క్రితం భాగంలో: కారెంపూడి యుద్ధానికి వెళ్ళే ముందు సాని సబ్బాయిని చూడ్డానికి వెళ్ళి, ఆమె వలపుల పంజరంలో చిక్కుకుపోతాడు బాలచంద్రుడు. సోదరుడు అనపోతు హెచ్చరించి, హితబోధ చేయడంతో దాని సహవాసం వదిలి, అమ్మ కిచ్చిన మాట ప్రకారం తన భార్య మాంచాలను చూడడానికి అత్తవారింటికి వస్తాడు. పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా కలుసుకోబోతున్న భార్యాభర్తలకు ‘నాలుగు గడియల” సమయమే ఉంది. గడువు ముగియగానే యుద్ధానికి సిద్ధం కావాలని హెచ్చరిక చేస్తాడు అనపోతు. “చెన్నకేశవుని ఆన” అని మాటిస్తాడు బాలచంద్రుడు. |
ప్రస్తుత కథ:
మాంచాల భర్తను వెంటబెట్టుకుని, తన మేడ మీదికి తీసుకుపోయింది. అతన్ని అక్కడ కూర్చోబెట్టి మనసు రంజింపజేసే మాటలెన్నింటినో చెప్పింది.
“స్వామీ! మీ కోసం జలకమాడి వస్తాను. వెళ్ళిరమ్మని అజ్ఞ!” అన్నది.
“అట్లాగే”
అనుభవించే సుఖానికి అనువైన విధంగా ఆమె దుస్తుల్ని ధరించి తల్లి రేఖాంబ దగ్గరకు వెళ్ళి “అమ్మా! ఆయన నా కోసం ఎదురుచూస్తున్నారు. వెళ్ళిరానా?” అంది. రేఖాంబ కూతురి ముఖంలోకి దీక్షగా చూసి, నిశ్శబ్దంగా కూర్చుంది.
“మాట్లాడేవు కాదేమమ్మా? నా భర్త రాకరాక వచ్చారు. ఆయన భార్యనై, గండు వారి గారాల బాలనై, దాంపత్య జీవనాన్ని అనుభవించలేకపోయాను. కదనరంగానికి పోతూ ఇటు వచ్చారు నా పతి. ఆయనకు సపర్యలు చేయడం నా కర్తవ్యం కాదా?” అన్నది.
(శ్రీనాథ కవిసార్వభౌముడు వ్రాసిన పల్నాటి వీరభారతం కావ్యంలో, ఈ ఘట్టంలో సజీవమైన సాహిత్యాన్ని సృష్టించాడు. ఆయన ద్విపదలకి వచనానువాదం ఇలా ఉంది)
రేఖాంబ కూతురు ముఖంలోకి చూసి ఇలా అన్నది.
“జన్మ అనేది ఒక వృక్షమైతే దానికి రెండు ఫలాలు ఉంటాయి. మొదటిది “సుఖం” రెండవది “గౌరవం”.
సృష్టిలో రకరకాల ప్రాణులు పుట్టి, గిట్టుతూవుంటాయి. జీవితం బుద్భుధప్రాయమైంది. కానీ కాలం అనంతమైనది. శాశ్వతమైన గౌరవం కోసం ఒకరు జన్మిస్తే క్షణిక సుఖం కోసం కొందరు వెంపర్లాడుతారు.
మనిషి మరణించినా ఆతని కీర్తి శాశ్వతమైన గౌరవం పొందితీరాలి. కానీ ఇది దుర్లభం.
మొదటి ఫలాన్ని ఆస్వాదించి, క్షణిక సుఖాలను పొంది ఈ చరిత్ర నుంచి ఏమీ మిగుల్చుకోలేక శాశ్వతంగా వెళ్ళిపోతారు కొందరు. అంతటితో కథ సమాప్తి.
రెండవవారు శాశ్వత కీర్తి ప్రతిష్టల కోసం రెండవ ఫలాన్ని కోరుతారు. తమ కోసం “చరిత్ర” పేరును ముందు తరాల కోసం దాచుకుంటారు. (సజీవ సాహితి ఈ పేర్లను ముందు తరాల కోసం దాచి ఉంచుతుంది)
కాలం ఎవర్నీ నిలపదు. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు తప్ప. తాత్కాలికమైన మొదటి ఫలరసం తుచ్ఛమైనది! రెండవ ఫలరసం చిరకాలం మన్నేది! కాలం వున్నంత కాలం మనగలిగిన సత్యాల్లో రెండవదే మొదటిది. వీరులైనవారు వీరత్వం కోసమే జన్మిస్తారు కారణజన్ములు. నీ భర్త చంచలుడు కావచ్చు కానీ వీరుడు. మట్టిలో పుట్టినంతమాత్రాన పద్మం, జాతి పువ్వు కాక మానదు. స్త్రీ ప్రలోభి ఐనా బాలచంద్రుడు గొప్ప యోధుడు. పల్నాటి ప్రజాశ్రేయస్సుకై ప్రభువులకు నీ భర్తలాంటి వీరుల అవసరం చాలావుంది.
