ్యాక ఆమె నా హక్కయింది. నాకు ఈ రాజ్యం మీద ఎంత హక్కుందో ఆమె మీదా అంతే. ఆమెను నేను పంపను. క్షమాపణ ఎందుకు చెప్పాలో అర్థం కావటం లేదు. ఆమె, నేను ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకున్నాం. మీరంతా ఏదైనా చెయ్యగలిగితే, మీ మనస్సుకు వచ్చిన విధంగా చెయ్యండి. జరగబోయేది జరక్క మానదు” అని.

**********

మూర్ఖులు, దురభిమానులూ ఐన తన సోదరులతో శివనండ్ల మీదకు వీరసోముడు దండెత్తి రావచ్చని ఊహించింది నాగులాదేవి.

“బావా!”

“నాగులా!”

“నా ఒక్కదాని కోసం శివనండ్లలో రక్తపుటేరులు ప్రవహింపజేయలేను. నన్ను కళ్యాణపురం పంపించు. ఎట్లా రాసివుంటే అట్లా జరుగుతుంది.” అని కన్నీరు పెట్టుకుంది.

స్వతహాగా అభిమానధనుడైన శివసింగు నాగులాదేవి కన్నీరు తుడిచి “నాగులా! ఉంటే కలసివుందాం. చనిపొతే కలిసే పోదాం. వీరులైనవాళ్ళకు యుద్ధాలు తప్పవు. రాజులకు ఈ కలహాలు సర్వసామాన్యాలు. భార్యను నేను వదులుకోలేను. అలాగే రాజ్యాన్నీ వదులుకోలేను. ఈ కోటను జయించటం సామాన్యమైన విషయంగాదు. ఐనా కాలమే తుదితీర్పును ఇస్తుంది. నీవు నిశ్చింతగా వుండు”.

*********




 
నాగులాదేవి ఊహించినట్టుగానే వీరసోముడు శివనండ్ల మీదకు దండెత్తివచ్చాడు.

కొన్ని ఏళ్ళపాటు ముట్టడి వేశాడు వీరసోముడు. హోరాహోరిగా జరిగిన యుద్ధంలో తన సైనికులను, అశ్వికదళాన్ని పోగొట్టుకొన్నాడు సోముడు. మున్ముందు ఏం చేయాలో తోచలేదు. తికమక పడ్డాడు. ఈ యుద్ధంలో విజయలక్ష్మి శివసింగును వరించింది.

ఈ సందిగ్ధ పరిస్థితిలో వీరసోముడికి బ్రహ్మనాయుడు గుర్తుకొచ్చాడు. ఒకానొకనాడు తన కూతురును ఇవ్వటానికి నిరాకరించిన వీరసోముడు, తన ఆత్మాభిమానాన్ని వదులుకొని – బ్రహ్మనాయుని సహాయాన్ని అర్థించాడు.

బ్రహ్మనాయుడు మలిదేవాదులతో సంప్రదించి – వీరసోముడికి యుద్ధంలో సహాయం చేస్తానని మాట ఇచ్చాడు.

ఈ యుద్ధం జరుగుతున్న కాలంలో శివసింగుకు, నాగులాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

బ్రహ్మనాయుడు తన సైన్యంతో శివసింగు కోటను ముట్టడించాడు. ప్రచండమైన బ్రహ్మనాయుని సైన్యానికి శివనండ్ల కోటను స్వాధీనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

మాచెర్ల సైన్యం కోటలోకి చొచ్చుకువస్తోంది.

నాగులాదేవి తన పిల్లల్ని వక్షం మీదకు లాక్కొని దుఃఖిస్తోంది. శివసింగు అంతఃపురపు పశ్చిమద్వారంలో నిలబడి చూస్తున్నాడు.

తన రాజ్యాధికారం అంతరించబోతోంది. తను పిరికివాడుగా మరణించకూడదు.

**********

తన భార్యను పిల్చాడు – “నా జీవితం, రాజ్యాధికారం ముగియడానికి సిద్ధంగా వున్నాయి. ఈ కోటను వదిలి పిల్లలతోను, నీతోను పారిపోవడానికి నా మనసు ఒప్పుకోవడంలేదు. అలాగని వీరసోముడికి లొంగి, దిక్కులేని చావు చావనూ లేను. అందుకని….”

“బావా…”

“నాగులా! ఈ రెక్కలు రాని, దిక్కులేని పక్షులను నీకు వదిలిపోతున్నాను. తల్లివైనా, తండ్రివైనా నీవే! వీరసోముడికి శతృత్వం నా మీద. నీ మీద ఏ పగా లేదు.”

