ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అధ్యాయం 21 – పల్నాటి వీరభారతం

Like-o-Meter
[Total: 0 Average: 0]

క్రితం భాగంలో: సంధి కోసం మలిదేవుని తరఫున వెళ్ళిన అలరాజు విషప్రయోగంతో మరణిస్తాడు. అతని భార్య పేరిందేవి సతీసహగమనం చేస్తుంది. చితి నెక్కబోయే ముందు తన భర్త మరణానికి కారకుడైన నరసింగరాజు తలను ఎవరైనా నరకుతారా అని అడిగితే “నేను కొడతా”నంటాడు బాలరాజు. అలరాజు మరణంతో మాచెర్ల వీరుల రక్తం మరుగుతోంది.

 

ప్రస్తుత కథ:

మొదటి అంకం ముగింపు వాక్యంగా అలరాజు మరణాన్ని చెప్పదలిస్తే – కారెంపూడి యుద్ధానికి వీరులంతా తయారైనారనేది రెండవ అంకానికి మొదటి వాక్యంగా చెప్పుకు తీరాలి.

మొదటినుంచీ ఇరువర్గాలవారూ, యుద్ధానికి నిర్ణయించుకున్న స్థలం కారెంపూడి. నాగులేటి ఒడ్డునే వున్నది.

“నాగులేటి నీళ్ళలోన నాలుగు మణుగుల నల్లపూసలు తెగా”లని మహాసాధ్వి పేరిందేవి శాపం పెట్టింది. బహుశా అందుకేనేమో, పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది.

* * * * *

రాజ్యకాంక్ష ఎంత భయంకరమైనదో, కపట మంత్రిత్వము కూడా అంతే దారుణమైనదని పల్నాటి వీరచరిత్ర మనకు విప్పి చెబుతుంది. కోడిపందేలతో, కోరమీసాల దువ్వులతో మొదలైన ఈ పొట్లాట – ఆఖరుకు పరాకాష్ఠకు చేరుకున్నది.

దూతను చంపిన నేరానికి నలరాజు శిక్షార్హుడే!

అదీగాక అలరాజు ఇటు వర్గం కన్నా – అటు వర్గానికి ముఖ్యుడు. వీరాధివీరుణ్ణి కాలం కాటువేసి, పొట్టనబెట్టుకున్నది.

అలరాజు అభ్యర్థనను త్రోసిపుచ్చి నలగాముడు యుద్ధానికే సిద్ధమై చరిత్రలో తన పేరును, పేరమ్మ కన్నీటితో, పల్నాటి ప్రజారక్తంతో వ్రాసుకున్నాడంటే – అతనికి నాగమ్మ మాట మీద ఎంత గురివున్నదో మనకు అర్థమవుతున్నది.

అలరాజు హత్య “మేడపి”ని అతలాకుతలం చేసింది. వీరులైనవాళ్ళ హృదయాలలో నిండివున్నది కేవలం పగ-ప్రతీకారం మాత్రమే.

“బ్రహ్మన్నా! ఇక ఆగి – ఆలోచించి ప్రయోజనం లేదు” అన్నాడు పెదమలిదేవుడు కొలువు తీరి.

బ్రహ్మన్న ఈ మాటకు తలైతే వూపాడుగానీ, అవ్యక్తమైన బాధ కడుపులో సుడులు తిరుగుతున్నది. తను ఎన్నో కలలుగని నిర్మించుకున్న పల్నాటిలో రక్తం ప్రవహిస్తుంది కాబోలు. తను ఏదైతే జరగకూడదని అనుకుంటూ వచ్చాడో అదే సిద్ధంగా వున్నది.

యుద్ధం…యుద్ధం…యుద్ధం.

కాలం ఇంతమందిలో ఎంతమందిని ఉంచుతుందో?

ఈ ప్రశ్నకు “కాలం” మాత్రమే జవాబు చెప్పాలి.

మేడపిలో వీరులు యుద్ధానికి ఉరకలు వేస్తున్నారు. ఈ మహా ప్రవాహాన్ని ఆపి ప్రయోజనం లేదు.

 

యుద్ధానికి వీరులంతా కదలకముందు – గద్దె మీద రాజుగా – కనీసం నామకా ఐనా కూర్చోటానికి ఎవరో ఒకరు కావాలి.