నీ భర్తలో వున్న లోటు సుఖం. నీ సౌందర్యాన్ని చూసి, ప్రలోభి అయిన నీ భర్త రేపు కారెంపూడి సంగతి పట్టించుకోడు. అతని వీరత్వం నీ పమిటచెంగు చాటున కప్పెట్టిబడిపోతుంది. వీరపత్నిగా నిన్ను ప్రజలు మర్చిపోతారు.
నీకు శారీరిక సుఖంలో వచ్చిన భౌతిక ఆనందం కావాలో, మరణం లేని మహత్తరమైన కీర్తి కావాలో నిశ్చయించుకో!
వీర రక్తంతో నుదుట వీర తిలకం దిద్ది భర్తను యుద్ధరంగానికి పంపు! తిరిగివస్తే శాశ్వత ప్రతిష్టతో బాటు అమర సౌఖ్యాలనూ అనుభవించు. అతణ్ణి యుద్ధవిముఖుణ్ణి చెయ్యకు”
EXPLORE UNTOLD HISTORY
తన భార్య ఆలస్యానికి చిరాకు పడుతున్న బాలచంద్రుడు, శృంగార లక్ష్మిలా వస్తున్న భార్యను
చూసి “ఇంత ఆలస్యం దేనికి?” అన్నాడు.
“అంతా మేల్కొనే వున్నారు. మీ కోసం వస్తే సఖులు నవ్వరా? కనుమరుగు చేసుకుని వచ్చాను.” అన్నది.
పట్టుపరుపు మీద కూర్చున్న భర్తపాదాలను స్పృశించితే ఆమెకు అనుకొకుండా కన్నీళ్ళొచ్చాయి. బాలచంద్రుడు చూడకుండా పైటచెంగుతో కళ్ళద్దుకుని “కర్పూరతాంబూలం ఇవ్వనా?” అన్నది.
“చిత్తం” అన్నాడు.
నర్మగర్భమైన సరస సృంగార సంభాషణలనెన్నో చేసాడు. కాసేపు “నా మీద కోపం లేదా?”
“ఎందుకు?”
“రత్నాలను ఇంట్లో వుంచుకుని, రాళ్ళ కోసం పరుగెత్తే మూర్ఖులు కొందరుంటారు. నీలాంటి సౌందర్యవతిని వదిలి, పరస్త్రీల కోసం ప్రాకులాడే నన్ను నేను దూషించుకుంటున్నాను. వేశ్యాలోలుడనై, కులకాంతను కన్నెత్తి చూడని నేరానికి నా మీద నేను కోపం తెచ్చుకుంటున్నాను”
మాంచాల ఏమీ మాట్లాడలేదు.
ఆపుకోలేని తమితో ఆమె వక్షాన్ని స్పృశిస్తే మెడలోవున్న ముత్యాలపేరు తెగి, పూసలు నలుదిక్కులా చెదిరి దొర్లాయి.
“అయ్యొయ్యో ప్రభూ!” అంది.
“ఏమిటి దేవీ?”
“మాకు గౌరీ వ్రతమున్నది. ఈ హారం లేకుండా నేను దాంపత్యసుఖం అనుభవించరాదే! ఇది మా వంశాచారం. ఇప్పుడు అపచారమైపోయింది. ఏం చెయ్యను?” అన్నది.
బాలచంద్రుడు ప్రేమతో ఆమె చుబుకాన్ని పైకెత్తి “దీనికే ఇంత విచారపడాలా దేవీ? పూసలను గుచ్చటం నాకు వెన్నతో పెట్టిన విద్య. పద ఏరుదాం” అన్నాడు.
అతను ఏరి ఆమె చేతులలో పోస్తున్నాడు. ఆమె పట్టు పైట కొంగులో పోస్తూ, బాలుడు చూడకుండా నేలజారుస్తున్నది.
కాలం గడుస్తున్నది – కానీ పూసలు అన్నీ దొరకడం లేదు.
నిస్సహాయుడైన బాలుడు మాంచాల ముఖంలోకి చూసి “దేవీ! కాలం ఐపోతున్నది” అన్నాడు.
ఆ మాటలు అపశకునంగా వినిపించింది మాంచాలకు.
కన్నీరు పెట్టుకొని గద్గద స్వరంతో ఇట్లా అన్నది – “ప్రభూ! ఏడు జాములు గడిచిపోయినవి. ఆకసాన వేగుచుక్క పొడిచింది. తొలికోడి కొక్కొరొకో అని కూసింది. వీరులు మీ కోసం ఎదురుచూస్తున్నారు. యుద్ధరంగం నుంచి అజేయులై తిరిగి రండి.”
“మాంచాలా! నిన్ను వదలి పోలేకపోతున్నాను”
మాంచాల భర్త నుదుట ముద్దుపెట్టుకుని “క్షణభంగురమైన బ్రతుకులో, అతి తాత్కాలికమైన స్వల్ప సుఖం కోసం మీరు మీ వీరత్వాన్ని అడవి గాచిన వెన్నెల చేయకండి. నా మాట వినండి.”