“బావా! నీవు లేని బ్రతుకు మీద నాకు ఆశలేదు. తుచ్ఛమైన అలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చావడమే మేలు. మరి పిల్లలంటావా! ఎలా రాసిపెట్టి వుందో వాళ్ళకు అలానే జరుగుతుంది. ఆ కత్తితో ముందు నన్ను పొడవండి. పుణ్యస్త్రీగా నాకు అంతకంటే మరో భాగ్యం లేదు.”

“నాగులా!”

నాగులాదేవిని ముందుగా పొడిచి, తన తలను నరుక్కున్నాడు శివసింగు.

**********

అప్పటికి ప్రొద్దు గ్రుంకబోతున్నది.

సూర్యుని చివరి వెలుగు పడమటి కిటికీ నుండి దూసుకువచ్చి, నెత్తుటి మడుగులో పడివున్న ఆ అమరప్రేమికుల మీద పడి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. పెద్ద దిక్కులను పోగొట్టుకున్న పసికూనలిద్దరూ హృదయవిదారకంగా ఏడుస్తున్నారు.

బ్రహ్మన్న లోనికి వచ్చేసరికి కంట పడ్డ ఈ దృశ్యానికి చలించిపోయాడు. “చెన్నకేశవా!” అన్న మాటలను అతని నోటినుండి అప్రయత్నంగా వెలువడ్డాయి.

వీరసోముడు కత్తిపట్టుకుని లోనికి వచ్చి “ఏడీ ఆ దుర్మార్గుడు?” అని అరిచాడు.

బ్రహ్మనాయుడు విషాదపూరితమైన నవ్వు నవ్వి – “కత్తి పడేయ్ వీరసోమా! సింహం మరణించింది. వాళ్ళ ఆత్మశాంతి కోసం తల వంచి నిలబడు” అన్నాడు.

**********

ప్రతి రాజ చరిత్రలోనూ, ఈ విధమైన రక్తపాతాలతో, ఆత్మత్యాగాలతో నిండిన ప్రేమ కథలు కనిపిస్తాయి. సజీవ సాహితికి ఇవి మెరుగులు పెడతాయి. ప్రాణం కన్నా ప్రేమే ఎక్కువైతే, ప్రేమంత గొప్పది ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు.

బ్రహ్మనాయుడు క్షణం నిశ్శబ్దంగా నిలబడి “వీరసోమా! ఈ ప్రేమికుల్ని చంపిన పాపం మనిద్దరికీ చుట్టుకుంటే, ఆ పాపంలో సగభాగం నాకూ ఉంది” అని బైటకి వచ్చాడు. వచ్చేటప్పుడు పిల్లలిద్దర్నీ చేరే చంకలో ఎక్కించుకుని మరీ వచ్చాడు.

పశ్చాత్తప్తుడైన వీరసోముడు మౌనంగా బ్రహ్మన్నను అనుసరించాడు.

ఈ యుద్ధం తర్వాత తన కూతురు శ్రీరమాదేవిని పెద మలిదేవుని కిచ్చి బేషరతుగా పెళ్ళి చేసాడు వీరసోముడు.


ఈ అధ్యాయం ముగింపులో ఒక్క మాట చెప్పాలని వున్నది.

నాగులాదేవిలాంటి స్త్రీల ప్రేమ పవిత్రతలోనే ఈ దేశం పవిత్రతను సంపాదించుకొన్నది. అనార్కలిని పోగొట్టుకొన్న సలీం నెత్తురు చరిత్ర – అనార్కలి సమాధిపై ఎర్ర గులాబీలను పూయించింది.

అవివేకపు అరాచక రాజకీయమే నాగులాదేవినీ, శివసింగునూ బలితీసుకొన్నది. కాలం ఏదైనా కథలు ఒక్క తీరుగానే ఉంటాయి.

ప్రేమ జయిస్తుంది. కానీ ప్రేమికులు ఉండరు. కాలగర్భంలో కలిసిపోయిన ప్రేమకథల్లో రాచరికం ఆనాటికి జయించి వుండవచ్చు గాక, కానీ గొప్ప ప్రేమకథలు అజరామరంగా వుండిపోతాయి.

వీటిల్ని చరిత్రపుటల్లోంచి తీసివేయడానికి లేదు. అవి శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాయి. ఇట్లాంటి ప్రేమకథలను విని కృతజ్ఞతా పూర్వకమైన ఒక నిశ్వాసాన్ని వదిలిపెట్టడం మనసున్న మనిషి కనీస కర్తవ్యం!

**********
సశేషం