“బాల మలిదేవుడు” అనే పెదమలిదేవుడి కొడుకుకు పట్టాభిషేకం చేసారు. ఐతే, తాత్కాలిక మంత్రి ఎవ్వరు?

అనూచానంగా వస్తున్న బ్రహ్మన్న వంశంలోని వాడూ, బ్రహ్మన్నకు ఏకైక కుమారుడూ ఐన బాలచంద్రుడు తాత్కాలిక మంత్రి అయ్యాడు.

అంతా యుద్ధానికి బయలుదేరారు.

యుద్ధప్రయాణానికి కావలసిన శుభ శకునాన్ని చూసారు. నిష్ఠతో పరమశివుణ్ణి ప్రార్థించారు.

వీరులు కదలి కారెంపూడివైపుకు వెళుతూవుంటే, ఎక్కడో మహా ప్రవాహం కదులుతున్నట్లు కనిపించింది. నాగులేరు పొంగినట్లు ప్రజలు పొంగిపొర్లుతూ కదనసీమకు కదులుతున్నారు.

ఐతే కారెంపూడి రణక్షేత్రంలో అంతకుమునుపే చాలా యుద్ధాలు జరిగినాయి. అది ఇవ్వాళ పుర్రెలతో, బొమికెలతో నిండివుంది. అవి ఏ శౌర్యధనుల మాట్లాడలేని కంకాళాలో చెప్పలేము. ఈ కంకాళాలు బ్రతికివుండగా వీర రసోద్దీపనా చిహ్నమైన కథలు చెప్పివుండివుంటాయి. శౌర్యాన్ని ప్రతిబింబించివుంటాయి.

కారెంపూడి రణక్షేత్రం సిద్ధమైంది.

ఆ ప్రాంతాన్ని నాగులేటి నీళ్ళతో శుద్ధిచేద్దామనుకున్నారు ఇరుపక్షాలవాళ్ళు. కానీ ఆ రాత్రే బ్రహ్మాండమైన వర్షం కురిసింది. ఆ నేల తడిసి పుణ్యస్థలిగా అయ్యింది.

ఆ వాన ధర్మదేవత చిందించిన అశృకణాలే వుండాలి. లేదా, మృత్యుదేవత విలయతాండవం చేసి అలిసిపోయినప్పుడు చిందిన స్వేద బిందువులై వుండాలి. లేదా అధర్మాన్ని, పాపాన్ని ప్రక్షాళించేందుకు దేవుడు కురిపించిన దివ్య వర్షమై వుండాలి.

ఏది ఏమైనా ఇప్పుడు కారెంపూడి రణపుణ్యస్థలి. వీరులకు కార్యస్థలి. యోధులకు ధర్మస్థలి. వీరత్వమే ఊపిరిగా బ్రతుకున్న ప్రతి ఒక్కరికీ ముక్తిస్థలి.

* * * * *

కారెంపూడిలో బ్రహ్మన్నా, మాచెర్ల అఖండ సేనావాహినీ విడిదిచేసింది.

చివరిసారిగా మరో సంధి ప్రయత్నం చెయ్యటం మంచిదని అన్నాడు బ్రహ్మన్న. కానీ వీరులెవ్వరికీ ఇది ఇష్టం లేదు.

బ్రహ్మన్న మాటకు ఎదురు చెప్పలేని మలిదేవుడు మాత్రం “మీ ఇష్టం” అన్నాడు.

ఓపిక నశించిన వీరుడొక్కడు లేచి – “ఇక ఏ రాయబారాలూ వద్దు” అని అరిచాడు.

బ్రహ్మన్న గంభీరంగా సైనికుల వంక జూసి – ” మాచెర్ల వీరులారా! ఒక్క విషయం వినండి. యుద్ధమంటే భయపడి నేను ఈ సంధి ప్రయత్నం చెయ్యడంలేదు. ప్రభువైనవాడు ప్రజా క్షేమాన్ని ఆలోచించాలి. యుద్ధం ఏ రూపేణ వచ్చిన, అది వేలాదిమందిని బలి తీసుకుంటుంది. వీరులైనవారెందరో నేలకొరిగిపోతారు.

మూర్ఖులు అనవసర యుద్ధాలకు కాలుదువ్వుతారు. ఆలోచనాపరులు సందర్భోచితంగా ప్రవర్తిస్తారు.