అనపోతు తలుపు తట్టి “అన్నా!” అని పిలిచాడు.
బాలచంద్రుడు క్రోధాన్ని ఆపుకోలేక కత్తి దూసి, తలుపు తీసి “నిన్ను నరుకుతాను!” అన్నాడు.
అనపోతు శంత గంభీర స్వరంతో “ఉద్రేక పడటం మంచిది కాదు బాలచంద్రా! కత్తి పగవారి కోసం. తనవారిని నరకటం పరువూ కాదు, ప్రతిష్టా కాదు. నీ మాట నీవు నిలబెట్టుకో! కత్తి ఒరన పెట్టు! కారెంపూడి కదనరంగానికి కదులు! నీలోని వీర యువ రక్తం విజృంభించగా పగవారి తలల్ని తెగనరుకు! ఆపైన నీ ఇష్టం.” అని బాలుడి కత్తికి ఎదురు నిల్చాడు.
ఉద్రేకం చప్పున చల్లారిపోగా, శాంతుడైన బాలుడు – “క్షమించు సోదరా! అనవసరంగా ఆవేశపడ్డాను” అన్నాడు.
మాంచాల హారతి వెలిగించి, కత్తితో వేలు కోసుకొని, భర్త నుదుట పొడవుగా రక్తతిలకం దిద్ది
“మాచెర్ల మా తండ్రి చెన్నకేశవుని ఆన
మీ అమ్మ ఐతమ్మ నోముల్ల ఫలము
కదలుమా…కదలుమా…కదనాంతకుండ
కదన రంగంలోకి, కలత లెరుగక మగడ
వీరరక్తం నొసట దిద్ది వుంచాను
వీరమాత గన్న వీరుడవు గండ
వీరపత్నిగ నేను నిల్చిపోవాలి
వీరగంధం నను తల్చి రాసుకోవాలి
ఏ నోట విన్నా నీ పేరు పలకాలి
వీరభారతి మెడలోని దండనవ్వాలి
మా అక్క “పేరమ్మ” కోర్కె నిలబెట్టాలి
నరసింగరాజు తలను పడగొట్టు
నాయకురాలిని నాశనం చెయ్యి
మాట నిలబెడుదువని చేత చెయివెయ్యి
కదన రంగములో కాలుడవు నీవు
పగతుర గుండెలో బల్లెమౌతావు
పది కాలాలు నిల్చు పల్నాటి భారతమ్ము
తల్చుకోనీ నిన్ను ప్రతి తల్లి నిరతమ్ము”
మధుర గంభీర స్వరంతో మాంచాల వీరగీతం పాడగానే బాలచంద్రుడికి ఒళ్ళు ఝల్లుమంది.
ఒక్కసారిగా ఉప్పొంగిన గుండెతొ –
“వీరరక్తం నుదుట తీర్చిదిద్దావు
వీరగంధం పూసి వీడుకోలివ్వు
నరసింగు తలగొడుదు, నాగమ్మ పడుదు
దీవించి పంపవే దేవి మాంచాలా!”
మాంచాల భర్త పాదాలను అంటి – “ఈ చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిల్చిపోతుంది. దేవతలు మీ వీరగాధను చెప్పుకుంటారు. పల్నాట వాడవాడలా మీ కథలు దివ్యగానాలై, అశేషాంధ్ర ప్రజల్ని ఉర్రూతలూగిస్తాయి. మిమ్ము కన్నతల్లి, మిమ్ము కట్టుకున్న నేను ధన్యులౌతాము.
మాచెర్ల చెన్నకేశవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు. మీకు జయం కలుగుతుంది. కానీ స్వామీ!
కాలం ఎవర్ని ఉంచుతుందో లేదో చెప్పలేం. బ్రాహ్మణులు దైవస్వరూపులు! అనపోతను యుద్ధరంగానికి తీసుకువెళ్ళకండి. లేకుంటే బ్రహ్మహత్య దోషం మనకు తగులుకుంటుంది. ఇదే నా తుది కోరిక” అన్నది.
బాలచంద్రుడు భార్యకు అభయమిచ్చి ఆమె హారతుల్ని పొంది కారెంపూడికి బయలుదేరాడు.
సజలాశ్రునయనాలతో, ద్వారబంధనాన్నానుకుని నిలబడిపోయింది మగువ మాంచాల. ఆమె ఆత్మలో అనుభూతికి అందని బాధ ఏదో సుడులు తిరుగుతోంది.
మేడపిలో బాలచంద్రుణ్ణి తల్చుకుని తల్లి ఐతాంబ మనసులోనే ఇలా దీవించింది “తండ్రీ! నీకు జయం కలుగుగాక. సర్వలోకాలనూ రక్షించే భగవంతుడు నిన్ను నిరతమూ కాపాడుతూ ఉంటాడు. వీరాంజనేయుడే వీరుడవైనా నీకు రక్ష”.
సశేషం…
pay per click