సుభిక్షంగా, పాడిపంటలతో విలసిల్లే ఈ పల్నాటిలో రక్తపుటేరులు ప్రవహించటం నేను ఊహించలేకపోతున్నాను. అందుకనే దీర్ఘంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను” అన్నాడు.

సభ నిశ్శబ్దమైంది.

బ్రహ్మన్నే మళ్ళీ అన్నాడు – “ఏది ఎట్లా జరగాలనివుందో అట్లానే జరుగుతుంది. దానికి వగచి ప్రయోజనం లేదు. మీరంతా మీ గోత్రాలను చెప్పుకుని, నాగులేటిలో స్నానం చేయండి. వీరపూజలు చెయ్యండి. యుద్ధమే జరిగితే మనకే విజయం దక్కాలని పరమశివునికీ, ఆదిశక్తి అపర్ణకూ మ్రొక్కండి”.

నాగులేటిలోని “వీరధార” మడుగులో వీరులైన వాళ్ళందరూ అంతే చేసారు.

 

“ఐతే ఇప్పుడు ఎవర్ని దూతగా పంపాలి?” అన్నాడు మలిదేవుడు.

“భట్టుగారిని పంపుదాం” అన్నాడు బ్రహ్మన్న.

“ఈ పని ముందే చేసివుంటే అలరాజు మనకు దక్కేవాడుగా!” అని అప్రయత్నంగానే అనేసాడు మలిదేవుడు.

బ్రహ్మన్న వైరాగ్యం నిండిన నవ్వొక్కటి నవ్వి “మృత్యుహస్తం స్పృశించిన రోజున – ఎవరి చావునూ, ఏ విధంగానూ ఆపలేము. సృష్టి రహస్యం, సృష్టి రచనాక్రమం అయోమయంగానూ, అర్థం లేకుండానూ కనిపిస్తాయి. జరిగే ప్రతి ఘటన వెనుకా ఓ కనిపించని కారణముంటుంది. ఆ కారణం ముందే తెలిసినా మనం చెయ్యగలిగింది ఏమీ లేదు మలిదేవా! అంతా భగవదేచ్ఛ! చెన్నకేశవుని ఆన ఎలావుంటే అలాగే జరుగుతుంది” అన్నాడు.

మలిదేవుడు బ్రహ్మన్న ముఖంలోకి చూసాడు.

గంభీరమైన బ్రహ్మన్న ముఖంలోకి పెద్దతనపు ముడుతలు వచ్చి చేరాయి. కానీ పుట్టుకతో వచ్చిన రాజసం పోలేదు. అనుభవం నింపిన వర్చస్సూ తగ్గలేదు. వార్ధక్యం వచ్చినా, రాజసం సడలని వృద్ధ సింహంలా ఉన్నాడు బ్రహ్మన్న.

“రాజకీయాన్ని ధర్మబద్ధంగా నిర్వహించడమే మన కర్తవ్యం. మలిదేవా! సంధి ఒక ప్రయత్నం మాత్రమే కాదు. అదొక ఉన్నతమైన లక్ష్యం. మహారాజులకు ప్రజాశ్రేయస్సుకు మించిన కార్యం లేదు. మాచెర్ల ప్రభువులు ప్రజాకంటకులన్న అపప్రథ కాలగతిలో నిలవరాదు. అందుకనే ఆఖరి ప్రయత్నంగా మరొక్కమారు సంధి ప్రయత్నం చేద్దాం. ఆ పైన కానున్నది కాక మానదు” అన్నాడు బ్రహ్మన్న.

బ్రహ్మన్న గొంతులోని గాంభీర్యానికి, మాటల్లో ఉన్న లోతైన భావాలకు మలిదేవుడు ఎదురు మాట్లాడలేకపోయాడు.

“అలరాజు మరణానికి కారకుడైన నర్సింగరాజును మన కప్పగించాలన్న షరత్తు విధిద్దాం” అన్నాడు పెదమలిదేవుడు.

“శాంతితో బాటు ఆ అప్పగింతకూడా ముఖ్యమైనదే. ఈ రాయబారంలోని ప్రధానాంశమూ అదే” అని తన ఒప్పుకోలును తెలిపాడు బ్రహ్మన్న.

మరుసటిరోజున భట్టును రాయబారానికై గురజాలకు పంపాడు బ్రహ్మన్న.

సశేషం...

* * * * * 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY